🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*నిజమైన ధర్మము సాక్షాత్తుగా భగవంతుని చేతనే చెప్పబడింది. అందుకే భగవంతుడు తప్ప ఇంకొకరి నుండి దానిని నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఆ విషయమే భగవద్గీతలో చక్కగా "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం” అని చక్కగా చెప్పబడింది. అదే భగవచ్చరణాగతి. అదే ధర్మము. కేవలము శరణము పొందడం కాదు, ఆ దేవదేవుని ఇచ్ఛానుసారము వర్తించాలి లేదా భగవత్ప్రేమికుడు కావాలి. అదే సర్వోన్నతమైన ధర్మము. ఈ విషయాన్నే నేను మీకు చాలాసార్లు వివరించాను.*
*“స వై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే" - ఏ ధర్మమైతే భగవత్ప్రేమికుడయ్యే విధమును బోధిస్తుందో అదే సర్వోన్నతమైన ధర్మము. నీవు భగవత్ప్రేమికుడవైతే నీ జన్మము ధన్యమౌతుంది. అపుడు నీవు భగవంతుని కొరకు ఏదైనా చేస్తావు. లేకపోతే “నేనెందుకు అది చేయాలి?” అనే ప్రశ్న వస్తుంది. ఆవిధముగా అడుగుతున్నావంటే ప్రేమ లేదని అర్థం. కాని ప్రేమ ఉంటే ప్రశ్నలే ఉండవు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు యోగము, జ్ఞానము, కర్మ వంటి ఎన్నో విషయాలు చెప్పిన తరువాత చివరకు “సర్వగుహ్యతమం నేను నీకిపుడు పరమ రహస్యాన్ని చెబుతున్నాను" అని పలికి "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ" అని అన్నాడు. అది పరమ రహస్యమైన విషయం. సాధారణంగా మనిషి ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే నాల్గింటిని సమ్మతిస్తాడు. ధర్మమంటే ధర్మపాలనము, అర్థమంటే ఆర్థికాభివృద్ధి. కామమంటే ఇంద్రియతృప్తి, చివరకు మోక్ష ప్రాప్తి. కాని ఇదంతా భౌతికమైన స్థితి. మనిషి వీటిని దాటి ఆధ్యాత్మికస్థితికి రావాలి. అదే “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం". మనుషులు ఏదో బాహ్యానికి ధర్మపాలన చేపడతారు. కాని వారి ముఖ్యోద్దేశ్యము ఇంద్రియతృప్తి. కాని అది నిజమైన ధర్మము కాదు. నిజమైన ధర్మమంటే ఇంద్రియతృప్తి శూన్యం. కేవలము భగవంతుని సంతృప్తిపరచడమే నిజమైన ధర్మం.*
*కృష్ణకృపమూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 1974 జనవరి 21 వ తేదీ హవాయి దేశంలో ఇచ్చిన సందేశం*