*108 వైష్ణవ దివ్య క్షేత్రాలు 14 తిరుక్కూడాల్*
🍂ఈ సన్నిధి మధురై పట్టణం నడిబొడ్డున ఉన్నది. మీనాక్షి అమ్మవారి ఆలయం నుంచి 1 కి.మీ. పెద్ద ఆలయం. స్వామి కూడల్ అళగర్. అమ్మవారు మధురవల్లి. ఈ ఆలయం విమానం నీడ నేలమీద పడదు.
🍂తిరుపల్లాండు: పెరియాళ్వార్ విరచిత 12 పాశురముల తిరుపల్లాండు నాలాయిర దివ్య ప్రభంధములో ఒక భాగం. నాలాయిర దివ్య ప్రభంధములో తిరుపల్లాండుకు చాలా విశిష్టమైన స్థానం ఉన్నది. తిరుప్పల్లాండు అంతటి ప్రబంధం మరి ఒకటి లేదు అని పెద్దలు అంటారు. ప్రతి విష్ణు ఆలయంలో ఆరాధన సమయంలో తిరుపల్లాండు లోని మొదటి రెండు పాశురములను రెండు సార్లు సేవిస్తారు (పఠిస్తారు).
🍂వల్లభదేవుడు అను పాండ్య రాజుకు పరమపదానికి మార్గం చూపించే శక్తి ఉన్న దేవుడిని గురించి తెలుసుకోవాలనిపించింది. ఒక బంగారు చిలుకను రాజాస్థానములో పై కప్పుకు వేలాడదీస్తారు. తన ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పినప్పుడు ఆ చిలుక దానంతట అదే కింద పడుతుందని రాజు ప్రకటిస్తాడు. చాలా మంది వచ్చి విజయం సాధించకుండా తిరిగి వెళతారు. కూడల్ అళగర్ పెరుమాళ్ళు వల్లభదేవుడి పురోహితుడైన సెల్వనంబి కలలో కనపడి శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన విష్ణుచిత్తుల (పెరియాళ్వార్) వారి పేరు సూచిస్తాడు. రాజుగారి మంత్రులు పెరియాళ్వార్ ను మధురైలోని పాండ్య రాజు ఆస్థానానికి తీసుకుని వస్తారు.
🍂వేద గ్రంథాల నుండి మరియు చారిత్రక సూచనల నుండి అనేక ఉదాహరణలతో పెరియాళ్వార్ పాండ్య రాజుకు మహా విష్ణువు పరమపదానికి తీసుకెళ్లగలడు అని నిరూపిస్తారు. అప్పుడు సభలో ఉన్నవారికందరికి ఆశ్చర్యం కలిగించేటట్లు బంగారు చిలుక క్రింద పడిపోతుంది. సంతోషించిన రాజు పెరియాళ్వార్ ను ప్రశంసించి వారిని మధురైలో ఏనుగుపై ఊరేగిస్తాడు. ఆ ఊరేగింపు చూడటానికి కూడల్ అళగర్ పెరుమాళ్ళు స్వయంగా తను గరుడ వాహనంలో వస్తాడు. స్వామిని చుసిన ఆనందంలో పెరియాళ్వార్ 12 పాశురముల తిరుప్పల్లాండుతో స్వామికి మంగళాశాసనం చేస్తారు. ఆయన అప్పుడు 473 పాశురములు సాయిస్తారు (పాడుతారు). తిరుప్పల్లాండు అందులో భాగమే. నాలాయిర దివ్యప్రభంధం ఈ పాశురములతోనే మొదలవుతుంది.
🍂ఆలయ ప్రాకారంలో 108 దివ్యదేశాల చిత్రపటాలు, రామాయణ, మహాభారతానికి చెందిన శిల్పాలు మనం చూడొచ్చు.
🍂సామాన్యంగా విష్ణు ఆలయములలో నవగ్రహాలు ఉండవు. ఈ ఆలయంలో నవగ్రహములు ప్రతిష్టింపబడినవి.
🍂ఈ స్వామి నాలుగు యుగాలుగా-- కృత, త్రేతా, ద్వాపర, కలియుగములు--భక్తులనుంచి పూజలందుకొంటున్నాడు.