శ్రీమదొంటిమిట్ట రఘువీరశతకము - Srimadontimitta Raghuveerasatakam

P Madhav Kumar

 


శ్రీమదొంటిమిట్ట రఘువీరశతకము
 

శా. శ్రీకల్యాణగుణాభిరామ! విబుధశ్రేణీ కిరీటద్యుతి
వ్యాకీర్ణాంఘ్రి సరోరుహద్వయ! సహస్రాక్షస్తుతా! యచ్యుతా!
నాకుం బ్రాపును దాపు నీవె యగుచున్ నన్నేలుమీ రామభ
ద్రా! కారుణ్యసముద్ర! ధీర! రఘువీరా! జానకీనాయకా! 1

శా. తారుణ్యోదయ! యొంటిమిట్టరఘునాథా! నీకు నేఁ బద్యముల్
నూఱుం జెప్పెద నూరుఁబేరు వెలయన్ నూత్నంబుగా; నంత నా
నోరుం బావన మౌను, నీ కరుణఁ గాంతున్, భక్తి నన్నందఱున్
రారమ్మందురు గారవించి రఘువీరా! జానకీనాయకా! 2

శా. ఆ కర్ణాటకమండలాధిపతిచే నాస్థానమధ్యంబులో
నా కావ్యంబులు మెచ్చఁజేసితివి నానారాజులుం జూడఁగా
నీకుం బద్యము లిచ్చుచో నిపుడు వాణీదేవి నా జిహ్వకున్
రాకుంటెట్లు? వసించుఁగాక రఘువీరా! జానకీ నాయకా! 3

శా. నీ కేలన్ దృణ మంది వైవ నదియున్ నిర్ఘాతపాతక్రియన్
గాకాకారనికారదానవుని లోకాలోకపర్యంత మీ
లోకంబుల్ పదునాల్గు త్రిప్పినది కాలున్మోపఁగానీక యౌ
రా! కాకుత్స్థ కులాగ్రగణ్య! రఘువీరా! జానకీనాయకా! 4.

మ. సకలామ్నాయములం బఠించు ఫల మబ్జాతాక్షు నామంబులం
దొక టేదైనఁ బఠింపఁ గల్గు నటువం టుత్కృష్ట పుణ్యప్రవ
ర్తకనామంబులు చక్రపాణికి సహస్రంబుండుఁ దత్తుల్య మ
ర్కకులా! నీ శుభనామ మౌర! రఘువీరా! జానకీనాయకా! 5

శా. కొంకం గారణ మేమి ధర్మములు పెక్కుల్ చేసి మర్త్యుండు నీ
వంకం జిత్తము నిల్పలేక పెరత్రోవల్ త్రొక్కినన్ సర్వముం
బొంకై పోవుఁ; గురంగనేత్ర తగునోముల్ వేయునున్ నోచి తా
ఱంకాడంగఁ దొడంగినట్లు రఘువీరా! జానకీనాయకా! 6

శా. ఆ గౌరీశ్వరకీర్తనీయుఁ డగు ని న్నర్చింపఁగా లేనివా
రోగు ల్గారొకొ చాల యోగ్యులయినన్ యోగానుసంధాను లీ
మాగుల్గాన యథార్థమాడితిని నీమంత్రంబె మంత్రంబురా!
రాగద్వేషవిదూర! ధీర! రఘువీరా! జానకీనాయకా! 7

మ. జగముల్ మూఁడు సృజింపఁబ్రోవఁ బిదపన్ సంహారముం జేయఁగాఁ
ద్రిగుణాకారముఁ దాల్చినట్టి వరమూర్తీ! వాసుదేవా! హరీ!
నిగమస్తుత్యపవిత్రగాత్ర! నృహరీ! నీలాభ్రవర్ణా! మహో
రగతల్పా! జనకల్పభూజ! రఘువీరా! జానకీనాయకా! 8

శా. నీ చారిత్రముఁ జెప్ప నద్భుతమగున్, నీ నామసంకీర్తనం
బాచండాలునకైన మోక్ష మొసఁగున్, హత్యాదిదోషంబులన్
వే చించున్ విదళించుఁ ద్రుంచుఁ దునుమున్ వేఁటాడు నంటంబడున్
రాచుం ద్రోచు నడంచు నొంచు రఘువీరా! జానకీనాయకా! 9

శా. తేజం బొప్పఁగ నీవె కావె మొదలం ద్రేతాయుగాంతంబునన్
రాజై పుట్టితి వింక నీకలియుగాంత్యం బందునన్ రౌతవై
వాజిం దోలి విరోధులం దునుమ దేవా! నీవ యొండెవ్వఁ డా
రాజున్ రౌతును నీవె కావె రఘువీరా! జానకీనాయకా! 10

శా. గాజుం బూస సురేంద్రనీలమణిగాఁ గల్పించు చందంబునన్
బాజుం జర్మము మీఁది బేగడపొరల్ బంగార మౌ రీతిగన్
నా జన్మంబు పవిత్రభాజనముగా నన్నేల రావేలరా
రాజీవాక్ష! కృపాకటాక్ష! రఘువీరా! జానకీనాయకా! 11

శా. నా జన్మాంతర వాసనావశమునన్ నాపాలి భాగ్యంబునన్
నా జాడ్యంబులు పోవుకాలముతఱిన్ నా పుణ్యపాకంబునం
దీజన్మంబున నిన్నుఁ గొల్వఁ గలిగెన్, హీనుండఁ గా నింక, నే
రాజన్, నాకెదు రెవ్వ రుర్వి? రఘువీరా! జానకీనాయకా! 12

శా. నేఁటం దీఱె ననేకజన్మములనుండి న్నన్ను వెంటాడుచున్
వాటంబై చనుదెంచు పాపములు; శ్రీవత్సాంక! యీవంక నీ
పాటల్ పాఠము సేయువారికి మఱిం బాపంబులం బాపుఁ గ
ర్ణాటాధీశ్వర! యొంటిమిట్ట రఘువీరా! జానకీనాయకా! 13

మ. పటునిర్ఘాత కఠోరనాదము ఘనబ్రహ్మాండ భాండంబుఁ బి
క్కటిలం జేయుచు వచ్చునప్పు డితరుల్ గాండీవినామంబు లె
న్నుట మేలందురు; వైష్ణవుల్ తలఁప రన్యుం గోరి యెంతెంత దు
ర్ఘటముల్ వచ్చిన నిన్నెగాక రఘువీరా! జానకీనాయకా! 14

మ. కొడుకు ల్బ్రహ్మలు, కూఁతు రీశ్వరశిరఃకూటంబుపైఁ గాఁపురం,
బుడురాజుం దినరాజుఁ గన్ను, లహిరా జుయ్యాలమంచంబు, నీ
పడఁతుల్ శ్రీయు ధరిత్రియున్, సవతు చెప్పన్ లేరు నీకన్యు, లా
ఱడి మర్త్యు ల్గనలేరుగాక రఘువీరా! జానకీనాయకా! 15

మ. వడి మీఱంగ నమోఘమై నిగుడు నీ వాలమ్ము వాలమ్ముఁ దాఁ
కెడు నంచున్ మెడ యొడ్డినన్ జమరిపైఁ గీల్కొన్న కారుణ్య మే
ర్పడ మున్నేసిన యమ్ము వేఱె యొక నారాచమ్మునం ద్రుంచి పే
ర్పడి తౌరా విలుకాండ్రలోన రఘువీరా! జానకీనాయకా! 16

మ. చెడుగన్, గష్టుఁడ, దుష్టచిత్తుఁడఁ, బరస్త్రీలోలుఁడన్, బాలుఁడన్
జడుఁడన్, మూఢుఁడఁ, గొండెకాఁడను, దురాచారి, న్నిషిద్ధాత్ముఁడన్
గడుసంగాకరిఁ గల్ల గుల్లఁ గపటిన్ గర్విన్ ననుం గావు మూ
ఱడి యున్నాఁడను నీవె దిక్కు రఘువీరా! జానకీనాయకా! 17

మ. అడుగున్విద్యకు లోనుజేసితివి న న్నావంత నావంతలే
కడియాసల్ గొనుచున్ దురాత్మకుల నే నర్థించుచున్నాఁడ; నె
న్నఁడు రక్షించెదు, నీవు నన్ను బలె నెన్నం బేదవా? యేల యా
ఱడిఁ బెట్టంగ? రమావిహార! రఘువీరా! జానకీనాయకా! 18

మ. ప్రణుతింపన్ మృతదేహుఁ జూచి బ్రదికింపన్ బ్రహ్మరుద్రుల్ మరు
ద్గణనాథాదులు నోప, రద్భుతము గాఁగన్ నీదు భృత్యుండు ల
క్ష్మణు ప్రాణంబులు దెచ్చెఁ జచ్చినతఱిన్ సంజీవనీప్రక్రియన్
రణభూభాగములోనఁ దానె రఘువీరా! జానకీనాయకా! 19

శా. ఏ తాత్పర్యము గల్గి కొల్చెదవురా? యే నేల నిన్మెత్తురా?
నీతో నాకుఁ బనేమిరా? యనక మన్నింపం దగున్; మున్ను నీ
చేతన్ మోక్షముఁ గన్నవారి వినమా చిత్రంబుగా నిర్జరా
రాతిన్ నాతిని రాతిఁ దొల్లి రఘువీరా! జానకీనాయకా! 20

శా. దాతల్ ద్రాతలు తల్లిదండ్రులు మఱిన్ దైవంబు లాప్తుల్ చెలుల్
భ్రాత ల్దక్కినవారు చుట్టములు మీపాదాలపై నాన నా
దాత ల్ద్రాతలు తల్లిదండ్రులు మఱిన్ దైవంబు లాప్తుల్ చెలుల్
భ్రాతల్ సర్వము నీవె కావె రఘువీరా! జానకీనాయకా! 21

మ. శ్రుతిపాథోధి మథించి శాస్త్రమహిమ ల్శోధించి యష్టాదశ
స్మృతు లాలించి మహేతిహాసకథలుం జింతించి తా రొక్క స
మ్మతమై సన్మును లాచరించిన మహామార్గంబు నీసేవ; దు
ర్మతు లీమార్గముఁ గానలేరు రఘువీరా! జానకీనాయకా! 22

మ. మతి నూహింపరు కొంద ఱీసుకృత మేమార్గంబునం దున్న ను
గ్రతపోధ్యానము సామగానమును దీర్థస్నానమున్ దానమున్
గ్రతుసంధానము లేల? నేలఁ దులసిం గర్వయ్యెనో? యూర నీ
ప్రతిమ ల్లేవొ నమస్కరింప? రఘువీరా! జానకీనాయకా! 23

మ. సుతు లంచున్ హితు లంచు బంధుజను లంచుం దల్లులుం దండ్రులున్
సతులుం బౌత్రులు నంచు నెంచుకొనుచున్ సంసారమోహాబ్ధిలో
గతజన్మంబులఁ దేలుచున్ మునుఁగుచున్ గర్వించి యే ని న్ననా
రతముం గొల్వని మోస గల్గె రఘువీరా! జానకీనాయకా! 24

మ. క్షితిలోఁ దామును బ్రహ్మసృష్టికిఁ బునస్సృష్టిన్ వినిర్మించియున్
గ్రతువిఘ్నం బొనరించు దానవుల వీఁకం దోలఁగా లేక నాఁ
డతిబాలున్ నినుఁ దోడు తోడుకొనిపోఁడా గాధిసూనుండు నీ
ప్రతివీరాగ్రణి యెవ్వఁ డింక? రఘువీరా! జానకీనాయకా! 25

మ. క్షితిలో నల్పులమీఁదఁ జెప్పిన కృతుల్ ఛీఛీ నిరర్థంబులౌ
నుతిపాత్రమ్ములు గావు మేఁక మెడ చన్నుల్ నేతిబీఱల్సుమా
వితత ప్రౌఢిమ నీకుఁ జెప్పిన కృతుల్ వేదాలు శాస్త్రాలు భా
రత రామాయణముల్ దలంప రఘువీరా! జానకీనాయకా! 26

శా. సంతానంబును బారిజాతకమహీజాతంబు మందారమున్
జింతారత్నముఁ గామధేనువు సుధాసింధూత్తమంబున్ మదిన్
జింతింపన్ సరిగావు నీకు విజయశ్రీధామ! యో రామ! య
శ్రాంతత్యాగ వివేకపాక! రఘువీరా! జానకీనాయకా! 27

శా. ఏ దైవాల వరాలకంటె సులభం బెవ్వారికైనన్ మదిన్
నీ దాతృత్వము చెప్పనేల శరణంటేన్ గాతు వింతేల నీ
పాదాంభోజరజంబు రాతికయినన్ బ్రాణంబు లీఁజాలు నౌ
రా! దిక్పూరితకీర్తిపూర! రఘువీరా! జానకీనాయకా! 28

శా. విందున్ వేదపురాణశాస్త్రముల గోవిందున్ ముకుందున్ హరిన్
విందున్ వేల్పులలోన భక్తసులభున్ విశ్వంభరున్ సచ్చిదా
నందున్ నందుఁడు కన్న చిన్నశిశువున్ నాపాలి పాపాళిఁ బా
ఱం దోలంగ నృసింహు నిన్ను రఘువీరా! జానకీనాయకా! 29

శా. సందిం బూసలలోన నీ కవచరక్షామంత్రరాజంబుఁ బెం
పొందన్ వ్రాసి ధరించినాతఁడు రిపువ్యూహంబులో నైన నే
కందుం బొందక వజ్రపంజరములోఁ గాఁపున్న చందానఁ బా
ఱం దోలుం బగవారి నౌర రఘువీరా! జానకీనాయకా! 30

మ. వృథగా దెవ్వఁడు నిన్నుఁ గొల్చినఁ గృపన్ వీక్షించి వాఁ డేమనో
రథముల్ వేఁడిన నట్లె సేయుదువుగా రక్షావిధేయుండవై
కథగాదీ వచనంబు నిక్క మటులే కాదేని మున్నేల సా
రథివై తర్జునుతేరిఁ దోల రఘువీరా! జానకీనాయకా! 31

మ. ఘనసారంబును లోనికిం గొనిన శ్రీగంధంబుఁ బైఁ బూసినన్
దినమున్ మర్దనఁ జేసినం గడిగినన్ దిష్టంబులోనం దొలం
గని దుర్గంధము నైజ మీముఱికి డొక్కల్ నమ్మి ని న్గొల్వనే
రని మూఢాత్ముల నేమి చెప్ప రఘువీరా! జానకీనాయకా! 32

మ. ఇనుమా రాశ్రితు నిల్ప; వాడ వినుమా రేమాటయున్; సాయకం
బినుమా రాహవభూమిఁ బూన; విదిగా కింకొండు మేలంచు నీ
వినుమా రీ దురితాంధకారపటలం బేరీతి వీక్షింతు? వు
గ్రనిశాటాంతక! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా! 33

మ. మును నే నెన్నఁడు వేదశాస్త్రపఠనంబుల్ రిత్తతీర్థాటనం
బును దానంబును జేయఁ బోను సతతంబున్ నిన్ను సేవించి కీ
ర్తనఁ జేయన్ మతిలేదు దానమున కర్థం బల్ప మింకెట్లు బో
రన నా దుష్కృతముల్ దొలంగు? రఘువీరా! జానకీనాయకా! 34

మ. విను నా కెన్నియొ దోసముల్ గలవు నొప్పిం బొందఁగా మ్రంద ర
మ్మని రౌద్రంబుగఁ గాలుబంటు లన నే రాఁపేరు? నా పేరుఁ బె
ట్టినవానిన్ బరలోకదూరుఁడని యండ్రే పొండు పొండంచు బో
రన సాయమ్మయి యడ్డగింపు రఘువీరా! జానకీనాయకా! 35

మ. అనఘంబైన దశాశ్వమేధకృత పుణ్యస్ఫూర్తి నీకొక్క మా
టు నమస్కారము సేయఁ గల్గునని విందున్; యాగధర్మంబులున్
గొనసాగున్; జననంబు లుక్కడఁగు నీకున్ మ్రొక్కెనేనిన్ బున
ర్జననంబేది దలంచి చూడ రఘువీరా! జానకీనాయకా! 36

మ. దనుజారి జ్వలనాంతకాసుర సముద్రస్వామి వాయు త్రిలో
చనమిత్రాభవ సూర్యసోమధరణీజాతాంబుజాత ద్విష
జ్జననాంగీరస శుక్రభానుతనయ స్వర్భానుకేతు ప్రవ
ర్తనముల్ నీ విభవంబులౌర రఘువీరా! జానకీనాయకా! 37

మ. కనుఁగొన్నప్పుడె గుప్పఁడే కుజనులం గాలుండు కాలుండు పొం
డనుచున్ రౌరవనారకాగ్నులఁ బడన్ హత్తించి, యయ్యగ్నుల
న్మునుఁగం జాలఁ బరేతరాజునకు న న్నొప్పింపఁగాఁ బోవ కు
గ్రనిశాటాంతక! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా! 38

మ. నిను సేవించెద నంచుఁ గోరుకొనియున్నేన్ వానికిం బూర్వక
ర్మనిమిత్తంబులు కష్టముల్ గలుఁగఁగా మన్నించి నీవడ్డ మౌ
దని చెప్పంబడు, ద్రౌపదిం గరినిఁ బ్రహ్లాదున్ ధ్రువున్ మున్ను బో
రన రక్షించుట కల్దొ లేదొ రఘువీరా! జానకీనాయకా! 39

మ. అనిశంబున్ నినుఁ గొల్చు మానవులు ప్రాణాంతంబునన్ రోగబా
ధ నిమిత్తంబున రామరామ యనుచున్ దల్పంగ లేకుండినన్
జననాథాగ్రణి! నీవు వారి రసనాస్థానంబున న్నిల్చి బో
రన రామా! యనిపింతు వౌర! రఘువీరా! జానకీనాయకా! 40

మ. ఇనవంశోత్తమ! వేదశాస్త్రములలో నే వింటి నేవింటి వాఁ
డును నీకుం బ్రతిగాఁడు, నీకుఁ గల బంటు, న్నన్ను రక్షింపు; కా
లుని బంట్లన్ విదళింపఁగా వలయు, నాలో నుండుమీ గండుమీ
ఱ నమోఘాస్త్రము విల్లుఁ బూని రఘువీరా! జానకీనాయకా! 41

మ. జననాథాగ్రణి! నిన్నుఁ గొల్చునతఁ డాచండాలుఁడైనం బున
ర్జననం బొందక ముక్తిఁ గాంచు నొనరన్ సద్భక్తుఁడైనం దుదిన్,
జనుఁ జండాలకులంబులోన నుదయించం గోరి నీ నామకీ
ర్తన సేయ న్నిరసించెనేని రఘువీరా! జానకీనాయకా! 42

మ. జనకుం డెవ్వఁడు నీకు? నీ కడుపులో సర్వంబు నుండంగ నీ
యునికి స్థానము దుగ్ధవార్ధి నడుమన్ యోగీంద్రహృద్గేహ! యే
మని వర్ణింపుదు నీ మహత్త్వములు సర్వాశ్చర్యముల్ పుణ్య వ
ర్తన రాజన్యయశోవిహార రఘువీరా! జానకీనాయకా! 43

మ. జనకుండా జనకుండు నీ సతికిఁ, గౌసల్యా యహల్యాఘమో
చన!నిన్ గాంచిన తల్లి, పంక్తిరథుఁడా సర్వేశ! మీ తండ్రి, యే
మి నిమిత్తంబున నుద్భవించితివొ నెమ్మి న్నిట్టు లీపుట్టు వు
గ్రనిశాటాంతక! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా! 44

మ. హనుమంతుం డొక యబ్ధి దాఁటె నని యేలా ప్రస్తుతుల్ సేయఁగా
దనుజారాతి! భవత్పదాబ్జములు హృత్పద్మంబున న్నిల్పు నా
ఘనపుణ్యుండు భవాంబురాశులు తృణీకారంబుగా దాఁటు బో
రన నెన్నైనను గొంకులేక రఘువీరా! జానకీనాయకా! 45

శా. నీ పాదోదక మక్షులం దదుముకొంటిం, గొంటి నాలోనికిన్,
నీ పళ్లెంబు ప్రసాదముం గుడిచితిన్, నీ పేరునుం బెట్టితిన్,
నీ పెన్ముద్రలు దాల్చితిన్ భుజములన్, నీవింక నన్నేగతిన్
బ్రాపై ప్రోచెదొ కాని పూని రఘువీరా! జానకీనాయకా! 46

మ. తపముల్ చేసినఁ బోనిపాపములు మంత్రంబుల్ సమర్థంబుగా
జపముల్ చేసినఁ బోని దోషము నదీస్నానంబునం బోని ఘో
రపుఁ గర్మంబులు వాయు నొక్కమఱి శ్రీరామా యనే మాట క
ర్ణపుటం బించుక సోఁకెనేని రఘువీరా! జానకీనాయకా! 47

మ. కంపింతున్ మును దండధారికిని మత్కాయంబు వీక్షించి శం
కింపం గారణ మేమి నాకిఁక నినున్ గీర్తించుచున్నాఁడ; బల్
దుంపల్ గట్టిన ఘోరపాపముల సంధు ల్గోసివేయంగ బల్
ఱంపంబైనది నీ చరిత్ర రఘువీరా! జానకీనాయకా! 48

శా. నీ మంత్రంబు సదా సదాశివుఁడు పత్నీయుక్తుఁడై కాశిలో
నేమం బొప్ప జపించె నంచు శ్రుతులన్ని న్నిన్నె వర్ణింపఁగా
నేమా నిన్ను నుతించువార మయినన్ నిన్నెంతు నోరారఁగా
రామా! రాఘవ! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా! 49

శా. నీ మంత్రంబు జపించు మానవులకున్ నిశ్శ్రేయ మౌ నర్థముల్
హేమంబు ల్గొడుగుల్ తురంగములు మత్తేభంబు లాందోళికల్
గ్రామంబుల్ నగరంబులున్ విభవముల్ రాజ్యంబులున్ రత్నముల్
రామారత్నము లేమిలెక్క రఘువీరా! జానకీనాయకా! 50

శా. గోమేధాధ్వర వాజిమేధశతముల్ గోదాన భూదానముల్
హేమాద్రుల్ తిలపర్వతంబులు సువర్ణేభాశ్వదానంబులున్
నీ మంత్రంబగు నక్షరద్వయముతో నే పుణ్యముల్ పోల వో
రామా! రాఘవ! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా! 51

శా. గోమాంసాశని, మద్యపాని, నగరిన్ గొండీఁడుఁ, చండాలుఁడున్
హేమస్తేయుఁడు, సోదరీరతుఁడు, గూ డేకాదశిన్ భుక్తిగొ
న్నామూఢాత్ముఁడు లోనుగాఁ గలుగు దుష్టాచారుఁడైనం దుదిన్
రామా! యన్నను ముక్తిఁ గాంచు రఘువీరా! జానకీనాయకా! 52

శా. ఏమీ పాతకులార! మా పురికి రా రీపట్టునం దున్నత
శ్రీమైఁ బోయెద రెందుకన్న జమునిం గ్రేగన్నులం జూచుచున్
రామయ్యా! యిఁక నంచుఁ బల్కి యపవర్గస్థానమున్ జొత్తురో
రామయ్యా! నినుఁ గొల్చువారు రఘువీరా! జానకీనాయకా! 53

శా. స్వామిద్రోహికిఁ దమ్ముఁడెట్లు? ఘనరాజ్యంబేల నీవిచ్చుటె?
ట్లామాటల్ విని కాదె నిన్నడుగ నత్యాసక్తి నాకున్న దొ
డ్డేమిన్ పల్మఱు వేసరింపఁ గవి నే నీరాదె నీ సీమలో
గ్రామం బొక్కటి చాలు నాకు రఘువీరా! జానకీనాయకా! 54

శా. మామా యంచును మామ యంచు నెపుడే మా యల్లుఁ డుద్యద్గతిన్
హేమాద్రిప్రతిమానమైన యొక విల్లేపార మో పెట్టఁగా
సామర్థ్యంబున మేటి యీతఁడని నీ సత్త్వంబె వర్ణింతు నో
రామా! రాఘవ! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా! 55

మ. కమురం గ్రాఁగిన లోభివాని తల పున్కం, గుక్కమాంసంబు మ
ద్యముతో వండుచుఁ దిన్న మాలఁడయినం, దత్పాపకర్మంబులన్
యమకూపంబుల లోపలం బడఁడు జిహ్వాగ్రంబునన్ రామమం
త్రముఁ బేర్కొన్నను నొంటిమిట్ట రఘువీరా! జానకీనాయకా! 56

మ. యమకూపంబుల లోపలం బడి మహాహైన్యంబునుం బొందకుం
డ ముదంబారఁగ నన్నుఁ బ్రోచి కరుణన్ సాయుజ్యమిమ్మీ తుదిన్
గ్రిమిరూపుం దన రూపుగాఁ బెనిచి రక్షింపన్ విచారించునా
భ్రమరంబుం బలెఁ బాపదూర! రఘువీరా! జానకీనాయకా! 57

మ. మమకారంబున సర్వకాలమును నీ మంత్రంబు వాక్రుచ్చు డెం
దము నాకుం గలుగంగని మ్మటులయైనన్ మృత్యువక్త్రమ్ము దూ
ఱము; నిన్నున్ మతి దూఱ మంత నపవర్గస్వర్గమార్గంబు దూ
రము గాకుండును మాకుఁ జేర రఘువీరా! జానకీనాయకా! 58

మ. తమ గర్వంబునఁ దారు పొంగిపడుచున్ దైవంబు మంత్రంబుఁ దం
త్రములన్ వీడఁగ నాడుచున్ దిరుగు నిర్భాగ్యుల్ మహారాజులై
మము నూరింపఁగ నేము నిన్నెఱిఁగి నీ మంత్రం బెఱింగిన్ దరి
ద్రమతిన్ వేడఁగఁ బోవుటెట్లు రఘువీరా! జానకీనాయకా! 59

మ. హిమధామ ప్రతిమాన కాంతియుతులై యింద్రాది దిక్పాలకుల్
తములన్ స్తోత్రముచేయ నుండుదురు నీ దాసానుదాసుల్ సుర
ప్రమదాపల్లవపాటలాధర సుధాపానాది కేలీవిహా
రములన్ మీఱుచు మీరు చూడ రఘువీరా! జానకీనాయకా! 60

శా. మిమ్ముం గొల్చి తలంచి పాపముల నెమ్మిన్ సోఁక రానీక నే
నెమ్మిన్ సౌఖ్యముఁ బొందువాఁడ ననుచున్ నీ మూర్తి భావించెదన్
రమ్మా వీని తలంపు మేలని కృపన్ రక్షింప నాలోనికిన్
రమ్మా నన్నుఁ గృతార్థుఁ జేయ రఘువీరా! జానకీనాయకా! 61

మ. ప్రమదారత్న మహల్య గౌతముని శాపప్రాప్తి పాషాణరూ
పముతోఁ బెక్కుయుగంబులుండఁగ హరబ్రహ్మాదులుం బాపలే
ని మహాపాపము పాపనోపినదిగా నీ పాదరేణుప్రకా
రము నేనేమని సన్నుతింతు రఘువీరా! జానకీనాయకా! 62

శా. నా యజ్ఞానముఁ బాపుమంచు మదిలో నానాప్రకారంబులన్
గూయం గూయ నదేమిరా యనవు నీకున్ మ్రొక్కనా? కుక్కనా?
చీ యంచేటికి రోఁతగించెదవు? నీచిత్తంబు రాకుండినన్
బ్రాయశ్చిత్తము నాకునెద్ది? రఘువీరా! జానకీనాయకా! 63

మ. నియమంబొప్ప ననేకజన్మములనుండిన్ దాఁచుకొన్నట్టి సం
చయదోషంబుల మాటమాత్రమున దోఁచంబోవు చోరత్వ మె
న్ని యుపాయంబుల నభ్యసించినవియో నీ నామముల్ వేయు నా
రయ నిన్ను న్వివరించుటెట్లు రఘువీరా! జానకీనాయకా! 64

మ. సకృపాలోకన! నందగోపుని తనూజాతుండవై గొల్లవై
సకలక్షోణుల నేలినాఁడవఁట, మించం గశ్యపబ్రహ్మ గ
న్న కుమారుండన మిన్నుముట్టి కుఱుచై నాఁడేల నాడేల నే
రక దానంబుగ వేఁడుకొంటి రఘువీరా! జానకీనాయకా! 65

శా. చీరల్ దీయకు చన్నుగుబ్బల పయిం జీకాకుగాఁ గాకుగాఁ
జీరల్ దీయకు మందబోయఁడిదె వచ్చే బ్రొద్దు రావల్దు నా
జారా! మేలను జారలం గవయు కృష్ణా! యేకపత్నీవ్రత
ప్రారంభం బిపుడేల నీకు రఘువీరా! జానకీనాయకా! 66

మ. తిరునామంబు ధరింపఁడేని నొసలన్ దిక్పూరితంబైన నీ
వరనామంబుఁ దలంపఁడేని మదిలో వాంఛించి నీ పాదపం
కరుహ శ్రీతులసీదళోదకముఁ ద్రాగండేని వాఁడేటి నే
ర్పరి వైకుంఠపురంబుఁ జేర రఘువీరా! జానకీనాయకా! 67

మ. శరణంబన్నను మాటమాత్రమున విశ్వద్రోహి తోఁబుట్టుకున్
గరుణాపూర్ణవిలోకనం బొదవ లంకారాజ్యసింహాసన
స్థిరపట్టం బొనరించినాఁడ వఁట యేదేవుండు నీసాటి యు
ర్వరలోనన్ భవరోగదూర! రఘువీరా! జానకీనాయకా! 68

మ. పరనారీ కుచకుంభపాలికలపైఁ బాదాబ్జయుగ్మంబుపైఁ
గరమూలంబులపైఁ గపోలతటిపైఁ గంఠంబుపైఁ గొప్పుపైఁ
బరువుల్ వాఱెడు నా తలంపులు మిమున్ భావింపఁగాఁ జేసి స
ర్వరసాధీశ్వర! నన్నుఁ బ్రోవు రఘువీరా! జానకీనాయకా! 69

మ. నరకుల్ క్రాఁగిన యిన్పకంబముల నంటంగట్టఁగాఁ గొట్టఁగాఁ
బొరలం బొర్లఁగఁ గక్కరాలఁ గొని వీఁపు ల్గోయఁగా వ్రేయఁగా
నరకావాసులలోన నుండుదురు నీ నామంబు వర్జించి దు
ర్మరణంబు ల్గని చన్నవారు రఘువీరా! జానకీనాయకా! 70

మ. పురసంహారుని చాపమున్ జివుకువంబున్ ద్రుంచి పోఁజూచినన్
బరశూదగ్రభుజుండు పోవిడుచునే భంజించుఁగాకంచు ని
ష్ఠురముల్ పల్కిన భార్గవున్ భుజబలాటోపంబు వారించి ని
ర్భరశాంతంబునఁ గాచితౌర రఘువీరా! జానకీనాయకా! 71

మ. స్మరసంహారుఁడు కోరి పొత్తున భుజింపన్ బిల్వ నే రాను, శ్రీ
హరినామంబులు వేయునెన్నవలె నిత్యంబైన నోమన్న నో
యరవిందానన! వేయునేటికిని రామా యన్నఁ జాలన్న మం
త్రరహస్యంబుఁ దలంతు నేను రఘువీరా! జానకీనాయకా! 72

శా. బాలత్వంబునఁ గొంతకాలము వృథా పాపంపు దుర్బుద్ధినై
చాలన్ జవ్వనమందు గర్వమతినై సంసారినై దుష్క్రియా
జాలభ్రాంతిఁ జరింతుఁగాని నినుఁ గాంక్షం గొల్వలేదయ్య హే
రాళంబైనది చింత వంత రఘువీరా! జానకీనాయకా! 73

శా. సాలగ్రామ శిలాశిలోచ్చయ గయాస్నాన ప్రయాగస్థలుల్
పోలం జూచెద నంచుఁ బోవఁదలఁతున్ బోలేను మీదాసులన్
బోలం గానఁగ బుద్ధిపుట్ట దిఁక నేఁ బుణ్యాత్ముఁ డౌటెట్లు? హే
రాళంబైనది చింత వంత రఘువీరా! జానకీనాయకా! 74

మ. కొలువం జాలక మాన, నీ నుతులు పెక్కుల్ సేయుటన్ మాన, నిన్
దలఁపం జాలక మాన, నేఁ గలసి నీ దాసానువర్గంబుతో
నిలువం జాలక మానఁబో! కడపటన్ నీనామముల్ విన్నవా
రలకుం గల్గును మోక్షలక్ష్మి రఘువీరా! జానకీనాయకా! 75

మ. తలఁపం జిత్రము మీ మహత్త్వములు మీ దాసుల్ మహాభాగ్యవం
తులు త్రైలోక్యమునన్ బదస్థుఁడు ధ్రువుం డుండున్ నభోమండలిన్,
బలి పాతాళమునన్, విభీషణుఁడు భూభాగంబునం, బద్మజ
ప్రలయంబైనను బోవరౌర! రఘువీరా! జానకీనాయకా! 76

మ. చెలఁగన్ మర్త్యులు వేగి లేచి తమిచేఁ జేయంగఁ బాపంబు లీ
కలుషంబుల్ పెడఁబాయ నేదిగతి? యింకన్ ద్రోవ యొండెద్ది? పు
ర్వులగుంటం బడనీని పోకడయు నేర్పున్ బుద్ధియుం గల్గువా
రలు నీ సేవకు లౌట లెస్స రఘువీరా! జానకీనాయకా! 77

మ. కలకాలంబు వ్రతంబులుం దపములుం గావించి యన్యు ల్తుదిన్
గలకాలంబును బోలె నిర్జరపురీకాంతాకుచాలింగనం
బులఁ గొన్నాళ్లు సుఖించి క్రమ్మఱ నిలం బుట్టంగ నే మెచ్చ ని
ర్మలముక్తిన్ నినుఁ గొల్చి కాంతు రఘువీరా! జానకీనాయకా! 78

మ. నిలువెల్లం బులకాంకురంబు లొదవన్ నీపాదతీర్థంబుతోఁ
దులసీపర్ణ మొకించుకంత గొనినన్ దోషాలు ఖండించుఁ గా!
పొలపాకుల్ దినఁ గాననంబుల బడిన్ బోనేల మోక్షంబు కూ
రలను న్నారల నేల గల్గు? రఘువీరా! జానకీనాయకా! 79

మ. చెలువంబొప్ప సువర్ణముద్ర లితరుల్ చెల్లించుటే క్రొత్త, కా
కల నీ ముద్రలు చూడఁ జెల్లుబడి చక్రాలంచు వేయించుమం
డలనాథాగ్రణి క్రొత్త, నీ బలిమి నానావర్ణపుం దోలుము
ద్రలు చెల్లించితి విందు నందు రఘువీరా! జానకీనాయకా! 80

మ. ప్రళయాపాదిత కాలమృత్యువగు నీ రాకాసి రాకాశివా
దులు వారింపఁగ నేర రింక నెటఁ జొత్తుం జత్తుఁ గాకన్న సం
చలితుం గౌశికుఁ గాచి తాటక మహాస్త్రజ్వాలచేఁ ద్రుంచి దో
ర్బలశక్తిన్ విలసిల్లితౌర! రఘువీరా! జానకీనాయకా! 81

మ. చిలుకన్ ముద్దులు చిల్క బిల్చుతఱి రాజీవాక్షి యొక్కర్తు ని
చ్చలు రామా రఘురామ రావె యనినన్ సాలోక్యసాయుజ్యమున్
కొలఁదు ల్మీఱఁగ నిచ్చినాఁడవఁట నిన్నున్ బిడ్డపే రిడ్డవా
రల పుణ్యంబున కెద్దిమేర రఘువీరా! జానకీనాయకా! 82

మ. ఇల నిన్నుం దొలుబామునం దలఁప నే నీజన్మమందైన నా
తలఁపు ల్మీపదపంకజంబులపయిన్ దాపింతు నే నింక బు
ట్టలలోఁ జెట్టులలోన నంబువులఁ బుట్టం బుట్టఁగా నోపఁ గ
ర్మలతాబంధము మాపవయ్య! రఘువీరా! జానకీనాయకా! 83

మ. ఇల నీ మీఁదను జాలభక్తిగలవాఁ డేచెట్టవాఁడైన నే
ఖలుఁడైనం దుది నుత్తమోత్తముఁడగున్ గాదన్నఁ గొంగీడ్చెదన్
దెలుప న్నిల్చిన నాడుకొన్న పరవాదిన్ గెల్చెదన్ వేదశా
స్త్ర లసద్వాక్యనుత ప్రతాప! రఘువీరా! జానకీనాయకా! 84

శా. దేవా! నాదొక విన్నపంబు గల దేదీ యంటివా వింటివా
త్రోవం దండధరుండు దుర్గతులకై త్రోవన్ విచారించునో
యేవిఘ్నం బొనరించునో యెఱుఁగరా దే ముక్తికిం బోవుచో
రావే వెంబడి నింతనంత రఘువీరా! జానకీనాయకా! 85

శా. గోవం దొల్తటి జన్మకాలముల నీకుం బంటఁ గానైతి నం
చీవక్రంబులె కాక నాకు నివి లక్షింపంగ జన్మంబులా
చావుం బుట్టువు మాన్పుకోవలయు నీ జన్మాన నీవాఁడనై
రావా నా మది కింకనైన రఘువీరా! జానకీనాయకా! 86

శా. చావు ల్మర్త్యులకెల్లఁ గల్గుటలు నిస్సందేహముల్ దేహముల్
చేవ ల్గల్గిననాఁడె శ్రీగిరి గయా శ్రీవేంకటాహోబిల
గ్రావప్రాంతములందుఁ జేరవలెఁ; జేరంబోవ కేలబ్బు నా
ర్యావాణీస్తుత మోక్షలక్ష్మి? రఘువీరా! జానకీనాయకా! 87

శా. త్రోవన్ మానవుఁ డొంటిఁబోవుతఱి నీస్తోత్రంబు వాక్రుచ్చినన్
నీవుం దమ్ముఁడుఁ దోడువత్తురటె నీ నెయ్యంబు తియ్యంబుగా
నీవంటాప్తుఁడు నిన్నుఁ బోలు హితుఁడున్ నీవంటి భక్తప్రియ
ప్రావీణ్యుండును లేఁడు చూడ రఘువీరా! జానకీనాయకా! 88

మ. నవనీతంబుల కేల పాఱెదవురా నాయన్న! రా! యెన్నరా
యివి దూష్యంబులు గాఁగ గోపికలు? నీయింటం బదార్థంబు లె
య్యవి లే? వంచు వచించు నమ్మకడ కొయ్యంజేరు కైశోర చో
రవినోదంబులు నేఁ దలంతు రఘువీరా! జానకీనాయకా! 89

మ. వివిధబ్రహ్మల యంత్యకాలముల నేవే నిల్వ వావేళలన్
ధ్రువుఁడో యొండె విభీషణుండు బలి యుందుర్ వారు నీ దాసులై
న విశేషంబునఁ గాక తక్కొరుల కుండంబోలునే యింద్రరు
ద్రవిరించిస్తుత శౌర్యసార! రఘువీరా! జానకీనాయకా! 90

మ. చెవి నీనామము విందునో యని కడున్ సెంకించి కర్ణంబులన్
రవము ల్మీఱఁగ ఘంట లంటనిడి ఘంటాకర్ణుఁ డేతేరఁగా
నవి చూచిన్ వరమిచ్చినాఁడవఁట నీయంఘ్రిద్వయీసేవక
ప్రవరుం గాచుట యేమిలెక్క? రఘువీరా! జానకీనాయకా! 91

మ. రవిసూనుం బరిమార్చి యింద్రసుతునిన్ రక్షించినావందునో
రవిసూనుం గృపనేలి యింద్రసుతుఁ బోరం ద్రుంచినావందునో
యివి నీయందును రెండునుం గలవు; నీ కేదిష్ట మౌనో కదా
రవివంశాగ్రణి! తెల్పవయ్య రఘువీరా! జానకీనాయకా! 92

శా. దోసంబు ల్కులపర్వతంబుల కొలందుల్ గల్గినం గల్గనీ
మీ సంకీర్తన శబ్దమాత్రమున భస్మీభూతమైపోవవా
త్రాసు ల్కోటిసహస్రముల్ గలిగి యెత్తన్ రాని కార్పాసపున్
రాసు ల్సోఁకిన నిప్పువోలె రఘువీరా! జానకీనాయకా! 93

మ. కసుమాలంబగు దేహిపుట్టువుల నీ కష్టంబులం బాపి ది
వ్యసుకాయం బొనరింతు వెవ్వఁడు నినున్ వాక్రుచ్చినన్ యోగిమా
నస గేహంబులనుండి; లోహము సువర్ణచ్ఛాయగాఁ జేయఁగా
రసవాదంబులు నేర్చితౌర రఘువీరా! జానకీనాయకా! 94

మ. పసులన్ గాచిన గొల్లవాఁడవనుచున్ భావింతు నిన్నున్ దుదిన్
ముసలిభ్రాత వటంచు నెంతు మదిలో మూర్తిత్రయాకార! నే
వసుధాధారుని నిన్ను నిక్క మెఱుఁగన్ వాంఛింతు నో సత్కృపా
రసపాథోనిధి! కావవయ్య రఘువీరా! జానకీనాయకా! (గద్వాల ప్రతి) 95

మ. పిసినిం జూచి మహాప్రదాతయనుచున్ బీభత్సకుత్సాంగునిన్
బ్రసవాస్త్ర ప్రతిమానరూపుఁడనుచున్ బందం బ్రియంబంద శ
త్రుసమూహాంతకుఁ డంచు నెప్పుడు నరస్తోత్రంబు గావించు నీ
రసుఁడన్ నిన్ను నుతింపనేర రఘువీరా! జానకీనాయకా! 96.

మ. బహురూపాలు ధరించుకొంచును గ్రియాభాషాంగము ల్ముట్టఁగా
బహుకాలంబులనుండి యాడితి నిఁకం బ్రాల్మాలినట్లయ్యెడిన్
దహలంబెట్టక చాల్పురేయనుము నీత్యాగంబు నేనొల్ల సా
గ్రహ దైతేయ మదాపహార! రఘువీరా! జానకీనాయకా! 97

శా. మోక్షాపేక్ష జనించె నాకు నిదియేమో కాని యీజన్మమం
దక్షీణోదయ!ముక్తి కెవ్వఁ డొడయం డాపుణ్యునిం జెప్పెదో
దక్షారిస్తుత! నీవె కర్తవయినన్ దక్కేల నీవే ననున్
రక్షింతో యెఱుగంగఁ జెప్పు రఘువీరా! జానకీనాయకా! 98

మ. అక్షీణాప్రతిమానదానవిభవాహంకారపారీణ! యో
రక్షోదైత్యమదాపహార విబుధా! త్రైలోక్యసంరక్షకా!
దక్షధ్వంసివధూటికావినుత! నీ దాసానుదాసుండ నన్
రక్షింపం గదవయ్య! రామ! రఘువీరా! జానకీనాయకా! 99

మ. చదువు ల్దొంగిలి సోమకాసురుఁడు భాషాభర్త కూపెట్టఁగా
నుదధుల్ సొచ్చినఁ బాఱిపట్టుటకు నుద్యోగించి మత్స్యంబవై
యదరంటన్ రిపుఁ ద్రుంచి వేదములు దేవా దేవ! శాండిల్యనా
రదకౌండిన్యనుత ప్రతాప! రఘువీరా! జానకీనాయకా! 100.

మ. అమరుల్ రాక్షసనాయకుల్ కడఁకతో నత్యంతగర్వంబునన్
దమ సత్త్వంబుల మందరాచలముచేఁ దర్వంగ నంభోధిలో
రమణం దద్గిరి మోచి కాచిన జగత్త్రాణుండ! కూర్మావతా
ర మనంగా మఱి నీవెకావె రఘువీరా! జానకీనాయకా! 101

మ. దనుజాధీశులు నిర్జరాధిపతులున్ దామందఱున్ మందరున్
ఘనసత్త్వంబున నెత్తి వార్థి నహిపుం గవ్వంబుగాఁ ద్రచ్చుచో
మునుఁగం బాఱకయుండఁ గచ్ఛపమవై మున్నీటిలోనుండు వ
ర్తన మే నాత్మఁ దలంచుచుందు రఘువీరా! జానకీనాయకా! *
మ. ధర కల్పాంతమునం గరంగఁబడి పాతాళంబులోనంటినన్
దొరయం దొల్లిటియట్ల కా నిలుప నుద్యోగించి క్రోడంబవై
పొరి నబ్భూతలమెత్తినట్టి ఘనదర్పున్ నిన్ను భావింతు ని
ర్భరకారుణ్య నిరూఢచిత్త! రఘువీరా! జానకీనాయకా! 102

మ. వడుగా! నీవడుగంగనేర విట నల్పంబైన దానంబు న
న్నడుగన్ వచ్చితి వన్నఁ గన్గొని బలీంద్రా! నాకు నీవిచ్చు మూఁ
డడుగు ల్మూఁడు జగంబులంచుఁ గొనవా యాద్యంతముల్ మాటమా
ర్పడ నాడన్ నుడికాఁడవౌర! రఘువీరా! జానకీనాయకా! 103

శా. ఏతుల్ గాక మురాంతకుండు గలఁడా యెందైన నిందైన నీ
నీతు ల్మాను మటంచుఁ దండ్రి సుతునిన్ నిట్రాతిలోఁ జూపరా
చూతున్ నాఁగ నృసింహరూపమున నచ్చో నుండవా చెండవా
రాతిం బోలిన దైత్యు మేను రఘువీరా! జానకీనాయకా! 104

మ. సమరక్షోణులఁ బాఱఁ బాఱఁగ జరాసంధాదులం ద్రుంచి చం
డమదాభీలుని ధేనుకాసురుని చట్ట ల్చీరి ముష్టిప్రహా
రములన్ ముష్టికు నా ప్రలంబదనుజున్ మ్రందించి తౌ రేవతీ
రమణాకారముఁ దాల్చి యౌర! రఘువీరా! జానకీనాయకా! 105

మ. నిను నారాయణమూర్తిగాఁ దలఁచుచున్ నీ దండ నా దండకా
వన వాచంయము లెల్లఁ జేరి కొలువన్ వారిం గృపం జూచుటల్
వనధిం గట్టుట రావణుం దునుముటల్ వర్ణింతు రామావతా
ర నిరూఢాకృతి నిన్ను నౌర! రఘువీరా! జానకీనాయకా! 106

మ. అమరారాతివధూటికామణులచే నశ్వత్థనారాయణ
ద్రుమముం గౌఁగిటఁ జేర్పఁ జేసి వ్రతము ల్దూలించి బుద్ధావతా
రమునన్ రుద్రసహాయమై త్రిపురముల్ మ్రగ్గించి తౌరౌర! ధీ
ర! మునిస్తుత్య యశోవిహార! రఘువీరా! జానకీనాయకా! 107

మ. కలికాలాంతమునన్ గిరాతజనముల్ గర్వించినం దత్కిరా
తుల నెల్లన్ విదళించుచున్ గృతయుగోద్భూతంబుఁ గావింప నిం
పలరం గల్కివి గాఁగ నున్న హరి నిన్నశ్రాంతముం గొల్చువా
రలు పుణ్యాత్ము లగణ్యశూర! రఘువీరా! జానకీనాయకా! 108

శా. త్రేతా ద్వాపరసంధి నుద్ధతమదాంధీభూత ధాత్రీధవ
వ్రాతంబున్ జననీ ప్రతిజ్ఞకొఱ కిర్వైయొక్కమారుల్ బహు
ప్రీతిం ద్రుంచితి గాదె నీవు విలసద్వీర్యంబుమై ఘోరని
ర్ఘాతక్రూరకుఠారధార రఘువీరా! జానకీనాయకా! 25 

శా. కావం దొల్లిటి కాలజన్మముల నీకా బంటుఁ గానైతి నీ
సేవాకార్యములేమొ నాకు నవి లక్షింపంగ లేవయ్యె నీ
చావుం బుట్టువు మాన్పుకోవలయు నీ జన్మాన నీవాఁడనై
రావా నా మదిఁ గోర్కెఁ దీర్ప! రఘువీరా! జానకీనాయకా! 32 

శా. ఉండందెక్కడ నీవు లేక వెలియై యుండేది యెచ్చోటు బ్ర
హ్మాండంబుల్ లయమందు నీవు కనుమూయన్ లోకపర్వంబుగా
నండంబున్ బ్రభవించు నీకును వినోదార్థంబు నీ మాయ మా
ర్కండేయాదు లెఱుంగలేరు రఘువీరా! జానకీనాయకా! 60 

మ. జననీగర్భములందు నన్నిటు బడన్ జన్మిచ్చి బాల్యంబులన్
జనుబా లెందఱివైనఁ ద్రాపి యటు వేల్ సంబంధముల్గా పురా
తనకాలంబుననుండి యెంతగను యత్నంబున్న నిందాకఁ దీ
రని కర్మంబులు దీఱు టెట్లు? రఘువీరా! జానకీనాయకా! 74 

మ. వెనుకం జేసిన దోషముల్గలుగ నుర్విన్ ముక్తికిం బోదురే
చనఁ బొయ్యే వని కాలుబంట్లె నుడువన్, సాక్షాత్తు నా బంటు వీ
నిని బట్టన్ గమకించు టొప్ప దనియున్ నీవే నివారించవా
ప్రణతాశేష శరణ్యచిత్త! రఘువీరా! జానకీనాయకా! 77 

శా. నానాజీవమనోనివాస! త్రిజగన్నాథా! మురారీశ! గౌ
రీనాథస్తుత! కైటభాసురవిదారీ! చక్రి! నారాయణా!
యో నాళీకదళాయతాక్ష! కలుషవ్యూహాద్రి వజ్రాయుధా!
ప్రాణాపానసమానరూప! రఘువీరా! జానకీనాయకా! 81 

మ. నను నన్యుల్ గొనియాడ మే లనకయుండన్, నాకు నేనే మహా
ఘనుఁడన్ విద్యకు నేనె బ్రహ్మ ననుచున్ గర్వించి దుర్వాక్యముల్
విని మీ చిత్తమునందు రోయకుము నా వేసాలు గ్రాసాలకే
యని మన్నింతువుగాని నన్ను రఘువీరా! జానకీనాయకా! 87 

మ. వినుమా యాశ్రితు నిల్పువాఁడ ననుమా వేయేల నీ భక్తునిం
గనుమా యాశ్రితరక్షణంబు ఘనమా కారుణ్యవారాశి య
య్యు నతార్తావనుఁడైన నీకు జగతీవ్యోమస్ఫురత్కీర్తి కొ
య్యన లక్ష్మీకమనీయవక్ష! రఘువీరా! జానకీనాయకా! 90 

మ. కొమరౌ నాండ్రు పదాఱువేలు గొలువన్ గోపాలకృష్ణావతా
రమునన్ జాలక చొచ్చి గోపికల చీరల్ దీసి రాఁదీసి నె
య్యమునం బొందిన కొయ్యదేవరవు గావా నీవు కృష్ణావతా
రమునన్ లోకమనోభిరామ! రఘువీరా! జానకీనాయకా! 92 

మ. కరుణానీరధి! నిన్ను వేడుకొనినన్ గాండీవికిం బోరిలో
నరదం బొప్పఁగ గొప్ప సారథివి గావా కావ నోదేవ! నీ
సరి యెవ్వారును లేరు శిష్టజనరక్షాదక్ష దీక్షామణీ!
ధరణీనాయకమౌళిరత్న! రఘువీరా! జానకీనాయకా! 93 

మ. అతులప్రౌఢిమ మీఱ రాయకవి యయ్యల్‌రాజు సత్పుత్రుఁ డ
చ్యుతభక్తిం ద్రిపురాంతకుం డొనరిచెన్ శుద్ధంబుగా నాంధ్ర సం
గత పద్యంబుల నూటి నివ్వి వెలయుం గాతన్ రవీందుప్రచా
రత యెందాకనొ యంత దాక రఘువీరా! జానకీనాయకా! 95 

శ్రీరాయకవి యయ్యలరాజు తిప్పరాజ ప్రణీతంబైన యొంటిమిట్ట రఘువీర శతకము సంపూర్ణము.
* శతకరత్నాకరము, రాజమండ్రి ప్రతి అధికపాఠం.
రచించినవారు: అయ్యలరాజు త్రిపురాంతకకవి



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat