*గరుడ మహాపురాణ ప్రారంభము నైమిషారణ్యంలో జరిగింది.* 🌷
*విష్ణుభగవానుని అవతార వర్ణనం*
🌺భారతీయ సాంప్రదాయంలో 'జయ' శబ్దానికి గల ఆధ్యాత్మిక అర్ధం పురాణమని, మహాభారతమని విజ్ఞులంటారు. ఏ పురాణాన్ని వ్రాయడంగాని చదవడంగాని మొదలు పెట్టినా ముందు శ్లోకాలుండాలి.
నారాయణం నమస్కృత్య
నరంచైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం
తతో జయముదీరయేత్
🌺నారాయణునికీ, తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు మహర్షికీ చదువుల తల్లి సరస్వతీ దేవికీ వాఙ్మయాధీశుడు వ్యాసమహర్షికి నమస్కరించి ఈ గ్రంథమును ప్రారంభించాలి.
అజమజరమనంతం జ్ఞానరూపం మహాంతం శివమమలమనాదిం భూత దేహాది హీనం
సకల కరణ హీనం సర్వభూత స్థితం తం హరిమమల మమాయం సర్వగం వంద ఏకం
నమస్యామి హరిం రుద్రం బ్రహ్మాణంచ గణాధిపం
దేవీం సరస్వతీం దైవ మనోవాక్కర్మభిః సదా
🌺పుట్టుకగాని ముసలితనముగాని లేని కల్యాణ స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, విశుద్ధచారిత్రుడు, అనాదియైన వాడు, పాంచభౌతికశరీరుడు కానివాడు, ఇంద్రియములు లేనివాడు, ప్రాణులలో స్థానముకలవాడు, మాయకు అతీతుడు, సర్వవ్యాపకుడు, పరమ పవిత్రుడు, మంగళమయుడు, అద్వయుడునగు శ్రీహరికి వందనం. మనస్సులో, మాటతో, చేతుల ద్వారా ఆ శ్రీ హరికీ, శివునికీ, బ్రహ్మకీ, గణేశునికీ, సరస్వతీ దేవికీ సర్వదా నమస్కరిస్తుంటాను.
🌺ఇక గరుడ మహాపురాణ ప్రారంభము నైమిషారణ్యంలో జరిగింది. నిమిష నిమిషానికి పవిత్రత, జ్ఞానము ఏ అరణ్యంలో పెరుగుతాయో అదే నైమిషారణ్యము.అక్కడ లోకకళ్యాణం కోసం వేలాదిమునులు శౌనకుని ఆథ్వర్యంలో సత్రయాగం చేస్తుంటారు. ఇది వెయ్యేళ్ళ పాటు సాగే యజ్ఞం. విశ్వంలోని మునులందరూ, ఆచార్యు లందరూ, రాజగురువులందరూ, వ్యాసశిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళినపుడల్లా ఇక్కడికి వచ్చి వెళుతుంటారు.
🌺 శౌనక మహర్షి అడగగానే కాదనకుండా తాము సంపాదించిన జ్ఞానాన్నంతటినీ మాట రూపంలో అక్కడ సమర్పించి వెళుతుంటారు. ఇతరుల ప్రసంగాలను కూడా వినడం వల్ల అక్కడి వారి, అక్కడికే తెంచిన వారిజ్ఞానం నిమిషనిమిషానికీ పెరిగి పోతుంటుంది. అందుకే అది నైమిషారణ్యం.
🌺ఒకనాడక్కడికి సర్వశాస్త్ర పారంగతుడు, పురాణ విద్యాకుశలుడు, శాంత చిత్తుడు, వ్యాసమహర్షి శిష్యుడు, మహాత్ముడునైన సూతమహర్షి తీర్థ యాత్రలు చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఒక పవిత్రాసనంపై కూర్చుని విష్ణుధ్యానంలో మునిగిపోయాడు. క్రాంత దరియైన ఈ మహాపౌరాణికుడు తనపై కాలు మోపగానే నైమిషారణ్యమే పులకించిపోయింది.
🌺 ఆ పులకింత శౌనకమహర్షికి చెప్పకనే చెప్పింది ఎవరో మహానుభావుడు వచ్చాడని. ఆయన వెంటనే కొందరు ఉత్తమ ఋషులను వెంటనిడుకొని సూతమహర్షిని కనుగొని ఆయన కనులు తెఱచునందాక అక్కడే వేచియుండి ఆయనను సగౌరవంగా యాగస్థలికి తోడ్కొని వచ్చాడు. మునులందరూ ఆయనను సేవించి ఆతిథ్యమిచ్చి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు.