🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸సిద్ధరాముడు కైలాసమునకు పోవుటఇలా వుండగా సొన్నలిపురంలో వున్న శివయోగి, సిద్ధరాముణ్ణి ఆయన భక్తులు ఒకనాడు ‘గురువర్యా! బసవడనేవాడు ఇక్కడ భూలోకంలోనూ అక్కడ కైలాసంలోనూ కూడా ఉన్నాడని వింటున్నాము అదెలా సాధ్యం’ అని ప్రశ్నించారు.
🌿అది విని సిద్ధరామయ్య ఆ సంగతి నేనిప్పుడు యోగ మార్గంలో కైలాసానికిపోయి విచారించి వస్తాను’ అని చెప్పి సిద్ధరామయ్య కైలాసం పోయాడు. అక్కడ ప్రమథ గణ పరివేష్టితుడైన పరమేశ్వరుణ్ణి చూచి సిద్ధరామయ్య శరణు చేసి స్తుతించి భక్తులు తన్ను అడిగిన సందేహాన్ని పరమేశ్వరుని అడిగాడు. అప్పుడు శివుడు నవ్వి ‘సిద్ధయా! బసవనికి ఈ లోకం ఆలోకం అని లేదు. అన్ని లోకాలలోనూ ఉంటాడు. ప్రమథలలో ఉంటాడు.
🌸సద్భక్తులలో ఉంటాడు. గురుచర లింగములలో ఉంటాడు.
అంతెందుకు ఇప్పుడిక్కడ నా హృదయంలో కూడా వున్నాడు చూడు’మని శివుడు తన హృదయం విప్పి చూపేసరికి అక్కడ పద్మాసనుడై బసవన్న పరమేశ్వరుని హృదయ పద్మంలో కూర్చొని వున్న దృశ్యం కన్పించింది. అది చూచి సిద్ధరామయ్య నివ్వెరపోయాడు.
🌿దేవతలూ ప్రమధులూ సాష్టాంగ నమస్కారాలు చేశారు. అప్పుడు శివుడు పార్వతితో ‘చూచావా! దేవీ! నా హృదయములో బసవణ్ణి! అంటే నేనే బసవణ్ణని అర్థం! శిలాదునికి నేనే వృషభేంద్ర రూపంలో నాడు పుట్టాను. నేడు భక్తహితార్థమై బసవడనే పేరుతో నేనే భూలోకంలో వున్నాను. నేను లోకాధిపతిని.
🌸బసవన్న లోకపావనుడు. కారణలోక సంహారిని నేను. కారణ లోకోపకారి బసవడు. నేను భక్తవత్సలుణ్ణి. భక్త రత్నములకు నిధి బసవన్న. భకె్తైకదేవుడను నేను. భక్తజనప్రాణి ఇతడు. నేను ముక్తికి రాజును. బసవన్న భక్తికి రాజు. నేను లింగపట్టబద్ధుణ్ణి.
🌿బసవన్న భక్తిపట్టబద్ధుడు. నేను అచరలింగాన్ని. అతడు చరలింగం. నా పరు శంభుడు. బసవని పేరు ద్వితీయ శంభుడు.నన్ను స్థిరభక్తితో కొలిస్తేనే కాని ముక్తి లేదు కాని ధరలో బసవణ్ణి తలిస్తేనే ముక్తి! భక్తులు నా కొరకు తమ ప్రాణ దేహార్థాలు ఇస్తూ వుంటారు. కాని బసవన్న భక్తుల కొరకు తన ప్రాణ దేహ అర్థాలు ఇస్తూ వుంటాడు.
🌸ఎవడు ‘బసవ’ అనే మూడక్షరాలు కల మంత్రం ఉచ్చరిస్తుంటాడో అతని ముఖమందే నేనూ ప్రమధగణమూ నిరంతరం చరిస్తూ వుంటాము’’ అని పరమేశ్వరుడు తన హృదయస్థుడైన బసవన్నను చూచి ‘బసవన్నా ఎలా వుంది భూలోకవాసం’ అని ప్రశ్నించాడు.
🌿ఏమని చెప్పను ప్రభూ!’ అన్నాడు బసవన్న. ‘భూమి మీద భక్తులెవరైనా ఉన్నారా?అని ప్రశ్నించాడు శివుడు. లేదు ప్రభూనేనొక్కణ్ణే భక్తుణ్ణి’ అన్నాడు బసవన్న.అదేమిటీ? భూమిపైనున్న శివశరణులు భక్తులు కారా?’ అనిప్రశ్నించాడుపరమేశ్వరుడు.
🌸కాదు ప్రభూ! వారు భక్తులు కారు. వారంతా సాక్షాత్తూ నీవే! ప్రతి శివశరణుని రూపంలోనూ నీవే నాకు కనపడుతున్నావు! అందుకని భూమి మొత్తం శివమయమై వుంది. ఆ సమస్త శివగణాన్నీ అర్చించవలసిన భక్తుణ్ణి నేనే’ అన్నాడు బసవన్న.అది విని సమస్త దేవతలూ హర్షధ్వానాలు చేశారు.
🌿సిద్ధరామయ్య యోగమార్గంలో తిరిగి భూలోకానికి వచ్చి కైలాసంలో తాను విన్న ఈ మాటలన్నీ భక్తుడు చెప్పాడు.3ఒకనాడు ఒక శివశరణుడు బసవన్న వద్దకు వచ్చి ‘బసవా! నాకు నీ సమస్త ధనం కావాలి’ అని అడిగాడు.
బసవన్న చిరునవ్వు నవ్వి ధనపు పెట్టెలను ఉన్నవి ఉన్నట్లు మొత్తం భక్తునికి స్వాధీనం చేశాడు.
🌸అది చూచి కొందరు బిజ్జలునికిది చెప్పారు. రాజు కోపించి బసవణ్ణి పిలిపించి ‘బసవా! ఏమిటీ పని? ప్రభుత్వ ధనం జాగ్రత్త పరుస్తావని నీకు ప్రధానమంత్రిత్వం ఇస్తే దానినంతా దుర్వినియోగం చేశావా? చాలు చాలు మా డబ్బంతా మాకు లెక్క జూపు’ అని గద్దించాడు.అప్పుడు బసవన్న రాజుతో ‘ప్రభూ! నాకు నీ ధనాగారంలోని డబ్బుతో పనిలేదయ్యా! శివభక్తి నాకు కల్పతరువు.
🌿గురుభక్తి నాకు కాంచన పర్వతం. శివభక్తి నాకు చింతామణి. గురుభక్తి నాకు కామధేనువు. భక్తుడు పరధనానికి ఆశడతాడా? సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా? పాల సముద్రంలో తిరిగే రాజహంస గోతులలో నీళ్లు తాగుతుందా? మామిడి రసాలు కొరికే చిలుక బూరుగుపండ్లను తింటుందా? వెనె్నల తినే చకోరం చీకటిని ఆశిస్తుందా!
🌸పద్మపరీమళాలలో విహరించే మధుపం బొబ్బిలి పూలను తాకుతుందా? రాజా! దిగ్గజపు కొదుమ పంది పోయే బాటలో పోదు. ధనంతో నాకు పనిలేనే లేదు. భక్తుల ధనమే నా ధనం. నేను భక్తులకిచ్చింది వారి ధనమే! వారి సొమ్ము తిరిగి వారికే చెందింది. కావాలంటే మీరు ధనాగారంలోని మూటలు విప్పి లెక్కలు చూచుకోండి’ అన్నాడు.
🌿మరుక్షణమే ధనాగారపు తాళాలు తీసి ధనాన్ని బిజ్జలుని ముందు పెట్టి లెక్క బెట్టేసరికి అందులో ఉండవలసిన దానికన్నా ఎన్నో రెట్లు అధికంగా ధనం వుంది. అది చూచి బిజ్జలుడు నిర్ఘాంతపోయాడు! లెక్కబెట్టేవారికి ఎంత తీసినా తరగని మాడలను లెక్కించడం కష్టమైపోయింది...సశేషం...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿