భక్తి మార్గాలు ఎన్ని ? అవి ఏవి ?.
జ : భక్తి ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు, కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించినది. అదేవిధంగా శైవులకు శివుడు, శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించినది. భక్తి యోగం గురించి భగవద్గీత లో వేదాంతాల సారంగా పేర్కొన్నది. నారద భక్తి సూత్రాలు పలురకాల భక్తి విధాల గురించి పేర్కొన్నది.
భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉన్నది. భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.
- శ్రవణం: భగవంతుని గూర్చిన గాధలు, భజనలు, కీర్తనలు వినుట - (హరికథ శ్రోతలు),ధర్మరాజు, జనమేజయుడు, శౌనకాది మునులు.
- కీర్తనం: భగవంతుని గుణగణములను కీర్తించుట- రామదాసు,అన్నమయ్య,త్యాగరాజు,తులసీదాసు,మీరాబాయి - మరెందరో భక్త గాయకులు.
- స్మరణం: భగవంతుని స్మరించుట - నిత్యం ధ్యానం చేసే కోట్లాది భక్తులు.
- పాదసేవ: దేవుని పాదముల పూజ సేయుట.
- అర్చనం: గుడిలోగాని, ఇంటిలోగాని,హృదయములో గాని విధివిధానములతో అర్చించుట.
- వందనం: ప్రణామం చేయుట.
- దాస్యం: భగవంతునకు దాసుడగుట - హనుమంతుడు, రామదాసు.
- సఖ్యం: అర్జునుడు.
- ఆత్మనివేదనం: తనను పూర్తిగా దేవునకు సమర్పించుకొనుట - గోదాదేవి, మీరాబాయి.