శ్రీ వేంకటేశ్వర లీలలు భాగము 15 - చోళరాజునకు విష్ణుమూర్తి ఘోరశాపమిచ్చుట

P Madhav Kumar


🌻 *చోళరాజునకు విష్ణుమూర్తి ఘోరశాపమిచ్చుట* 🌻

🍃🌹గోపాలుడు ఏమి కొంప మునుగుతుందో నను భయముతోనే వచ్చాడు. చోళరాజు భార్య వాని పై మండిపడుతూ ‘‘ఓరీ! మనసు పడి కొంటిమిగదా ఆ క్రొత్త ఆవును? మనకు దాని ఉపయోగమేమిటి! ఒక్కరోజయినా నీవు ని సాలు సరిగా పతికి తెచ్చితివా? పాలు యివ్వనందుకు అది పాడుయావు అందువేమో, అది పాడుయావు గాదు. 


🍃🌹నాకు దీనిలోగుట్టు తెలిసియే యున్నది. నీవు ఏమియూ తెలియని నంగనాచివలెనున్నావు కాని, నీవు ఆ యావు పాలను ప్రతిదినము త్రాగి వేయుచున్న సంగతి ఎందులకు దాచెదవు? లేకున్న ఆ చిక్కని పాలను చక్కగా అంగడిలో అమ్ముచు ధనము గడించుచుంటివా!’’ అని ఆరోపణలతో కోప వాక్యములు పలికినది. 


🍃🌹ఆ నిందా వాక్యములు వినజాలక, అతడు ‘‘తల్లీ! మనస్సాక్షిగా చెప్పుచున్నాను వినుము. నేనేవిధముగా కూడ అన్యాయము చేయలేదు తల్లీ! దీని కంతకూ నేనే మాత్రమునూ బాధ్యుడను గాను. 


🍃🌹ప్రతి దినము సాయంకాలము నేను తక్కినయావులవలెనే ఆ యావు నుండి గూడ పాలు తీయుదమని వెడలుటయు, వింతగా దాని చన్నులు పాలులేని కారణముగ ఎండి పోవుటయు జరుగుచున్నది. కారణమేమియో నాకున్నూ తెలియరాకున్నది’’ అనినాడు.


🍃🌹రాణి గొల్లవాని మాటలు నమ్మలేదు. ‘‘ఓరీ నీ మాటలు నమ్ముట కష్టము. ఇదిగో చెప్పుచున్నాను వినుము – నీ మాటలను కట్టిపెట్టి నేటి నుండి ఆ యావుపాలు తీసికొని రావలసినదే! లేకున్న కఠినాతి కఠినముగ నిన్ను శిక్షించుట జరుగును. ఒడలు దగ్గరపెట్టుకొని మసలుకొనుము’’ అని మందలోని ఆ క్రొత్త యావు విషయమై మందలించినది. 


🍃🌹మందలించుటయేమి – హెచ్చరించినది, ‘‘సరే ఇక నుండి నేను మీరు చెప్పినట్లే నడచుకొనగలవాడ’’నన్నాడు వినయముగా గోపాలుడు.


🍃🌹రోజూలాగే ఆనాడు కూడా గోపాలుడు ఆవులమందను మేత కొరకు శేషాచలము మీదకు తోలుకొని వెళ్ళినాడు. రాజుగారి భార్య తనకు చీవాట్లు పుష్కలముగా పెట్టి వుండుట వలన ఆ రోజు అతడి దృష్టి ఆ క్రొత్త ఆవు వైపు దాని పొదుగు వైపే వున్నది. 


🍃🌹ఆ యావు కదలికతో తన దృష్టిని గూడ కదలించుచుండెను, జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూయున్నాడు. ఆ క్రొత్త యావు మెల్లమెల్లగా వెళ్ళి ఆ పుట్టను చేరినది. చేరి క్షీరధారను పుట్టలోనికి కార్చుట మొదలు పెట్టినది. 


🍃🌹ఇది చూసిన గోపాలునకు యాశ్చర్యము, కోపము కలసి వచ్చినవి. ఒడలు మండిపోయింది గోపాలునకు ఓహో రోజూ యిది ఈ విధముగాచేయుచున్నదా? అని అనుకొన్నాడు. ఆవు దగ్గరకు వెళ్ళినాడు. పొదుగును పుట్ట పై యుంచి పాలను పుట్టపాలు చేయుచున్నందులకు అతనికి అరికాలి మంట నెత్తికెక్కినది.


🍃🌹కోపము హెచ్చినచో విచక్షణాశక్తి తరిగిపోవునుగదా! అతని చేతిలోనున్నది మరొకటి కాదు. గండ్రగొడ్డలాయె. గోపాలుడు దానిని ఎత్తి ఆవు నెత్తి పై కొట్టబోయినాడు. తనకుపకారము చేయుచున్న ఆవుకు ఆపద రాబోవుట చూచి శ్రీమన్నారాయణుడు వెంటనే పుట్టలో నుండి పైకి వచ్చి ఆవునకు అడ్డుపడగా గొల్లవాని గొడ్డలి వ్రేటు నారాయణునికే తగిలెను. 


🍃🌹ఆయన తలపై తగిలి అదేపనిగా రక్తధారలు వెలువడజొచ్చినవి. ఆశ్చర్యకరమైన ఆ రక్తధారలు చూసి చూడగానే ఆ గోపాలుని కళ్ళు తిరిగి నేల పైబడి మూర్చపోయినాడు. అంతట ఆవు అంబా, అంబాయని అరుచుకొనుచు కన్నుల వెంబడి నీరుకారుచుండగ పర్వతము దిగి చోళరాజు వద్దకు వెళ్ళెను. ఎన్నడూ పొందని ఆశ్చర్యము పొందినాడు రాజు. 


🍃🌹వెంటనే దాని సంగతి సందర్భాలు తెలుసుకొన నిశ్చయించినాడు. మహాశ్చర్యభరిత ఆలోచనా సమన్విత హృదయుడై ఆ రాజు తాను స్వయముగా ఆ ఆవు ననుసరించి పర్వతాన్ని అదిరోహించి పుట్ట చెంతకు చేరాడు. పుట్ట నుండి రక్తము వచ్చుట ఎట్టు జరుగుచున్నది? గోపాలుడు మూర్చబోవడానికి కారణము ఏమిటి? అనే ఆలోచనలు అతని మెదడులో తిరుగాడసాగాయి! ఇంతలో...


🍃🌹ఇంతులో ఏమి జరిగినదీ అంటే గాయమూ, రక్తమూ కలిగిన తలతో శ్రీమహావిష్ణువే పుట్టవెలుపలికి వచ్చేశాడు. వచ్చి, చోళరాజును జూచినవాడై ఆగ్రహముతో ‘‘ఓరీ! మదాంధా! నీచరాజా! నీకు కళ్ళు ఎంతగా మూసుకొనిపోయినవి? లేకున్న నీకు యెగ్గూ తలపెట్టని నన్ను. నీ గోపాలుని చేత గండ్రగొడ్డలితో కొట్టించుటకు సాహసించి యుందువా! నా కోపమునకు, నా బాధకు నీవు కారణమైతివి గనుక, ఇదిగో శపించుచున్నాను, ఆ తప్పు ని కాదు. ఆ గోపాలునిదే అనగలవేమో! సేవకుల దోషములకు యజమానులకు దండన వుండి తీరును, అందువలన నీవు పిశాచమయిపోయెదవు గాక!’’ యని శపించెను.


🍃🌹భరించలేని పిశాచరూపము పొందునట్లు స్వామి తీవ్రకోపముతో శపించగా చోళరాజు దుఃఖమును పట్టలేకపోయెను. అతడు స్వామి పవిత్ర పాదముల పై కుప్పగా కూలిపోయాడు. విలపించడం ప్రారంభించాడు.


🍃🌹‘‘ఓ స్వామీ! పవిత్రమూర్తీ నేను ఏ పాపమున్నూ యెరుగను. గోపాలుని గండ్ర గొడ్డలితో నిన్ను కొట్టమని నేను అసలు యాజ్ఞపించలేదు స్వామీ! నిజముస్వామీ నమ్ము స్వామీ! నన్ను పిశాచముగా మారిపోవుట యెందులకు మీరు శపించినారు. ఎంత ఘోరమయిన శాపమిచ్చినారు? స్వామీ!’’ అసలు మీరీ పుట్టలో నున్నట్లు నాకు తెలియనే తెలియదు. రక్షించు స్వామీ! అని అతిదీనముగా విలపించసాగినాడు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat