బసవ పురాణం - 1 వ భాగము

P Madhav Kumar


🕉🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️

శ్రీరజతాచల

శిఖరం మీద శివ పార్వతులు వినోదంగా ముచ్చటిస్తూ వున్నారు. వారి పాదాల వద్ద ఉపమన్యుడు- భృంగి, నందికేశ్వరుడు మొదలైన ప్రమథులు శివునియందే తమ శుద్ధ మనస్సును కేంద్రీకరించి సేవిస్తూ వున్నారు. ఆ సమయంలో నారద మహాముని కైలాసానికి వచ్చాడు. రాగానే ఆదిదంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి రెండు చేతులూ కట్టుకొని వినయంగా నిలబడ్డాడు. చంద్రశేఖరుడు తన వెనె్నల కంటితో నారదుణ్ణి చల్లగా చూచాడు. అంబికాదేవి, ‘నారదా, నీవు భూలోకానికి వెళ్లి వచ్చావు కదా! అక్కడి విశేషాలు స్వామివారికి విన్నవించు’ అన్నది.

అప్పుడు నారదుడు ‘స్వామీ! ఎందువల్లనో తెలియదు కానీ భూమిపై శివభక్తి సన్నగిల్లింది. కొందరు కేవలం శివాచారాలలో మునిగి శైవేతరులతో మాట్లాడటమే మానివేసి శివతత్వాన్ని ప్రచారం చేయడంలేదు. కొందరు కేవలం లౌకిక జీవనంలో మునిగిపోయారు.

మరికొందరు బ్రహ్మానందంలో మునిగి తమ్ము తాము మరిచి సమాజానికి ఉపయోగపడకుండా పోయారు. ఏమైతేనేమి తమ భక్తితత్వమ సంపూర్ణ సమాజానికి తెలియడంలేదు, అందువల్ల మానవులందరూ లింగస్థల, జంగమస్థల, ప్రసాదస్థలముల స్వీకరించి మహాభక్తులై ఉండే నిమిత్తం తమరొకసారి భూలోకంలో అవతరించక తప్పదు’.

మహాదేవుడైన పరమేశ్వరుడు అనురాగచిత్తుడై నారదుని మాటలు విని ఇలా అన్నాడు: ‘‘నారదా! నీ కోరిక ప్రకారం భూలోకంలో అవతరించవలసిందే. అయితే నాకూ నందీశ్వరునికీ రవ్వంత కూడా భేదం లేదు. ఆ కారణంగా నా పక్షాన నందిని భూలోకానికి పంపుతున్నాను’’.

పార్వతీదేవి ఈ మాటలు విని చిరునవ్వు నవ్వి ‘‘నాథా! మీరు ఇలా అనడంలోని ఆంతర్యమేమిటి?

నిజంగా నందీశ్వరుడూ మీరూ ఒక్కరేనా? లేక భక్తపరాధీనులు కాబట్టి- ‘నేనూ నా భక్తుడూ ఒకటే’ అన్న అర్థంలో ఈ మాట అన్నారా?’’ అని ప్రశ్నించింది.

అది విని పరమేశ్వరుడు నారదుడూ, పార్వతీదేవి వింటుండగా ఇలా అన్నాడు.

‘‘దేవీ! నీవు చెప్పింది నిజమే! భక్తుని శరీరమే నా శరీరం. నాకూ భక్తునికీ భేదం లేదు. అందుకని అలా అన్నాను. అంతేకాక ఇంకో కథ కూడా వుంది. పూర్వం కొన్ని యుగాలకింద శిలాదుడనే మహాముని శ్రీశైలానికి నైరుతీ భాగంలో కఠోర తపస్సు చేశాడు. ముందు కందమూలాలు ఆహారంగా తీసుకొని తపస్సు చేశాడు. తర్వాత అది మానివేసి రాళ్ళు తిని ఆకలి చంపుకొని ఘోర తపస్సు చేశాడు.


🙏 ఓం నమశ్శివాయ🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat