*వరలక్ష్మీ కటాక్షం*

P Madhav Kumar

భారతీయ పర్వకాలాల్లో ఒక్కొక్క రుతువుకు, ఒక్కో మాసానికి, తిథులకు ప్రత్యేకతలున్నాయి. ఆ ప్రత్యేకతలే ప్రత్యేక దేవతారూపాలుగా పూజలందు కుంటున్నాయి. పూజ, వ్రతం, ధ్యానం, సంకీర్తన... వంటి మార్గాలన్నీ మనసును  మహాశక్తితో అనుసంధానపరచే సాధనలు.


గ్రీష్మంలో అగ్నితత్వాన్ని స్వీకరించిన భూదేవి, వర్షరుతువు ఆరంభమాసమైన శ్రావణం నుంచి జలతత్వాన్ని గ్రహిస్తుంది. ఈ జలతత్వ సంధానాన్నే 'ఆప్యాయనం అంటారు. భూమికి ఆప్యాయనం కలిగించే మాసం శ్రావణం. ఈ 'ఆర్ధశక్తి' వల్లనే పచ్చదనం, సస్యసంపద భూమికి సమకూరుతాయి. ఆ ఐశ్వర్య రూపిణిని మహాలక్ష్మిగా, సృష్టికారణశక్తిగా, సంపదల దేవతగా ఆరాధించే పద్ధతిని వేద రుషులు ఆవిష్కరించారు. ఆర్ద్ర, పుష్కరిణి (పోషకశక్తి) అని 'శ్రీ'దేవిని వరలక్ష్మిగా 'శ్రీసూక్తం' వర్ణించింది.


సర్వవ్యాపకుడైన పరమాత్మను శ్రీమహావిష్ణువుగా, ఆయన విభూతి (ఐశ్వర్య) శక్తిని మహాలక్ష్మిగా వేదం విశదపరచింది. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి (విద్యాలక్ష్మి), శ్రీలక్ష్మి, వరలక్ష్మి... అనే ఆరులక్ష్ములుగా ఉన్న మహాలక్ష్మి ఎల్లవేళలా నా ఎడల ప్రసన్నురాలగుగాక, అంటూ వైదిక సంప్రదాయం లక్ష్మీ రూపాలను పేర్కొంది. కార్యానికి సిద్ధి; దుఃఖం(ఆజ్ఞానం) నుంచి విముక్తి; సంకల్పాలకు సాఫల్యం (గెలుపు), విజ్ఞానం; శోభ, కాంతి, అభీష్టాలు నెరవేరడం... ఈ ఆరు సంపదల రూపాలే పై ఆరు లక్ష్ములు..


'చారుమతి' అనే సాధ్విని వరలక్ష్మి అనుగ్రహించి, స్వప్నంలో సాక్షాత్కరించి, శ్రావణమాస పూర్ణిమకు ముందువచ్చే శుక్రవారం నాడు తనను ఆరాధించి వ్రతాచరణ చేసేవారిని అనుగ్రహిస్తానని ప్రసన్నురాలై దీవించింది. ఆ వృత్తాంతాన్ని తన పెనిమిటికి, అత్తమామలకు చెప్పి, వారి ఆనందాన్ని ఆమోదాన్నీ పొంది వరలక్ష్మి వ్రతాన్ని తోటి స్త్రీలతో కలిసి ఆచరించిందని వ్రతకథ చెబుతోంది. 'చారుమతి' అంటే 'మంచి బుద్ధికలది' అని అర్థం. కుటుంబంలో ఉన్న (ఉండవలసిన) సౌమనస్య స్వభావాన్ని ఆమె ప్రవర్తన సూచిస్తుంది.

వస్త్రాభరణాలతో అలంకృత అయిన స్త్రీమూర్తిని సాక్షాత్తు లక్ష్మీ రూపంగా మన్నన చేయడం వరలక్ష్మీవ్రతం నాటి పేరంటాల అర్చనలో గోచరిస్తుంది. శుక్రవారాలు లక్ష్మీప్రీతికరాలు అని శాస్త్రోక్తి, శుక్రవారానికి 'భృగుప్రజాపతి' అధిపతి. ఆ భృగువు తపస్సుకు ఫలితంగా లక్ష్మీదేవి ఆయనకు తనయగా ఆవిర్భవించింది. నారాయణుడి విభూతి శక్తియే సిద్ధిగా ఆయనను అనుగ్రహించింది. ఆ మహాలక్ష్మిని నారాయణుని పత్నిగా అప్పగించాడు భృగువు. భృగువు అధిపతిగా ఉన్న భృగువాసరం (శుక్రవారం) లక్ష్మీపూజకు ముఖ్యమని శాస్త్రనిర్ణయం.


శుక్రవారానికి ఇంద్రుడు దేవతగా కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. 'ఇంద్రుడు' అనే మాటకు 'ఐశ్వర్యం, తేజస్సు కలవాడు' అని అర్థం. త్రిలోకాధిపతి విష్ణుకృపతో లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ఇంద్రుడయ్యా'డు. 'ఇందిర' అన్నా మహాలక్ష్మియేకదా! చంద్రకళలు వృద్ధిచెందే శుక్లపక్షంలో, చంద్రసహోదరిగా క్షీరసాగరం నుంచి ఉద్భవించిన లక్ష్మిని అర్చించాలని సంప్రదాయం. అందుకే, పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా నిర్ణయించారు. వరలక్ష్మీ కటాక్షం వల్ల భారత జాతి క్షేమ సమృద్ధులతో విలసిల్లాలని భారతదేశం సర్వతోముఖాభ్యుదయాన్ని సాధించాలని ఆ జగన్మాతను ప్రార్ధిద్దాం.


సామవేదం షణ్ముఖశర్మ

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat