🙏 *జయలక్ష్మీ వరలక్ష్మీ..*
జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి
ప్రియురాలవై హరికి బెరసితి వమ్మ
పాలజలనిధిలోని పసనైన మీగడ
మేలిమి తామెరలోని మించు వాసన
నీలవర్ణునురముపై నిండిన నిధానమవై
ఏలేవు లోకములు మమ్మేలవమ్మ
చందురుతోడ పుట్టిన సంపదల మెరగవో
కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో
అందిన గోవిందునికి అండనే తోడు నీడై
వుందానవు మా యింటనే వుండవమ్మా
పదియారు వన్నెలతో బంగారు పతిమ
చెదరని వేదముల చిగురు బోడి
ఎదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు
నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ
: *జయలక్ష్మి వరలక్ష్మీ..*
భావము :
- శ్రీ తాడేపల్లి పతంజలి గారు
అమ్మవారిని జయాలిచ్చే, వరాలిచ్చే లక్ష్మి గా కొలుస్తూ అన్నమాచార్యులవారు రచించిన కీర్తన ఇది.
అమ్మా! నువ్వు జయములిచ్చే లక్ష్మివి. వరములిచ్చే లక్ష్మివి. యుద్ధంలో వీరాన్ని చూపే లక్ష్మివి. అటువంటి నువ్వు మా వెంకటేశునికి ప్రియురాలవై, ఆయన వక్షస్థలంలో కలిసిపోయావు.
1. అమ్మా! నీ రూపంలో పాలసముద్రంలోని బాగైన ( పసనైన ) నిగనిగలాడే మీగడ కాంతి ఉంది. నీ శరీరంలో గొప్పదయిన ( మేలిమి ) తామరపువ్వులోని వాసన ఉంది. నల్లనైన మా వేంకటేశుని ( నీలవర్ణుని ) రొమ్ముపై దాచుకున్న నిక్షేపంలా ( నిధానము ) నిండిపోయి లోకాలన్నీ పరిపాలిస్తున్నావు. నీ బిడ్డలమైన మమ్ములను కూడా పాలించు తల్లీ!
2. పాలసముద్రంలో ఆ చంద్రునితో కలిసి పుట్టావు కనుక ఆ చంద్రకాంతి సంపద నీలో నిండి ఉందేమో! సమర్థులైన ( కందువ ) ఆ బ్రహ్మలను కాపాడే కల్పవృక్షపు తీగవు. నీకు ప్రేమతో అందిన ( పొందిన ) గోవిందునితో సమీపంలోనే తోడునీడగా ఉంటున్నావు. మా ఇంట్లోనే మమ్ములను అనుగ్రహిస్తూ ఉండిపోవమ్మా!
3. పదహారు కళలతో బంగారు బొమ్మలా ఉన్నావు. నీ శరీరము చిగురులా వణికిపోతుంటుంది. కానీ వేదాలు నీలో చెదరకుండా స్థిరంగా ఉంటాయి. వేంకటేశుని ఇల్లాలుగా ఎదుట ఉంటూ, నువ్వు మహాపద్మము మొదలైన తొమ్మిది నిధులలోను ఉంటావు. మేము నీ భక్తులము తల్లీ!🙏
తాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తన
గానం. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు
రాగము : లలిత
సంఖ్య : 250
సంపుటము : 19
రేకు : 989