విశ్వనాథ శతకము - Vishwanatha Satakamu

P Madhav Kumar

 

శ్రీరామాయ నమః

అమలాపురము సన్యాసికవికృత
విశ్వనాథశతకము

సీ. శ్రీవిశాలాక్షీమనోవారిజార్యమ | యమదోర్బలోద్రేకహరణచతుర
చతురాస్యముఖ్యపూజిత పత్పయోజాత | జాతరూపాంశుకశాతకాండ
కాండకటాహప్రకాండ నైజపిచండ | చండరుక్ఛశిధనంజయవిలోక
లోకత్రయరక్షణైకధురంధర | ధరణీధరోత్కరోత్తమనిశాంత  
గీ. శాంతరసమూర్తి దేవతాచక్రవర్తి | శమితసుజనార్తి పరిహృతజననజార్తి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 1

సీ. కలభ కీర పిపీలికారాజి రాజీవ- | యానోక్తినవ్యరోమాళివదన
కమఠ పాఠీన భృంగశ్రేణి విచికిల- | ప్రపదవిలోచన పక్ష్మరదన
కిసలయ హరిజపాకుసుమ రంభాస్తంభ- | చరణమద్యాధర సక్థియుగళ
పులినమేరునమేరు పుష్పఖండేందు స- | త్కటి పయోధర నాభి గండభాగ  
గీ. కలిత లసదన్నపూర్ణాంబికాముఖాబ్జ- | బాలసూర్య సదాపరిపాలితార్య,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 2

సీ. జయజయ శయకుశేశయసంభృతకురంగ | జయ దుష్టజనసముదయవిభంగ
జయజయ వందారు నయనాంబురుహమిత్ర | జయ కలశాంభోజిశయనమిత్ర
జయజయ విధిహరిహయపోషణోల్లాస | జయ భవ్యనిర్జరాలయశరాస
జయజయ కృతబిలేశయరాజమణిహార | జయ మృకండుకుమారభయవిదార  
గీ. జయ మహోదార జయ నిరామయశరీర | జయ దయాపూర జయ సమిజ్జయవిచార,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 3

సీ. దీనసంఘాతచేతోనీరజాత మ- | త్తాళివరాయ తుభ్యం నమోస్తు
ఫేనకాదేన సంతానబిసప్రసూ- | నాభదేహాయ తుభ్యం నమోస్తు
నీలాతసీసుమమాలాతమాలసం- | పజ్జిద్గళాయ తుభ్యం నమోస్తు
బాలాతపహుతాశకీలాతటిల్లతా- | భాకపర్దాయ తుభ్యం నమోస్తు  
గీ. అంచు సతతము నే వినుతించుచున్న | కించిదనుకంపమున విలోకింప వహహ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 4

సీ. శ్రీభవానీవర సితకంఠ హర వామ- | దేవ మహాదేవ దేవదేవ
దేవరాణ్ణుతసుస్వభావ భావజభంగ | భర్గ విరూపాక్ష భవ కపర్ది
శంకర సాధువశంకర శర్వ శ- | శాంకశేఖర నిష్కళంక వరద
శూలి సోమ కపాలమాలికాధర నీల- | లోహిత గిరిధన్వ త్రాహి యనుచు  
గీ. నహరహంబును నే మహామహుఁడు నుడువు | నతఁడు కైవల్యమొందుటే యబ్బురంబ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 5

సీ. కామగర్వవిఫాల సామజాజినచేల | సామగానవిలోల శరణు శరణు
పుంగవాజానేయ సంగరాజేయ భు- | జంగతల్పసహాయ శరణు శరణు
నిత్యనృత్యవినోద భృత్యతత్యాహ్లాద- | సత్యవచోమోద శరణు శరణు
సాంద్రకృపాపాంగ చంద్రికాభనిభాంగ | చంద్రసూర్యరథాంగ శరణు శరణు  
గీ. సంతతద్యోధునీజూట శరణు శరణు | సభ్యరక్షానిరాఘాట శరణు శరణు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 6

సీ. తిలగత తైలంబు తెఱఁగునఁ బూసల- | లోని దారము మాడ్కి మానిలోని
చేవ విధంబున శిలలోని లోహంబు | పగిదినిఁ బాలలోపలి ఘృతంబు
వడువున ననలోని వాసన కైవడి | దారువులోపలి దహను మాడ్కి
ఫలములోని రసంబు భాతి ధరిత్రీత- | లంబులోపలి నిధానంబు రీతి  
గీ. నరయమశకాది దంతిపర్యంత జీవ- | గణమునందున నుందువు కానరావు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 7

సీ. హరివిరించులు కిటిహంసరూపములఁ ద్వ- | దాద్యంతములు గాననందువలన
కనుదమ్మితో వేయు కమలము ల్బూజింప | హరికి చక్రంబిచ్చినందువలన
బొంగుచు శ్రీరామలింగప్రతిష్ఠ సీ- | తాధీశుఁ డొనరించినందువలన
హరి యొక్కరుఁడె దైవమన్న వ్యాసునకు బా- | హార్గళస్తంభ మైనందువలన  
గీ. శరభసాళువమై నరహరినిఁ గెలిచి- | నందువలన మహాదేవుఁడవు నిజంబు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 8

సీ. ఆరావ మొక్కటి భేరీమృదంగాది | వాద్యవిశేషము ల్వరుస వేఱు
కాంచన మొక్కటి కటకాంగదాది నా- | నావిధోజ్జ్వలభూషణములు వేఱు
గోక్షీర మొక్కటి గోసమూహమునకు | కృష్ణసితారుణాకృతులు వేఱు
మృత్తిక యొక్కటి మేదురస్వేద నీ- | స్థాలీశరావఘటాలి వేఱు  
గీ. గరిమఁ బరమాత్మమూ ర్తి యొక్కరుఁడ వీవు | కాయములు భిన్నరూపముల్ గావె తలఁప,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 9

సీ. విమలభవత్కథల్ వినని కర్ణములు క- | ర్ణములా పురాణకూపములు గాక
త్వన్మూర్తిఁ గనని నేత్రములు నేత్రంబులా | చాలినీకుహరసంచయము గాక
భక్తితో మిము నుతింపని రసజ్ఞ రసజ్ఞె | ఘనతరాయసఖజాకంబు గాక
మిముఁ బూజ సేయని మృదులహస్తములు హ- | స్తములా దారుహస్తములు గాక  
గీ. నిజపదానతకృతబోధనిర్నిరోధ | కుటిలవర్గమృగవ్యాధ గురుసుమేధ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 10

సీ. ఆశ్రితకల్పక మంచు స్థాణువు నెట్టు- | లింద్రాది సురలాశ్రయించి రొక్కొ
స్త్రీపుంనపుంసకరూపహీనున కెట్లు | పురుషో త్తముఁ డొనర్చెఁ బూజనంబు
కులగోత్రములు లేని గూఢమార్గున కెట్లు | కులగోత్రపతి తన కూతునొసఁగె
నతులామృతాపేక్షులైన మహర్షులు | విషధారి నాత్మ భావించి రెట్టు-  
గీ. లిలఁ బురాకృతపుణ్యంబు గలుగ నెట్టి- | వార లధికారులౌట ధృవంబుగాదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 11

సీ. అతులితాష్టైశ్వర్యయుతుఁ డౌట చిత్రమే | రాజశేఖరుఁడయి ప్రబలు కతన
సమధికసౌందర్యశాలి యౌటరుదుకో | జగతిలో స్మరహరుం డగుట కతన
వివిధవిద్యావిదుఁ డవుట యచ్చెఱువె స- | ర్వజ్ఞసమఖ్యచే వరలు కతన
నిరుపమతరశౌర్యనిధి యౌట వింతయే | యంతకాంతకుఁడయి యలరు కతన  
గీ. నిట్టి మహిమంబు లెవ్వరియెడఁ గలుంగు- | నట్టి నినుఁ బ్రార్థన మొనర్తు ననుదినంబు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 12

సీ. ఆదిభిక్షుఁడవయ్యు నఖిలేశ్వరుండ నా | నలరారు టిది విస్మయంబు గాదె
విసము కుత్తుకనిండ మెసఁగియు నెన్నఁడు | మృతిలేక యుండు టద్భుతము గాదె
యెవ్వరు ముట్టని యెముకఁ జేపట్టియు | శుచిమూర్తివైతివి సొబగు గాదె
యున్మత్తము వహించి సన్మార్గవర్తి నా | విహరించితివి కడువింతఁ గాదె  
గీ. వ్యత్యయంబయ్యె నీ నడవడిఁ గనంగఁ | బ్రత్యయముసేయు భక్తులపట్ల నట్ల,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 13

సీ. ఎఱుకులవాఁడవై యెనఁగాని ఘనగోని - | షాదుండవౌట నిశ్చయము గాదె
కరమర్థి జాలరికన్నియం బెండ్లాడి | ధీవరాఖ్యుఁడవౌట దృష్టము గాదె
బూడిద నెమ్మేనఁ బూసియు భూయోవి- | భూతి పూర్ణుఁడవౌట ఖ్యాతి గాదె
చండికతోఁ గూడి చరియించుచుండి స- | తీపతివౌట సుస్థిరము గాదె  
గీ. శ్రీద వారితసూరివిషాద సుప్ర- | సాద జితమత్తకరిమానుషాద పాహి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 14

సీ. నీలకంఠ యటన్న నిలుచునే నిశ్శేష- | వృజినవ్రజోగ్ర దర్వీకరములు
పంచానన యటన్నఁ బారవే భవదుఃఖ- | పుంజమదోన్మత్త కుంజరములు
హరిణాంక యన్న దైన్యమునొందవే బహు- | దారుణాపత్సరసీరుహములు
విషధర యన్నను వెసనారిపోవె తా- | పత్రయోత్కట బృహద్భానుశిఖలు  
గీ. నీదు నామమహత్తు వర్ణింపఁ దరమె | కింపురుష సిద్ధసాధ్య నిలింపులకును,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 15

సీ. స్ఫురదణిమాది విభూతులు గలుఁగఁగా | నింటింట భిక్షకు నేఁగనేల
సర్వమంగళ నీకు సామేన నుండఁగా | బెస్తకన్నెను నెత్తిఁ బెట్టనేల
వెండిగుబ్బలిపైఁ బరుండక ననిశంబు | నొలకలలోపల నుండనేల
వేలుపుల్ గొల్వఁ బేరోలగంబున నిల్వ | కురుభూతముల వెంటఁ దిరుఁగనేల  
గీ. మతవిరోధులు శంభుఁ డమంగళుండ- | టన్నఁ దవులదె నా మది విన్నఁదనము,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 16

సీ. మారునిఁ గాలిచి మరుభూతి మైనిండ | మలయజంబు విభాతి నలఁదినావు
మాతంగదైత్యుని మర్దించి తచ్చర్మ- | ముత్తరీయంబుగా నుంచినావు
వనజోదరు శిరంబు వ్రచ్చి తదీయ క- | ర్పరముఁ బాత్రముగఁ జేపట్టినావు
గరళంబు మ్రింగకఁ గంఠకోణమున మా- | నితలాంఛనంబుగా నిలిపినావు  
గీ. యిటుల సేత పరాక్రమం బెఱుకపడుట- | కో యపస్మారిగుణమొ నాకు సెలవిమ్ము,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 17

సీ. ఏ మహాత్మునకును హేమావనీధ్రంబు | రమణీయకార్ముకరాజమయ్యె
నే కృపానిధికి రత్నాకరశ్రేష్ఠంబు | నిరవధికోరుతూణీరమయ్యె
నే గుణాఢ్యునకును బాగొప్ప నవనిధీ- | శ్వరుఁ డనారతబద్ధసఖ్యుఁడయ్యె
నే శాంతఖనికి లక్ష్మీశుండు నిజనేత్ర- | పద్మపూజ యొనర్చి భక్తుఁడయ్యె  
గీ. నింతవానికి నగ్నత్వమేలఁ గల్గె | నేమి మర్యాదొ తుదమొద లెఱుఁగరాదు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 18

సీ. శ్రీమజ్జగద్గురునామధేయుఁడవయ్యు | నురుగణపాల శిష్యుండవైతి-
వభవుఁడవయ్యును విభవం బెలర్పఁగ | భల్లాణనృపతికిఁ బట్టివైతి
చర్చింప నీశ్వరశబ్దవాచ్యుఁడవయ్యు | బాణాసురునకును భటుఁడవైతి
మిత్తిని గెలిచిన మేటిశూరుఁడవయ్యు | సితవాహునకుఁ బరాజితుఁడవైతి  
గీ. సామి నీ భక్తసులభత యేమి చెప్పఁ - | జిత్రమో యప్ప సతతపోషితకకుప్ప,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 19

సీ. సద్భక్ష్యభోజ్యచోష్యములు భుజిష్యుల- | కిచ్చి క్ష్వేళము భుజియించినావు
గజసైంధవములు కింకరకోటులకు నిచ్చి | వృషభవాహనుఁడవై వెలసినావు
ముక్తాఫలకలాపములు నమ్రులకు నిడి | పునుకలపేరులు బూనినావు
పట్టాంబరంబులు భక్తాళికి నొసంగి | కటిపైనిఁ బులితోలు గట్టినావు  
గీ. యెన్ని జన్మములెత్తిన నిన్ను గెలువఁ | దగును నీవంటి విభుఁ డేడి దాసులకును,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 20

సీ. భూతేశ నాకు నీవే తండ్రివి నగేంద్ర | పుత్రిక తల్లి సవిత్రి గంగ
శీతశైలేశుండు తాత మేనక యవ్వ | మైనాకుఁడే మేనమామ సుమ్ము
యన్న వీరన్న పెద్దన్న విఘ్నేశుండు | కొమరొప్పఁ జిన్నన్న కొమరుసామి
ప్రమథులు బంధువుల్ భసితంబు శ్రీగంధ- | మల శివాక్షసరము లలఘుమణులు  
గీ. వేయునన నేమిటికి కౌద్రవేయవలయ | పుడమిలోపల మా కేడుగడయు నీవె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 21

సీ. నీ తనుజన్ముండు నిఖిలవిద్యల కెల్ల | దేశికస్వామియై తేజరిల్లె
నీ జటాగ్రంబున నెలకొన్న దేవశై- | వలిని త్రిలోకపావన మొనర్చె
నీ కడియంబైన కాకోదరవరుండు | మహితభూభరణసమర్థుఁడయ్యె
నీ వధూతిలకంబు నిర్జరుల్ నుతి సేయ | జగదంబ నామబ్రశస్తి నొందె-  
గీ. నభవ నీవు జగజ్జనకాఖ్యఁ బూని- | తౌర నినుఁ గొల్చువారి భాగ్యము కొఱఁతయె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 22

సీ. శివ యన్న మాత్రనే చేకూరు నైహికా- | ముష్మికములు భక్తముఖ్యులకును
త్ర్యంబక యన్న నయంబుగ మూఁడుజ- | గంబుల నేలు యోగంబుఁ గలుగు
మృత్యుంజయ యటన్న సత్యంబు ధర్మార్థ- | కామమోక్షములు శీఘ్రమె లభించు
బంచాక్షరములు జపించినఁ బృథుపంచ- | పాతకంబులు బటాపంచలగును  
గీ. తొలఁగు ద్విపద త్రినేత్ర చతుర్భుజములు | నైదుమొగములు గలుఁగు మహాత్మ వింత,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 23

సీ. వారణాశీశ తావకదర్శనం బబ్బ | వారణాదులమీఁది వాంఛయేల
పుండరీకేశ్వరుఁ బొడగన్నఁ బుండరీ- | కాదులమీఁది ప్రియంబదేల
కుంభకోణేశుఁ గన్గొన్న నూతనశాత- | కుంభకుంభాదులు గోరనేల
గేరి కేదారసుక్షేత్రేశుఁ గన్నఁ గే- | దారసుక్షేత్రచింతనమదేల  
గీ. శ్రీగిరీశు నిరీక్షింపఁ జెందదే య- | శేషసంపత్తి హృతవిపశ్చిద్విపత్తి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 24

సీ. భవవార్ధినిర్మగ్నభక్తులఁ దరిఁ జేర్చఁ | దారకేశ్వరుఁడవై తనరినావు
నతజనప్రతతిసంసృతి రోగములు మాన్ప | వైద్యనాథుండవై వరలినావు
సర్వదాసాజవంజవ సంజ్వర మణంప | సోమేశ్వరఖ్యాతిఁ జూపినావు
సేవక భవబంధ లాపనం బొనరింప | బట్టిసాధిపుఁడవై పఱఁగినావు  
గీ. యిహపరము లబ్బవే భువినించుకేని | బ్రతిదినము నిన్ను స్మరియింపఁ బరమపురుష,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 25

సీ. వ్యాఘ్రేశ్వరాభిధేయము వహించితి మాను- | షాఘౌఘరురు పలాయనము సేయ
హరిమాయూరేశ్వరాభిఖ్యఁ బూనితి | నరవిపదహి ఖండనంబు సేయ
నాగేశ్వరాభోగ నామంబు నొందితి | జనశోకపవన భక్షణము సేయ
నేకామ్రనాయకాఖ్యాక నిల్చితి మర్త్య- | కామితఫలములు గలుఁగఁ జేయ  
గీ. మృగఖగాహిద్రుమాఖ్యల నెగడితౌర | వాటి భాగ్యంబుఁ బొగడ నెవ్వరి తరంబు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 26

సీ. నీవు న్యగ్రోధావనీజమై యుండంగ | శౌరి తద్వటపత్రశాయియయ్యె
నీ కంకణమున సంధిలు మసారంబనఁ | దోయజాక్షుఁడు శేషశాయియయ్యె
నీ విషంగమునకు నిశితాంబకంబయ్యుఁ | జక్రపాణి పయోధిశాయియయ్యె
సదమల జంబుకేశ్వరుఁడవై యున్న త్వ- | త్సన్నిధి హరి రంగశాయియయ్యె  
గీ. నీ రహస్యంబు లెఱుఁగరొకో రమేశ్వ- | రేశ్వరుల నెడఁగావింతు రిలఁ గుజనులు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 27

సీ. తన్నవే విధునిఁ బదాఱు వ్రక్కలు గాఁగ | దయఁ గ్రమ్మఱఁగ మూర్ధ్నిఁ దాల్చినావు
తలఁ ద్రుంపవే విధాతకుఁ బునస్సారథ్య- | కృత్యంబునకు నియోగించినావు
ఫాలాగ్నిచేఁ గాల్పవే లతాంతాయుధు | మించి వెండియుఁ బ్రతికించినావు
తఱగవే దక్షు మస్తకము నెప్పటి మేష- | శిరమిచ్చి జీవితుఁ జేసినావు  
గీ. నిగ్రహానుగ్రహంబులు నీకె తగును | రుద్ర కారుణికాగ్రేసరుండవగుట,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 28

సీ. ఆమ్నాయహయ నీకు హంసవాహన మహా- | ననదేశములు సాహిణములు గావె
యాకాశకేశ నీ కర్ధినీబాంధవ- | ప్రముఖ గ్రహములు సుమములు గావె
ఫణ్యాభరణ నీకుఁ బాతాళలోకంబు | హాటకభూషాసుపేటి గాదె
దిగ్వాస నీకు నాదిత్యాధిపాది ది- | క్పతులు శాటీపాలకరులు గారె  
గీ. నీవు వేధోండములలోన నిండియుండ | తథ్యమే గాదె యేతద్విధంబు దెలియ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 29

సీ. బికిరమెత్తుట మానుపింతు నీకందునా | యెద్దొక్కటే కృషి యెట్టులగును
కాఁటిలోపలఁ బండ నేఁటికి యందు ఖ- | ట్వాంగ మొక్కటి మంచమగునదెట్లు
లలిఁ బసిఁదిండి కళాసముద్యజియించు- | మందునా నిర్గుణ మనుసరించె
నస్థిహారము వలదందునా యేవంశ- | జుఁడవు మౌక్తికదామశోభ నొంద  
గీ. యేమి సేయుదుఁ దండ్రి మదీప్సితంబు | తీరదయ్యెను నా దురదృష్టమరయ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 30

సీ. ఒకవేళఁ గుంభకారకు భంగి బ్రహ్మాండ- | భాండనిర్మాణతత్పరుడవగుచు
పాంచాలికుని లీలఁ బ్రాణుల నాడింతు- | వొకవేళ చర్మపుత్రికల కరణి-
నొకవేళ నైంద్రజాలికుని చందంబున | జీవకోటులయందు సేయుచుందు-
వొకవేళ నజముకుందోగ్రాఖ్యలఁ జరింతు- | వొకవేళ జ్యోతిర్మయుండవగుదు-  
గీ. వీశ నీ చర్యలెన్న వాతాశవర్య- | దివిషదాచార్యులకునైనఁ దెలివి గలదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 31

సీ. తాండవలీలాప్రియుండవు గావున | డమరు డాంనిన విడంబము దగు
భిల్లవేషంబు శోభిల్ల ధరించితి | కల్ల గాదుర లేడిపిల్ల దగును
కొండకూతురిఁ గూడి కొండపై దిఱుఁగుదు | గండ్రగొడ్డలి చేత యుండఁదగును
నిచ్చలు విడువక బిచ్చంబునకు నేఁగు | జోఁగులవాఁడవు జోలె తగును  
గీ. భూమినే భూమికకుఁ దగు భూమవస్తు- | వులను గూర్చుట వేషికి యుక్తమె కద,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 32

సీ. తావక శరసంగతంబయ్యె నేణశా- | బక మేమి తొల్లి తపంబుఁ జేసె
నీ శిరోవేష్టనమై శుభావహుఁడయ్యె | నహివర్యుఁ డే పుణ్య మాచరించె
యుష్మదీయస్కంధయుతమయ్యె నేనిఁక- | కళవసం బే నిష్ఠగతిఁ జరించె
నీ గ్రీవమాలికలై గ్రాలె రుద్రాక్ష- | ఫలము లే పూజలు సలిపెనొక్కొ  
గీ. బిల్వ మే వ్రతమున నీకుఁ బ్రీతియయ్యె | నవనిఁ బున్నియ మొకరి సొమ్మౌనె తలఁప,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 33

సీ. కరికాళుఁడొసగు మాకందఫలంబులు | మిక్కుటంబగు కూర్మి మెక్కిమెక్కి
మాదర చెన్నాఖ్యుఁ డాదరంబున చెట్టు | సురుచిరాంబకళంబుఁ జుఱ్ఱిజుఱ్ఱి
నిమ్మవ్వ మదిఁ బత్తి నివ్వటిల్లఁగఁ బోయు | జావ సంతసముసఁ దావితావి
బోయకన్నడు యెడఁబాయక నర్పించు | నంజుఁడు తునకలు నమలినమలి  
గీ. తృప్తిఁ దీరక భిక్షాం ప్రదేహి యనుట | జనులు దీర్తురె క్షుత్తు విశ్వంభరునకు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 34

సీ. వేదముల్చదివెనే వేదండము స్వతుండ- | మున వారిఁ దెచ్చి మజ్జన మొనర్ప
శాస్త్రముల్చదివెనే చక్రిస్ఫుటస్ఫటం- | బాతపవారణ రీతిఁ బట్ట
మంత్రముల్ నుడివెనే మహి నూర్ణనాభి శో- | భిల దుకూలవ్యూతి కలన నెఱప
ఘనపురాణంబులు వినెనే కి- | రాతుండు పిశితఖండంబు లర్పించుటకును  
గీ. యేమివిద్య లు త్వత్టాక్షేక్షణములఁ | జూచినఁ గృతార్థులగుదురు నీచులైన,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 35

సీ. అభిషేకయోగ్యంబులగు నారికేళంబు- | లను లేపయోగ్య చందనము లక్ష-
తానీకయోగ్య వంశానోకహములు స- | మర్చనాయోగ్య కుందాదికములు
గురుధూపయోగ్య గుగ్గులములు జ్వలదీప- | యోగ్య శారదపాదపోచ్చయములు
నైవేద్యయోగ్య కనచ్చూతములు వీటి- | కాయోగ్య ఫణివల్లికాక్రముకము-  
గీ. లగములయ్యు నెంతేని ధన్యత వహించె | యుష్మదష్టవిధార్చనాయోగ్య ఫణితి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 36

సీ. శైలూషదళ మొక్క టేలాగు నర్పింతు | మారేడువనములో మలయు నీకు
నొక్క క్రొవ్విరిచేత నొగినెట్లుఁ బూజింతు | తారకాకుసుమముల్ దాల్చు నీకు
నేకఫలం బెట్టులిడుదుఁ బ్రేమ మనేక- | పారిషదిష్టార్థఫలద నీకు
చుళుకోదకమున నెట్టుల స్నానమమరింతుఁ | దలపైని మిన్నేరుఁ గలుగు నీకు  
గీ. నైన సద్భక్తితోడుత నే నొసంగు | పత్రపుష్పఫలాంబు సపర్యలు గొను,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 37

సీ. నీచుఁడు వీఁడని నెమ్మదినుంచక | భ్రమరకీటన్యాయ పటిమ నెఱపు
నే పల్కు పలుకు లెంతే పద్యములు జేయు | నవ్యఘుణాక్షరన్యాయశక్తి
వడి విడనాడంగ వలదు మర్కటకిశో- | రన్యాయపద్ధతి రాజిలంగ
చేపట్టఁగదవయ్య చెలఁగి మాల్జారకి- | శోరమహాన్యాయ కారణముగ  
గీ. గాదు మామక యత్న మొకానొకతఱి | కాకతాళఫలన్యాయ ఘటనఁ గాదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 38

సీ. బహుపాతకుఁడనంచు భయము నొందఁగనేల | పతితపావన ఘనవ్రతము నీది
షడ్వర్గశాత్రవచ్ఛటకు జంకఁగనేల | శరణాగతత్రాణ బిరుదు నీది
నిప్పచ్చరంబుఁ జెందిన చింత యేటికి | దీనదయాపరదీక్ష నీది
సుగతి గల్గ గణించు దిగులుల్లముననేల | శ్రేయోప్రదానోరుచిహ్న నీది  
గీ. యే ప్రకారంబునఁ గనఁగ నేది శంక | నిను నొకించుక సేవించు జనులకింక,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 39

సీ. కామాంధకారివి గావున వర్ణివై | మేనకాత్మజను భ్రమించుటెల్ల
మంజులద్విజరాజమౌళివి గావున | విప్రవరాఢ్యత వెలయుటెల్ల
ప్రచురమహాశ్మశానచరుండ వటుగాన | నొగిఁ బిశాచస్నేహమొందుటెల్ల
సుమహానటాభిధానమునొందితివి గాన | మూఁడువేళలయందు నాఁడుటెల్ల  
గీ. నెంతవారికి నైనను వింత గాదె | సంతతంబు భవత్ప్రౌఢి చింతసేయ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 40

సీ. వేమారు శ్రీమహావిష్ణువల్లభ యంచుఁ | బలుమరు బ్రహ్మాది పతియటంచు
గొనకొని స శివ ఏకో దేవ యంచును | దివిరి రుద్రో న ద్వితీయ యనుచు
రహి సమానాధికరహిత యటంచు మా- | నక శివాత్పరతరం నాస్తి యనుచు
మాటిమాటికి జనుర్మరణదూర యటంచు | దైవతమూలకందం బటంచు  
గీ. నిగమములు బల్కఁగ నరుఁడు నియతి నన్య- | దేవతారాధన మొనర్పఁబోవఁ దగునె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 41

సీ. వికసితమందారవిటపి మాని మిళింద- | మఱుఁగునె వేగ మందారమునకు
పక్వరసాలాంఘ్రిపము మాని చనునె శు- | కంబు దుత్తూరసాలంబునకును
లలితపయఃపానలాలస మానసౌ- | కసము పయఃపానకాంక్ష యిడునె
కలిత బలాహకావలిఁ గాంచి ముదమొందు | కేకి కావలిఁ గాంచి కేరుటెట్లు  
గీ. నీ పదధ్యాననిరతుఁడై నెగడు జనుఁడు | చేరి పెరవేలుపుల నుతిసేయఁ జనునె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 42

సీ. బూతి నెన్నొసటపైఁ బూసెదనంటినా | కీలికీలలు సోకి కాలునేమొ
యడుఁగులొత్తెద బత్తినంటినా నూపురా- | శీవిషభూత్కృతుల్ జెందునేమొ
నందిని ముస్తాబొనర్చెదనంటినా | క్రొవ్వాడికొమ్ములఁ గ్రుమ్మునేమొ
బంటునై కొలిచెదనంటినా ప్రేతర- | వంబులకును మేను వడఁకునేమొ  
గీ. యుగ్రమూర్తివి దయఁ జూడకున్నఁ జేరఁ- | దీసి బ్రోవదె యార్య దయాసమగ్ర,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 43

సీ. ఏ నవీనాశ్వంబుపై నధిష్ఠించెనే | విఘ్నరాజు దలంప వృషము గాక
దిట్టముగా నేమైనఁ బటములు గట్టెనే | వటుఁడు దిగంబరత్వంబు గాక
శాంతమేమైనను సంగ్రహించెనే వీర- | భద్రుఁ డక్షుద్రకోపంబు గాక
నే తల్లి గని పెంచెనే తారకారిని | భావింప సంశయాస్పదము గాక  
గీ. తండ్రి పోలిక సుతులకుఁ దగె నొకొక్క | గుణము మేలయ్యె నయయొ నాల్గుఁ దగె నీకు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 44

సీ. అఘటనాఘటనాసమర్థుఁడ వంటకు | శునకాకృతులు బూను శ్రుతులు సాక్షి
కంజజుకృతము లంఘ్యం బటంటకును మా- | ర్కండేయమౌనివర్యుండు సాక్షి
సబలు దుర్బలుఁ జేయు జాణ వంటకుఁ ద్వన్న- | గోత్పాటనుఁడు దశాస్యుండు సాక్షి
కూటస్థుఁడ వటంటకును ద్వదీయేక్షణ- | సంజాతుఁడైన శ్రీజాని సాక్షి,  
గీ. సాక్షి గోధినితాంతమేచక శిరోధి | హతవిరోధి యపారదయాపయోధి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 45

సీ. గోహయ నీ లెంక వాహనంబులు గదా | దేవతురంగ మైరావతములు
సత్పాఠకులు గదా సంగీతసాహిత్య- | చణులు నారదుఁడును శారదయును
మండనంబులు గదా మహితచక్షుశ్శ్రవ- | స్సార్వభౌముడును జందురుండు
శ్వశురగేహ స్వీయసదనంబులే కదా | హిమనగ శ్వేతమహీధరములు  
గీ. నాలుదొనలు వియన్నది యమృతజలధి | నీ యశంబిట్టిదనుచు వర్ణింపఁ దరమె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 46

సీ. కుంభిదైత్యస్ఫీతకుంభముల్ మోద వే | తొడరి మొమ్మొనల కైదువు గ్రహించి
శార్దూలయామినీచరుఁ గదనంబులో | జదుపవే చంద్రహాసము ధరించి
ప్రాకటపురసుందరీకంఠసూత్రముల్ | ఖండింపవే పినాకము వహించి
దునుమవే జాలంధరునిఁ బదాంగుష్ఠకృ- | దబ్ధిజావర్తమయారిఁ బూని  
గీ. తేజరిలె నీ ప్రతాపకాంతి ఖగరాజు | మోరఁ గల వెల్లఁదనమెల్లఁ జూరఁగొనియె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 47

సీ. అర్ధనారివి నే యధార్థంబుగాఁ బూరు- | షాకారివని గొనియాడుటెట్లు
కొమరైన బవిరిగడ్డముగల్గు కతమునఁ | జెలిమియటంచు వచించుటెట్లు
నిరతంబును సమర్చనీయ లింగస్వరూ- | పుఁడవు క్లీబుఁడవంచు నుడువుటెట్లు
తలఁపఁ బరేతభూతలనికేతనుఁడవు | గృహమేధివనుచు నగ్గించుటెట్లు  
గీ. మాతృపితృవర్జితుండవు జాతి లేదు | పెక్కుపేరులు నీకొక పేరు లేదు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 48

సీ. ఆతతశూలసమేతుండవయ్యును | వ్యాధివిదూరుండవై వరలుట
యతులితసోమాహ్వయప్రదీపితుఁడవ- | య్యును గమలాప్తత నొందుటయును
నిక్కంబు పుష్కరనేత్రుండవయ్యును | బుణ్యజనావనస్ఫూర్తిఁ గనుట
కడువడి గంగాధరుఁడవయ్యు జటులకృ- | శానుతేజోవృద్ధిఁ బూనుటయును  
గీ. నిర్భరాశ్చర్యములు కదా నీ మహిమలు | మహి నసాధారణములు సామాన్యులకును,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 49

సీ. కమనీయముద్రికాకటకకేయూరాద్య- | లంకార మండలాలంకృతంబు
తుహినావనీధరదుహితృమతల్లికా- | వితతనేపథ్య సద్విరచనంబు
సౌవర్ణఘంటికారావబంధుర వృష- | స్కంధాగ్రభాగ సంస్ఫాలనంబు
లోకభయంకర కాకోలజంబూఫ- | లాకారకృన్నిపుణాంచితంబు-  
గీ. నైన భవదీయహస్తము నభవ నాదు | మస్తకముపైనిఁ జేరిచి మాన్పు భయము,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 50

సీ. సౌగంధికాంభోజరాగప్రవాళ ప- | ల్లవసముజ్జ్వలకాంతి లాలితములు
ఝషహలధ్వజశంఖచక్రాబ్జపవిధను- | రాది నవీనరేఖాన్వితములు
ఘటజవసిష్ఠముఖ్యమునీంద్రహృత్పద- | కర్ణికాపీఠికాగ్రస్థితములు
భాషాసుయోషావిశేషసీమంతసిం- | దూరబిందూరు సిందూరితములు  
గీ. నగు భవత్పాదములు చూపఁదగదె నాదు | చిత్తమిత్తఱిఁ దమి నిగురొత్తె సామి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 51

సీ. అసమానబాహువీర్యవిజృంభణాదిత్య- | తనయోగ్రదంత తాడనకరములు
వాణీశముఖమౌళిమాణిక్యదీపికా- | ప్రాజ్యనీరాజన భాజనములు
స్తబ్ధరోమర్ష భోద్యద్వర్షధార్యబ్ధి- | వరజావరాదృష్ట వైభవములు
ప్రత్యగ్రశీతలభానుసంకాశ న- | ఖశ్రేణికావిభా విశ్రుతములు  
గీ. నగు త్వదంఘ్రిపయోజము లస్మదీయ | మానససరోవరంబునఁ బూని కొలుతు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 52

సీ. ఉపనయనుండవై యొప్పవే ధరఁ బంచ- | యజ్ఞపరుండని ప్రాజ్ఞులనఁగ
రాజశిఖామణివై జేయవే దుష్ట- | శిక్షణంబును శిష్టరక్షణంబు
యార్యుఁడవై యనయముఁ బాశుపాల్యప్ర- | భావమందవె పశుపత్యభిఖ్య
వృషలుండవై సదా విఖ్యాతిఁ గాంచవే | త్రివిధవర్ణాసక్తి తేజరిల్ల  
గీ. బ్రాహ్మణక్షత్రియోరుభూపాదభవుల | లోన నెవ్వండవొ గొల్తు నానతిమ్ము,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 53

సీ. బ్రహ్మచర్యము గదా పావన- | గౌరీతపోవనంబునకును బోవుటఁ గన
గార్హస్త్యమే గదా కరము శర్వాణితో | తిరముగాఁ గూడి కాపురము సేత
మిగుల వానప్రస్థమే కదా జడలు ధ- | రించి యెల్లపుడు చరించుటెల్ల
యత్యాశ్రమము కదా నిత్యంబు భిక్షాన్న- | మారగించుట వర్ణి సాంబ జటిల-  
గీ. భిక్షుకాఖ్యలు సహజముల్ త్ర్యక్ష నీకు | నిదియది యటంచు మది నిశ్చయింపనేర,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 54

సీ. అంబికాధర నవ్యబింబికాఫలరస- | గ్రసనవ్యసనకీర గర్వదూర
కాళీమనఃఫుల్ల నాళీకమకరంద- | పానషట్పదరాజ భవ్యతేజ
దాక్షాయణీ పీనవక్షోజ కాశ్మీర- | వక్షఃకవాట మహోక్షఘోట
నీహారగిరినందినీదృక్చకోరక- | రాకామృగాంక నిరస్తపంక  
గీ. కృతసురావనసంరంభ ధృతకురంగ- | డింభ సంభరితాజాండకుంభ బ్రోవు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 55

సీ. చారుతత్పూరుషాఘోర సద్యోజాత | వామదేవేశానవక్త్రమూర్తి
సతతవరాభయాజగవత్రిశూల ప్ర- | ముఖ కరాంభోరుహామోఘమూర్తి
హేరంబ షణ్ముఖ వీరభద్ర క్షేత్ర- | పాలాది పరివృత భద్రమూర్తి
జలభూనభోనభస్వద్భాస్వదిందీవ- | రప్రియాధ్వర్యగ్ని దీపమూర్తి  
గీ. బుధజనస్తోమ సస్యనభోనభస్య | హరివయస్య నిరంతరాచరితలాస్య,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 56

సీ. అనుదినాకర్ణనమును రోమహర్షణ- | మందని యురగత్వ మందఁగోర
శారీరమానసాక్షయ్యబాధలు గల్గి- | యుండెడు మనుజత్వ మొందఁగోర
లలితనిద్రాహారములు లేకయుండెడు | యురుతర దేవత్వ మొందఁగోర
నిరోహనిస్సంగ నిర్ద్వంద్వనిరుపాధి- | యుతమైన ప్రమథత్వ మొందఁగోర  
గీ. నా యభీష్టము విజ్ఞాపనం బొనర్తు | జిత్తగింపుము తాదాత్మ్యసిద్ధి యొసఁగు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 57

సీ. ఆనందకాననం బాలవాలము గాఁగ | విలసితంబగు జడల్ వ్రేళ్లు గాఁగ
బాహుయుగంబులు ప్రచురశాఖలు గాఁగ | లలితాంగుళులు కిసలములు గాఁగ
కొమరునఖంబులు కోరకంబులు గాఁగఁ | బొక్కిలి కోటరస్ఫురణ గాఁగ
నవ్యస్మితంబు సూనంబులు గాఁగ ఫ- | లముచంద్ర మశ్మకలమ్ము గాఁగ  
గీ. నగజ బెనఁగొను లత గాఁగఁ దగిన కల్ప- | శాఖివి మదిష్టఫలము లొసంగి గావు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 58

సీ. నిస్తులోరులు ప్రతిష్ఠాస్తంభములు గాఁగ | భుజములు బిసముల పోల్కెఁ గాఁగ
కరములు వికచపుష్కరములు గాఁగ స- | ద్వళు లురువీచికావళులు గాఁగ
నాభికాకుహర మెన్నందగు సుడి గాఁగ | కంఠంబు దివ్యశంఖంబు గాఁగ
చటులజటాచ్చటల్ శైవాలములు గాఁగ | లలి కృపారసము జలంబు గాఁగఁ  
గీ. దనరు యుష్మత్సరోవరమున మునింగి | పాపసంతాపముక్తుఁడనై పరఁగెద,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 59

సీ. రమణీయయానంబు రాజహంసలు గాఁగ | నారు మేల్తుమ్మెదబారు గాఁగ
సముచితకుచములు చక్రవాకములుగా | స్వరము వనప్రియవరము గాఁగ
నాస్యంబు పుష్కరాహ్వము గాఁగ మంజులో- | క్తులు శుకశాకుంతకులము గాఁగ
పక్షులు ఖంజరీటౌఘము గాఁగఁ గ- | చంబు సుబర్హిబర్హంబు గాఁగ  
గీ. నొప్పు ప్రాలేయగిరిజావయోవిలాస- | మరయ నీ మోహజాలమునందుఁ బడదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 60

నవరసములు
సీ. నవవజ్రమకుటవైభవ ధాళధళ్యరు- | చుల్ శీర్షమందు సంశోభిలంగ
మండితహరినీలకుండల చాకచ- | క్యప్రభల్ గల్లభాగములఁ బొదలఁ
మాంగళ్యశోణరత్నాంగద ధాగధ- | గ్యద్యుతు లంసములందు వెలుఁగ
ముత్యాలబలుసరముల తాళతళ్యదీ- | ప్తులు నిజోరస్థలిఁ దొంగలింప  
గీ. మేల్కడెంబులు మణికట్ల మెఱయుచుండు | నీదు శృంగారరస మెన్నఁగాఁ దరంబె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 61

సీ. వదలక ద్వాదశవత్సరాయుర్దాయ- | పరిమాణుఁడగు వశివర్యుశిశువు
నీక్షించి క్రుద్ధుఁడై దక్షిణాధీశుండు | కాలపాశనిబద్ధుఁగా నొనర్పఁ
బెంపు వేఁ జెడి విలాపింపుచు దేవ ర- | క్షింపు రక్షింపు రక్షింపుమన్న
సాక్షాత్కరించి కటాక్షవీక్షాపాళిఁ | జూచి తదర్భకుఁ గాచి హేళి-  
గీ. సుతుని భవదీయ పార్ష్ణిపీడితునిఁ జేసి | వీరరసము వహింపవే విభ్రమముగ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 62

సీ. మందరాహార్యంబు మంథానముగఁ జేసి | వాసుకి సూత్రంబుఁ జేసి యనిమి-
షాసురుల్ డాసి దుగ్ధాంబురాశి మథింప | విష ముద్భవంబంది వెస జగములు
గాలుప నడలి జేజేలు పదంపడి | పార్వతీశ్వర పాహి పాహి యనుచు
కైవార మొనరింపఁగా వార లఱుదందఁ | గాలకూటము వేడ్క గ్రోలిప్రోవ-  
గీ. వే చతుర్దశభువనముల్ విస్తరిల్ల | నిబిడకరుణారసము మది నివ్వటిల్ల,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 63

సీ. స్యందనకేతువుల్ జ్యానంతములు నియం- | తాశుగములు భారతీశ మేశు-
లురగరుత్తూణము లరుణానుజాబ్దు ల- | ర్వప్రతోదము లాగమప్రణవము-
లుర్వీభృదురగవర్యులు ధనుస్సింజిను- | లతిరథాంగము లహర్పతిసుధాంశు-
బింబముల్ జేసి పురంబులు మూఁడు క- | రంబు నిమేషమాత్రంబులో చె-  
గీ. లంగుచును లీల నేలఁ గూలంగఁ జేసి | యద్భుతరసంబుఁ జూపవే యమరు లమర,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 64

సీ. కాత్యాయనీపృథుకబరికాభరమున | విరులదండలు జుట్టి వెలయువేళ
హైమవతీలలాటాగ్రమందు సితాభ- | తిలకంబు సొగసుగా దిద్దువేళ
లసదపర్ణాకపోలములు కస్తురిచేత | వారకమకరికల్ వ్రాయువేళ
నగజాకఠోరస్తనస్తబకద్వంద్వ- | మందుఁ గుంకుమపంక మలఁదువేళ  
గీ. నుమకుఁ గిలికించితములు సేయుచును హాస్య- | రసముఁ జూపవే స్మేరవిరాజితాస్య,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 65

సీ. పసిపాపని హిరణ్యకశిపుఁడు నొప్పింప | గరివరదుఁడు నృకేసరిశరీర-
మలవడ నద్దనుజాధము వధియింపఁ | గని ఘనక్రౌర్యంబు గడలుకొనఁగఁ
దడయక నెనిమిదియడుగుల మెకఁపురూ | పముఁ గొంత సాళ్వరూపంబు
గొంత తగువిగ్రహముఁ బూని తన్మానవమృగేంద్రు | పటుదర్ప మొగిఁ దృణప్రాయముగ నొ-  
గీ. నర్చితివి భళియని సుమనస్తతి మిముఁ | బ్రస్తుతింప భయానకరసము నిగుడ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 66

సీ. శ్రీకంఠ మిము వెలిఁ జేసి దక్షుఁడు యాగ- | మొనరింపఁగ నెఱింగి కినుకతోఁడ
జని పూషు దంతముల్ సడలించి శశిని షో- | డశఖండములుగ నడంచి భగుని
కన్నులు పెరికి పెన్గాలినెచ్చెలికాని | నాల్క లేడును గోసి నలువచెలువ
ముక్కు గ్రక్కునఁ జెక్కి మురవైరి చక్రంబు | చక్కిలముగఁ బుక్కి వెక్కసముగ  
గీ. దక్షు తలఁ ద్రెవ్వనేసియుఁ దత్క్షణమున | భర్గ బీభత్సరసముఁ జూపవె మహాత్మ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 67

సీ. మదనుఁ డనంగుడు గద మత్తమధుపగు- | ణము నిష్ఫలమ్ము చాపము నలాదు
లస్త్రముల్ ప్రబలసైన్యము పతంగంబులు | తేరనిలం బతీంద్రియుఁడు సూతుఁ
డారయ పడగ విసారమౌట యెఱింగి | నిజసత్వ పరసత్వ నిర్ణయంబు
దెలియక నీమీఁద నలరు [1]తూపుల నేయ | నలికాగ్నిచేతఁ దదాత్మభవుని  
గీ. భస్మ మొనరించి జగములు భయము నొంద | రౌద్రరసరేఖఁ జూపవే రభసమునను,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 68

సీ. అక్షయ మభవ మనాద్య మనంత మ- | ద్వయ మనామయ మనాహ్వయ మచింత్య
మవ్యక్త మనుపమ మనుపద్రవ మజేయ | మనసూయ మనపాయ మప్రమేయ
మసహాయ మలఘుత్వ మనఘత్వ మచలత్వ | మగుణత్వ మమితత్వ మమలినత్వ
మశిశుత్వ మవయోత్వ మజరత్వ మస్త్రీత్వ | మపురుషత్వ మషండమై సమంచి-  
గీ. తామలస్ఫటికాకృతియై వెలుంగు | మూర్తివై శాంతరసమున మొనసితౌర,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 69

సీ. ఉరులింగమూర్తివై యుదయింపఁ గని రమా- | కాంతాబ్జభవులు విభ్రాంతులైరి
సతతము హాటకేశ్వరు భజించి రసాత- | లాధినాయకులు కృతార్థులైరి
వాలాయముగ మహాకాళేశ్వరునిఁ గొల్చి | భూలోకవాసులు పుణ్యులైరి
తారకేశ్వరు నిరంతరము గౌరవమునఁ | బూజించి దివిజులు పూజ్యులైరి  
గీ. యిన్ని రూపులు నీవౌట యెఱుఁగరాదె | శాస్త్రవేత్తల కేలకో సంశయంబు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 70

సీ. భాసురతరమహాభవనముల్ తగునయ్య | యఖిలాంతరాత్ముఁడవైన నీకు
కనదురుదీపితైకస్నేహవర్ధిష్ణు- | తనరే స్వయంప్రకాశసుఖ నీకు
నూర్ముల సంగతి యొప్పునే పరికింప | నహహ నిరాకారివైన నీకు
మేటి శతాంగాదులేటికిఁ బరికింప | హరవిరాడ్రూపుఁడవైన నీకు  
గీ. నాదిమధ్యాంతకూన్యుఁడ వైన నీవె | దేవుఁడవు నేను పరుల నుతింపఁబోను,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 71

సీ. ఉపనిషదర్థసౌధోపరితలములఁ | జరియించు నెవ్వాఁడు సంతతంబు
సఫలజంతుఫలద్రు సరణి నజాండముల్ | భరియించు నెవ్వాఁడు ప్రకటమహిమ
నాపాదమస్తకాభ్యాంతరాళములందు | ధరియించు నెవ్వాఁడు ధవళరక్ష
రూఢిఁ గామక్రోధలోభమోహాదులు | హరియించు నెవ్వాఁ డహర్నిశంబు  
గీ. నట్టి భగవంతుఁ గీర్తిదిగంతు శాంతు | దాంతు శ్రీమంతు ధీమంతుఁ దగ భజింతు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 72

సీ. అవిముక్తరాజధానివిరాజమాన కో- | దండరాజము లేఖ తటిని గొనము
కేవల లోలార్కకేశవుల్ కొటికలు | మహనీయధర్మంబు మార్గణంబు
గోఘ్న ద్విజాతిఘ్న గురుతల్పగానవా- | స్వాదన స్వర్ణాపహార ముఖ్య
కలుషజాతంబు లక్ష్యము నీవు ధానుష్క- | చూడామణివి నిన్నుఁ జూడఁగోరు  
గీ. వారి సుకృతము వర్ణింప వశము గాదు | ధాతకయిన భుజంగమనేతకైన,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 73

సీ. ఆకులు మేయవే మేఁకలు నీటిలో- | పలను మెలంగవే జలచరములు
వృక్షశాఖల వ్రేలవే గబ్బిలములు | చెప్పినఁ బలుకవే చిలుకగములు
వాయువు గ్రోలవే వ్యాళము లనయంబు | విపినవాసము సేయవే మృగములు
ధ్యానంబు సేయవే తద్దయు బకములు | గుహల నర్తింపవే కోరి హరులు  
గీ. జపతపస్స్నానసంధ్య లా సద్గతికిని | కారణంబులు దృఢబుద్ధి కాక భళిర,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 74

సీ. దారాదికేషణత్రయము వర్జించి స- | త్వాదిగాఢగుణత్రయంబు విడచి
తాపత్రయముఁ బరిత్యక్తముఁ జేసి స- | య్యన మలత్రయవిమోచన మొనర్చి
వాసనాత్రయమును వదలి పెద్దయు మండ- | లత్రయాగమ్యస్థలములు వెదకి
యంగత్రయోజ్జ్వలవ్యాపారము నెఱింగి | లింగత్రయాంతర్విలీను లైన-  
గీ. వారలకు దుర్ఘటామృతద్వాఃకవాట- | విఘటనము సేత సేకూరు వేగిరమున
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 75

సీ. ఏఁబదిరేకులచే బిందుసంయుక్త | పంచాశదక్షరపంక్తిచేత
నలరారెడు సమంజసాధారనామచ- | క్రాదిషట్చక్రముల్ హర్ష మలర
గ్రమమున శోధించి ఘనతదీయోపరి- | భాగసహస్రార పద్మవిహర-
మాణ మరాళసామ్రాడ్విలోకన మాచ- | రించు మాన్యులకు సిద్ధించు ముక్తి  
గీ. కామినీసంగమము వృథా పామరులకుఁ | గలుఁగునె సుధీపచేళిమకల్పభూమి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 76

సీ. భూతధాత్రీముఖ్య భూతపంచకమును | శబ్దాది విషయపంచకము మఱియు
శ్రవణాది ధీంద్రియోజ్జ్వలపంచకంబు వా- | క్ప్రముఖ కర్మేంద్రియపంచకంబు
నలి మనోబుద్ధిచిత్తాహంకృతి చతుష్ట- | యంబు జీవాత్మసమావృతమగు
పంచవింశతితత్త్వభాగ్దేహినివహహృ- | ద్వనమధ్యముల నీవారశూక-  
గీ. విధమున నజస్రమును వెల్గు విభుఁడ వీవె | కావె దేవేంద్రనుత వేగ రావె బ్రోవ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 77

సీ. రజ్జువునందు సర్పంబు ముక్తాస్ఫోట- | మందు రౌప్యంబు పైష్టాంబువులఁ బ-
యస్సు మరీచకయందు నీరంబు భ్రాం- | తి జగంబు నీయందు దృశ్యమగును
దహనునియందును దాహకత్వంబును | దపనునియందునఁ దాపనంబు
సలిలమునందున శైత్యంబుఁ బూర్ణని- | శాకరునందుఁ బ్రసన్న మట్లె  
గీ. నొగిఁ బ్రపంచంబులోపల నుండు దీవు | విష్టపమ్ములకును నీకు వేఱు గలదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 78

సీ. ఉభయపార్శ్వముల ధాత్రూపేంద్రు లురువడి | వింజామరమ్ములు వీచుచుండ
ఛత్రమ్ము వజ్రపశ్చాత్పీఠిఁ బట్టఁ ద- | ర్పణము పురోవీధి వహ్ని నిలుప
సౌరి భీకరగదాధారియై నిలుచుండఁ | గర్బురేంద్రుఁడు పాదుకలు ధరింప
వరుణుడు కాళాంజి పట్ట సమీరుండు | వీడియ మొసఁగంగ విత్తవిభుఁడు  
గీ. చేరి కైదండ యిడఁగఁ గచేరియందు | గద్దెపైఁ గూరుచుండవే కడుముదమున,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 79

సీ. హరిరాట్కిశోరంబు హరికిశోరము గాదె | నీ విక్రమమునకు నిభము గాక
గ్రావవతంసంబు గ్రావమ్ము గాదె నీ | ధీరసంపదకును దీటు గాక
సింధురాజం బల్పసింధువు కాదె యు- | ష్మద్దభీరతకును సవతు గాక
ఖద్యోతబింబము ఖద్యోతమగుఁ గాదె | నీ ప్రభాపటలికి నీటు గాక  
గీ. భీమ నీ శౌర్యధైర్యగాంభీర్యరుచుల | కేమి సదృశముఁ దెల్పుదు నింకఁ దెలుపు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 80

సీ. ఉత్పలప్రియుఁడు మహోత్పలప్రియుఁడు పూ- | దండగా మేల్బండియుండ గాఁగ
బలవిరోధియు మహాబలవిరోధియుఁ బడ- | వాలుగా మేల్మెడనూలు గాఁగ
రజితాచలము మహారజితాచలము నివ- | సనముగా నవశరాసనము గాఁగఁ
బద్మాధిపతి మహాపద్మాధిపతియును | జోడుగా సంగడికాడు గాఁగఁ  
గీ. జెలఁగు నిను జిన్మయుండంచుఁ జెప్పుచుందు- | నెపుడుఁ బ్రామినుకులు నెడ యింత లేక,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 81

సీ. అవిరతగుణశాలివౌట నిజంబు దూ- | రములయ్యె నన్నవస్త్రములు నీకు
నిరతశివాసక్తనిర్ణిద్రుఁడవు గదా | ధర్మవిద్వేషము దవిలె నీకు
లావణ్యయుక్తనూలసితుండవే కదా | క్షారసంపర్కంబు గలిఁగె నీకు
వివరింప నిర్మోహివే కదా ధరలోన | నసమాక్షయుగభిఖ్య హత్తె నీకు  
గీ. దొడ్డవారికినైనను జెడ్డగొనము | కొంత గలుఁగదె కలిఁగినఁ గొదువ యేమి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 82

సీ. అనుపమచిత్రకాయయుతుండవై హత- | చిత్రకాయుండవై చెలఁగినావు
రాగముక్తుండవై రతిరాజభస్మాంగ- | రాగయుక్తుండవై ప్రబలినావు
సారంగధరుఁడవై సాహసం బేపార | సారంగహరుఁడవై గేరినావు
గోత్రవర్జితుఁడవై గోత్రాధిరూఢగ- | రిష్ఠత్వ మంగీకరించినావు  
గీ. తారుమారయ్యె నీ ప్రవర్తనలు చూడ | నబ్రము గదయ్య సానుమదతినికాయ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 83

సీ. ధీరాళ్యభీష్టదాతారం గణాధినే- | తారం సపత్నహంతార మఘవి-
దారం యమీంద్రమందారం సువితరణో- | దార మంకస్థితదార మురగ-
హారం హలాహలాహారం మహిధ్రవి- | హారం విచారప్రహార మమిత-
సారం విధూతసంసారం ధృతాభ్రకా- | సారం ఘృణారసాసార మీశ-  
గీ. మహ ముసాసే యటంచుఁ బ్రత్యహముఁ దలఁతు | భాసురే భాసురత్వగ్విలాసవాస,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 84

సీ. సంగోరు మెయినిడ్డ చలిమలబిడ్డతో | వడిగల గిబ్బవార్వమ్ముతోఁడ
మూఁడవకన్నుతో ముయ్యంబువాలుతో | సిరులీను రుదురక్కసరులతోఁడ
నగవొప్పుమోముతో జిగికప్పుమెడతోఁడ | గాలిమేతరిసూడిగములతోఁడ
బూచులగములతోఁ బూపజూబిలితోడఁ | జంకను బెట్టిన జింకతోఁడ  
గీ. వేగమున నాకుఁ బొడసూపవే గడంకఁ | గందు మనసారఁ గన్నుల కరవు దీర,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 85

సీ. అనృతోక్తు లాడింప నాలోచనము చేసి | కపటముఁ బన్నిన గాధిపుత్రు
కొఱకు హరిశ్చంద్రకువలయేశ్వరుఁడు భా- | ర్యను నందనుని విక్రయంబొనర్చి
తాను చండాలునొద్దను మధుమాంసముల్ | మోచుచుఁ గడలేని నీచవృత్తిఁ
దిరుగుచునుండఁ దద్విభునకు సౌహార్ద్ర- | మొప్పఁ బ్రత్యక్షమై యున్నతముగ  
గీ. సర్వసర్వంసహాచక్రధూర్వహాఢ్యుఁ | జేసి వాసిగఁ జెలఁగితివౌ సితాంగ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 86

సీ. అభినవగానవిద్యాశక్తిచే మనోం- | బుజ మలరింపఁ దుంబురుఁడఁ గాను
బరిహాసవాక్యవైఖరిచేఁ బ్రమోదంబు | ఘటియింప నే భృంగిరిటుఁడఁ గాను
విపులకవిత్వప్రవీణత మెప్పింప | వావిరి గంధర్వవరుఁడఁ గాను
వాస్తవముగ నీ స్తవం బొనరింప ని- | మ్మహిలోఁ బరాశరాత్మజుఁడఁ గాను  
గీ. యిట్టులొనరింప నాచేత నెట్టులగును | నీదు చిత్తము నా భాగ్యమో దయాబ్ధి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 87

సీ. పంచామృతంబు గూర్పఁగ లేకయుండిన | శుద్ధోదకంబు దెచ్చుకొనలేనె
తెల్లఁదామరవిరుల్ తేలేక యుండిన | జిల్లేడుపూలఁ బూజించలేనె
మాలూరపత్రసమాజంబు లేకున్న | నూడుగుపత్తిరి యుంచలేనె
పాయసం బర్పణ సేయలేకుండినఁ | బేర్మిఁ గౌబేరంబు వెట్టలేనె  
గీ. గొప్ప కొద్దియుఁ గలుఁగునొకో సుభక్తి- | మాత్రసులభుఁడవౌ నీదు మానసమున,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 88

సీ. వారాంగనామణీవక్షోజ మర్చించి | సాలోక్య మొకఁడు హర్ష మునఁ జెందె
నీషదజైకకరీష మారాధించి | సామీప్య మొకఁడు హర్షమునఁ జెందె
జానుప్రదేశపూజానూనదక్షుఁడై | సారూప్య మొకఁడు హర్షమునఁ జెందె
ప్రస్థార్చనాకౌశలస్థిరత్వమ్మున | సాయుజ్య మొకఁడు హర్షమునఁ జెందె  
గీ. నిటుల నాచేతనగునె యక్కట జడుండఁ | గుటిలచిత్తుఁడ మత్తుఁడ గుణరహితుఁడ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 89

సీ. చిరితొండభక్తుండు శిశుహంతఁ గావించె | నక్కటికం బిసుమంత లేక
గాటకోటఁడు పితృఘాతుకత్వముఁ బూనె | జగతిలో నిందకు శంక లేక
రోహిణీశుఁడు గురుద్రోహ మాపాదించెఁ | బరలోకహానికి భయము లేక
దురితంబనాక మాతులవధ యొనరించె | యాదోనిధీశకన్యాధవుండు  
గీ. యిట్టి సాహసికులఁ బ్రోచినట్టి సామి | నన్ను రక్షింప వింత యన్యాయమేమి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 90

సీ. బ్రాహ్మణుఁ డొకఁడు సర్వక్షేత్రగామియై | వెనుక రుద్రావాసమునకు వచ్చి
యొకనాడు రూపరేఖోన్నతయుక్తయౌ | మధువిక్రయాబలామణి సురఁ గొని
రాఁ గని తన యభిప్రాయముఁ దెల్పిన | నొడఁబడి తన యింటికడకు దెచ్చి
సురతంబుఁ దేల్చిన తఱి జీవితేశుండు | చనుదేరఁగా సాధ్వసంబు మీఱఁ  
గీ. గాఁగులోఁ బారునిడి నిండ గల్లుఁ బోయ | మేన్ దొరఁగి లింగమూర్తియై మెఱసెఁ గాదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 91

సీ. నిశ్రేయసాపేక్షనియతిచే శివశర్మ | యను బ్రహ్మవంశవర్ధనుఁ డయోధ్య-
యును మధురయు మాయయును గాశి కాంచికా- | వంతికా శ్రీద్వారవతులు తిరిఁగి-
యును హరిద్వారమందునఁ గాలధర్మంబు | నొంది వైకుంఠంబుఁ జెంది పిదపఁ
బార్థివుండై పుట్టి పట్టికిఁ బట్టంబుఁ | గట్టి కాశికి నేగి కాంచె ముక్తి  
గీ. భళిర నీ పుటభేదనప్రాభవంబుఁ | బ్రణుతి యొనరింప నలవియే ప్రాకృతులకు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 92

సీ. ఒడయనంబిని గాను యుడుఁగకఁ బరమనా- | చి నిమిత్త మెలమిఁ గుంటెనకుఁ బంప
సాంఖ్యతొండడఁ గాను సందేహపడక న- | హా శిలాప్రహరణ లాచరింప
సవ్యసాచినిఁ గాను సమరాంగణమునందుఁ | గడిమి నీపైని సింగాణి విసరఁ
జందయాఖ్యుఁడ గాను శరణులు చూడంగ | వేమరు నిను వెనువెంటఁ ద్రిప్ప  
గీ. నన్య దాశరణంనా స్తియనుచు నున్న | వాని పైఁ గని కారము మానఁదగునె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 93

సీ. అధికాయు వీయవే యల్పజీవనుఁడు నా | నెసఁగు నిరాబారి నిసువునకును
సమకూర్చవే పుణ్యజనభర్తఁగా దుష్కృ - | తాసక్తు గుణనిధి యనెడి ద్విజుని
నరకస్థుల స్వకీయనగరమ్ముఁ జేర్చవే | తావకీనమను ప్రధానమహిమఁ
దారుణ్య మొసఁగవే కారుణ్యరసమొప్ప | నతివృద్ధుఁడగు గుండయాహ్వయునకు  
గీ. దేవ యివి నిజమైన నన్ బ్రోవరాదె | కాలయాపన మొనరింపనేల చాల,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 94

సీ. అమలవాఙ్మాధుర్యమబ్బునే హాలాహ- | లాశ్లిష్టకంధరావాప్తి కతనఁ
జల్లనిచూపులఁ జెల్లఁబోఁ గనుటెట్టు- | లగణితోగ్రాక్షుఁడ వగుటవలన
మార్దవ మేభంగి మనమున నొనఁగూడు | నకట గిరీశుఁడ వగుటవలన
స్థావరస్థితి సమాసాధ్య మేగతి యొకో | - జంగమాభిధచే మెలంగు కతనఁ  
గీ. దాత యేతాదృశ్యుడవు గదా జనులకుఁ | గొడుకుపై ఋజుభావము వొడమకున్నె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 95

సీ. అంతరంగోపవనాంతరంబున సదా | శివశిఖావళమును జేర్చు నెవ్వఁ
డనితరాత్మాలాన మందున మలహర | ద్విపలలామంబు బంధించు నెవ్వఁ
డుల్లఁపుదామర నుడురాజభిత్తమ- | హోత్తంసుఁ డను దేఁటి నుంచు నెవ్వఁ
డఱుఁదుగ హృదయపంజరమున మృడుఁడను | రాచిల్కఁ బ్రీతిమీఱ నెవఁ డుంచు-  
గీ. నట్టి సుశ్లోకుఁడె మదాప్తుఁ డంచు నుందు | నన్యులా బంధువులు శతమన్యుసేవ్య,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 96

సీ. నీ తనూజుపతాకయై తామ్రచూడరా- | జంబు కాలజ్ఞానసంజ్ఞ నొందె
నీకు గుఱ్ఱంబౌటనే నందికేశుండు | ర్మస్వరూపి నాఁ దగె ధరిత్రి
నీ రవణంబైన నిడుపరాయఁడు మించె | శేముషీధౌరేయశీలనమున
నీ నేత్రమై చిత్రభానుండు భువి జగ- | త్ప్రాణసఖుండు నాఁ బ్రౌఢి మెఱసె  
గీ. నుర్వి మహదాశ్రమము బహుయోగ్య మనుచు | విబుధజనములు వచియంప వింటిఁ గంటి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 97

సీ. అఖిలజన్మార్జితాంహస్సంహతి హరింప | భారంబుఁ బూనె సుపర్వవాపి
అన్నపానీయాదు లాదరమునఁ బెట్ట | నాయత్తపడెఁ గదా యన్నపూర్ణ
సకలాంతరాయభంజన మొనర్పఁ బ్రతిజ్ఞ | గావించె గద డుంఠికరటిముఖుఁడు
దక్షణశ్రుతిమీదుగా క్షితిపైఁ ద్రెళ్లు | ప్రాణికి స్వస్వరూపము నొసంగ  
గీ. నీవు ప్రతిసరమూనితివే విచార- | మేల నరులకుఁ గాశీపురీచ్ఛ వలదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 98

సీ. ముందు విశ్వేశ నీ సందర్శన మొనర్చి | బిందుమాధవునకు వందనమిడి
వరడుంఠిగణపతి చరణంబులకు మ్రొక్కి | దండపాణికి వేడ్క దండమొసఁగి
భైరవునకు నమస్కారంబుఁ గాలించి | కేరుచుఁ గాశికిఁ గేలుమోడ్చి
ఘనగుహాలోకన మొనరించి గంగనీ- | క్షించి భవాని దర్శించియు మణి-  
గీ. కర్ణికాప్లావనముఁ జేసి కడఁక నిటుల | యాత్ర సలిపినవారు మహాత్ములు గద,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 99

సీ. చంపక దేవకాంచన భూమిజ కురంట- | కాశోక నీలోత్పలాబ్జ కుబ్జ
మల్లికార్జున గిరిమల్లికానీప మ- | ధూక శిరీష బంధూక కర్ణి-
కార శామంతికా కరవీర కృతమాల | మాలతీ ద్రోణార్క మదన పారి-
భద్ర నంద్యావర్త పాటల నందివ- | ర్ధన బృహతీ దేవదారు దవన  
గీ. నాగకేసర వకుళ పున్నాగములను | బూజ నీకొనరింతు నేఁ బుష్కలముగ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 100

సీ. దండంబు మిహికాంశుఖండరాజన్మస్త- | దండంబు మేరుకోదండహస్త-
దండంబు నిష్ఠురకాండకల్పిత శౌరి- | దండంబు పరిభూత దండధారి-
దండంబు నూత్నవేదండకృత్తికటీర- | దండంబు ధృతజగదండవార-
దండంబు పద్మజాఖండలస్తుతనామ- | దండంబు కోటిమార్తాండధామ-  
గీ. దండ మశ్రాంతసాత్వికోద్దండ నీకు | దండ మతిజవవద్భద్రకాండ నీకు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 101

సీ. ఒదుఁగుచు సాష్టాంగ మొనరింప నా వంతు | నీ వంతు రయమున లేవనెత్త
నపరాధి ననుఁ గావుమని పల్క నా వంతు | నీ వంతు తప్పులన్నియు క్షమింప
దారిద్ర్య మొసఁగు మిత్తఱియన నా వంతు | నీ వంతు ధనవంతునిఁగ నొనర్ప
గద్యపద్యములు వక్కాణింప నా వంతు | నీ వంతు సావధానివయి వినుట  
గీ. పెక్కుమాట లికేటికి దిక్కు మాకు | నీవ నీవానిఁ జేసి మన్నింపవలయు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 102

సీ. కలుఁగవే స్కాంద మార్కండేయ గారుడ | బ్రహ్మాండ నారద బ్రహ్మ విష్ణు
శివ లింగ మత్స్య కూర్మ వరాహ పద్మాగ్ని | వామన బ్రహ్మవైవర్త భాగ
వత భవిష్యదభిఖ్యయుత పురాణంబు ల- | ష్టాదశసంఖ్య రూఢముగ నందు-
రవి కొక్కటి కృపీటభవున కొకండు ధా- | తకు రెండు నాల్గు మాధవునకుఁ బది  
గీ. యర్థి నినుఁ జెప్పు నీ మహత్వము గణింప | దుర్లభంబని జనులకుఁ దోఁచుఁ గాదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 103

సీ. కరిముఖ నరముఖ కపిముఖాహిముఖోష్ట్ర- | ముఖ సింహముఖ మేషముఖ వరాహ-
కర్ణ ఘంటాకర్ణ గజకర్ణ శంఖక- | ర్ణ ద్వికర్ణ త్రికర్ణ ప్రచండ
కుండోదర నికుంభ కుంభోదర ప్రకంప- | న మహాకాళ కపర్ది వజ్ర
పాణి సుదర్శనపాణి శూలాయుధ | సూర్యపాతన నంది సోమనంది  
గీ. నందిషేణాది గణము లానందమున భ- | జింప వెలుఁగొందు నిన్ను భజింపుచుందు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 104

సీ. శ్రీనీలగిరిని భుజించుటయును మంగ- | లాద్రిపై నిల్చి దాహంబుఁ గొనుట
సింహభూధరమున సిరిగంద మలఁదుట | వేంకటాచలమున విలువ లేని
మానికమును సొమ్ములూనుట ద్వారకా- | పూర్వరమందు నపూర్వలీల
స్త్రీలతో నిధువనక్రీడలు సల్పుట | శ్రీరంగమందు నిద్రించుటయును  
గీ. నిన్ని సౌఖ్యము లొందుట వెన్నుఁ డిలను | గన్ను నీకర్పణము సేయు కతనఁ గాదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 105

సీ. మురహరుం డవతారములు దశవిధములఁ | బరిపాటిగా భూతభావియుగము-
లం దుద్భవించుచు నంతంబు నొందుచుఁ | బడరానిపాట్లెల్లఁ బడి బడసెను
బెనుమసనంబులోఁ బెద్దనిద్దురఁ జెందు | పంచజనుం డొకపరి సమస్త
నాకవాసులు మెచ్చ నేకాదశాకార- | ముల కిరవగు రూపమును ధరించు-  
గీ. నౌర ప్రత్యక్షకైలాస మనఁగఁ బరగు | క్షితిని సమ మెందుఁగలదె నీ క్షేత్రమునకు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 106

సీ. ఆవిర్భవించునే యాఁకలి దప్పి నీ | కటకంబునందు లింగములు గన్న
శ్రమఁ జెందునే సదాజ్ఞానవాప్యాద్యమ- | హాదీర్ఘికలు ముదమారఁ గన్న
బడలికఁ గలుఁగునే కడకఁ బంచక్రోశ- | గమనాభిలాషంబు గడలుకొనినఁ
గొందలమొందునే కుక్కుటస్థానాది | మంటపతతిఁ గడగంటఁ గన్న  
గీ. మాటిమాటికి నేను నీ వీటితోడ | సాటిగల ప్రోళ్లు లేవంచుఁ జాటుచుందు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 107

సీ. స్వర్ణవేత్రములూని చండప్రచండులు | పరువులెత్తుచుఁ బరాబరు లొనర్ప
సరిగమపదని సుస్వరనయాభినయంబు- | లలర రంభాది వేశ్యలు నటింప
రతనంపుటారతుల్ జతనంబుగాఁ బౌర- | సారసయాన లాసక్తి నొసగఁ
గాహళ వేణు వీణా హుడుక్కా తాళ | మురజ భేరీవాద్యములు చెలంగఁ  
గీ. గోరికలు మీఱఁగా మీరు స్వారి వెడలు | హొయలు మాదృశులకు నలవియె వచింప,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 108

సీ. మహితాలికమున భస్మము మూఁడు రేకలు | మునుకొని యెగదిగ మూఁడు కళ్లు
మెడ నొడలను జడముడులవన్నెలు మూడు | కేలునఁ గీలించు వాలునకును
మూఁడు మొనల్ గడువేడుక నీవు పూ- | జలు గొను పత్తిరి వెలయు మూఁడు
దళములు నాప్తున కలర మూఁడడుఁగులు | నాఱుమూఁడుగఁ దోఁచె నయయొ నీదు  
గీ. బ్రతుకు నాకేమి తోఁచదే గతియొ కాని | నిన్ను నమ్మినవారి కో యన్న చెపుమ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 109

సీ. ఆహరప్రాహరమను నృశంసుఁడు కిల్బి- | షంబులు దొలఁగి ప్రశంసఁ గనఁడె
వాసి యటంచును వాక్రుచ్చిన జనుండు | నిర్వాణమొందఁడే నిఖిలమెఱుఁగ
సానందుచే షడక్షరి నరుల్ వీనులా | నిరయంబ విడువరే నిరయము భళి
తిరముగాను గురూపదేశంబు నొందియుఁ | గొందఱు మోక్షంబు నొందలేదె  
గీ. జిహ్వ నీ పేరు రక్తి భాషించునట్టి- | వారి సామర్థ్య మెన్నఁగ వశము గాదు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 110

సీ. ఔద్ధత్యమున బ్రహ్మహత్యఁ గావించితి | క్రూరుఁడవౌట నిక్కువము గాదె
దారుకాంతారకాంతారతిప్రౌఢవు | జారుఁడవౌట నిజంబు కాదె
గౌరీమనోధనహారిపేశలుఁడవు | చోరుఁడవౌట విస్ఫురణఁ గాదె
లింగపటోలికాలీనుండవైతి భీ- | రుఁడవౌట నిర్ణయరూఢి గాదె  
గీ. యిట్టి చేష్టలు దొరలినయట్టు దొరకు | దాస్యమొనరించువాని కొదవునె యెఱుక,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 111

సీ. అష్టభుజుఁడు యంతయయ్యెఁగా నీకుడ్డ- | చేతులు గలవను హేతువెఱిఁగి
యర్చకుఁడయ్యె దశాననుఁ డరపది- | మోములు గలవను మూలమెఱిఁగి
హితుఁడయ్యె ద్రవిణాఢ్యుఁ డెంచ నకించనో- | దంచనుండవటన్న సంచెఱింగి
ీ. పృథివి నీకంటె భక్తులే యధికులనెడి | వార్త తార్కాణమయ్యె నేవంవిధమున,  
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ
112

సీ. తిలకింప మడికాసు మలమంచివెన్నెల | మహలుగా వాచంయమప్రవరులు
ఖొజ్జాలు గాఁగ మరుజ్జాతి సరదార్లు | గా జయవిజయులు గాఢమగు న-
కీబులు గాఁగ మేల్గిత ఘోడా గాఁగ | లచ్చిసైఁదోడు కుళాయి గాఁగ
గబ్బుచంకమెకంబు బెబ్బులితోళ్లు జా- | మాతమానులుగా క్షమాతలమున  
గీ. నేనుమొగములసాహేబు నా నలరితి | యవనకర్త సలాం జేతు నాదరింపు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 113

సీ. మండలేశ్వరుఁడయి యుండఁడే యిప్పుడు | వసుమతిలో శాలివాహనుండు
గణుతింప భక్తాగ్రగణ్యుండు నా మించె | గుండయ్య ధారుణీమండలమున
రామాయణగ్రంథరచనాద్రఢిమఁ గాంచె | మొల్ల వధూటీమతల్లి యనఁగ
మహిసూరునకు మహీమహిళాకళత్రులై- | రి కృతేభదానధురీణు లనఁగ  
గీ. ధరఁ గులాలాన్వవాయభూతప్రసిద్ధి- | నుదయమైరి తదీయ కులోద్భవుండ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 114

సీ. అమలాపురాన్వయోత్తముఁ డగు కాశీప- | తికిని గంగాభవానికిని సుతుఁడ
సన్యాసినామక సహితుఁడ శ్రీకాట్ర- | కోన లక్ష్మణసమాఖ్యునకు వేంక-
మాంబకుఁ బుత్రిక యగు కన్నమాహ్వయ- | పత్నితోఁ గూడి మీ ప్రాంతమునకు
నఱుదెంచి యేను గృతాంజలినై ప్రభూ | కానుక లివ్వఁగలానె నీకు  
గీ. నీ కృతి రచించితిని గొని మాకు నైక్య- | మొసఁగుమని వేడితిని నట్ల యొసఁగరాదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 115

సీ. కాకిణికామాత్రకనకంబు శ్రీకురు- | క్షేత్రమం దొసఁగు విశేషఫలము
మఱియుఁ బ్రయాగలో మకరమేళనమాఘ- | మునఁ ద్రివేణికయందు మునుఁగు ఫలము
గవిసురద్రుమపంచకంబు నా వెలయు పం- | చారామదర్శనమబ్బు ఫలము
ధృతి గయలోపలఁ బితృవర్గమునకును | బిండంబు నొకమారుఁ బెట్టు ఫలము  
గీ. కలుఁగు నీ శతకము వ్రాయఁ గాంక్షఁ జదువ | విన్న జనులకు నీ కృపావిలసనమున,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ! 116

క. శ్రీవిశ్వనాథశతకము
భావుకమతి నెవ్వరేని పారాయణముం
గావించిన వారలకున్
జీవన్ముక్తి యొనఁగూర్చు శివుఁ డధికదయన్.  
సంపూర్ణము.

పీఠిక
ఈ విశ్వనాథశతకము వ్రాసిన కవి అమలాపురము సన్యాసికవి. ఈయన నివాసస్థలము విశాఖపట్టణమండలాంతర్గతమగు పాల్తేరు. కవితానుకులాలకుల సంభూతుఁడ ననియుఁ, గాశీపతికి గంగాభవానికి గుమారుఁడ ననియుఁ, దన పత్నియగు కన్నమ్మతోఁ గలసి కాశీనగరమున కేగి విశ్వేశ్వరునిగూర్చి యీ శతకము రచించెననియు శతకాంతమునఁగల పద్యముల వలనఁ దెలియుచున్నది.

ఈ కవి శతకములను నూరింటికిఁ బైగ రచించెననియుఁ, గట్టమూరి కామేశ్వరకవి శిష్యుఁడనియు, రామాయణము రుద్రాక్షమహత్వము లోనగు గ్రంథములు రచించెననియుఁ గవిశిష్యులలో నొకరగు దేవులపల్లి చంద్రశాస్త్రిగారు రచించిన మాలికవలనఁ దెలియనగును.

ఈ సన్యాసికవి శాలివాహనశకము 1782 సరియగు క్రీ.శ. 1860లో జనించినటులఁ గవికి శిష్యుఁడగు దేవులపల్లి చంద్రశాస్త్రిగారు రచించిన యీ క్రింది పద్యమువలన స్పష్టముగాఁ దెలియుచున్నది.

సీ. తన వంశకర్తయై తనరారు శాలివా - | హనమహారాజు శతాబ్దములు క-
రగజర్షివిధుసంఖ్యఁ దగు రౌద్రివత్సర | చైత్రశుద్ధ నవమి మిత్రపుత్ర-
వార త్రియామాదియై రహిన్ గను సమ - | యంబున నమలాపురాన్వయామృ-
తాంభోధిరాకాసుధాంశుండు నాఁగ ను - | ద్భవమంది మదిని సద్భక్తి మెఱయన్.

పై పద్యమువలనఁ గవి జన్మమొందిన కాలము పైని మేముదాహరించినటుల స్పష్టమగుచుండ, శతకకవుల చరిత్రమునందు వంగూరి సుబ్బారావుగారును, ద్వితీయశతకసంపుటమున లచ్చారావుగారును ఈ కవి శాలివాహనశకము 1682 సరియగు కీ. శ. 1760 లో మృతినొందినటుల వ్రాయుట కేది యాధారమో తెలియదు.

ఈ సన్యాసికవి కంత్యనియమాదులయం దభిరుచి మెండు. ఇంతవఱ కీ కవిశతకములలో నైదాఱు మాత్రమే లభించినవి. ఈయన వ్రాసిన గ్రంథము లెన్ని కలవో యవి యెందు గలవో విశాఖపట్టణమండలవాసులు శోధించి ప్రచురించుట కర్తవ్యము.

తండయార్పేట,
చెన్నపట్నం,
26-1-1926.

ఇట్లు,
వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat