*2.భాగం*
బ్రహ్మ - నారదా ! దేవలుడు పోవునపుడు పార్వతికి నమస్కరించి యిట్లనెను.
దేవీ ! నన్ను సాదరముగా జూడుము. నీవు లోకముల కీశ్వరివి. నేను శివునియాజ్ఞాప్రకారము సంతోషముగా బాలసముద్రమునకు బోవుచున్నాను.
నాయందనుగ్రహ దృష్టియుంచుము. లోకములన్నియు నీయధీనములు. అనియ
నగానే పార్వతి యిట్లనియె నాయనా ! దేవలా ! నీవు పొమ్ము. అవసరము
తటస్థించునపుడు సాయము చేసెదను. నిన్ను శత్రువులు బాధించినపుడు నన్ను
స్మరింపుము. నేను బ్రత్యక్షమై నీశత్రువులను సంహరింతును. అని దేవి చెప్పగానే
సంతోషించి దేవలుడు పాలసముద్రమునకు బోయి దానియొడ్డున నొకచక్కని
సువర్ణాశ్రమమున నుండెను. వర్ణించుటకు వాక్కులు చాలని యాయాశ్రమములో
నుండి విష్ణుమూర్తిని బ్రసన్నుని జేసికొనుటకై యధావిధిగా నియమమవలంబించి
తపస్సుచేసెను. అతని తపస్సునకు మెచ్చి విష్ణుదు ప్రసన్నమాయెను. దేవలుడు విష్ణుననేకవిధములుగా స్తుతిచేసెను. అతనిస్తుతికి సంతోషించి మందస్మితసుందరవద
నారవిందుడై గోవిందు డిట్లనియె. మహాభాగ ! బాగు ! బాగు ! నీతపస్సునకు
సంతోషించితిని. నీయిష్టమయిన వరమడుగుము, ఇచ్చెదను. అని చెప్పగానే దేవలు డిట్లనెను. దేవదేవా ! నీవుసంతోషించుటవలన నేను గృతార్థుడ నయితిని. శివుడు
నన్ను వస్త్రములను నిర్మింపుమన్నాడు. నీయొద్ద నున్న తంతువులు నా కిమ్ము. నేనందులకై వచ్చితిని. నీదర్శనమువలన నాకోరిక నెఱవేటినది. అనగానే మంచిదే.యని తంతువుల నాదేవలుని కిచ్చెను. ఇట్లు చిరకాలమునుండి తన నాభీపద్మములో
నుంచుకొనియున్న దారముల నిచ్చి యచ్చక్రధరుడు దేవలునితో నిట్లనియె.
ఓదేవలమునీ ! ఇవి పూర్వము సృష్టిసమయముననే పుట్టినవి. అది మొదలు నేను
వీనిని నానాభిపద్మమునందుంచి దాచుచుంటిని. నీవల నిన్నాళ్లకు వీనికి వినియోగము గలిగినది. ఇవి పట్టుకొనిపోయి నేర్చుకొలదిని విలువలేని
వస్త్రములను సిద్ధముచేసి దేవతలు మొదలగువారి నలంకరించి వారిమానము
గాపాడుము.నీవుపోవునపుడు దారిలో రాక్షసులు మునివేషములతో వచ్చి
నిన్నువంచించి దొంగిలింపగలరు. నీవావిషయమై జాగ్రత్త గలిగి నీ పరాక్రమమంతయు జూపి యుద్ధముచేసి వాండ్రను జంపుము. ఇట్లు చెప్పి వెంటనే తన చక్రమునుండి చక్రమునుసృజించి యాతనికిచ్చెను. చక్రముపుచ్చుకొని
సంతోషించుచు జేతులు జోడించి దేవలు డిట్లనియె. ప్రభూ ! నీవు నాయం
దనుగ్రహించి యంతయు జెప్పితివి. నీదయవలన నిక వస్త్రములను నేసెదను.
నీయాజ్ఞను శిరసావహించి దేవతలందఱకును వస్త్రము లిచ్చెదను. అని చెప్పి
దేవలుడు భక్తిగా నారాయణునియెదుట నిలువబడి చిత్తము స్వామీ ! యని నమస్కరించెను. భగవంతుడప్పుడే యంతర్థానమాయెను. అక్కడనుండి తిన్నగా
దేపలమహాముని జంబూద్వీపమునకు వచ్చెను. ఉప్పుసముద్రమునొడ్డున నొకానొక కృత్రిమమయిన యాశ్రమమును జూచెను. మాయచే జేయబడిన యాయాశ్రమమునుసంగతి యెంతవింతగా నుండునో చదువరులే పోల్చుకోగలరు. అట్టి యాశ్రమమునుజూచి “ఈయాశ్రమ మెవరిదోకదా ! ఇది నామనస్సును
హరించినది. ఈయాశ్రమముయొక్క యజమానుని తపోమహిమ యెటువంటిదయి
యుండునోకదా !" యని యనుకొనుచు మెల్లగా నందులోనికిబోయెను. అందొకచో గపటమంతయు శరీరమును ధరించి కూర్చుండియున్నదో యన్నట్లు మునియొక్కడక్కడ నున్నాడు. తన్ను మించిన శిష్యులు పరివేష్టించియున్నారు. కపటమంత్రములను జపము చేయుచున్నాడు. చూచుటకు మహాశుచివలె నున్నాడు. ఇతనినిజూచి నాయనా ! నీవెవరు ? నీ పేరేమి ? నీవిచ్చటికి వచ్చినపనియేమి ? అని యతిప్రేమగా
నడుగగా దేవలు ఉన్నాడు. మహాబాగా ! నేను దేవలుడను పేరుగలవాడను.
ఈశ్వరునిమానసపుత్రుడను. శివభగవానుడు నాకు వస్త్రములునేయుమని యాజ్ఞాపించెను. విష్ణునిదగ్గఱుకుబోయి దారములు దెచ్చుచున్నాను. అను నతని మాటలువిని కపటముని యిట్లనియె. నాయనా ! నిన్నుజూచి చాల సంతోషించితిని.
నీవు మార్గాయాశము తగ్గించుకొని రేపోయెల్లుండియో పోవుదువుగాక యనెను,
మంచిదేయని యారాత్రి దేవలుడు కృతాతి ధ్యుడై శయనించెను. రాత్రిగురువుగారు
శిష్యులు రాక్షసులై దేవలుని జంప నుద్యుక్తులైరి. వీరికుటిలము దెలిసికొని
విష్ణుమూర్తియిచ్చినచక్రమును వాండ్రపయి బ్రయోగించెను.
కోటిసూర్యప్రకాశమానమగు నాచక్రము కొందఱురాక్షసులను సంహరించినది. కొందఱు పదిదిక్కులకును
ముందేపారిపోయిరి. ఎట్లో తప్పించుకొని తరువాతను వజ్రముష్టి ధూమ్రవక్రుడు,
ధూమ్రాస్యుడు, చిత్రసేనుడు, పంచ సేనుడు అను నైదుగురు రాక్షసులేకమయి యితనితో యుద్ధముచేయమొదలిడిరి. రాక్షసులు బాణవర్షము గురిపించి లొకమంతయు జీకటిమయము చేయుచున్నారు. కోపించి దేవలుని ఛిన్నభిన్నముగ
జేయుచున్నారు. చక్రమువాండ్ర నేమియుజేయజాలకపోయినది. వాండ్ర దెబ్బలకు దేవలుడు తాళజాలకపోయినాడు. ఈ చరాచర ప్రపంచమున కీశ్వరియగు చండికను మనస్ఫూర్తిగా దలచుకొన్నాడు. అనేక విధములుగా నాయమ్మను
స్తుతిచేసినవాడు. భక్తపరాధీనురాలు పాపము ! దేవి హఠాత్తుగ నా ఆవిర్భవించినది.
ఇట్లు ప్రసన్నురాలయిన యాయంబతో సవినయముగా నిట్లని విన్నవించెను. అమ్మా!
చండికా ! నీకొక్క నమస్కారము అమ్మా ! నేను నేడు నీ పుణ్యమూర్తిని గనులారజూడజాలితిని, నాదికదా ! అదృష్టము. అంబా ! యీరాక్షసులను చూచితివిగదా !
నన్నెట్లు బాధించుచున్నారో ! ఈ మాటలు విని యెంత పర్వతరాజపుత్రియయినను,
ఆడుదిగనుక జటుకున మనసుకరగినది. ప్రసన్నురాలై దేవలునితో పరమేశ్వరి
యిట్లన్నది. వత్సా భయపడకు. నీకు క్షేమమే యగును. ముహూర్తమాత్రము నా బలముచూడు. ఈ రాక్షసులను శూలముతో, బొడిచిచంపెదను. నేడు వీండ్ర రక్తము బొట్టు పెట్టుకొనియెదను. అని చండిక యొక్కసారి పెద్దనవ్వు నవ్వినది. నాలుగు
భుజములు, పెద్దనాలుక, ఎఱ్ఱనికన్నులు, మహాబలముగలదై చేతులతో శూలము,చక్రము, గద మొదలగునాయుధములు ధరించి కోటిసూర్య ప్రకాశమానమగు
కిరీటము శిరోభాగమున వెలుగుచుండగా గాటుక బొమ్మవలె నాయమ్మ ప్రత్యక్షమై
యొక్క దెబ్బతో రాక్షుసులు తమ యబ్బలదగ్గఱకు బోవునట్లు చేయగల నిబ్బరముగల
శూలమును గొబ్బున ద్రిప్పమొదలిడినది. వాండ్రును సామాన్యులుగారు. ఇట్లు
భయంకరాకారముతో దేవి వచ్చియుండుట చూచి యెట్లయినను దేవిని
జంపుదమను తెంపుతో యుద్ధమునకు సన్నద్దులయిరి. దేవిదివ్యకిరీటపు గాంతులచేతనే స్తంభించిపోయిరి. ఒక్క హుంకారము చేయునప్పటికి మూర్ఛపోయిరి. అప్పుడు ఘోరరూపిణియగు వీరమాత తనయాయుధముల నన్నింటిని వాండ్రపయిన బ్రయోగింపవలసి వచ్చినది. కొందఱు కాందిశీకులయిరి. ఎట్లో ఆయైదుగురుగడ్డు రాక్షసులను యమునియింటికి బంపించినది. దేవులుడపు
డైదురంగులు గల వాండ్రరక్తములో దనయొద్దనున్న దారములు దడిపి యయిదురంగులనూలు సిద్ధము చేసికొనెను. చూడమనగా గిరీటము,
కిరీటమునుండి బయలుదేఱిన కాంతులచే రాక్షసులందఱును స్తంభించిరి. గనుక
జౌడేశ్వరియని యాత్రి భువనేశ్వరి ఏర్పడ్డది. ఆమె ప్రసన్నచిత్తురాలై దేవలునితో
నిట్లన్నది. వత్సా ! ఇక నీ యిష్టము వచ్చిన చోటికి బొమ్ము. నీవునన్ను దలంచినతోడనే
ప్రత్యక్ష మగుచుందును. అని చెప్పి మాయంబ వెంబడి సాయంతర్ధానమయి
పోయినది. దేవల మహాముని తిన్నగాను నూలుపట్టుకొని శివుని సెలవు ప్రకారముగా
నామోదపట్టణమునకు బోయెను.పితాజీ ! ఆవజ్రముష్టి మొదలయిన యయిదుగురు రాక్షసులును ఎవరికొడుకులు ? విష్ణుచక్రముగూడ వారి నెందులకు జంపజాలకపోయినది?
వారెక్కడివారో కాని ఆసామాన్యులవలె నున్నారు. వారి సంగతి కొంచెము విస్తరించి చెప్పుము.