*17.భాగం*
వధూవరుల నిమిత్తమయి దానియందు రెండుపీఠములు
కల్పించెను. మఱియు బ్రాహ్మణులకొఱకు నెన్నోపీఠములు నిర్మించెను. అంతటను నానారత్న వినిర్మితములయిన సింహాసనములు ఉన్నతములు హ్రస్వములునయి
యుండునని కల్పించెను. ఈరీతిగా దనపనివానితన మంతయు జూపి చేసినమం
టపమును దెచ్చి విశ్వకర్మ తనయల్లుడగు సూర్యునికి సమర్పించెను. దానిని జూచి
సూర్యుడునుజాలస్తుతిజేసెను. తరువాతను దేవాంగుడు కైలాసమునకుపోయి
తనవివాహమునకు బ్రభువగు శంకరభగవానుని బిలిచి శ్వేతద్వీపమునకుబోయి
విష్ణుని బిల్చి యచ్చటనుండి స్వర్గమునకుబోయి యింద్రుని బ్రహ్మను దిక్పాలురను
వివాహార్థము వచ్చుటకై ప్రార్ధించెను. మఱియు భూలోకములోనుండు రాజులను మంత్రులను సపరివారముగా బిలిచెను. తరువాతను దేవాంగుడు తెల్లవాఱుజామున
జతురంగబల సమేతముగా బ్రాహ్మణులను పురోహితులను బురస్కరించుకొని
మంగళవాద్య ఘోషములతో వందిమాగధులు స్తుతిచేయుచుండుగా బయలుదేటి
సూర్యలోకమునకు బోయెను. తరువాతను బ్రహ్మాది దేవతలు శివుడు ప్రమధగణములు విష్ణువు మొదలగు భాగవతులును దేవలుని వివాహము చూచుటకై
సంతోషముతో సూర్యలోకమునకు వచ్చిరి. తరువాతను మహాతేజశ్శాలియగు
సూర్యుడు దేవతలయందఱు యెదుటకును దేవత్తను దీసికొనివచ్చి దేవాంగుని
కిచ్చెను. త్రిలోకసుందరి యగునాబాల ముల్లోకములను మోహింపజేయుచు
నుండెను. మఱియు నామె సర్వాంగసుందరి యగుటచే బ్రహ్మ ప్రయత్నపూర్వముగా
సృజించినట్టున్నది. శచీదేవి యింద్రునకుంబలె నామె దేవాంగునకు దగియున్నది.
తరువాత నాదేవల
మహారాజు బ్రహ్మ మొదలగు దేవతల సమక్షమున నామెకంఠమునందు మంగళసూత్రమును గట్టెను. బ్రాహ్మణులు మంత్రములు చదువుచునక్షతారోపరణము చేసిరి. సువాసినులు మంగళగానములు పాడుచు నీరాజనము పట్టిరి. ఇంద్రునియాజ్ఞచేతను కల్పవృక్షము కామధేనువు చింతామణి యందఱకును
భోజనమును సమకూర్చినవి. ఈరీతిగా నాలుగు దినములు వివాహమహోత్సవము
జరిగినది. తరువాతను దేవాంగరాజు సంతోషించుచు నుత్సనో పయోగములయిన
దివ్యవస్త్రములను ముందుగా బార్వతీపరమేశ్వరుల కిచ్చెను. తరువాత బ్రహ్మ విష్ణువు మొదలగు ముఖ్యదేవతల కిచ్చి యనంతరము పెండ్లికి వచ్చిన వారందఱకును వారివారి యోగ్యతకు దగినవస్త్రముల నిచ్చెను. పిమ్మట నొక
దివ్యాంబరమును బైరవున కీయబోగా నతడు పుచ్చుకోక మిక్కిలి కోపించి శిరస్సు
కంపించుచు దేవలున కిట్లనియె రాజా ! యింతసేపటికా నేను నీ కగపడితిని అందఱకును ముందుగా వస్త్రము లిచ్చి తరువాతను గదా మిగిలినగుడ్డముక్క నా
కీయ వచ్చితివి. మొదటనే నా కీయవలదా ? నే నిపుడు పుచ్చుకోను. దత్తశేషము
నాకు దగదు. అని యతడు తన కిచ్చినవస్త్రమును జింపి జమ్మిచెట్టు పైని పడవైచి
నాకు దివ్యమయినవస్త్ర మింకొకటి యిమ్మనెను. అది విని దేవాంగుడు "నే నిచ్చిన
వస్త్రము నీరీతిగా జేసితిని గావున మణి నీ కీయగూడదు. నీయిష్టము వచ్చినచోటికి
బొమ్ము. అనగానే దుష్టాత్ముడగుబైరవుడు పరమేశ్వరునియొద్దకు బోయి యాయనకు నమస్కరించి యిట్లనియె. దేవా ! దేవాంగుడందఱకును వస్త్రము లిచ్చి నన్ను మఱచిపోయి తుదకు మిగిలినది నాకీయవచ్చెను. అని చెప్పగానే శివుడు దేవాంగుని
జూచి వీనికి స్వచ్ఛమయిన దివ్యవస్త్ర మిమ్మనెను. అప్పుడు దేవాంగుడు శివునకు
నమస్కరించి దేవా ! నేను దివ్యవస్త్రము నీయగా దానిని జింపి జిమ్మిపైని
వైచియున్నాడు చిత్తగింపు డనగానే బైరవు డీశ్వరునివంక జూచి “అయ్యా ! అత
డిచ్చినవస్త్రమును నేను గోపించి చింపి జిమ్మిచెట్టు మీదను వైచినను నాకు
మంచివస్త్ర మీయకపోయెను.” అని యనుచున్న భైరవుని జూచి శివుడు “నీవు
కోపించి యట్లు చేసితివి గనుక నెప్పుడును జిమ్మిక్రిందనే యుండుము" అని వానిని
శపించెను.తరువాత సూర్యుడు తనచెల్లెలగు దేవదత్తకును మఱుదికిని బెక్కుమదపు టేనుగులను గుఱ్ఱములను రధములను, ఆభరణములను దాసీదాసజనమ్మును
గానుకగా నిచ్చెను. వివాహము పూర్తికాగానే బ్రహ్మాది దేవతలందఱును దమతమ
మందిరములకు, బోయిరి. దేవాంగ మహారాజును తనభార్యను బరివారమును
వెంటబెట్టుకొని ఛాయూదే వియొద్దను సూర్యునియొద్దను సెలవు పుచ్చుకొని
యామోదపట్టణమునకు వచ్చి యెప్పటియట్లు సంతోషముగలుగునట్లు ప్రజలనందఱును బరిపాలించుచు దేవదత్త యను భార్యంగూడి యింద్రుడు శచీదేవితో బలెనే
చిరకాలము సర్వసుఖముల ననుభవించుచుండెను. ఎవడు భక్తిశ్రద్ధాతాత్పర్యములతో నీదేవాంగమహారాజు వివాహ వృత్తాంతమును వినునో చదువునో వినిపించునోయతడు సకలమనోరధములను బొందును. మఱియు నీదేవాంగమహా
రాజు యొక్క వివాహకథను జదివినపుడు వస్త్రములను మంగళసూత్రమును దానము
చేసినవారికి శివునియనుగ్రహము వలన నెల్లసుఖములును గలుగును.
*సశేషం........*