నరకలోకంలో శిక్షలు
ఈలోకంలో మనుష్యులు తమక్షణిక సుఖాలకోసం అనేక దుష్కర్మలను చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మనపురాణాలు బోధిస్తున్నాయి.ఈ భోగదేహం రెండు రకాలు:
- ➣ ఒకటి సూక్ష్మ శరీరం. ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గ లోకాలకు చేరుతుంది.
- ➣ రెండవది యాతనా దేహము. ఇది మానవుడు చేసిన పాప ఫలాలను అనుభవించడానికి నరక లోకాలకు చేరుతుంది.
శ్రీమద్భాగవతంలో యాతనాదేహం అనుభవించే వివిధశిక్షలు వాటిని అమలు చేసే 28 నరకాల వర్ణన వున్నది. వాటి సంక్షిప్త వివరణ:
- 1. తామిస్ర నరకం: పరధనాపహరణ, పరస్త్రీ, పర పుత్ర హరణం వలన ఈ నరకం పొందుతాడు. ఇక్కడ అంధకార బంధురమున పడవేసి ఇనుప కర్రలచే బాదుదురు.
- 2. అంధతామిశ్ర నరకం: మోసగించి స్త్రీల ధనమును తీసుకున్నవారు కండ్లు కనిపించని చీకటిలో నరికిన చెట్ల వలె నరకబడుదురు.
- 3. రౌరవ నరకం: ఇతర ప్రాణులను చంపి తన కుటుంబమును పోషించుకున్న వారిని ఇక్కడ రురువులు అను జంతువులు పాముల కన్న ఘోరముగా హింసించును.
- 4. మహారౌరవ నరకం: ఇతర ప్రాణులను బాధించి తన శరీరాన్ని పోషించుకునేవాడు ఈ నరకానికి చేరుతాడు. పచ్చి మాంసము తిను రురువులు వారి మాంసమును కండలు కండలుగా పీక్కుతినును.
- 5. కుంభీపాకనరకం: సజీవంగా వున్న పశుపక్ష్యా దులను చంపి వాటి మాంసాన్ని తిన్నవాడు ఈ నరకాన్ని పొందుతాడు, సలసల కాగే నూనెలో పడవేసి, గారెలవలె వేపుదురు.
- 6. కాలసూత్ర నరకం: తల్లిదండ్రులకు, సద్క్బాహ్మణులకు వేదాలకు ద్రోహం తలపెట్టినవారు ఈ నరకానికి వెళతారు. బాగా కాలిన రాగిలాంటి నేలపై నడిపిస్తూ ఉంటే! సూర్యుడు అగ్నిజ్వాలలు కురిపిస్తూ మాడ్చి వేయును.
- 7 అసిపత్ర నరకం: వేదములను ధిక్కరించిన వారు ఈ నరకాన్ని పొందుతారు. కొరడాలతో గొడ్డును బాదినట్లు బాదుచూ సర్వాంగములను కత్తులతో కోసి ఈ శిక్షలను అమలుపరుస్తారు.
- 8. సూకర ముఖ నరకం: నేరము చేయకపోయినా, నేరం చేశారని దండించిన రాజులను అధికారులను చెరకు గడలవలే గానుగలో పెట్టి తిప్పుదురు.
- 9. అంధకూప నరక: చిన్న చిన్న ప్రాణులను చంపిన వానిని పాములు, నల్లులు, దోమలు, చీమలు మూకుమ్మడిగా దాడిచేసి హింసించును.
- 10. క్రిమి భోజన నరకం: అతిథులకు అనాదలకు అన్నం పెట్టక తన పొట్ట నింపుకొన్నవాడు క్రిములతో నిండిన లక్షయోజనముల కుండలో పడవేయుదురు.
- 11. సందంశ నరకం: ఇతరుల ధనధాన్యాలను, బంగారము రత్నములు దోచుకున్న వారిని మండుతున్న ఇనుపకడ్డీలతో పొడుస్తూ, పటకారుతో చర్మము పీకుట వంటి శిక్షలు వేస్తారు.
- 12. తప్తోర్మి నరకం: సంభోగించరాని స్త్రీలతో సంభోగించిన మగవారు, అట్టి మగవారితో సంభోగించిన స్త్రీలు మండుచున్న ఇనుప స్త్రీ, పురుష ప్రతిమలచే కౌగిలింప చేయబడుదురు.
- 13. వజ్ర కంటక నరకం: పశువులతో ఇతర జంతువులతో సంభోగించిన వాడిని ఇనుప చవ్వులలాంటి ముళ్ళున్న బూరుగుచెట్టు మీదకి ఎక్కించి కిందకు లాగుదురు.
- 14. శాల్మలి నరకం: కులమర్యాద పాటించని రాజు లేక రాజోద్యోగి, చీము, నెత్తురు, తలవెంట్రుకలు, గోళ్ళచే నిండి ఉన్న నదిలో త్రోయబడుదురు.
- 15. వైతరణీ వుయోద నరకం: శౌచము మొదలైన ఆచార ములను పాటించని వారిని మలమూత్రాలచే నిండిన చెరువులో పడవేయుదురు.
- 16. ప్రాణరోధ నరకం: కుక్కలను, గాడిదలను పెంచి వాటినే వృత్తిగా పెట్టుకున్న బ్రాహ్మణులను అంపకోలలచే వేటాడి హింసించెదరు.
- 17. విశవిశస నరకం: దంభ యజ్ఞములు చేసి పశుపక్ష్యాదులను హింసించు వార్ని ప్రాణాంతకమైన రకరకాల హింసలకు గుర్తిచేసి హింసించెదరు.
- 13. లాలాభక్షణ నరకం: కుల భార్యచే వీర్యపానము చేయించినవారిని, వారిచే వీర్యపానము చేయించి అతి కిరాతకంగా హింసించెదరు.
- 14. సారమోయోదన నరకం: ఇండ్లు తగుల పెట్టుట విషముపెట్టుట, బిడార్లు దోచుట, గ్రామములను దోచుకొను వారిని వజ్రములవలే కరకుగా వున్న కోరలు గల ఏడు వందల జాగిలములు ఒకేసారి పీక్కొని తినును.
- 15. అలీచారయ నరకం: అబద్ద సాక్ష్యాలను చెప్పి, లావా దేవీలలో మోసం చేసిన వారిని వంద యోజనముల ఎత్తయిన పర్వత శిఖరముల నుండి పడద్రోసి పచ్చడి పచ్చడిగా చేయబడుదురు.
- 16. రేతః పాన నరకం: ప్రతనిష్ఠలో వుండి మద్యపానము చేసిన బ్రాహ్మణులు సోమపానము చేసిన క్షత్రియ, వైశ్యులను బాగా కరిగిన ఇనుమును వారిచే త్రాగింతురు.
- 17. క్షాంకర్డ నరకం: తన కన్న అధికులను, పెద్దలను తిరస్కరించు వారిని తల క్రిందులుగా ప్రేలాడ దీసి నానా బాధలు పెట్టి హింసించెదరు.
- 18. రక్షో గణభోజన నరకం: నరమేధములు చేయువారిని, నరమాంసము, పశువుల మాంసము తిను స్త్రీ పురుషులను వాడిగల ఆయుధములచే ముక్కలు ముక్కలుగా నరికివేసెదగ
- 19. శూల ప్రోతస నరకం: నిరపరాధులైన అడవి జంతువులను ఊర పశువులను నమ్మించి పొడిచి చంపిన వారిని శూలములచే పొడుస్తూ కంబములకు ప్రేలాడదీయుదురు.
- 20. దండశూత నరకం: ప్రాణికోటికి భయము కలిగించు ఉగ్రస్వభావులను అయిదు, ఏడు తలల పాములు అనేకం కలిసి ఎలుకలను హింసించినట్లు హింసిస్తాయి.
- 21. మలనిరోధన నరకం: ఇతరులను, ఏ నేరము చేయని వారిని, గదులలోనూ, నూతులలోనూ బంధించిన వారిని విషాగ్నులు మండించి విషపు పొగలు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేయుదురు.
- 22. పరావర్తన నరకం: అతిథులను, అభ్యాగతులను మోసంతో హింసించినవారిని కనుగ్రుడ్లను కాకులచే, గ్రద్దలచే పొడిపింతురు.
- 23. సూచిముఖ నరకం: ధన మదాంధముతో అందరిని చిన్న చూపు చూచిన వానిని శరీరమును దబ్బలం లాంటి సూదులతో బొంతను కుట్టినట్టు కుట్టెదరు.