*3.భాగం*
బ్రహ్మ - నారదా ! దేవి యుగ్రరూపముతో బ్రత్యక్షముగా గానే యామెను
జూచి “మనము చాలమందిమి గుమిగా గూడితిమేని జయింపవచ్చును" అని
వెట్టియాలోచన నిర్ణయించుకొని చతురంగబలముతోడను బయలుదేఱిరి.వారియాలోపము వ్రాయదరముగాదు. దేవితో యుద్ధముగదా ! వాండ్రు దేవిని సామాన్య మయినయాడుది యనియే తలచియుందురు. గాలి కెగరుజెండాగుడ్డలచప్పుడు, కాహళములను వాద్యముల చప్పుడు, గుఱ్ఱములఘోషలు, ఏనుగులఘంకారములు, రాక్షసులు మేఘగర్జనలు, పిడుగులవంటి ధనుష్టంకారములు దిక్కులను
జెవుడెత్తించినవి. అయ్యా ! రాక్షసబలములను జూచినది. మణింత కోపము
దెచ్చుకొన్నది. గద చేతితో గిరగిరద్రిప్పి రాక్షసులను మొత్త మొదలు పెట్టినది. ఒక్కొక్క
దెబ్బకు బలుమందిగా జచ్చిరి. వాండ్రనందఱను దిలలవలె ఖండించినది. కొన్ని
యేనుగులు గదాఘాతములచే దంతములు విఱిగియు గుంభస్థలములు పగిలియు
నేలగూలినవి. కుంభములనుండి జల్లున ముత్తెములు రాలినవి. గదచే
నెముకలువిటిగి గుఱ్ఱములు చచ్చినవి. రధములు పొడిపొడియయిపోయినవి. రాక్షసుల శిరస్సులు బ్రద్దలయినవి. బలవంతుడగుమానిసి కట్టుతో గుండలుదొంతిని
బగులగొట్టినట్లు రాక్షసుల శిరస్సులు దేవి గదతో గొట్టుచున్నది. సారథులు చచ్చిరి.అప్పుడు కత్తి చేతబట్టుకొని యేనుగులతొండములు కంఠములు ఖండింప
మొదలిడినది. దేవేంద్రుడు వజ్రాయుధముతో గొండల టెక్కలు నటికి పడగొట్టినట్లు
రాక్షసులను బడగొట్టినది. ప్రళయకాలమున యముడు దండపాణియయి ప్రజలను
సంహరించులాగున నాలుగు చేతులతోను శూలము, కత్తి, గద, చక్రము పట్టుకొని
యొక్క మాఱుగా రాక్షసులను జంప మొదలిడినది. ఒక్కొక్కసారి కత్తి పట్టుకొని
వజ్రపాణియగు నింద్రునివలె రాక్షసులను వెంటాడించినది. ప్రళయమున బైరవునివలె శూలముతో రాక్షసులను జీల్చినది. చక్రముతోడ ననేకులను ఖండించి
యమునియింటికి విందునకు బంపినది. ఘోరరూపిణియగు చండిక యీరీతిగా
జాలమంది రాక్షసులను జంపి మిగిలినవారిని బరుగెత్తించినది. రాక్షసరక్తము
వఱదలై వెల్లువలై ప్రవహించుచున్నది. ఆరక్తమంతయు ద్రావినది. వాండ్రప్రేగులు మెడలో వైచుకొన్నది. చూడశక్యముగాకుండ ఘోరరూపిణియై ప్రళయకాల
మేఘములవలె గర్జించినది. చావగా మిగిలినరాక్షసులందఱును నాలుగు దిక్కులకును బాటిపోయిరి. ఇట్లు రాక్షసులందఱును జచ్చిపడియుండుట చూచి
భూతభేతాళ ఢాకినీ శాకినీ గణములు వచ్చిపడినవి. మాంసమును దిని రక్తమును
ద్రావి సంతుష్టిని బొందుచున్నవి. దేవి ననేక విధములుగా స్తుతిచేయుచు పీచ్చిపట్టినట్టు తాండవముచేసినవి. పాటిపోయిన రాక్షసు లీసంగతియు దమవారగు
నితర రాక్షసుల తోడను జెప్పిరి. పూర్వము ప్రళయము దటస్థించినపుడు
ప్రపంచమంతయు జలమయియుండగా, భగవంతడగు విష్ణుమూర్తి శేషశయ్య పై యోగనిద్ర ననుభవించుచుండగా నాయన దేహమున జెమట పట్టినది. అప్పుడాచెమటవలన వజ్రముష్టి మొదలగు నాయయిదుగురు రాక్షసులును బుట్టిరి.గోవిందుడు నిద్రపోవు చుండుట చూచి యతనినే చంప నుద్యుక్తులయిరి.
తరువాతను విష్ణుడు మేల్కొని వారితో ఘోరముగ యుద్ధముచేసెను. అప్పుడు వారు చేసిన బాహుయుద్ధమునకు సంతోషించి శౌరి వారితో నిట్లనియె. రాక్షసులారా !
మీరుచేసిన యుద్ధమునకు జాల సంతోషించితిని. మీయిష్టమయిన వరము వేడుడు.అనగానే యారాక్షసులతనితో నిట్లనిరి. దేవా ! నీకు మాయందు దయయున్నచో మాకు నీ చక్రముచే, జావులేకుండ వరమిమ్ము. అని యడుగగానే విష్ణుడట్లే యిచ్చితి ననెను. అది మొదలు వజ్రముష్టి మొదలగువారు నిర్భయులై తమ పౌరుషము
నాశ్రయించి పాతాళమునకు బోయి యందు సుఖముగానుండిరి. తరువాత నొకప్పుడా రాక్షసులు భార్గవాశ్రమమునకు వచ్చిరి. ఆశుక్రాచార్యుని యాశ్రమములో నాతనికూతును దేవయానయనుదానిని జూచిరి.సర్వాంగసుందరియగు
నాసుందరినిజూచి వారందఱును మొహమునొందిరి. ప్రేమపూర్వకముగా
నామెయొద్దకుబోయి వినయముగా నిట్లనిరి. సుందరీ ! నీకు మేలగుగాక. హితకరమయిన మాపలుకాలింపుము. మేము ముల్లోకములయందును బేర్పడిన రాక్షసులము. మాయయిదుగురిలో నీ యిచ్చకువచ్చినవానిని వరింపుము.అనియిట్లు వారు చెప్పిన మాటలువిని యారమణి మిక్కిలిని గోపించి యిట్లన్నది.ఓరీదురాత్ములారా ! గురుపుత్రియన్నసంగతి యయినను నాలోచింపక
యిట్లనజొచ్చితిరిగా ! బలముచేగర్వించి మీరు మతిలేక నోరికి వచ్చినమచ్చున
బ్రేలుచున్నారుగా ! నన్నడుగుటకు మీకు నో రెట్లు వచ్చినది ? దుర్బుద్ధులారా ! నా బోటి బోటియే మీ టోపము నణగించును. నాశాపము దప్పనిది. మీబలతేజము
లాయబలవలన నశించుగాక, అనియిట్లు వారిని శపించి తనయింటికి బోయినది.
ఇట్లు గురుపుత్రిచే శపింపబడి యారాక్షసులు శమదమాదిసంపన్నులయి శివుని తపసుచే సంతోషింపజేసిరి. శివుడు ప్రసన్ను డయి యెదుట సాక్షాత్కరించెను.
వారాయన నిట్లు యాచించిరి. దేవా ! మాయందు దయయుంచి మారక్తమునందఱును ధరించులాగున వరముదయచేయుము. అని కోరగానే యట్లేయగునని,
వారికి వరమిచ్చి యచ్చటనే యంతర్ధానమాయెను. వారే కాలము సమీపించి
యుండుటచే నిప్పుడిలాగున దేవలమహామునిని జంపవచ్చిరి. చౌడేశ్వరిచే మహాబలవంతులగు నారాక్షసులు చంపబడిరి. దేవలుడు వారిరక్తముతో నాదారములు ముంచి
యయిదురంగులు గలవానినిగా జేసెను. వారి కీశ్వరుడిచ్చిన వరము
సఫలమయినది.
*సశేషం.......*