మృత్యుంజయం శతకము - Mrityunjayam Satakamu

P Madhav Kumar

 || మృత్యుంజయం ||

శ్రీకైలాసనగాధివాస! కరుణాసింధూ! జగత్ప్రాణబం
ధూ! కల్యాణగుణావహా! సకలదుర్దోషాపహా! దేవతా
నీకాభ్యర్చితపాదపంకజ! భవానీనాథ! గంగాసనా
థా! కైవల్యమయా! చతుర్నిగమగేయా! తండ్రి, మృత్యుంజయా! 1

అకలంకా! నిజమౌళ్యలంకృతమృగాంకా! సర్వలోకైకనా
యక! పాదాశ్రితపారిజాతక! మునీంద్రారాధితా! నాదబిం
దుకళాతీత! సురాసురప్రకరపాధోజాతఖద్యోత! సా
యకితాబ్జాతదళేక్షణా! శరధితూణా! తండ్రి, మృత్యుంజయా! 2

ఓ విశ్వేశ్వర! ఓ నితాంతమధుపానోద్రిక్త మాతంగ క
న్యావీణాస్వనదత్తచిత్తనటరాజా! సుంత విన్పించుకో
లేవా మామొఱ, యొక్కమాఱయిన రాలేవా, యిటన్‌ మాపయి
న్నీవాత్సల్య మొకింతయున్‌ జిలుక లేనేలేవ, మృత్యుంజయా! 3

ఆ కైలాస నగాన నీకు నొక నృత్యంబుండినన్‌ జాలునో,
లోకంబెంత యపోహలోనఁ బడెనో లోలోన నిన్‌గూర్చి నీ
వా కర్మంబు నెఱుంగనే యెఱుఁగవా? యార్తావనత్వమ్ము చేఁ
గాకున్నన్‌ విడియాకొసంగి తొలగంగా రాదె? మృత్యుంజయా! 4

మెడనాగయ్యకు నొక్కటే బుసబుసల్‌, మేనన్‌ సగంబైన యా
బిడతో నీ కిఁకనెప్పుడున్‌ గుసగుసల్‌, వీక్షించి మీచంద మె
క్కడ లేనంతగ నెత్తిపై రుసరుసల్‌ గంగమ్మకున్‌, నీచెవిన్‌
బడుటేలాగునొ మామొఱల్‌ తెలియదప్పా! మాకు, మృత్యుంజయా! 5

హరియే ముగ్ధతఁజెందవచ్చును ద్వదీయాకారముం జూచి, లో
నెఱుఁగంజాలకపోవవచ్చు నిఁక బ్రహ్మేంద్రాదులే పూర్తిగా
బరమంబైన భవత్ప్రభావమును, లాభంబేమి? మమ్మెంతగాఁ
గరుణింపంగలవన్న దొక్కటె ప్రసక్తంబయ్య! మృత్యుంజయా! 6

నీ చక్కందన మీ వెఱుంగమినొ, రానేరావె యీకాలపుం
బోచాయింపుల ముందింకెక్కడని యేమో జాడ లేకుంటివే,
నీ చంద్రార్ధకిరీటసంస్మరణతోనే చొక్కుచుండంగ నీ
భూచక్రంబిఁకఁ గొంకనేల విజయంబున్‌ జేయ మృత్యుంజయా! 7

నోటన్‌ బల్కగరాని పాపముల నెన్నో చేయుచున్నాఁడ, ఆ
మాటే పట్టదు నాకు, నీవయిననున్‌ బట్టించుకోనట్లె యీ
నాటన్‌ గూడను గానవత్తు, విటులే నమ్మించి చేఁజిక్కునా
డేటన్‌ ముంతువొ యంచు గుండె దిగులౌనే తండ్రి, మృత్యుంజయా! 8

మెదలన్‌ బాప మొకొక్కటే మెదడున న్మేనెల్లఁగంపించి గా
డిద తన్నుల్‌గద గుండెలో నెచటొ, నాడే నీవు కాదన్నచో
మొదలా జోక్యమె యుండఁబోదుగద, నీమోసమ్మె మోసమ్మురా
సొదగాఁ దేలిచివైచినావు సుధగాఁ జూపించి, మృత్యుంజయా! 9

ఈ చిత్తమ్ము గురూపదేశవిధిగా నే నిల్పఁగాఁ జాల నా
భీచక్రమ్మున, నిన్ను నేదొయొక చిద్బిందుస్వరూపమ్ముగా
నా చూపుం బఱగింపఁజాలఁ, గరుణన్‌ నా ప్రాణలింగమ్ముగా
నా చుట్టుం దిరుగాడు బిడ్డవయి యున్నంజాలు, మృత్యుంజయా! 10

ఎడమీకుండగఁ బైనవచ్చిపడు మా యీ పాపపంకమ్ములన్‌
గడుగంగాఁ దలదాల్చుకొంటివటరా గంగామహాదేవి, నీ
యెడ దాకొల్పెడి మాదు పాపముల నీ వెల్లప్డు శాంతిల్లఁజే
సెడుపొంటెన్‌ దరుణేందుశేఖరుఁడవై చెల్వౌదె, మృత్యుంజయా! 11

సిరిగాఁ బార్వతిగా సరస్వతిగ స్వస్త్రీరాణఁ జెన్నారఁగా
హరివై సాంబశివుండవై యజుఁడవై యాద్యంతశూన్యుండవై
చిరనూత్నంబుగఁ దేజరిల్లెడి నినున్‌ చిజ్జ్యోతి నీనాటి యా
త్మరుచిన్‌ నేనొక చంద్రచూడునిగనే ధ్యానింతు, మృత్యుంజయా! 12

పరిపూర్ణంబయినట్టి నిర్గుణపరబ్రహ్మమ్ము పేరే చెవిన్‌
జొఱదేచిత్రమొకాని, సుంత చెవికిన్‌ సోకంగ నీచంద్రశే
ఖరనామమ్మొక యింతలో మనసువొంగంజొచ్చు, నొక్కొక్కవై
ఖరిగా నొక్కొకబుద్ధి వర్తిలెడునుం గాదయ్య, మృత్యుంజయా! 13

పెద్దంజేయ మనస్కరింపదు నినున్‌, బిడ్డన్‌ వలెన్‌ జూచుచున్‌
ముద్దున్‌ జేయుచు ముచ్చటాడుకొనుచు న్మూపందు నన్మోయుచున్‌
సుద్దుల్‌ సెప్పుచుఁ జెప్పిన న్వినుచు నిన్‌ జొక్కించుచుం జొక్కుచున్‌
బ్రొద్దుల్‌ పుచ్చుటలున్నఁజాలు నితరంబున్‌ గోర, మృత్యుంజయా! 14

ఒక బిల్వార్చనయేని వీఁడెఱుఁగునో, యొక్కొక్కటే యొంటిమీఁ
దికి నిన్నేఁడులువచ్చి యొక్క శివరాత్రింగాని వీఁడుండెనో,
మొక మేలాగునఁ జెల్లి వాఁదెఱచెడిన్‌ మోక్షమ్మునిమ్మంచు నే
టికి నా మ్రొక్కిన మ్రొక్కె చాలుననుకొంటేతప్ప, మృత్యుంజయా! 15

నరజన్మం బెటులిచ్చితో పశుపతీ, నాకంటెఁ బశ్వాదులున్‌
మెఱుఁగే యెన్నివిధాలఁజూచినను స్వామీ! ముందు చేజాఱు నీ
పొరబాటున్‌ సవరించుకోనయిన సద్బుద్ధిన్‌ బ్రసాదింప, వి
త్తెఱగౌ పాలన యిందెకాని మఱి యెందే కద్ద? మృత్యుంజయా! 16

ఏఁ బైకిన్‌ దెగఁ బండితుండనని పేరేకాని నాలోని కేఁ
బోఁబోవంగను జెప్ప లజ్జయయిపోవున్‌ నేను నా బుద్ధికే
యే బొడ్డూడనిబిడ్డనో యగుదుఁ దండ్రీ! నిక్క మీపాటిదే
నాబండారము, త్రోవ నీ విడకయున్నం గాదు, మృత్యుంజయా! 17

ఎఱుఁగన్‌ ని న్నవకాశమెక్కడిది ముందీ ముక్కునంబోవు నూ
పిరినే ఎంత విశేషమున్నయదియో విశ్వప్రయత్నమ్మునన్‌
గుఱుతింపబడునాటికే ముగియవే నూఱేఁడులుంగూడ, నే
విరమింతుం జతనమ్ము నీకునయి నీవే రావె, మృత్యుంజయా! 18

ఒక లంబోదరుఁడైన పుత్రకుఁడు మున్నున్నట్టిదే నీకుఁ జా
లక కాఁబోలును సృష్టిఁజేసితివి యీ లంబోదరుంగూడఁ, దీ
గకుఁ గాయల్‌ బరువౌన కాని, కుడుముల్‌ గల్పించి యవ్వాని కే
లొకొ యివ్వానికి నొక్కమైని యిడుముల్‌ మొల్పింతు, మృత్యుంజయా! 19

నవరాత్రుల్‌గద దేశమంతటను ఈనాఁడేని నాయింటిలో
శివరాత్రుల్‌ జరిగింపఁగావలెనె? నే సేవించుటా దేవినే
యవునేనీ యిటు కూటికే మొగమువాయంజేయునే? యాదిభి
క్షువువీ వాయమ యన్నపూర్ణ యెటులొక్కొ సాటి, మృత్యుంజయా! 20

గజగర్భమ్ముగఁ బైకిఁగన్పడని నా కష్టాలఁ బోకార్పఁగా
నిజ మీ వొక్కఁడవే సమర్థుఁడవు కానీ యేమిలాభమ్ము, నీ
యజమానత్వము చేత నింటను 'మనుష్యాణముకే' లేదుపో
'యజమానాయకు'నైన లేక తలదుబ్బైపోయె, మృత్యుంజయా! 21

ఈ నాకే యనికాదు, నీకయినఁగానీ నేటి కాలానఁ బూ
ర్ణానుస్వారము ముష్టియేని క-నంబన్‌దాన, నన్నేటికై
పూనఁజేసితివో, ప్రమాదములు దేవుండేనియుం బొందునో
నేనేమంచనుకోవలెన్‌ దెలుపవో నిన్‌గూర్చి, మృత్యుంజయా! 22

ఏదో నీకొక దేవిగాని యిఁక నేవేవో సవాలక్ష లా
వాదేవీ లయిపోయె మాకు, జరుగుంబాటెట్టు, లే కొండనో
లేదా యే గుహలోనొ పట్టకొక జోలే దాగియుండంగ, మే
మేదేవుళ్లమొ విశ్వమూర్తులమొ నీవే తెల్పు, మృత్యుంజయా! 23

కొడుకుల్‌ కొమ్మలు గాక వేఱెవరు లోకుల్‌? వీరియందెల్ల నీ
యెడ లేకుండిన క్షుత్పిపాస లస లెట్లేర్పడ్డవో? శక్తియు
క్తుఁడవై యుండుట నీవె దాకొలిపియుందో తెల్పవైతీవు, తు
మ్మెడు దీవించెడువారు మాకు నొక మేమే కామ? మృత్యుంజయా! 24

గాలిన్‌ మేయుచు సర్ప మాకలిని బోకార్చంగఁ, గుందేలు డా
కాలిన్‌నాకుచు దాహమార్చికొనఁగాఁ, గాసంత లివ్వానిలే
చాలన్‌లేక జనుం డిఁకేమియనుచున్‌ సంతోషవారాంనిధిన్‌
దేలంగావలె సృష్టికెల్ల మొనగానింబోలె, మృత్యుంజయా! 25

మేమీ భూమిని పొట్టకోసమయి ఏమేన్‌ జేయకేతప్పునే?
ఏమీ నీకది లేకపోఁగఁ బయిగా నే పాపపుణ్యాలనో
ఈ మా నెత్తిని వేసి రుద్దుటయు మేలే? ఎందుకేర్పడ్డ హం
గామా? ఆకలియన్నదెల్ల నణచగా రాద? మృత్యుంజయా! 26

బొక్కెండన్నము పుట్టఁబోవదు సరే, పూర్వార్జితం బేనియున్‌
దక్కంబోవదు ముక్కు మూసికొని పుణ్యంబంచు పాపంబటం
చిక్కాలమ్ముఁ బెట్టుకొన్నయెడ, నే డేయెత్తుఁ బైయెత్తునన్‌
బొక్కం ద్రోసెడువానిదే ప్రథమతాంబూలమ్ము, మృత్యుంజయా! 27

ఉండంబోవనుగాని యుర్విపయి మున్నున్నన్నినాళ్ళింకఁ బ
ట్టెండన్నమ్మున కెన్నొనోళులను గొట్టెన్‌ జేనెఁడౌపొట్ట జి
ట్టెండౌనాల్కన గూడఁగట్టుకొని చుట్టెన్‌ బాపముల్‌ తట్టుబం
డెం డీజన్మము నిమ్మటంచు నెవఁడేడ్చెన్‌ దండ్రి, మృత్యుంజయా! 28

ఉండంగావలెనొక్కొ నీకొఱకె యేవో వెండిబంగారపుం
గొండల్‌ రెండొకఁడైన బిడ్డలకు మాకున్‌ బంచి యీరాదొ, యొ
క్కొండి ల్లొక్కఁడు విల్లుగాఁ గుదుర నీకున్‌ నిండెనే మాకు, ఈ
గుండుల్‌ బండ లెదానఁగొట్టితి పృథక్కుల్‌ మేలె? మృత్యుంజయా! 29

ఊళ్ళేయేలెనొ లేకయున్నయెడ నింకూళ్ళూళ్ళలో నీళ్ళకా
విళ్ళేమోసెనొ యేరికిన్‌ వలసెడిన్‌, విత్తమ్ము చేనున్నచో
నాళ్ళన్నింటిని గూడఁదీసికొని గండాభిల్లులున్‌ దాంతియా
భిల్లుల్‌ సైతము పిల్లులయ్యెదరు సువ్వే నేఁడు, మృత్యుంజయా! 30

అల్లాగే చననీయకే తిరిగి నీ వామాటకే రాగ ఇ
ల్లిల్లే, సున్నకు సున్నె హళ్ళికిని హళ్ళేగాదె నీ శాంబరీ
భిల్లత్వమ్మును, దాని కెచ్చటనొ నీవే దూరి యేనాడొ బి
స్మిల్లా కాగను లెక్కకా జమక యీ మేమింక, మృత్యుంజయా! 31

పల్లెత్తంగనె కళ్ళమంతపడు తుప్పర్లంచు లోనెంతువో
అల్లాకాదుర ఫక్తు రొక్కముర ఆ 'అల్లాడి' నిల్వంగనే
అల్లల్లాడుర అద్దియిద్దియటరా హైకోర్టతం డెంతరా!
యెల్లన్‌ నీవయికూడ రాలెడిది విత్తే లేదు, మృత్యుంజయా! 32

మావాడంగల పాలవాఁడునయమే మా నెండు నింకెన్నియో
గావించున్‌, మఱి చేతువీ వయిన నొక్కం డిన్నిరూపాలుగా
ఈ వేదీ యటు కళ్లఁజూడగలవే యేరోజు రొక్కమ్ము; నీ
దేవత్వమ్మున నేమి మృత్తికయులేదే తండ్రి, మృత్యుంజయా! 33

నాకీనాటను జీవయాత్రకె టికాణాలేక నావల్లనే
లోకంబన్నదీ నిల్చియున్నదనుచున్‌ లోలోన నన్కొందునే,
నీకెట్టుల్‌ గుదిరెన్‌ జగంబఖిలమున్‌ నీదయ్యుఁ గానట్టులన్‌
నాకంటెన్‌ నిరుపేదగా మనెడి పంథా! తండ్రి, మృత్యుంజయా! 34

నడుపంగావలె వ్యాజ్యమందు నెదో గ్రంథం, బట్లు కాకుండినన్‌
నడుపంగావలె నేదొ యౌషధమునైనన్‌ వ్యాధి, కీ రెండు నొ
క్కెడనే చొప్పడెనేనిఁ జెప్పవలెనే యెల్లప్డు పాల్‌ పెర్గు కా
విడు లేవేళను నేతిజుత్త లొక డబ్బేకాదు, మృత్యుంజయా! 35

ఈ మమ్ముం గనిపాఱవేయుటయెగానీ పామరత్వం బటం
చేమీ పెట్టుకొనంగవైతిగద! నీ కేలయ్య కైలాస, మీ
భూమిన్‌ సంతతి నింత యుంచుక సుఖంబో కష్టమో యేకమై
మేమున్‌ నీవును గూడి యిందె మనుటల్‌ మేల్గాద? మృత్యుంజయా! 36

పద్దుల్‌ వ్రాసి గడించుకొన్నదెదియో పద్యమ్ము లచ్చందునన్‌
గ్రుద్దింపంగను దెచ్చిపెట్టి యిదిగో! కూర్చుంటి, నాయొద్ద నీ
యొద్దంగూడను సర్వమంగళము, నాకో నీకొ యీమీఁద నిల్‌
దిద్దన్‌ బాధ్యత వచ్చి తేల్చుకొనరాదే తండ్రి, మృత్యుంజయా! 37

మొదలున్నట్టి యశీతివాతములలో ముఖ్యమ్ములైనట్టి వే
పదిపైనో ననుఁ బట్టిచూచియును లాభంబేమిలేకే చెవిన్‌
గదపాయించుక వెళ్ళిపోయినవి, యీ కాలానకున్‌ జాల బె
ట్టిదమై యుబ్బసమొండె ప్రాణములఁ దోడెన్‌ దండ్రి, మృత్యుంజయా! 38

ఏచుట్టమ్ములఁ జేరుదున్‌ ముదిమి రానేవచ్చె, నీవైపుగన్‌
నా చూపిప్పటిదాఁక పెట్టుకొని సంతానమ్మునే చూచుకో
నోచన్‌ దిన్నగ, నేరు చూచెదరు కాల్‌నొవ్వంగఁ జేనొవ్వఁగా
నీ చిత్తం బెటువచ్చునో యటులె కానీ తండ్రి, మృత్యుంజయా! 39

సుడిగుండమ్ములఁగూడఁ దప్పుకొనుచున్‌ చుక్కానిలేకుండ నే
నడిగోదావరి లోపలన్‌ బయనమ ట్లెన్నాళ్ళు సాగించెనో
గడువంజొచ్చెను పాపికొండలును భగ్నం బేల గావింప కీ
పడవన్‌ నిల్పితొ, ప్రాఁతనింక నొక చేవంజేతొ, మృత్యుంజయా! 40

ఒక యాఘాతముమీఁద నొక్కటిగ నెన్నోయన్ని యీలాగుపం
పకమే, వీనికి నీవె కారణమొ నాప్రారబ్ధమే హేతువో
ఇంక నా ప్రస్తుతజీవితాచరణమే యీయింతకున్‌ మూలమో
సకలజ్ఞుండవు నాకొకింత యెఱిఁగించన్‌ రాదె, మృత్యుంజయా! 41

పూలం బూజలొనర్చుచుందుఁగద యేప్రొద్దున్‌, గతించెంగదా
కాలంబెంతయొ, యొక్కపల్కయిన పల్కంబోవె నీనోటి ము
త్యా లవ్వెక్కడ రాలునో పదిలమయ్యా! యేటి నా నీటిము
త్యాలేనీ యిటు చల్లనీ తపన చల్లారంగ మృత్యుంజయా! 42

వేళన్‌ నీకు నివేదనంజరిపి నీవే సర్వమైనట్లుగా
లోలో భావనచేయుచుండుటె మహాలోపమ్ముగా వేదనా
జాలంబైనది యింక జాలమయినన్‌ జ్వాలాకృతిందాల్చెడిన్‌
మేలోయయ్య! యింకైనఁగాని మఱి నీ మేల్కొంట, మృత్యుంజయా! 43

పవళుల్‌ రేలును బగ్గుబగ్గుమనుచున్‌ బాధాసహస్రాల ఖాం
డవమట్టుల్‌ దహియింపఁగాఁబడుచునుండన్‌ నాదుడెందమ్ము, తాం
డవమా నీకట నొక్కమై డమరుక ధ్వానమ్ముతో, నీ వొకం
డవుగా కింకొక తండ్రి యెవ్వఁ డిటు చేయంగల్గు? మృత్యుంజయా! 44

ఏఁడుల్‌ నిండినయట్టియాతఁ డిఁక పై నెన్నాళు లిందుండురా,
నేఁడున్నిన్నయటంచు గాదుగదరా నీజాడ గుర్తింప న
ల్లాడంజొచ్చుట, 'బారెడయ్యెఁ బగలెల్లన్‌నేయ' నన్నట్టులై
యీడాడం బరిహాసపాత్రుఁ డయిపోయెన్‌ వీఁడు! మృత్యుంజయా! 45

సుకముం గష్టము నెంచిచూచుకొనురోజుల్‌ వోయి యేమౌదునో
ఇఁక నీ దేహమునుండి జారుకొనఁగానే కొఱ్ఱగింజంతయన్‌
పిక రేపట్టి పలార్చుకాల మొకఁ డావేశించెడిన్‌ హస్తమ
స్తకసంయోగముచేఁ గుదిర్చి దరిఁ జేర్చన్‌రాద, మృత్యుంజయా! 46

ఆఘాతం బిది యెంతతీవ్రతరమో! యాత్మార్థమన్‌ దానికే
వ్యాఘాతంబయి నిట్టనిల్చి కవనం బానాటి కాఖాలునుం
గాఘాలున్‌ జదువంగఁబోయినది యీ కాసంతప్రాణాన కెం
తాఘోషన్‌ నెలకొల్పినాఁడ, వెపుడో యంతమ్ము, మృత్యుంజయా! 47

ఎండం గట్టగలేను దేహమును, నీవీ కంటికిం గానరా
కుండన్‌ బుచ్చుకొనంగలేను నొకగా నొక్కండు ప్రాణాహుతిన్‌
రెండున్‌ రెండయిపోయె, తగ్గదెదియున్‌ రేజాయు నీనాటికిన్‌
నిండుంబ్రాణము కెంతవచ్చినదిరా నీవల్ల, మృత్యుంజయా! 48

సరిలే మానవకోటి యీ వెలుపలన్‌ సంసారచక్రాననే
దొరలన్‌ లే కిటులుండ, లో నొకటిరెండున్‌ గావె షడ్చక్రముల్‌
వరుసన్‌ బేర్చి బిగించినావుగద యబ్బా! నాగపాశాలతో
దరియింపం దరమౌనె నీకరుణచేతంగాక, మృత్యుంజయా! 49

దాహంబాఱునె నీదు నామసుధచేతన్‌? మంచితీర్థమ్మునే
దేహంబుండెడిదాఁకఁ ద్రాగవలయున్‌ దీరన్‌వలెగాని, 'దా
సోహం సోహ' మటన్నమాత్రన మనుష్యప్రాణికిన్‌ దృప్తియే
'కోహం కోహ' మటంచు నిన్నునిలవేయంబోక, మృత్యుంజయా! 50

ఫలముల్‌ భక్ష్యము లెన్నియుంచినను మా ప్రాణానిలంబందునే
నిలుచు న్నీమనసంచు లో నెఱుఁగకే నీకేము చేఁజూపి ని
చ్చలు భక్షించుచు సంతసించెదము నిన్‌ సంతృప్తినొందించిన
ట్లిల మా మానవజీవితమ్ము సకలమ్మీలాగె, మృత్యుంజయా! 51

తొడుగ ట్టీడుచుకొంచు దేహమును ఏదో పొట్టకై చూచున
క్కడికే నాతల పట్టిపోయెడిని, పైగా నూరకోలేక నీ
గొడవంగూడను గోరితెచ్చుక యిటుల్‌ కూరాకునైపోతి, నీ
పొడగన్పట్టనిమాత్ర నేమి మునుఁగుం బోవోయి, మృత్యుంజయా! 52

మే మిష్టంబయినట్టులన్‌ జెవుల తమ్మెల్‌ వట్టి యాడింప నీ
వేమో నిత్యమొనర్చు నృత్యమున నింకేదో విశేషంబుగా
లో మన్నించుచునుంటివేమొ యిదిపోలున్‌, బోలకేయున్న నీ
కామై దుర్విషమే గళాభరణ మెట్లౌనయ్య, మృత్యుంజయా! 53

లాలింపందొరఁకొన్నచో మకురుపిల్లల్‌సైతమున్‌ విందు, రే
వేళన్‌ నేనిటు లెంతవేఁడికొనినన్‌ వేంచేయ, వీకూడు నీ
నీళుల్‌ నాకు హితమ్ముగా వెదురుగా నీవిందు లేకుండినన్‌,
జాలింబెట్టఁగ నేమి నీమనసు పాషాణంబ? మృత్యుంజయా! 54

ఉమ నీకిచ్చి వివాహమున్‌ సలిపినారో చెప్పు మా మేనకా
హిమవత్పర్వతరాజు, లేనటననో నీవామెఁ జేపట్టి యా
యమచేతన్‌ సవతాలు గంగమను మోయంజేయుచున్నావు పా
పము! దేహార్థమొసంగినట్లొసంగి సేబాసయ్య, మృత్యుంజయా! 55

'నడువన్‌ నిత్యము వేఁడికోవలయునే నా కాళులన్‌ నేను, నా
నడతన్‌ దిద్దఁగ నంతరాత్మవగుచున్‌ నాలోన నెల్లప్పు డుం
డెడి నిన్నేల స్మరింపఁగావలయునో నే' నన్నదే మిక్కిలిం
గడుసుంబాఱెను, నన్ను నే నెఱుఁగు మార్గంబేమొ, మృత్యుంజయా! 56

నీవేమో త్రిజగత్ప్రభుండవనుచున్‌ నే నింతకాలమ్ము నీ
సేవంజేసితి, నేటికిం దెలిసివచ్చెంజుమ్ము నా సేవకే
నీవెల్లప్పుడు వేచియుందువని, నే నేకాగ్రభావాన నా
యావద్భారముమోపఁ జచ్చినటు మోయంబోవ? మృత్యుంజయా! 57

నీతోడన్‌ దలపట్లు పట్టుకొనుకంటెన్‌ నేటి యే తారతో
బాతాఖానిని బెట్టుకొన్నఁ గడచున్‌ బబ్బంబు లెన్నేని, నీ
చేతంబడ్డదియే మొదల్‌ క్రమముగా జీవచ్ఛవంబైతి, నా
వ్రాఁతన్‌ నే ననుకొందు నేమిటికి దూఱన్‌ నిన్ను, మృత్యుంజయా! 58

ఈవే సృష్టియొనర్చియున్నయెడ మ, మ్మీరూపులన్నట్టివే
రావేమో! మఱి మాకుఁగూడను గుమారస్వామియార్మోములో
యావిఘ్నేశు గజాననమ్ములొ యవశ్యంబిచ్చి మానుండి యె
న్నో విడ్డూరపురూపు లేర్పడెడివేమో తండ్రి, మృత్యుంజయా! 59

నాచేతన్‌ నుతియింపఁగాబడుటకన్నన్‌ నీకు గత్యంతరం
బే చూపట్టదొ, నిన్ను లోఁ దలచుకొంటేగాని యీపొట్ట కే
దో చందమ్మున నింత పిండమిడవో, యిందేదియుంగాదు, లోఁ
దోఁచున్‌ నీయెడ నాకెదో సహజబంధుత్వమ్ము, మృత్యుంజయా! 60

యమదాహం బగుచుండ చుక్కయును వేయంబోక నా నాల్కపై
అమృతంపుం గలశాలఁ బట్టుకొని నీ హస్తాలఁ జూపింతు, విం
తమహానిర్దయ యొక్క దైవమునకే దక్కెం జుమీ, చూచి సా
టిమనుష్యుండెవఁడైన నోరువఁగలండే యిట్లు, మృత్యుంజయా! 61

ఆభారం బటు మోయఁగానయిన మోయంబోయెదేగాని నీ
లోభం బెట్టిదియో సుధాకలశమున్‌ లోకాన కీ వెంతకే
నీ భాగ్యంబటె! యట్టి వెన్నో తిరుగన్‌ సృష్టించుకోఁజాలవే
ఏ భోగాపురిబొల్లిమబ్బువిధమో యీవైతె? మృత్యుంజయా! 62

ఇగ నేనొక్క కణమ్ము ముట్టనుసుమీ యీవల్ల కైలాసముం
దిగి నా యింటికి వచ్చి నాయెదుటఁ దండ్రింబోలి కన్పించి త
ల్లిగ నన్నుం దినిపించి నా పలుకు చెల్లింపన్‌వలెన్‌; గోరుకొం
ద్రుగదా బిడ్డలచేఁ బరాజయము తండ్రుల్‌ దేవ! మృత్యుంజయా! 63

ఆనాఁ డెవ్వరొ పిల్చినట్టులుగ నా యాలాపనన్‌ వచ్చియున్‌,
రానేరానని మోడివేసితివి తీరా కోరి నేఁడిట్టు లా
హ్వానింపన్‌, మఱి నీకునుం గలవె వేళావేళ లీనాదు చం
దానన్‌, నీదియు మాది సర్వ మొక తత్వంబేనె, మృత్యుంజయా! 64

బువ్వేపెట్టని కైతఁబట్టుకొని దేవుళ్ళాడఁగాలేక, నా
కెవ్వల్లన్‌ మఱి ప్రొద్దువోక, బదులేమీపల్కుటేలేని నిన్‌
రవ్వంబెట్టెద నాల్కకుం దురదతీరం దప్పు సైరింపుమీ
అవ్వంబట్టి వసంతమాడుటిదియేనా స్వామి, మృత్యుంజయా! 65

సృష్టింజేసినయట్టి నీ వెటుల నన్‌ శిక్షింతువో చూతు నా
కష్టమ్మున్‌ సుఖ మింత పట్ట కెటనో కైలాసమందుండు నీ
యిష్టమ్మున్‌ గనిపెట్ట బానిసనటోయీ నేను పుత్రుండ, నీ
వ్యష్టిన్‌ మాన్పి సమష్టికింక నిను నీడ్వంజొత్తు, మృత్యుంజయా! 66

మ్రుగ్గందు న్నినుఁ బెట్టకుండవిడువంబోనోయి! నీకోసమై
కగ్గెం జిత్త మిదెల్ల నేఁడు చెవియొగ్గంబోని నీవే శిరం
బొగ్గంగావలె నేమొకో కడకు, రావో తండ్రి నాతోడుతన్‌
నెగ్గంగల్గినయేనిఁ గీర్తికరమౌనే నీకు? మృత్యుంజయా! 67

పందెంబొడ్డితి వెన్కకున్‌ దిరుగుటన్‌ పల్కన్నదే లేదిఁకన్‌
బొందిన్‌ బ్రాణములుండుదన్క, గడువై పోవంగనేచూడు ము
క్కందాయాన నమశ్శివాయ యని నే గంఠంబు శంఖస్థితిన్‌
బొందింపంగనె నీకు నక్కడను జిందుల్‌గావె, మృత్యుంజయా! 68

తంతుల్‌ లేకయు వాని నే నడుపఁ జేతంగాకయుం గాదు, సా
మంతంబూనుట నీదు మంచితనమున్‌ మర్యాద దక్కించ నే
ఎంతోదూరము పోవనేల 'ఉరువే యీవంచు లే' వన్న గ
ల్లంతున్‌ బెట్టినఁ జాలదే కదలు కైలాసంబె, మృత్యుంజయా! 69

చింతంజేసెడునట్టి భక్తులయెడన్‌ జెల్లించుకోవచ్చు, నిన్‌
సంతంబెట్టెడునట్టి యీ కవులతోనా నీకుఁ బంతంబులున్‌
గింతంబుల్‌, వలదయ్య వట్టి రణపెంకెన్‌ జెప్పుచున్నాను, అ
ల్లంతం దీరెడుకార్యమింక నొక కొండంతౌను, మృత్యుంజయా! 70

తిన్నం డంత తెగింపకున్నయెడ ఈతీరేగదా! యాతఁ డా
కన్నూడంబెఱుకంగనే కుదిరె రోగంబంతయున్‌ నీ, కదే
వన్నెన్‌ నన్నును దేకయేవిడుతువా, వాఁడే నయంబన్నదాఁ
క న్నిన్నేనియుఁ దేకయే విడుతునా? కానిమ్ము, మృత్యుంజయా! 71

నొవ్వంబల్కెడిదాఁక తెచ్చితివి, నిన్నుం బూలఁ బూజింతునే
యవ్విశ్వాస మికెట్లుమాఱెడినొ వీరావేశముందాల్చి నే
నెవ్వెవ్వో వెడలింపఁగా వలయునే యీనొట, రావోయి నా
కివ్వేళం గనుపింపవోయి సకలం బీడేరు, మృత్యుంజయా! 72

ఉత్తుత్తన్‌దలపోతెగాని మొదలీ వుంటేకదా యున్నదే
విత్తై, మొక్కగమొల్చి, వెఱ్ఱితలలన్‌ వేయంగ నానాఁడు నా
చిత్తక్షేత్రమునందు ఖండపరశూ! ఛేదించి కాపాడు నీ
సత్తా నే డెటుపోయె? కానఁబడ దీషత్తైన, మృత్యుంజయా! 73

నీకున్‌ గేవలమైన రూపమునకంటెన్‌ ఛాయగానున్న యీ
లోకంబే ప్రియమంచుఁదోచెడిని మాలో మాకెటో యట్టులే
నీకన్పట్టుటెయైన నేమడిగెదో నిన్‌ గూర్చియా, నీదు ఛా
యాకారమ్మునుగూర్చియా తెలుపవయ్యా మాకు, మృత్యుంజయా! 74

నిశ్వాసమ్ము నివాతదీపమటు తానేనిల్చు సూత్రమ్ము గ్రం
థాశ్వాసమ్ములలోన లేదు, మొద లీవం చొక్కఁడున్నాఁడ వ
న్విశ్వాసమ్ముఁ గుదుర్చుకోవలయుఁగానీ వట్టి తర్కాలచే
నశ్వంబ ట్లడవిం బడందొడఁగునయ్యా బుద్ధి, మృత్యుంజయా! 75

చేయంజేయఁగ నీదు నామజపమున్‌ చిన్ముద్ర నేర్పడ్డ చూ
చాయన్‌ దోచినయట్టె యప్పటి సుఖస్వప్నమ్ము నేఁ డెంతఁగా
నాయత్తంబయినన్‌ లవంబయిన లభ్యంబౌటయేలేదు, తం
డ్రీ! యేదెప్పటి కెంతప్రాప్తి యిఁక నంతేకాద! మృత్యుంజయా! 76

లే వీవన్న నిరాశ లేశమయినన్‌ లే దా మహావ్యాధిలో,
రావో లీలగ నాటిరే కలతనిద్రన్‌, నిన్ను గన్పెట్టనో,
నీవీ జాగ్రదవస్థనే యిపుడు నా నేత్రానకున్‌ రావలెన్‌
భావాతీతతఁ గట్టిపెట్టి యిదె నా పంతమ్ము, మృత్యుంజయా! 77

వెఱపన్నట్టిదెపోయి చూడ మిగులన్‌ వేడ్కయ్యె బీభత్ససుం
దరియై మృత్యువు నాఁడు కళ్ళయెదుటన్‌ నాట్యమ్ము సేయంగ, ఏ
నెఱసో నే ననునట్టి దప్డెఱిఁగితిన్‌, నీవెంతలోఁ దీసి తా
యెఱుకన్‌ నన్‌ బ్రతికించినాఁడవను పేరేగాని, మృత్యుంజయా! 78

ఒకనిన్‌ మించిన యోధుఁడింక నొకఁడయ్యున్‌ జంపనేలేక చం
పుకొనంజొచ్చిరి రోషవేషముల నా మూలమ్మునంజేసి, నీ
దు కృపాలోకన మా శనిన్‌ గుజసమేతున్‌ సౌమ్యుగావించి పా
పికె పాపం బనిపించుపాఠమును మప్పెంగాదె, మృత్యుంజయా! 79

ఎన్నండో సతి నన్ను బాసినను నా కేనాటికానాటికే
నిన్నన్నేడనిపించుచున్న వ్యధతో నెయ్యం బవిచ్ఛిన్నమై
యన్నెయ్యమ్మునఁగూడఁ దియ్యదనమే యంతంతకుందోఁచు ర
మ్మన్నన్‌ మృత్యువుసైత మిట్టులె ప్రియంబౌనేమొ, మృత్యుంజయా! 80

నా యందమ్ములహంస యేమయిన గానన్‌వచ్చెనే నీకు, నె
న్నోయేండ్లయ్యెను తప్పిపోయి, యొకఱెక్కో ముక్కొకాకుండఁ ద
త్కాయంబంతయుఁగూడ స్వర్ణమయమై కైలాసమందున్న య
ట్లే యూహన్‌ స్ఫురియించుచున్నది నిజంబే తండ్రి, మృత్యుంజయా! 81

పోనీ యేతరుమూలమందొ యొక పూవుంబొఁడి నాయందునన్‌
ధ్యానంబుంచి తపింపఁ జూచినటులైన్‌ జ్ఞప్తికింబాఱునే,
నే నింకన్‌ జనుదేరలేదె యనుచున్‌ నీర్వెట్టునేకంట, నీ
మౌనంబే మది కాసగొల్పెడినిసుమ్మా! నాకు, మృత్యుంజయా! 82

ఏసౌఖ్యమ్మునుగాని యాస లెవిగానీ లేకె నాతోడనే
యీసర్వమ్ము ప్రపంచమున్నయటుగా నేఁ జేర నచ్చోటి, కిం
తేసూ! యీ మనుజస్వభావము విషంబేనీ విడంజాల ద
భ్యాసంబయ్యెడిదాఁకగాని నిజమయ్యా! తండ్రి, మృత్యుంజయా! 83

ఎదొ జీర్ణించినయట్టివ్యాధియయి పై నెవ్వాని చేచల్వనో
కుదురన్‌ సంతసమందిగూడ అది తాఁ గోల్పోయియున్నట్టులన్‌
వెదకన్‌జొచ్చెడిప్రాణి వీడఁగలదే విశ్వమ్ము నెన్నేఁడులో
కుదురుంజేసుకయుండి, నీవె యెపుడో కొంపొమ్ము, మృత్యుంజయా! 84

ముదిమిన్‌ గాయమురోతవేయుచునె వ్యామోహమ్ముగల్పించుచు
న్నది, చేదేనిఁ దినందినంగఁ గడుఁ దీయందీయనౌ రీతిగన్‌,
బ్రదు కెంతేనియు భారమయ్యు నిదియే బ్రహ్మాండముల్‌ నిల్వ నా
స్పదమేమో యనిపించుచున్నది మహాశ్చర్యమ్ము, మృత్యుంజయా! 85

వెడలింపంబడి ప్రాణ మింకనెచటో వేఱేస్వరూపమ్ముతో
నొడలిందాలిచి యుండియున్నదియొ యీయుర్విన్‌ మఱింగాకనీ
యెడ జీర్ణించి జితించిపోయినదొ, నాకెవ్వా రెఱింగింపఁజా
లెడివా రా సతిగూర్చి యెంతకును జాలేలేద, మృత్యుంజయా! 86

కడకీ దుగ్ధసమేత మామెకు నెఱుంగన్‌రాదొ, నాకేని యీ
యొడలన్‌ బ్రాణమటంచునుండువఱకేనో యేమొ, జన్మమ్ము లీ
బడి నెన్నయ్యెనొ యింతకున్‌ మునుపు, మాప్రాణాలచే నీదఁగాఁ
బడ జన్మమ్ము లికెన్ని యున్నవియొ చెప్పన్‌రాద? మృత్యుంజయా! 87

కానీ, చాయయెకాక యొక్కయెడ ఆ కన్ముక్కుతీరేనియుం
గానన్వచ్చియుఁగూడ భేదపడియెం గంఠస్వరం, బట్టులే
యీనీ సృష్టిని దేనికయ్యదియె ప్రత్యేకత్వముంజెందు నే
ప్రాణిప్రాణియుం, జిత్ర మెంతటి ప్రభావంబయ్య, మృత్యుంజయా! 88

ఒడలిం గాలిచివేయ భస్మమయి యెందో యెందునో చేరు కై
వడి జీవాణువులేని దేహ మిది పోవన్‌ జన్మమున్నప్పుడుం
డెడి కర్మానుగుణమ్ముగాఁ జనెడినో నీపన్పుచే నెక్కడె
క్కడికో సృష్టికి నిత్యనూతనత ఆకల్పింప, మృత్యుంజయా! 89

బొందిన్‌ దోడ్కొనిపోక ప్రాణమునె కొంపో లాభమేముండునో
యిందీ భూమిని ప్రాణవాయు వెటులో యీ మేముజీవింప మా
యందుం గల్గినయట్టి ప్రాణమును నీ కట్లేమొ భావింప, ము
న్ముందీ హింసయటంచు నీయెడనె యుద్భూతమ్మొ! మృత్యుంజయా! 90

ఒక నిత్యున్‌ సృజియింపలేవయితి నిత్యుండన్న పేరున్నయం
దుకు, నీకీ యిహలక్షణం బెఱుఁగరాదో? కీటకంబేని కీ
టకమున్‌ సృష్టియొనర్పఁగాఁ గలిగియుండంగావలెన్‌, బాల్యపా
లకసంబంధము శక్తిచాలకెటు నిల్వంజాలు, మృత్యుంజయా! 91

నీ వాలాగున శాశ్వతుండ వగుచున్‌ నీవల్ల జన్మించు మా
కే వల్లన్‌ ఘటియిల్లుచున్నవొకదా! యీచావు లీపుట్టుకల్‌
మావల్లన్‌ జనియించువారల కిఁకన్‌ మావైఖరుల్‌ రాఁగ నే
లా వర్తింపదొ నీదు మాదునెడ నీయంశమ్ము, మృత్యుంజయా! 92

గతకర్మానుభవమ్ము దీఱగనె యీకాయమ్ము తప్పించి ప్ర
స్తుతకర్మానుభవమ్ముకోసము మఱేదో కాయమున్‌ జూతువో
ప్రతిప్రాణమ్ము బ్రపంచవాసనలు దీఱన్‌ బైనిఁ కేనాడొ నీ
గతమై లీనతనొందునేమొ పరమాకాశాన? మృత్యుంజయా! 93

ఒక యుచ్ఛ్వాసముతోనె ప్రాణములనెన్నో మాటికిన్‌ నీవులో
నికిగొంచున్‌ భువికన్నిటిన్‌ విడుతువా నిశ్వాసరూపమ్ముగా
నకలంకా! విషవాయువుల్గొనుచు మాయందుండి వృక్షమ్ము లె
ట్లిక మాకిచ్చునొ శుద్ధవాయువుల నీ విట్లేన? మృత్యుంజయా! 94

చూడంజూడ మహాశ్మశాన మనిపించున్‌ నాకు నీలోక, మిం
దేడన్‌ గాలిడఁబోవ నేరిపయినో యే వేయుచున్నట్టులే
లో డక్కయ్యెడిం గాని నీమహిమ యాలోనే నివారించి, నీ
క్రీడారంగ మటన్నమార స్మృతికిం గీలించు, మృత్యుంజయా! 95

ఆభూతమ్ములతోనె యున్నయెడఁ గాదన్నారె యేరైన? నీ
వీ భూమిన్‌ బరపంజిసంతతిని నేఁ డీఁదంగఁబోనందువే
నీభారమ్ము వహింప నింక నెవఁడో నీయబ్బయున్నట్టులన్‌
లాభంబేమియు లేఁదికన్‌ దిగుము కైలాసమ్ము, మృత్యుంజయా! 96

పోమో, రామొ యిహమ్మునం దిరిగి రాఁబోకుండఁ గొంపోదువే?
యీ మమ్మందఱ నెత్తిఁబెట్టికొని యూరేగంగ నెంతున్నదో
యేమో, ఆపరలోకమున్‌ బెరుగునో యీవిచ్చు నాజ్ఞావిధిన్‌
మామా ప్రాణులతోడి పాటుగనె మర్మంబేమొ? మృత్యుంజయా! 97

ఒక కన్‌గ్రుడ్డుననున్న నీలిమను సూర్యున్‌ జంద్రు సర్వప్రపం
చకమున్‌ రేపగలొక్కమైఁ బ్రతిఫలింపం జేయుదేకాక త
త్సకలక్రీడ యనంటిపం డొలిచిచేతంబెట్టుచున్నట్లు దృ
ష్టికినిం దెత్తువు భక్తకోటి కొకఁడడ్డే నీకు, మృత్యుంజయా! 98

నిలువన్‌ బ్రార్థనచేయుచుండినకొలందిన్‌ సౌఖ్యమే కష్టమై
తొలగింపంగ యతింపకున్న కొలఁదిన్‌ దుఃఖమ్మె సౌఖ్యమ్ము కాఁ
గలదేమోకద! యెందుకేర్పడిన తర్కంబుల్‌ వితర్కంబు, లీ
యిలనే స్వర్గమొనర్చు స్పర్శమణివై యీవుండ, మృత్యుంజయా! 99

ఇహమందున్‌ బరమందు నొక్కగతిగా నిష్టమ్ముగల్పించుచున్‌
బహుళార్తిన్‌ దొలగించివైచినది నీ పంచాక్షరీమంత్ర, మా
మహనీయంబగు స్పర్శవేధి యనుచున్‌ మాకుండినన్‌ జాలుఁ బ్ర
త్యహముం బాయక, యేది యింక నిను గోరంబోము, మృత్యుంజయా! 100

నీనామమ్ము జపమ్మొనర్చినకొలందిన్‌ విశ్వగానమ్ముగా
నానాటన్‌ బరిణామ మొంది యటుపైనన్‌ బ్రహ్మగానమ్ముగా
రానున్‌ రాను ధ్వనించి లోన నిపు డుఱ్ఱట్లూఁగు, నింకెందునన్‌
లీనంబౌటకొ! తృప్తియాత్మకెటులున్‌ లేదయ్య, మృత్యుంజయా! 101

ఆ కన్పట్టిన ధ్యానముద్ర భవదీయాలోకనావాప్తిచే
నీ కన్గప్పెడి యోగనిద్రయయి తండ్రీ! చిత్త మీనాటికిన్‌
లోకం బేదొ యికొక్కలోకమయినట్లున్‌ బొందికైలాసమై
వైకుంఠం బరచేతనున్నయటులన్‌ వర్తించు, మృత్యుంజయా! 102

నాలోఁ గొన్నిదినాలనుండి యెవఁడో నాగస్వరం బూదుచున్‌
మూలాధారమునే కదల్చెడిని, తన్మూలమ్మునంజేసి కాఁ
బోలున్‌ శ్వాసయె యాడఁగాఁదొడఁగునెప్డున్‌ దేవతాసర్పమై
పోలంజూడఁగ నీవె యిందుకు గతంబో యేమొ, మృత్యుంజయా! 103

పలుబాముల్‌ పడుకారణమ్ముననొ, నీపై నొక్కటే ధ్యాసనో,
చలనంబన్నదెపోయి స్థాణువుగ నీ చందాన నిల్చెన్‌ మన
శ్శిల, స్థాణుండ విఁ కావహింపుము ప్రతిష్ఠింపంగ నీపేరునన్‌
గలుగంబోవునొయేమొ పూజలు పురస్కారాలు, మృత్యుంజయా! 104

ఎల్లన్‌ నీవయిపోయి, నీవు తలపై ఏచిన్నిపువ్వట్లొ జా
బిల్లిన్‌ దాలిచియుండ, వెన్నెలలుగా విశ్వాన నీకాంతులే
వెల్లింగొల్పెడునట్టు లున్నయవి, యీ వేళావిశేషమ్ముచే
వెళ్ళంబుచ్చకు నింక, దీని మనసే వేఱయ్యె, మృత్యుంజయా! 105

లోకమ్మందునఁగాక వెన్నెలలు లోలోఁ గాయునట్లుండె, న
య్యాకాశమ్మున నున్నజాబిలియు, నాయందున్న డెందమ్ము ని
ట్లేకాకారత నొంద నేమికతమో! యీ యాత్మసంబంధమున్‌
నీకారుణ్యముచేత నేర్పడుటగానే తోఁచు, మృత్యుంజయా! 106

నావంబోలి ప్రయాణమైనది మహానందప్రవాహమ్ములో
భావం బెచ్చటికో, కను ల్పగిలిపోవంజొచ్చు ధావళ్యమే!
లావణ్యం బతిగణ్యమే! యెటులు కైలాసమ్మొకో బొందినే!
కైవల్యంబొకొ జీవముండఁగనె! నిక్కమ్మొక్కొ, మృత్యుంజయా! 107

ఏరో వెన్నెల చీఁకటు ల్గలసిన ట్లీపర్వతాగ్రాన ను
న్నారే! యొక్కరిలోన నింకొకరు లీనంబౌచు నున్నట్టులున్‌
వేఱౌచున్నటు కానుపించెదరె! కానీ, వారికే వారు ప
ట్టీరే! యాదిపురాణదంపతులు కారే వారు! మృత్యుంజయా! 108

బుచ్చన్నా!....
ఎంతపనిచేసావు! చిరంజీవి నమశ్శివాయ కోరికపై 'ఒక లంబోదరుడైన పుత్రకుడు' అంటూ ఆషామాషీగా ఆరంభించినదెల్లా - అగాధతలాలనూ, ఉన్నతశిఖరాలనూ అంటి, అష్టోత్తరశతంచేసి, చివరకు 'ఏరో వెన్నెలచీకటుల్‌ గలసినట్లీ పర్వతాగ్రాన నున్నారే!' అంటూ మమ్మెక్కడికి తీసుకెళ్లి వదిలావంటేనూ! నీ హాస్యతరంగాల అడుగున, ఇంతటి సంస్కారపరిణతీ, ఇంతటి శాంతరసగర్భమూ వున్నదనుకోలేదు. పంచవటితోనే తలమున్కలై, శబరితో కాలు నిలువద్రొక్కుకోలేకపోతున్న మాకు ఈ మృత్యుంజయముతో 'నావంబోలి ప్రయాణమైనది మహానంద ప్రవాహమ్ములో భావంబెచ్చటికో!' మా బుచ్చయ్య ఇంతటి సంస్కారవృద్ధుడైనా, నువ్వు చెప్పినట్లు 'పెద్దంజేయ మనస్కరింపదు నిన్ను.' మా యీ చనవును మన్నించవూ? 'ఆ ధావళ్యంతో కన్నులు పగిలిపోతూ' కూడా 'బాబుగారూ' అంటూ నవ్వుతూ ఎదురువచ్చే నిన్నెప్పుడు కౌగిలించుకుంటానా అని యెదురుచూచే..10-1-1946, మచిలీపట్టణం. మిత్రుడు,..కాటూరి వేంకటేశ్వరరావు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat