🌹అంతర్యామికి సమర్పించే అర్చనా సామగ్రిలో
అరటిపండు తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ప్రకృతిలో ఎన్ని ఫలాలున్నా టెంకాయతో పాటు అరటిపండ్లకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. గృహ ప్రవేశం, వివాహం, అన్ని విధాలైన వ్రతాలు, శుభకార్యాల్లో ప్రత్యేకంగా అరటిపండును
వినియోగిస్తారు.
🌹అరటిపండులో విత్తనాలు ఉండవు కనుక పూర్ణఫలం అంటారు. అరటిని 'కదళీ' అనే పేరుతోనూ పిలుస్తారు. ఇతర ఫలాలన్నింటిలోనూ విత్తనాలుంటాయి. పండుతిని లోపలి విత్తనాలను వదిలేస్తాం. అప్పుడవి ఎంగిలి విత్తనాలవుతాయి. వాటినుంచే మొక్కలు మొలిచి చెట్లయి కాయలు, పండ్లు ఏర్పడతాయి. అలా లభించిన ఫలాలు ఎంగిలిపూలే కదా! వాటిని పరమాత్మకు నివేదన చేయడం ఆపచారం అవుతుందని చాలామంది నమ్మకం. కానీ, అరటి బీజంలేని ఫలంగల చెట్టుగా భూలోకంలో పుట్టింది. అన్నికాలాల్లోనూ లభించే బీజరహిత ఫలం కనుక దీన్ని పూర్ణఫలం అన్నారు.
🌹 రామాయణంలో అరటిపండు ప్రస్తావన అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. భాగవతంలో అరటి ఆవిర్భావం గురించిన కథ కూడా ఉంది. సృష్టిలో మొదట విరాట్ స్వరూపుడితో పాటు లక్ష్మి, దుర్గ, వాణి, సావిత్రి, రాధ అన్న పంచశక్తులు ఆవిర్భవించాయి.
🌹సావిత్రి అందరి కన్నా తానే గొప్ప సౌందర్యవతినన్న అహంకారంతో ప్రవర్తించేది. అది గమనించిన విరాటమూర్తి ఆమెను బీజంలేని చెట్టుగా భూలోకంలో జన్మించమని శపించాడు. ఫలితంగా ఆమె 'కదళి' పేరుతో భూలోకంలో అరటి చెట్టయి పుట్టింది. తన శాప పరిహారం కోసం అయిదువేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది. విరాటమూర్తి ప్రత్యక్షమై ఆమెకు పుణ్యలోక ప్రాప్తిని కలిగించాడు. అంతేకాక, ఆమె అంశను మాధవ, మానవసేవ నిమిత్తం భూలోకంలో శాశ్వతంగా ఉంచవలసిందిగా ఆదేశించాడు. విరాటమూర్తి ఆదేశం పొందిన పర్వదినమే మాఘ బహుళ చతుర్దశి. దీనికున్న మరో పేరు 'అరటి చతుర్దశి'.
🌹అరటి ప్రాముఖ్యంతో పాటు, దాని పూజా విధానాన్ని సైతం భరద్వాజ మహర్షి సీతారాములకు వివరించిన వైనం రామాయణంలో కనిపిస్తుంది. అరటి పిలకను, చెట్టును కొన్ని ప్రాంతాల్లో పూజిస్తారు. పసుపు, కుంకుమలతో, పూలమాలలతో అరటిచెట్టును. అలంకరిస్తారు. దీపారాధన చేస్తారు. ధూపమిచ్చి పెసరపప్పు, బెల్లం, తులసిదళాలు నైవేద్యంగా సమర్పిస్తారు. అయిదుగురు ముత్తయిదువులను పిలిచి, భోజన తాంబూలాదులతో సత్కరించి అరటిపండ్లు దానంగా ఇస్తారు. పూజ చేసినవారు మధ్యాహ్నం భోజనం చేయరు. సాయంత్రం చంద్రదర్శనం తరవాతే భోంచేస్తారు. సత్సంతానం కోసం అరటిపూజ చేస్తారంటారు.
🌹రామాయణంలో సీతారాములు అరటిపూజ చేసినట్లు తెలుస్తోంది. రావణవధానంతరం సీతారాములు భరద్వాజాశ్రమంలో విడిది చేశారు. అందరికీ అరిటాకుల్లో వడ్డించారు. తినడానికి ఉపక్రమించే సమయంలో హనుమకు అరటి ఆకు మిగల్లేదు. శ్రీరాముడు తన కుడివైపున మారుతిని కూర్చుండబెట్టుకొని, తన ఆకులోనే ఓ పక్కన అతడికి వడ్డించమని చెప్పాడు.
🌹శ్రీరాముడికి, ఆంజనేయుడికి చేసే పూజలో అరటి ఆకులో అరటిపండ్లు అర్పించేవారి వంశం అభివృద్ధి చెందుతుందని కొందరి నమ్మకం.
🌹అరటి ఆకులో చేసే భోజనం ఆయుష్షును పెంచుతుందంటారు.
🌹అరటిచెట్టులోని ప్రతి భాగం ఎంతో పవిత్రమైంది.
🌹ఆరోగ్యప్రదమైంది.
🌹 అరటి ఆకు భోజనం అతిథులకెంతో ఆనందం కలిగిస్తుంది.
🌹అరటి బోదెలలో దీపాలు వెలిగిస్తారు.
🌹అరటిపువ్వును కాయలను కూరలకు వినియోగిస్తారు.
🌹తాంబూలంలో రెండేసి అరటిపండ్లు ఉంచి పెద్దలకు సంభావనగా ఇస్తారు.
🌹 అరటిపండు మంచి ఆరోగ్యకర ఆహారం.
🌹అరటిచెట్లతో కల్యాణమండపాలను అలంకరిస్తారు.
✍️చిమ్మపూడి శ్రీరామమూర్తి