🌷పురాణ కాలంలో ఈ క్షేత్రం పేరు బృందారణ్యం. ఈ సన్నిధి చెన్నై నగరంలో చెన్నై సెంట్రల్ నుంచి 5 కి. మీ. దూరంలో ఉన్నది. శ్రీవారి తిరునామం పార్థసారథి పెరుమాళ్. వేదవల్లి తాయార్. ఒకప్పుడు ఈ ప్రాంతం ఒక గ్రామంగా ఉండేది. ఆలయ పుష్కరిణిలో ఉన్న అల్లి పూల పేరు మీద ఈ గ్రామానికి అల్లిక్కేణి అని పేరు ఏర్పడింది.
🌷గర్భగృహంలో మూలవిరాట్టుతో పాటు రుక్మిణి, బలరాముడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, సాత్యకిల విగ్రహాలు ఉన్నవి. ఈ ఒక్క క్షేత్రంలోనే కృష్ణుడి కుటుంబానికి సంభందించిన విగ్రహాలు చాలావరకు ఉన్నవి. ఈ క్షేత్రములో స్వామి పంచ మూర్తులుగా--పార్థసారథి, రంగనాథ, నారసింహ, శ్రీ రామచంద్ర, గజేంద్రవరదులుగా వేంచేసియున్నాడు. రాములవారి సన్నిధిలో భరత, శత్రుఘ్నులు కూడా ఉన్నారు.
🌷భృగు మహర్షి భగవంతుడు తన అల్లుడు కావాలని తపస్సు చేస్తాడు. ఆయనకు పుష్కరిణి లోనే అల్లి పూల మధ్య ఒక ఆడ శిశువు దొరుకుతుంది. ఆయన ఆ శిశువుకు వేదవల్లి అని నామకరణం చేసి ఆమెను పెంచి పెద్దచేస్తాడు. ఆమెకు యుక్త వయస్సు వచ్చిన తర్వాత రంగనాథుడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. వేదవల్లి తయారుకు ఈ ప్రకారంలోనే వేరే ఆలయం ఉంది.
*స్థల పురాణం:*
🌷సుమతి అను రాజు వేంకటేశ్వరస్వామిని నువ్వు అర్జునుడి రథ సారథ్యం చేసినపుడు ఎలా ఉన్నావో చూడాలనివుంది అని ప్రార్థిస్తాడు. స్వామి ఆ రాజును బృందారణ్యం వెళ్ళమని ఆదేశిస్తాడు. ఆత్రేయ మహర్షి తాను తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలం చెప్పమని తన ఆచార్యుడైన వేదవ్యాస మహర్షిని అడుగగా, ఆయన బృందారణ్యం వెళ్లి సుమతితోపాటు తపస్సు చేసుకోమంటాడు. వేదవ్యాసుడు తన శిష్యుడికి కుడి చేతిలో శంఖం, ఎడమ చేయి జ్ఞాన ముద్రలో ఉండే ఒక దివ్య మంగళ విగ్రహాన్ని ఇస్తాడు. ఆ ఎడమ చేయి ఆ విగ్రహం పాదాలను చూపిస్తూ గీతలోని చరమ శ్లోకాన్ని గుర్తు చేస్తుంది.
*సర్వ ధర్మాన్ పరిత్యజ్య*
*మా మేకం చరణం వ్రజI*
*అహం త్వా సర్వ పాపేభ్యో*
*మోక్షయిష్యామి మా శుచఃII*
🌷ఆత్రేయ ముని ఆ విగ్రహం తీసుకుని రాజును కలుస్తాడు. సుమతి పార్థసారథి దివ్య మంగళమూర్తిని చూసి తన కోరిక తీరినందుకు చాల సంతోషిష్తాడు. ఆత్రేయ మహర్షి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఈ పెరుమాళ్ తిరునామం వెంకట కృష్ణన్. ఈయనే మూల విరాట్టు. విశేషం ఏమిటంటే ఈ మూర్తికి మీసాలు ఉంటాయి. ఏ దివ్యదేశంలో ఈ విధంగా ఉండదు.
🌷సుదర్శన చక్రం స్వామి ముఖ్య ఆయుధం. కానీ ఇక్కడ పెరుమాళ్ళు చక్రం లేకుండా శంఖంతో మాత్రమే ఉంటాడు. భారత యుద్ధంలో శ్రీ కృష్ణుడు ఆయుధం పట్టనని చెప్పాడు కదా. ఉత్సవమూర్తి తిరుముఖం మీద ఉండే మచ్చలు కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడి బాణాలు వాళ్ళ అయిన గాయాల వల్ల అయినవే.
🌷సప్తఋషులు ఈ స్వామిని ఆరాధించారు. త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితర్, భారతియార్ స్వామిని విశేషంగా కీర్తిస్తూ కృతులు, పాటలు పాడినారు. స్వామి వివేకానందులవారు, రామానుజం పార్థసారథి పెరుమాళ్ భక్తులు. ఇచటనే ఆసూరి కేశవాచార్యులు గారు పుత్ర కామేష్టి యాగము చేసి "భగవద్రామానుజులవారిని" పుత్రులుగా పొందినారు.
🌷ఐదువేల ఏళ్ళ క్రితంనుంచి తిరుపతి, తిరుత్తణి, తిరువళ్లూరు నుంచి భక్తుల సముద్రస్నానానికై ఈ ప్రాంతానికి వచ్చేవారట. (మెరీనా బీచ్ ఇక్కడి నుంచి ఒక కి.మీ. మాత్రమే.)