*1.భాగం*
శ్లో|| నమః శ్రీరామలింగాయ చౌడాంబాయై నమో నమః |
దేవలాయ నమో యేన కృతం దేవాంగ గౌరవమ్ ||
పూర్వ మొకప్పుడు నారదుడు లోకులను అనుగ్రహించు తలంపుతో సత్యలోకమునకు బోయి బ్రహ్మకు నమస్కరించి యిట్లనియె.నారద - ఎవనియాజ్ఞచే బ్రహ్మవిష్ణు మహేశ్వరులు లోకములను సృజింపను,పాలింపను, సంహరింపను గర్తలగుచున్నారో అట్టి పురాణపురుషునకు
నమస్కరించుచున్నాను. పితామహా ! ఏది సమస్త పాపములను పోగొట్టి పుణ్యమును శుభములను గలిగించి లోకులను గృతార్థులను జేయునో అట్టి కథ చెప్పుమనగా బ్రహ్మ యిట్లనియె.బ్రహ్మ - నారదా ! రహస్యమును, సంతోషమును, గలిగించు నదియు,
పాపములను బోగొట్టి పుణ్యమును గలిగించునదియు, ప్రాచీన మయినదియు,
శివునిమాహాత్మ్యమును దెలుపునదియు, విన్నవారిని కృతార్థులను జేయునదియునగు
దేవాంగ చరిత్రమును జెప్పెదను వినుము. సచ్చిదానందస్వరూపుడును
శాశ్వతుడును సర్వలోకములకు బ్రభువును, సర్వవ్యాపియు,పరాత్పరుడును,అప్రమేయుడును, నిర్గుణుడును నగుపరమశివు డొకప్పుడు సృష్టిచేయవలయు నని తలంచెను. ఆతని యిచ్ఛవలన ద్రిగుణాత్మికయగు శక్తిపుట్టినది. ఆమె దివ్యజ్యోతియై
వెలుంగుచుండగా శివుడుచూచెను. ఆదిశక్తియు లోకముల కాధారభూతురాలును
నగు నామెను శివుడుచూడగానే రజోమూర్తియగు నామెవలన నేను బుట్టితిని. సాత్వికమూర్తివలన విష్ణువుపుట్టెను. తామసమూర్తివలన మహాబలుడగు కాలరుద్రుడు పుట్టెను. అని చెప్పగా విని నారదు డిట్లనియె.
నారద - దేవా ! ఆ ప్రకృతివలన బుట్టి నీవేమేమిచేసితివి. నీయిచ్ఛయెట్లుండెను. నీవెట్లు సృష్టికర్తవైతివి?ఆయీసంగతులు విస్తరించి చెప్పుమనగా బ్రహ్మ యిట్లనియె.బ్రహ్మ - నారదా ! బాగుగా నడిగితివి. చెప్పెదను వినుము. అట్లు పుట్టి నేను
శివునిగూర్చి తపస్సు చేసితిని. నా తపస్సునకు సంతోషించి శివుడు ప్రత్యక్షమాయెను. నే నతనిని పెక్కు విధముల స్తుతిచేసితిని. నాస్తుతికి శివుడుసంతోషించి యిట్లనియె.శివు - చతుర్ముఖా ! నీతపస్సుకు మెచ్చితిని. నీ యిష్టమైన వరము వేడుము.
ఇచ్చెదను. అని యనగానే సంతోషించి యిట్లంటిని. దేవా ! నీయాజ్ఞ ప్రకారము నేను
లోకములను సృజింపదలంచుచున్నాను. అనగానే విని యతడట్లేయగుగాక
యనెను. మఱియు, చతురాననా ! ఇదిమొదలు నీవు చరాచర ప్రపంచమును
సృజింపుము. అని యాశివుడదృశ్యమాయెను. నే నాతనియనుగ్రహమువలన
నీ చరాచర ప్రపంచమును సృజించితిని. దేవతలు మనుష్యులు మొదలగు నా
సృష్టిలోని వారందఱును పశువులవలె వస్త్రములులేక దిగంబరులై తిరుగుచుండిరి.
స్త్రీలకు గాని పురుషులకుగాని మానసంరక్షణము లేకపోయినది. అందు గొందఱు
చర్మములు, ఆకులు మొదలగువానిచే మానమును గాపాడుకో మొదలిడిరి. ఇట్టి
ప్రజలను జూచి నేను జాలసిగ్గుపడి యందఱకును ముఖ్యాలంకారమగు
వస్త్రములను సిద్ధముచేయు రీతిని దెలిసికొనుటకై కైలాసమునకు బోతిని. అచ్చట
దేవతలు మొదలగువారు ఆకులు మొదలయినవి కప్పుకొని సేవించుచుండగా
వజ్రసింహాసనముపై గూర్చున్న శివుని దర్శించి యనేకవిధములుగా స్తుతిచేసితిని.నాస్తుతులకు సంతోషించి శివుడిట్లనియె. బ్రహ్మా ! నీకును నీవు సృజించిన ప్రపంచమునకును క్షేమమేకదా ! నీవు చరాచర ప్రపంచమును సృజించితివిగాని వారు
వస్త్రములు లేనికారణమునుబట్టి దిగంబరులై చూచుట కసహ్యముగా గనుపట్టుచున్నారు. కావున వారి యలంకారమున కును మానసంరక్షణమునకును
వస్త్రములను నిర్మించు వానిని సృజింపుము, లోకము మిక్కిలి యసహ్యముగా నున్నది. నీబుద్ధి చేతనే యాలోచించుము. అనుశివునిమాటలు విని చేతులు జోడించు కొని యిట్లంటిని. దేవా ! దేవరయాజ్ఞా ప్రకారము లోకమును సృజించి తినిగాని
వస్త్రములను సిద్ధముచేయువానిని సృజింపజాలను, పుట్టించు వాడవును పెంచువాడవును సంహరించువాడవును నీవేకదా - నీకింకరుండనగు
నాకిట్టయసాధ్యమైనపని యేల చెప్పెదవు? అనినేనగానే శివుడిట్లనియె బ్రహ్మ ! ఏమి
ఆశ్చర్యమైన సంగతి చెప్పుచున్నావు? లోకమును సృజించిననీ కిదియేమాత్రపు
కష్టము? అని యాయనయన్నాడు. అపుడు నేను మరల నిట్లంటిని. సర్వజ్ఞుడవగు నీతోనేమి చెప్పవలయును? నాకేదిశక్యమో యేదిశక్యముగాదో నీకే తెలియును.పూర్వపుసృష్టిలో దేవతలు మొదలగువారికి వస్త్రములను నిర్మింపను మను
వుండెడివాడు. అతడు నీసాయుజ్యమును బొందియున్నాడు. అతడేతప్ప
మఱియెవ్వరును నీపనిచేయజాలరు. కావున నాయందును దేవాదులయందును
దయయుంచి వస్త్రములను సిద్ధముచేయువానిని నీవే సృజింపుము. అని
యూరకయుంటిని. తరువాత శివుడు సంతోషించి మనసులో నాలోచింపదా డగెను.
క్షణకాల మచ్చట నిశ్శబ్దముగా నుండెను. ఇట్లు శివుడు మనసులో నాలోచింపగానే
యొకానొక మహాజ్యోతి ప్రత్యక్షమై వెంటనే పురుషాకారమును ధరించెను. అతడు జటావల్కలములను దండాజినకమండలువులను ధరించి వ్రేళ్ళకు దర్భలు పెట్టుకొని
రుద్రాక్షకేయూరములును హారములును కంకణములను శరీరమున నలంకరించుకొని సర్వకర్మములకును సాధకమయిన యజ్ఞోపవీతముతో గోటి
సూర్యప్రకాశమానుడై యింద్రియనిగ్రహము గలిగి నీతిమంతుడును
బుద్ధిమంతుడును జ్ఞానవంతుడునునయి యగపడెను. మఱియు నతడు ఉదారమైన గుణములు గలవాడును సత్యమే పలుకువాడును, దృఢవ్రతుడును చాతుర్యము
యుక్తి గలవాడును కుశలియు కీర్తియేయలంకారములుగా గలవాడునునై యందఱకును నాశ్చర్యమును గలిగించెను. తరువాత శివుడందఱును వినునట్లుగానితడు దేవలుడని నాచే నామకరణము చేయుబడినవాడనెను. తరువాతను దేవలుడు చేతులు జోడించుకొని శివునియెదుట నిలువబడి యనేకవిధములుగా
నాయనను స్తుతి చేసి దేవా ! నన్నెందులకు సృజించితివి. నేను జేయదగిన దేదియైన
నున్నచో సెలవిమ్ము. ఏదో గొప్ప కార్యము లేనిచో నశించుస్వభావము గల
యీనాదేహమును సృజింపవు. దేహధారులకు సదా దుఃఖమేకాని సుఖమన్నమాట
కలలో దొరికిన మూటయేకదా ! ఈదేహము పంచ భూతాత్మకము. ఇందు
పంచప్రాణములున్నవి. పదియింద్రియములు గలవు. మనోబుద్ధిచిత్తాహంకారము
లతో గూడినది. ఇరువది నాలుగు తత్త్వములు గలసి దేహమని చెప్పబడుచున్నది.
నిత్యుడగు జీవుడి శరీరములోనున్నాడు. దేహసంబంధమునుబట్టి జీవుడు సుఖదుఃఖముల ననుభవించుచుండును. అజ్ఞానమను త్రాటితో గట్టుపడి దుఃఖమే యనుభవించుచున్నాడు. ఇట్టిదియని చెప్పరాని యజ్ఞానమువలన నవివేకము,
అవివేకమువలన అభిమానము దానివలన గామము క్రోధము లోభము మదము మత్సరము అనునంత శృత్రువులును, ఈర్ష్యాదులును బుట్టుచుండును. అందు
మనస్సు వాక్కు శరీరము కర్తృత్వమును బొంది మూడు విధములయిన కర్మమును
జేయును. అది ముగియువఱకును అనుభవించి తీఱవలసియే యుండును.సంసారసముద్రములో మునిగియున్న జీవునకు నివారింపరానికర్మమువలన
నొడ్డు దొరకుట యసంభవము. దుష్కరమైన కర్మముల ననుభవించుజీవునకు
సుఖమెక్కడిది? కావున నిందితమైన యీదేహమును నేనెట్లు భరింపగలను?
నన్నెందులకు బుట్టించితివి? నే నేమిచేయవలయును ? అని యిట్లు దేవలుడు
విన్నవింపగా శివుడిట్లనియె. నాయనా ! నీవు విచారింపకుము. నిన్ను
లోకోపకారమునకై సృజించితిని. నీ వాఱుజన్మములవఱకును లోకములో గీర్తిని
వ్యాపింపజేసి యేడవజన్మమున నాసాయుజ్యమునుబొందెదవు. ప్రస్తుతము నేను జెప్పబోవుదానిని వినుము. పూర్వము నావలన వేదములు పుట్టినప్పుడు వానితో
గూడ సర్వలోకాలం కారములగు దారములుగూడ బుట్టినవి. అది మొదలు
విష్ణునినాభీకములమునందున్నవి. నీ వావిష్ణునియొద్దకు బోయియాతంతువులను
సంగ్రహించి నీనేర్పు కొలదిని వానిని దివ్యవస్త్రములుగా జేసి మానసంరక్షణార్ధ
మందఱకును నిచ్చి యా దేవాంగముల నలంకరింపుము. దానివలన నీకు గీర్తియు దేవాంగుడను నామమును గలుగును. అని యిట్లు శివభగవానుడు చెప్పినమాటలు విని యాదేవలుడు తన వర్తనమునుగూర్చి యిట్లడిగెను.దేవా - దేవా ! ఇటుపయిని నాప్రవర్తనవిషయమై చెప్పుము. నే నెచ్చటికి
బోయియుండవలయును ? మహేశ్వరా ! నావంశమందెట్టివారు పుట్టుదురు?వారి ప్రవర్తన యెట్లుండును ? ఆయీసంగతులన్నియు జెప్పమన శివు డిట్లనెను.
శివు - దేవలా ! ముందుసంగతి వినుము. సర్వరత్నమయము, భోగాయతనము, ఓషధులతో నిండినది,నానావృక్షములుగలది, అనేక పర్వతములు
మొదలగువానితో నిండి యేడు ద్వీపములు తొమ్మిదిఖండములుగల భూమి యున్నది గదా ! అందు జంబూద్వీపము గలదు. అందు దేవతలందఱకును వాసయోగ్యమయిన మేరుపర్వతముగలదు. అది యుమ్మెత్త పువ్వువలె బంగారువికారముగా
నున్నది. దాని యౌన్నత్యము ముప్పది రెండులక్షలయోజనములు. పాతాళములో
బదియాఱులక్షల యోజనములవఱకును పాతువడియున్నది. ఆపర్వతమునకు దక్షిణ భాగమున భరతఖండము గలదు. అందు సర్వసౌఖ్య నిధానమగు సగరదేశ
మున్నది. ఆదేశములో బహు విస్తారముగల యామోదపట్టణము గలదు. అది స్వర్గమును మించి యున్నప్పుడు దానిని వేఱుగా వర్ణింపనేల ? నీవా పట్టణమునకు రాజవై రాజ్యమేలుచుండుము. ఇక నీవంశమువారి సంగతి యడిగితివి వినుము.
నీవారందఱును ఉదారులు, సత్యము తప్పనివారు, పరోపకరణపరాయణులు,
బుద్ధిశాలులు, సదాచార సంపన్నులు దేవతలయందును బ్రాహ్మణులయందును, భక్తి
గలవారు, పరాక్రమవంతులు, నేర్పరులు, అయియుందురు. ఇక నీవు వేగముగా
విష్ణునియొద్దకు బోయి ముందాపని చూడుము.
బ్రహ్మ - ఇట్లు శివుడాజ్ఞాపించినతోడనే మంచిదే యని యంగీకరించి
సంతోషముతో నతనికి నమస్కరించి విష్ణువుని జూచుటకై పాలసముద్రమునకు బోయెను.
*మొదటి ఆధ్యాయము సంపూర్ణం.*