సూర్యుడివరం ఫలవంతమయ్యే సూచనగా - అచిరకాలంలో అదితి గర్భవతి అయ్యింది. వెలుగు వేలుపుని తనలో నిక్షిప్తం చేసుకున్న ఆమె శరీరం ప్రతిఫలించే చల్లటి కాంతితో మెరిసి పోసాగింది. ఉషోదయకాంతి ఏదో ఆమె ముఖం మీద నర్తనం చేయసాగింది.
గర్భభారం అదితి కదలికల్ని అదుపు చేసింది. కశ్యపుడు ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. గర్భభారంతో అలసిపోతూ , భర్త సేవలు చేస్తూనే వున్న తమ అక్క. అదితిని వినత , కద్రువ వారించారు.
*"నువ్వు విశ్రాంతి తీసుకో అక్కా ! పతిదేవుడి సేవలు మేం చేస్తాం !"* అంది వినత. *"ఆయనకు ఏలోటూ రాకుండా చూసుకుంటాంలే, అక్కా !"* అంది కద్రువ.
కశ్యపుడి బలవంతంతో అదితి అందుకు అంగీకరించింది. *"సూర్యభగవానుడిని గర్భంలో మోస్తూ నువ్వు నాకు సేవ చేయడం భావ్యం కాదు !"* అన్నాడు అదితితో కశ్యపుడు.
అదితికి విశ్రాంతి యిచ్చిన వినత , కద్రువ ప్రేమానురాగాలతో , వినయ విధేయతలతో కశ్యప ప్రజాపతికి సర్వ సపర్యలూ చేస్తున్నారు.
విసుగూ , విరామం లేకుండా తన సేవలో నిమగ్నమైన చిన్నభార్యల ప్రవర్తన కశ్యపుడికి మహదానందం కలిగిస్తోంది.
ఒకనాటి రాత్రి నిద్రకు ఉపక్రమించిన కశ్యప ప్రజాపతికి పాద సంవాహనం. చేస్తూ కూర్చున్నారు వినత , కద్రువ. కశ్యపుడు హాయిగా ఆదమరచి నిద్రపోయాడు. వేకువజామున మెలకువ వచ్చి , కళ్ళు తెరిచి చూసిన కశ్యపుడు ఆశ్యర్యపోయాడు. వినత , కద్రువ యింకా ఆయన పాదాలు నొక్కుతూ కూర్చునే వున్నారు !
*“వినతా ! ఏమిటిది ? నిద్ర పోకుండా రాత్రంతా యిలా పాద సంవాహనం చేస్తూనే వున్నారా ?!"* అన్నాడు కశ్యపుడు.
*"పతి పద సేవ సతి విధి కదా , నాథా !"* అంది కద్రువ. *“మాకు నిజమైన విశ్రాంతి లభించేది మీ సేవలోనే !"* అంది వినత.
ఆ ఇరువురి భక్తిశ్రద్ధలూ కశ్యపుడిని ఎంతగానో అలరించాయి. ప్రేమాను రాగాలతో యిద్దర్నీ చూశాడు. *"మీ శ్రద్ధా భక్తులు , మీ సేవాపరతా నన్ను అలరిస్తున్నాయి !* చెరొక వరం కోరుకోండి ! మీరు కోరిన వరాలు యిచ్చి , నేను ఆనందిస్తాను !"* అన్నాడు.
*"కద్రువా ! మన అదృష్టం పండింది ! ముందుగా నువ్వు కోరుకో !"* అంది వినత. *“నాకు... మెరిసిపోయే పొడుగాటి శరీరాలతో , ఒకే రూపంతో వుండి అందంగా ప్రాకే వేయిమంది నాగ కుమారుల్ని ప్రసాదించండి !"* అంది కద్రువ.
కద్రువ కోరిక కశ్యపుణ్ని ఆశ్చర్యంలో ముంచివేసింది. *“నేల మీద ప్రాకే నాగ కుమారుల్నా ? నీ కోరిక విచిత్రంగా , ఆందోళన కలిగించేదిగా వుంది , కద్రువా ? మరేదైనా వరం కోరుకో !"* అన్నాడు కశ్యపుడు.
*"నాకు నాగకుమారులే కావాలి ! ఇస్తే వాళ్ళనే ఇవ్వండి !”* కద్రువ మొండిగా అంది.
*"సరే. అలాగే , నీ ఇష్టం !"* కశ్యపుడు నిరుత్సాహంగా అన్నాడు. *“నువ్వు కోరుకో వినతా ! నీకేం కావాలో ?"* అన్నాడు వినత వైపు చూస్తూ.
*"రూపంలో , తేజస్సులో , శక్తిలో కద్రువ పుత్రుల్ని మించినవారూ , పరాక్రమంలో అద్వితీయులూ అయిన ఇద్దరు పుత్రుల్ని ప్రసాదించండి !"* అంది వినత.
కశ్యపుడు ఆమె కోరికను మన్నిస్తూ *“తథాస్తు”* అన్నాడు. కద్రువ కోరికతో ఆందోళన చెందిన కశ్యప ప్రజాపతి బ్రహ్మదేవుడి సన్నిధికి వెళ్ళాడు. కద్రువ కోరిన విపరీత వరం గురించి వివరించి , తన భయాన్ని వ్యక్తం చేశాడు. ఇదమిత్థంగా తెలియక పోయినా ఎందుకో ఆందోళనగా వుందన్నాడు.
కశ్యపుడికి ధైర్యం చెప్తూ , బ్రహ్మ ఇలా అన్నాడు: *"కశ్యపా ! ఆందోళన అవసరం లేదు. నీ పత్నుల ద్వారా సరీసృపాలూ , పక్షిజాతులూ , గోవులూ , మృగాలు మొదలైన జీవుల ఉత్పత్తి జరగాలన్నది పరమాత్మ సంకల్పం. అందుకే నీకు పదముగ్గురు పత్నులు లభించారు ! దేవతలూ , దానవులూ , దేవ గంధర్వులూ మొదలైన వారితో బాటు ఇతర జీవులకూ నీవు తండ్రి వవుతావు !"*
కశ్యపుడు ఆశ్చర్యపోతూ విన్నాడు. బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు. *"పుత్రా ! నాకు తెలుసు. నాగ కుమారులు నీకు అధికమైన ఆందోళన కలిగిస్తున్నారు. నీ ఆందోళన సహేతుకమే. నాగకుమారులు విషజీవులు. వాటి విషంతో ఇతర ప్రాణులకు అపాయం జరుగుతుంది. కద్రువకు జన్మించబోయే నాగసంతతి విషం ప్రాణాంతకం. దానికి విరుగుడుగా నేను నీకు 'విషహర' మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్ర ప్రభావంతో నువ్వు సర్పవిషాన్ని హరిస్తూ , ప్రాణిరక్షణ చేయగలవు. నిర్భయంగా వెళ్ళిరా ! సకాలంలో నీకు విషహర యోగం లభిస్తుంది !"*
కశ్యపుడు బ్రహ్మకు నమస్కరించి , సెలవు తీసుకున్నాడు.
అదితికి క్రమంగా నెలలు నిండాయి. ఉదయించబోయే సూర్యుణ్ణి తనలో దాచుకున్న పూర్వదిశా సుందరిలాగా నిండుగా వుందామె. ఒక శుభకరమైన వేకువవేళ అదితికి ప్రసవ వేదన ప్రారంభమైంది. ఓర్చుకోగలిగిన , మధురమైన వేదన అది. కశ్యప ప్రజాపతి నదిలో స్నానం చేసి , తూర్పుదిక్కుకు తిరిగి ధ్యానంలో నిమగ్నుడై వున్నాడు.
ఆశ్రమంలో అదితి పురిటి నొప్పులు పడుతూనే వుంది.
తూర్పుదిక్కున ఎర్రటి సూర్యబింబం ఉదయించింది. అదేక్షణంలో ఆశ్రమంలో అదితికి బాలుడు జన్మించాడు. శిశువు ఉదయించగానే , ఆశ్రమం అంతటా తెల్లటి స్వచ్ఛమైన కాంతి అలముకుని , అందర్నీ ఆశ్చర్య పరిచింది.🙏