పరమ శివ ! |
రుద్రాధ్యాయములోని వివిధ నమకచమక మంత్రాలకు తెలియచేసిన శివధ్యాన శ్లోకాల సంగ్రహమే ఈ వ్యాసం. ప్రతి ధ్యానానికీ దేవత నామము, ఋషి నామము తెలియచేయబడ్డాయి.
1) ఆకర్ణకృష్టే ధనుషి జ్వలన్తీం దేవీమిషుం భాస్వతి సందధానమ్
ధ్యాయేన్మహేశం మహనీయవేషం దేవ్యాయుతం యోధతనుం యువానమ్
ప్రకాశించుచున్నదియు చెవివరకు లాగబడినదియు నగు ధనస్సు నందు మహాప్రభావము గల జ్వలించుచున్న బాణమును సంధించుచున్నవాడును, యౌవనముగలవాడును, వీరుని రూపపము గల వాడును, ఉత్తమమయిన అలంకారముగల దేవితో కూడిన వాడును, అగు మహేశ్వరుని ధ్యానించుచున్నాను.
దేవత: రుద్రుడు
ఋషి: కశ్యపుడు
2) ధ్యాయేద్దేవం సుస్మితం స్యన్దనస్థం దేవ్యాసార్థం తేజసాదీప్యమానం,
ఇష్విష్యాసాలంకృతాభ్యాం కరాభ్యాం శూరాకారం స్తూయమానం సురాద్యైః
చిఱునగవులవాడును, దేవితోగూడ రథముమీద నున్నవాడును, తేజస్సుచే ప్రకాశించుచున్నవాడును, బాణముచేతను ధనస్సుచేతను అలంకృతమైన హస్తములచే నొప్పినవాడును, శూరునిరూపము గలవాడును, దేవతలు మొదలగువారిచే స్తుతింపబడుచున్నవాడు అగు దేవుని ధ్యానించుచున్నాను.
దేవత: శంభువు
ఋషి: ఆత్రేయుడు
3) స్మేరాననం చన్ద్రకలావతంసం గంగాధరం శైలసుతాసహాయమ్
త్రిలోచనం భస్మభుజంగభూషణం ధ్యాయేత్పశూనాంపతిమీశితారమ్
చిఱునగువుతో గూడిన మోముకలవాడును, చంద్రకలశిరోభూషణము గలవాడును, గంగను ధరించిన వాడును, పార్వతితో గూడినవాడును, మూడుకన్నులు కలవాడును, విభూతియు సర్పములను ఆభరణములుగా కలవాడును, పశువులకుపతియు అగు ఈశ్వరుని ధ్యానించుచున్నాను.
దేవత: శంభువు
ఋషి: కాశ్యపుడు
4) సాంగ్రామికేణ వపుషా ప్రవిరాజమానం
దృప్యత్పురత్రయతృణాశని మన్దహాసమ్,
దైత్యాన్ దిధక్షు మచలేశ్వరచాపపాణిం
ధ్యాయేత్పురారి మమరౌఘరథాధిరూఢమ్.
యుద్ధమునకు యోగ్యమైన రూపముచే ప్రకాశించుచున్నవాడును, గర్వించిన త్రిపురాసురులను తృణములకు పిడుగయిన చిఱునగవు గలవాడును, దైత్యులను దహింపగోరిన వాడును, మేరుపర్వతమయిన ధనస్సుచేతగలవాడును, దేవసమూహము అను రథమును ఆరోహించినవాడు అగు పురహరుడైన రుద్రుని ధ్యానించుచున్నాను.
దేవత: రుద్రుడు
ఋషి: గౌతముడు / గోధూముడు
5) చంద్రార్థమౌళిం కాలారిం వ్యాళయజోపవీతినమ్,
జ్వలత్పావకసంకాశం ధ్యాయేద్దేవం త్రిలోచనమ్.
చంద్రకళ శిరస్సునందుకలవాడును, యముని జయించినవాడును, సర్పము యజ్ఞోపవీతముగా కలవాడును, జ్వలించుచున్న అగ్నివంటివాడును, మూడుకన్నులు కలవాడును, అగు దేవుని ధ్యానించుచున్నాను.
దేవత: శంభువు
ఋషి: కణ్వుడు
6) మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమానవపుషం శుచస్మితమ్,
చండదీధితి మఖణ్డవిగ్రహం చిన్తయేన్మునిసహస్ర సేవితమ్.
మండలములోపలనున్నవాడును, స్వర్ణమయంబగు రూపముగలవాడును, ప్రకాశించుచున్న దేహముగలవాడును, స్వచ్ఛమయిన చిఱునగవుకలవాడును, సర్వవ్యాపకమయిన ఆకారముకలవాడును,ఋషి సహస్రములచే సేవింపబడినవాడు అగు సూర్యుని ధ్యానించుచున్నాను.
దేవత: ఆదిత్యమూర్తి అగు రుద్రుడు
ఋషి: కాలుడు / మరుత్వంతుడు
7) శరచ్చంద్రప్రకాశేన వపుషా శీతలద్యుతిమ్,
ధ్యాయేత్సింహాసనాసీనముమయా సహితం శివమ్.
శరత్కాలమునందలి చంద్రునివంటి కాంతిగల దేహముతో గూడినవాడును, చల్లనికాంతిగలవాడును, సింహాసనమున గూర్చుండినవాడును, ఉమతో గూడిన శివుని ధ్యానించుచున్నాను.
దేవత: శంభువు
ఋషి: శంభువు
8) ఉద్యద్భాస్కరకోటి ప్రకాశదీప్తదహనమూర్థనమ్,
బీషణభుజంగభూషం ధ్యాయేద్వివిధాయుధం రుద్రమ్.
ఉదయించుచున్న కోటిసూర్యులవలే ప్రకాశముకలవాడును, మండుచున్న అగ్నివంటి శిరస్సు కలవాడును, భయంకరములైన సర్పములు ఆభరణములుగా గలవాడును, నానా విధములగు ఆయుధములుగలవాడు అగు రుద్రుని ధ్యానించుచున్నాను.
దేవత: రుద్రుడు
ఋషి: నారదడు
9) రుద్రం సురనియన్తారం శూలఖట్వాంగధారిణమ్
జ్వాలామాలావృతం ధ్యాయేద్భక్తానామభయప్రదమ్.
దేవతలకు నియామకుండును, శూలము ఖట్వాంగమును ధరించినవాడును, జ్వాలాజాలముచే జుట్టబడినవాడును, భక్తులకభయమొసంగువాడును అగు రుద్రుని ధ్యానించుచున్నాను.
10) ప్రణమదమరలోకమౌళి మాలాకుసుమ రజో2రుణపాదపద్మయుగ్మమ్,
అనవరతమనుస్మరేద్భవాన్యా సహజగతాం పితరం పినాకపాణిమ్.
నమస్కరించుచున్న దేవతలసమూహముయొక్క శిరస్సులందలి పూదండలపూవుల పరాగముచే గొంచెం ఎఱ్ఱనైన కమలములవంటి పాదములజంటకలవాడును, లోకములకు తండ్రియును, పినాకమను ధనస్సుచేత కలవాడును, భవానితో కూడినవాడుఅగు రుద్రుని, నిరంతరము మనస్సులో స్మరించుచున్నాను.
దేవత: భగవంతుడు
ఋషి: భగవంతుడు
11) ముక్తాలంకృతసర్వాంగమిన్దుగంగాధరం హరమ్,
ధ్యాయేత్కల్పతరోన్మూలే సమాసీనం సహోమయా.
ముత్యములచే అలంకరింపబడిన సర్వావయములనుకలవాడు, చంద్రుని గంగను ధరించినవాడును, ఉమతోకూడ కల్పవృక్షము క్రింద కూర్చుండినవాడును అగు హరుని ధ్యానించుచున్నాను.
దేవత: రుద్రుడు
ఋషి: మండూకుడు
12) రూపయౌవనసంపన్నా మూర్తేవ వనదేవతా
పుష్పితాశోకపున్నాగ సహకారశిశూపమః ||
పంచవింశతి నక్షత్రో మయూరకృతశేఖరః
అకలజ్ఞ్కశరచ్చంద్రపూర్ణబింబసమాననః ||
ప్రాన్తే బద్ధకపర్దాన్తో వసానశ్చర్మ కోమలమ్
సవ్యాపసవ్య విధృతకృతమాల విభూషితః ||
ధారాకదంబపుంజేన నాభిదేశప్రలంబినా
అజజ్ఞ్ఘప్రేక్షణీయేన ప్రేక్షణీయో2పి శత్రుభిః ||
భార్యాస్య చారుసర్వాంగీ వన్యాలంకారభూషితా
ఆదర్శ మూర్తిశ్శోభానాం వన్యానామివ నిర్మలా ||
తస్యా హస్తే ధనుర్దత్వా శరమేకం చ నిర్మలమ్
ద్వితీయమంసమాలామ్బ్యశిష్టం వామేన బాహునా ||
సుగన్ధి పుష్పస్తబకమాఘ్రాయాఘ్రాయ పాణినా
వీజ్యమానో మన్దమన్దం నవపల్లవశాఖయా ||
సమావృతో బాలకైశ్చ శ్వభిశ్చాపి మనోహరైః
గచ్చద్బిరగ్రతో దృప్తైర్ధ్యాతవ్యో జగతాం గురుః ||
ఏవంభూతో మహాతేజాః కిరాతవపురీశ్వరః
ఆకారము వహించిన రూపయౌవన సంపన్నమగు వనదేవతయో అనదగినవాడును, పుష్పితములగు అశోకపున్నాగసహకారముల గున్నలవలే నున్నవాడును, ఇరువదిఏండ్లవయస్సుకలవాడును, నెమలిపింఛం శిరము నందు దాల్చినవాడును, కలంకములేని శరత్కాలచంద్రుని నిండుబింబము పోలు బింబము గలవాడు, ఒకపక్కకు ముడవబడిన జటాజూటము కలవాడును, కోమలమగు వ్యాఘ్రచర్మము ధరించినవాడును, సవ్యముగా అపసవ్యముగా ఱేలపూదండలు దాల్చినవాడును, నాభిప్రదేశము మొదలు పిక్కలవరకు వేలాడునట్టి కడిమిపూలదండలచే శత్రువులకు ఆనందకరము అగు సౌందర్యము కలవాడును, తనవలే వన్యాలంకారములచే అలంకృతమయి నిర్మలయయి అడవియందలిశోభకు దర్పణమో అనదగి ఒప్పుచున్న సర్వాంగసుందరియగు దేవిహస్తమున ధనస్సును నిర్మలమగు ఒక బాణము ఒసగి ఆమె రెండవ మూపును తన వామబాహువుచే అవలంబించి రెండవచేత సుగంధియగు పూగుత్తిని పలుమాఱు మూఱ్కొనుచు క్రొంజిగురు రెమ్మచే వీవబడుచున్నవాడును, తనముందు గర్వించి నడుచుచున్న పిల్లవాండ్రచేత మనోహరమగు కుక్కలచేతను పరివేష్టితుడును, ఇట్టి ఆకారము దాల్చిన కిరాతవేషుడగు లోకగురువు ఈశ్వరుని ధ్యానించుచున్నాను.
దేవత: మహాదేవుడు
ఋషి: మహాదేవుడు
13) భస్మోద్భాసితసర్వాంగం జటామండలమండితమ్
ధ్యాయేత్త్ర్యక్షం వృషారూఢం గణేశ్వరయుతం హరమ్
విభూతిచే ప్రకాశించునట్టి యెల్లావయవములు గలవాడును, జటాసమూహముచే అలంకరింపబడినవాడును, మూడుకన్నులు కలవాడును, గణనాథునితో కూడిన వాడును, వృషభమును ఆరోహించినవాడు అగు హరుని ధ్యానించుచున్నాను.
14) గౌరీకరామ్బుజన్యస్తస్వర్ణశైలశరాసనమ్
ఇషుహస్తం రథారూఢం నరనారీతనుం స్మరేత్
గౌరీహస్తమున మేరుధనస్సు పట్టినవాడును, స్వహస్తమున బాణము దాల్చిన వాడును, రథారూఢుండు అగు అర్థనారీశ్వరుని ధ్యానించుచున్నాను.
దేవత: భగవంతుడగు శంభువు
ఋషి: భగవంతుడగు శంభువు
15) జటాభిర్లమ్బమానాభిర్నృత్యన్తమభయప్రదమ్
దేవం శుచిస్మితం ధ్యాయేద్వ్యాఘ్రచర్మపరిష్కృతమ్
వేలాడుచున్న జడలతో గూడినవాడై నృత్యముచేయుచున్నవాడును, అభయము ఇచ్చువాడును, స్వచ్చమైన చిరునగువు కలవాడును, వ్యాఘ్రాజినముచే అలంకరింపబడినవాడు అగు దేవుని ధ్యానించుచున్నాను.
దేవత: శ్రీరుద్రుడు
ఋషి: హేమకోశుడు
16) పినాకపాణిం భూతేశ మద్యత్సూర్యాయుతద్యుతిమ్
భూషితం భుజగైర్ధ్యాయేత్కణ్ఠేకాలం కపర్థినమ్
పినాకమను ధనస్సు హస్తమున గలవాడు, ఉదయించుచున్న పదివేల సూర్యులకుంబోలె తేజస్సు గలవాడును, సర్పములచే అలంకృతుడును, కంఠమున నీలవర్ణుడును, జటాజూటము గలవాడును, అగు భూతేశుడిని ధ్యానించుచున్నాను.
దేవత: భగవంతుడు
ఋషి: భగవంతుడు
17) విశ్వతః పాణిపాదాబ్జం విశ్వతోక్షి శిరోముఖమ్
జ్వలన్తం విశ్వమావృత్య తేజోరాశిం శివం స్మరేత్.
అంతటను హస్తములను పాదములను గలవాడును, అంతటను కన్నులను శిరస్సులను ముఖములను గలవాడును, సమస్తము నావరించి జ్వలించుచున్నవాడు అగు తేజోరాశిస్వరూపుడయిన శివుని ధ్యానించుచున్నాను.
దేవత: భగవంతుడగు శంభువు
ఋషి: భగవంతుడగు శంభువు
18) ఆగుల్బాసిత కఞ్చకో డమరుకాశ్లిష్టో లసత్కున్తలీ
శూలీ కుణ్డలిత శ్రవాస్సతిలకో మన్దక్వణన్నూపురః
శ్రీ మన్నిర్మల దన్తపజ్ఞ్తికిరణ శ్వేతాయమానాననో
దేవో భైరవభూషితవపుర్ధ్యేయో మృడానీపతిః
చీలమండలవరకు జీరాడునట్టి నల్ల చొక్కాయ గలవాడును, డమరువుతో కూడినవాడును, ప్రకాశించుచున్న వెండ్రుకలు కలవాడును, శూలము ధరించినవాడును, పోగులతో కూడిన చెవులు కలవాడునూ, నొసటబొట్టు ధరించినవాడును, తిన్నగా మోయుచున్న అందెలు కలవాడునూ, అధికమయిన కాంతికల స్వచ్ఛమయిన దంతపంక్తి కిరణములచే తెల్లనైనట్లున్న ముఖము కలవాడునూ భైరవ వేషముచే అలంకరింపబడిన దేహము గలవాడు అగు మృడానీపతి అయిన దేవుని ధ్యానించుచున్నాను.
దేవత: రుద్రుడు
ఋషి: పులహుడు
19) ద్రుతచామీకరప్రఖ్యం శక్తిపాణిం షడాననమ్
మయూరవాహనారూఢం స్కందరూపం శివం స్మరేత్.
కరిగిన బంగారువంటి మేనుగలవాడును శక్తియను ఆయుధము హస్తమునందు కలవాడును ఆరుమోములు కలవాడును, నెమలి వాహనము ఆరోహించినవాడును అగు స్కందుని రూపముకల శివుని మరించుచున్నాను.
దేవత: స్కందుడు
ఋషి: స్కందుడు
20) దివ్యసింహాసనాసీనం స్తూయమానం మహర్షిభిః
ప్రసన్నవదనం ధ్యాయేత్సోమం సోమార్థధారిణమ్
దివ్యసింహాసనంబున కూర్చుండినవాడును, మహర్షులచే స్తుతింపబడినవాడును, ప్రసన్నమయిన మోముకలవాడును,ఉమతో కూడి చంద్రకల ధరించినవాడు అగు శివుని ధ్యానించుచున్నాను.
దేవత: రుద్రుడు
ఋషి: మాండవ్యుడు
21) బాలేన్దుమకుటం దేవం తరుణాదిత్యవిగ్రహమ్
ధ్యాయేన్నన్దీశ్వరాకారం గణేశ్వరసమావృతమ్
బాలచంద్రుని కిరీటము నందు ధరించినవాడు, బాలసూర్యుని వంటి ఆకారము కలవాడు, ప్రమధగణనాథులచే పరివేష్టింపబడినవాడును, నందీశ్వరుని రూపము కలవాడు అగు రుద్రుని ధ్యానించుచున్నాను.
దేవత: నందీశ్వరరూపుడగు రుద్రుడు
ఋషి: దేవరాతుడు
22) దధానమేకాదశధా విభక్తం దేహం విశుద్ధస్ఫటికప్రకాశమ్
తేజోనిధిం శూలినమిన్దుమౌళిం విచిన్తయేత్తత్ర సదైవ రుద్రమ్
పదకొండు రూపములుగా విభక్తమయిన దేహము దాల్చినవాడును, స్వచ్ఛమయిన స్ఫటికమువలే వెలుంగువాడును, తేజస్సుల గనిఅయిన వాడును, శూలాయుధము దాల్చినవాడును, చంద్రుని శిరస్సున ధరించినవాడు అగు రుద్ర దేవునిని ఎల్లప్పుడు ధ్యానించుచున్నాను.
దేవత: భగవంతుడు
ఋషి: భగవంతుడు
23) కుర్వాణం సన్నిధౌ దేవ్యా దేవమానన్దతాండవమ్
హుతాశనధరం ధ్యాయేత్తప్తకాంచనసన్నిభమ్
దేవి ఎదుట ఆనందతాందవము చేయుచున్నవాడును, అగ్నిని ధరించినవాడును, ఉత్తమమయిన బంగారంతో సమానుడైనవాడుఅగు రుద్రుని ధ్యానించుచున్నాను.
దేవత: శంభువు
ఋషి: అత్రి
24) ఉద్యద్భాస్కరకోటి ప్రకాశమాదీప్తదహనమూర్థానమ్
అంబరనిలయం భీమం ధ్యాయేదభయం శివం సురౌఘనుతమ్
ఉదయించుచున్న కోటి సూర్యులకాంతి కలవాడును, మండుచున్న అగ్నివంటి వెండ్రుకలు కలవాడును, ఆకాశముననుండువాడును, శత్రువులకు భయంకరుడును, భక్తులకు అభయము ఒసంగువాడును, దేవసమూహములచే పొగడబడినవాడు అగు శివుని ధ్యానించుచున్నాను.
దేవత: రుద్రుడు
ఋషి: వైయాఘ్రుడు
25) గజచర్మావృతతనుం స్ఫురత్ప్రహరణోజ్జ్వలమ్
సర్వపాపహరం ధ్యాయేద్దేవం కుజ్ఞరభేదినమ్
ఏనుగు చర్మముచే కప్పబడిన దేహముకలవాడును, ప్రకాశించుచున్న ఆయుధములచే ఒప్పుచున్న వాడును, సమస్తపాపములను హరించువాడును గజాసురుని వధించినవాడునగు దేవుని ధ్యానించుచున్నాను.
దేవత: భగవంతుడు
ఋషి: భగవంతుడు
26) మంగలాయుతనం దేవ యువానమతిసున్దరమ్
ధ్యాయేద్వనచరాకారమాగచ్చన్తం పినాకిమ్
మంగళములకు జోటయినవాడును, యౌవనముకలవాడును, మిక్కిలి చక్కనివాడును, పినాకధనస్సు దాల్చినవాడై అభిముఖముగా వచ్చుచున్న వాడును కిరాతుని ఆకారము కలవాడును అగు దేవుని ధ్యానించుచున్నాను.
దేవత: శంభువు
ఋషి: వైరాజుడు
27) ప్రసన్నవదనం సౌమ్యం రచితోద్వాహమణ్డనమ్
అమ్బయా సహితం ధ్యాయెత్సురసఞ్ఘైరభిష్టుతమ్
ప్రసన్నముఖము కలవాడును, శాంతుడును, వివాహాలంకారము కలవాడును, పార్వతితో కూడినవాడును, దేవసమూహముచే పొగడబడినవాడునగు రుద్రుని ధ్యానించుచున్నాను.
దేవత: శంభువు
ఋషి: పులహుడు
28) సర్వపాపహరం దేవం సర్వాభరణభూషితమ్
సర్వాయుధధరం ధ్యాయెత్సర్వలోకమహేశ్వరమ్
ఎల్లపాపములను హరించువాడును, సమస్తభూషణములచే అలంకరింపబడినవాడును, సమస్తాయుధములను ధరించినవాడును, సమస్తలోకంబులకు మహేశ్వరుడు అగు దేవుని ధ్యానించుచున్నాను.
దేవత: రుద్రుడు
ఋషి: నారదడు లేక కణ్వుడు
29) దంష్ట్రాకరాళవదనం జ్వలజ్జ్వలనమూర్థజమ్
బిభ్రాణం త్రిశిఖం దీపం ధ్యాయేద్భుజగభూషణమ్
కోఱలచే భయంకరమయిన ముఖముకలవాడును, మండుచున్న నిప్పు వంటి వెండ్రుకలు కలవాడును, మూడుజ్వాలలు గల దీపమును ధరించువాడును, సర్పములు అలంకారముగా కలవాడు అగు రుద్రుని ధ్యానించుచున్నాను.
దేవత: రుద్రుడు
ఋషి: దూర్వాసుడు
30) వృషాధిరూఢం దేవేశం సర్వలోకైకకారణమ్
ధ్యాయేద్బ్రహ్మాదిభిస్త్సుత్యం పార్వతీ సహితం శివమ్
వృషభము ఆరోహించినవాడును, దేవతలకు నియామకుండును, సమస్తలోకములకు మూలకారణమయినవాడును, బ్రహ్మ మొదలగువారలచే పొగడదగినవాడును, పార్వతితో కూడిన శివుని ధ్యానించుచున్నాను.
దేవత: రుద్రుడు
ఋషి: దేవలుడు