🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌷దీపకదళియారు కధ
🌸భక్తి అనేక విధాలని పురాణ కధలు చదువుతూంటే తెలుస్తుంది. కొందరయితే తమ తనువూ, మనస్సూ తాము నమ్మిన దైవానికే సమర్పించి తమ ధ్యాస కూడా లేకుండా ఆ భగవంతుణ్ణీ కొలిచి పునీతులవుతారు.
🌿మనం బసవ పురాణం ద్వారా అలాంటి భక్తుల కధలు తెలుసు కుంటున్నాము. ఇప్పుడుకూడా దైవం గురించి తప్ప తన గురించి ఆలోచించని ఒక అమాయక భక్తుడు .
🌸పేరు దీపకదళియారు ఆయన కధ చెప్పుకుందాము.కంబ అనే పట్టణంలో దీపకదళియారు అనే ఒక శివ భక్తుడు వుండేవాడు. అతడొకసారి వేరే పనిమీద ఇంకొక గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది.
🌿దోవ మధ్యలో ఒక అడవి, దానిలో ఒక పాడుబడ్డ శివాలయాన్నిచూశాడు. అది చూసి ఆయన ఆలోచనలు పరిపరి విధాల పోయాయి. ఇదేమి వింత!శివుడీ అరణ్యం మధ్యలో వున్నాడు.
🌸శత్రువుల వల్ల ఇతనికేమి అపాయం వస్తుందో అసలే ఎప్పుడూ త్రిపురాసురులు వగైరా పెద్ద పెద్ద రాక్షసులతోనే శత్రుత్వమేర్పరచుకొని వాళ్ళని చంపేస్తూ వుంటాడు.
🌿ఈయనకేమో దయాళువు అని పెద్ద పేరు. మరి ఇలాంటి రాక్షసులని చంపి వాళ్ళ వాళ్ళతో విరోధం తెచ్చుకోవటం ఎందుకు? రాక్షసులు బలవంతులు.
🌸వారితో విరోధము మంచిది కాదు. అట్టి విరోధధులు కల ఇతడు కారు చీకట్లు కమ్మే ఇలాంటి దట్టమైన అడవిలో ఎవరి సహాయమూ లేకుండా ఒక్కడూ వుండవచ్చునా? పైగా ఈ గుడి కూడా శిధిలమైంది.
🌿గోడలు గట్టిగా లేవు.తలుపులు ద్వార బంధములు లేవు.చుట్టూ ప్రాకారము కూడా లేదు.పార్వతీ దేవి వుండే చోటు కూడా లేదు.
🌸ఇలాంటి పాడుబడిన గుడిలో ఏ పూజా పునస్కారం లేకుండా ఇట్లా వుండే అవసరం ఈయనకేం వచ్చింది’ అనుకున్నాడు.
🌿కొంచెం ఆలోచించి సరే, ఇక్కడ ఒక పెద్ద గోపురముతోను, చుట్టు ప్రాకారము తోను, నేనే పట్టుపట్టి ఒక మంచి ఆలయము నిర్మించెదను అనుకొని తిరిగి తన గ్రామమునకు పోయి
🌸తన ఆస్తినంతను అమ్మి, ఆ డబ్బు తీసుకువచ్చి అక్కడ ఒక గొప్ప ప్రాకారము కట్టించి దాని మధ్య ఒక పెద్ద ఆలయము అన్ని హంగులతోను నిర్మించి, పార్వతీ దేవికి కూడా ప్రత్యేకించి ఆలయం నిర్మించాడు.
🌿అంతేకాదు అక్కడ పూజలు యధావిధిగా జరపటానికి కావలసిన వారిని నియోగించి వారికి ఇళ్ళు కట్టించి, దుకాణాలను ఏర్పాటు చేసి, అన్ని రకాల వృత్తులవారిని ఏర్పాటు చేసి ఒక ఊరే నిర్మించాడు.
🌸తాను ధర్మకర్తగా వుండి పూజలు సక్రమంగా జరిపించేవాడు. అలా కొన్నేళ్ళు గడిచింది. తర్వాత డబ్బులన్నీ అయిపోయి,
🌿అందరికీ ఇవ్వవలసిన నెల బత్తెములను సకాలంలో ఇవ్వక పోవటంతో ఆలయంలో కొలువుకి నియమింపబడ్డవారంతా మానుకున్నారు.
🌸దీపకదళియారు కొన్నాళ్ళు వున్నంతలో గ్రామస్తులచేతనే పూజలు నిర్వహింపచేశాడు. కొన్నాళ్ళకి వాళ్ళూ ఇవ్వన్నీ మానుకుని ఊరు విడిచి వెళ్ళిపోయారు.
🌿అయినా దీపకదళియారు తన పట్టు విడవలేదు. తానే స్వయంగా పూజ చేసేవాడు. కొన్నాళ్ళకి పూజా ద్రవ్యాలు లేకపోయినా రాత్రింబగళ్ళు అఖండ జ్యోతి వెలిగేటట్లు మాత్రం చేసేవాడు.
🌸కొన్నాళ్ళకి దీపానికి నూనె దొరకటం కూడా కష్టమయింది. అప్పుడాయన చుట్లపట్లనున్న చెట్లు కొట్టి తెచ్చి కాల్చుచు దీపపు కాంతి కలుగచేసే వాడు.
🌿అవి కూడా అయిపోయాక తాను కట్టించిన ఇళ్ళయొక్క పై కప్పును, దూలములు, వాసములు, ద్వార బంధములు, ఏ చెక్క దొరికితే దానిని తీసుకొచ్చి దీపంలాగా వెలిగించేవాడు.
🌸కొన్నాళ్ళకి అవి కూడా అయి పోయాయి.తానొక్కడే మిగిలాడు. స్వామి ఆలయములో దీపము లేదు. అదే అతని చింత.అప్పుడతనికి ఒక ఆలోచన వచ్చింది.
🌿తన జుట్టంతా పైకి కట్టుకుని దాని కొనలకు నిప్పంటించి అది వెలుగుతుండగా గుడి చుట్టూ తిరగసాగాడు. వెండ్రుకలు కాలి, తలలోని మెదడంటుకొని కాలుచుండి వెలుగుచున్నను
🌸ఆయనకి తెలియక అలాగే తిరగసాగాడు.అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై,నీ భక్తికి మెచ్చితిని, వరమడగు అనగా మన భక్తాగ్రేసరుడు నాకే వరమక్కరలేదు.
🌿మనమీ అరణ్యంలో వుండద్దు. పద పోదాం. ఈ ఆలయంతోసహా కైలాసానికి వెళ్దాం అన్నాడు. అది విని శివుడు తన భక్తుని కోరిక తీర్చటానికి ఆలయముతో సహా అతనిని కైలాసమునకు తీసుకుపోయెను.
🌸శివుణ్ణి అంతగా ఆరాధించి, ఆయనగురించే జీవించి, చివరికి వరమడగమన్నా తనకోసం కాక ఆయనకోసమే అడిగినదీవకదళియారు కధ వల్ల నిస్వార్ధంగా భగవంతుణ్ణి సేవించినవారికి దక్కని వరాలుండవు అని తెలుస్తోంది కదా...సశేషం..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿