ప్ర : శివకేశవుల ఆభేదం గురించి తరచు చెబుతుంటారు. నేనూ విశ్వసిస్తాను. కానీ భాగవతంలో విష్ణునే పరముడు (సర్వోన్నతుడు) అని ఉన్నది. భస్మాసురుని విషయంలోను , భృగుమహర్షి త్రిమూర్తుల్ని పరీక్షించే సందర్భంలో శివుని కంటే విష్ణువు అధికుడని ఉన్నది కదా!
జ: పురాణ కథల్ని చక్కగా సమన్వయించుకోవాలి. విష్ణుభక్తులకు విష్ణువునందు నిష్ఠ కల్పించే విష్ణుపారమ్య పురాణాలలో భాగవతం ఒకటి. అలాగే శివ పారమ్యాన్ని నిరూపించే పురాణాలు కూడా ఉన్నాయి. శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించినప్పుడు బ్రహ్మవిష్ణువులు తుదిమొదళ్ళు తెలుసుకోలేకపోయారనీ, అలాగే-విష్ణువు, శివుని అర్చించి సుదర్శన చక్రాన్ని పొందాడనీ, దక్షయజ్ఞ ఘట్టంలో యజ్ఞరక్షకుడుగా ఉన్న విష్ణువు వీరభద్రుని చేతిలో ఓడిపోయాడనీ అనేక ఉదాహరణలు శివ సంబంధ పురాణాలలో చాలా కనిపిస్తాయి. వాటిని చూపించి 'శివుడే పరముడు' అని నిరూపించవచ్చు. అలాగే శక్తి సంబంధ పురాణాల ఆధారంగా దేవీపారమ్యాన్ని (దేవియే సర్వోన్నతురాలని) ఋజువు చేయవచ్చు.
ఇవన్నీ ఒకే వ్యాసుడు రచించాడని మరచిపోవద్దు. అక్కడ ఇతర దేవతలని తక్కువ పరచాలని ఉద్దేశంకాదు. దీనిని 'నహినిందాన్యాయం' అంటారు. (ఇందులో ఇతరు దేవతల నిందలేదు- అని అర్థం). తాను ఉపాసించే దైవాన్ని సర్వాధిక భావనతో కొలుచుకొనడమే ప్రధానోద్దేశం.
ఒకే పరమమైన తత్త్వాన్ని విష్ణువని కొందరు ఉపాసిస్తే, ఇంకొందరు శివుడని ఆరాధిస్తారు. మరికొందరు శక్తి అంటారు. ఉపాసనా సంప్రదాయాలు ఎన్నైనా- వాటిలో సమైక్యంగా ఉన్న పరమాత్మ తత్త్వాన్ని వివేకంతో సమన్వయించి బోధించవలసిన బాధ్యతను పండితులు మరువరాదు. దైవాన్ని తన కోరిక తీర్చే ఒక దేవత రూపంగా భావించేవారికి ఆ కోరిక తీర్చడం వరకే దేవత బాధ్యత. ఆ దేవత పరతత్త్వంగా భక్తితో ఉపాసించేవారికి జ్ఞానం, ముక్తి లభిస్తాయి. భస్మాసురుడు, శివుని తన కోరిక తీర్చే దేవతగా పూజించాడు. అంతవరకే అతడి దృష్టి. అతడికి పరమాత్మ భావనలేదు. కనుక జ్ఞానం లభించలేదు. అయితే - ఏ రూపంలో దేవత వరమిస్తుందో, ఆ రూపంలో శిక్షించదు. అందుకే భస్మాసురుని శివుడు సంహరించలేదు. ప్రళయకాలంలో కాలాగ్నిరుద్రుడై సర్వ జగతినీ దహించే స్వామికి భస్మాసురుడు ఒక లెక్కా? దేవతానియమం ప్రకారం - వరమిచ్చిన రూపంలో శిక్షించరాదు కనుక శివుడు ఉపేక్షించాడు. ఆ తత్త్వమే విష్ణురూపంలో శిక్షించింది. ఇలా అన్వయించి గ్రహించాలి.ఇలా కాకుండా - విశాలత లేని సంకుచిత బుద్ధులతో, ఒకే గ్రంథానికి లేదా సంప్రదాయానికి పరిమితమై ఇతర సాంప్రదాయాలను, దేవతలను నిందించితే జ్ఞానము, ముక్తి లభించవు.
ఎవరు ఏ సాంప్రదాయంలో ఉన్నా విశాలబుద్ధితో ఆలోచించి సమన్వయించుకొనే సహృదయం ఉన్నప్పుడే తరించగలరు.