⚜️ కాంతమల స్వర్ణమందిరం ⚜️
శ్రీ స్వామివారి పురాణ కథల ప్రకారము శ్రీ భూతనాథ స్వామివారి యొక్క అవతారమే శ్రీ అయ్యప్ప కారణ కార్యార్ధం భువిపై శివయ్యకు , వెంకటప్పకు జన్మించిన తనయుడు , అయ్యప్ప దైవమై , పన్నెండేండ్లు పందళరాజు రాజశేఖరుని వద్ద పెంపుడు కొడుకై వసియించి , స్వామి మహిమలు తెలియని దుర్మంత్రి కుట్రకు గురియై , తల్లియొక్క కపట శిరోవేదనకు ఔషధముగా పులిపాలు తెచ్చుటకు అడవికి వచ్చి , అచ్చట తన అవతార రహస్యమును నారద మునీంద్రుల వారిచే తెలుసుకొని , దేవతల గర్భ శత్రువు , వరబల మహిమాన్వితురాలు అయిన కరంభికై అను మహిషిని సంహరించినందులకు సంతసించిన దేవేంద్రుడు , ఋషి శ్రేష్టులతో కలిసి కాంతమలై శిఖరమున అజ్ఞానుల కంట పడనిరీతిగా స్వర్ణముతో ఆలయమొకటి నిర్మించి అందున జ్ఞానపీఠము నేర్పంచి శ్రీ స్వామివారిని ఆసీనులు గావించ కోరిరి. యక్ష కిన్నర , కింపురుషాదులు వాద్యాలు మ్రోగింప ఋషి పుంగవులు వేదఘోషలు చేయగా దేవతలు తమ తమ అంశములను తమకు మేలుచేసి రాక్షసి బారినుండి బాధా విముక్తి కలిగించిన శ్రీస్వామివారికి యొసగి జయఘోషలు చేయగా జ్ఞానపీఠము నధిష్టించుటకు శ్రీస్వామివారు వచ్చుచుండిరి. అప్పటి స్వామి , కలియుగ లెక్కప్రకారము పన్నెండేండ్లు కూడా నిండని పసిబాలుని రూపముతో నుండుట గాంచి , పీఠము ఎత్తుగా యుండుట వలన ఎక్కి కూర్చొనుట కష్టంగా యుంటుందేమోనని తలచి ఆ దేవతలలో పదునెనిమిదిగురు మెట్లుగా క్రింద నుండి పీఠం వరకు పడుకొనిరి.శ్రీస్వామివారు ఆ దేవతలపై తన పవిత్ర పాదములు మోపి దాటి జ్ఞానపీఠమునెక్కి కూర్చొని దేవతల పూజారాధనలు అందుకొనినారు. మానవుల ఏడాదికాలము అనునది దేవతలకు ఒక దినమే. కాంతగిరిపై వెలసియున్న స్వామిని దేవతలు ఉదయం మొదలు సాయంత్రము వరకు పూజించి , సాయంత్రము శ్రీ స్వామి వారికి చూపించే మంగళహారతితో జాజ్వల్యంగా వెలిగే స్వామివారి దేహ కాంతి పుంజమే మనకు ఏటేట సంక్రాంతి దినమున కనిపించే మకరజ్యోతి అనునది మన ఆర్యుల దృఢవిశ్వాసము.
🙏🌸ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏