*🧘♂️63- శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచితము - సిద్ధాశ్రమయోగులు🧘♀️
ఇతడు చంద్రవంశీయుడైన ప్రతీపమహారాజు కుమారుడు. శంతనుడు, బాహ్లికుడు, ఇతని సోదరులు. దేవాపికి చిన్నతనము నుండి లౌకిక విషయములందు ఆసక్తి లేదు. వేదాది విద్యలయందు అభిరుచి లేదు. ఎప్పుడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ భావనతో ఉండేవాడు.
కర్మిష్ఠులగు వేదవేత్తలు ఇతనిని నాస్తికునిగా భావించారు. పెరిగి పెద్దవాడైన తర్వాత నిస్సంగుడై ఇతడు అడవులకు
వెళ్ళిపోయివాడు. ప్రతీపుని తర్వాత పెద్దకొడుకు అడవులు పట్టి పోయినాడు కనుక శంతనునకు పట్టం గట్టి మహారాజును చేశాడు.
శంతనుడు రాజైన తర్వాత పన్నెండు సంవత్సరాలు దేశంలో వర్షాలు లేవు. బ్రాహ్మణులను కారణం చెప్పమని ప్రార్థిస్తే రాజ్యార్హుడైన అన్న ఉండగా నీవు రాజు కావడమే కారణం అది శాస్త్ర విరుద్ధమన్నారు. అప్పుడు కొండలు, కోనలు వెదికించి దేవాపిని తెచ్చి మహారాజు
పదవి స్వీకరించమని కోరారు.
కాని అతడు శాస్త్రోక్త కర్మలు చేయటానికి, ఆచారాలు పాటించటానికి ఇష్టపడలేదు. వైదికులాతనికి పాషండునిగా భావించి వదిలేశారు. దేవాపి మళ్ళీ అరణ్యాలలోకి వెళ్ళిపోయినాడు. అంతట వేదవేత్తలు శంతనుని చేత యజ్ఞములు చేయించి వానలు కురిపించారు. శంతనుని కుమారుడు భీష్ముడు శంతునడు తర్వాత వ్యాసమాత సత్యవతిని వివాహమాడటము విచిత్ర వీర్య చిత్రాంగదులను కనటం - భారత కథ.
దేవాపి హిమాలయాలకు వెళ్ళి యోగసిద్ధుడై కలాప గ్రామంలో తన నివాసం ఏర్పాటు చేసుకొన్నాడు. ఆ గ్రామం శంబళ ప్రాంతములోనిది. ఇదంతా సిద్ధాశ్రమ ప్రదేశం. కలి యుగాంతమునందు కల్కి భగవానుడుగా ఉదయించినప్పుడు దేవాపి మానవులను దైవ చైతన్య యుక్తులను చేయటానికి తనయోగశక్తులను ఉపయోగిస్తాడు.
ఆ కర్తవ్యం
నెరవర్చటానికి ఆ మహాయోగి సిద్ధాశ్రమ కలాప గ్రామంలో ఉన్నాడు. -
*🧘♂️మరువు🧘♀️*
ఇతడు శీఘ్రుడను మహాపురుషుని కుమారుడు. వీరిది కుశుని వంశము. సూర్యవంశీయుడైన మరువు కఠోర తపస్సు చేసి యోగసిద్ధి సాధించాడు.
శంతనుని అన్నయైన దేవాపి - ఇతడు మంచి స్నేహితులు. దేవాపి వలెనే యితడు కూడా సిద్ధాశ్రమ - కలాప గ్రామములో కలియుగాంతము దాకా ఉండి ధర్మస్థాపనకు తనశక్తిని వినియోగిస్తాడు.
మేడమ్ బ్లావెట్ స్కీ ఇతనిని చూచింది. మోరియా అనే పేరుతో కనిపించిన ఇతని చిత్రం ఐసెస్ అన్వీల్డ్ గ్రంథంలో ఆమె ప్రచురించింది.
(సశేషం )