🔱భద్రకాళి🔱
🚩🚩
బంగ్లాదేశ్ లోని పోక్రా రైల్వే స్టేషన్ నుండి
సుమారు 20 మైళ్ళ దూరంలో వున్న అందమైన భవానీపూర్ ను ఆనుకొని కరతోయా నది ప్రవహిస్తున్నది. ఈ నదీ తీరాన్నే "భూతాద్రి" ఆలయం వున్నది. ఈ ఆలయంలో
" కరతోయా
పీఠేశ్వరి" అని పిలవబడే భద్రకాళి రూప రహితంగా కొలవబడుతున్నది.
ఈ దేవినే అపర్ణ అని కూడా పిలుస్తారు.
లింగ రూపంలోనే దేవి వున్నదని ఆ దేవతే
"భద్రకాళిగా " భావించి
స్థానికులు ప్రాచీనకాలం నుండి పూజిస్తున్నారు.
51 శక్తి పీఠాలలో యీ పీఠం ఒకటి. ఈ స్థలంలోనే అమ్మవారి ఎడమ చెంప పడినందు వలన ఇది మహాశక్తి పీఠంగా పూజించబడుతున్నది.
ఒకానొక కాలంలో శుంభ ,నిశుంభులనే రాక్షసులు ముల్లోకాలను జయించి ప్రజలందరినీ హింసిస్తూ వచ్చారు. వారు
దేవలోకాన్ని కూడా వారు వదలలేదు.
దేవతలనందరిని స్వర్గం నుండి తరిమికొట్టారు. వారి నుండి తప్పించుకుని దేవతలు అడవులలో , కొండగుహలలో తలదాచుకున్నారు. దేవతలంతా దేవ గురువైన బృహస్పతి సలహాపై కైలాసానికి వెళ్ళి అక్కడ మహాదేవిగా అనుగ్రహిస్తున్న
ఆదిపరాశక్తి ని బీజాక్షర మంత్రసహితంగా భక్తితో జపించారు. దేవి అఖిలాండేశ్వరి రూపంలో సింవాహనం పై ఆశీనురాలై దర్శనమిచ్చినది.
కోటి సూర్యప్రభల ప్రకాశంతో ప్రత్యక్షమైన దేవిని చూసి దేవతలంతా పులకించిపోయారు.
వారంతా ముక్తకంఠంతో శుంభ, నిశుంభుల దౌష్ట్యం నుండి తమను కాపాడమని శరణుకోరారు.
దేవతల బాధలను ఆలకించిన దేవి పరాశక్తి తక్షణమే తన శరీరం నుండి కౌశికి అనే ఒక నల్లని , వికృతాకార శక్తిని ఆవిర్భవింపజేసింది.
నల్లని శరీరంతో మహా ఘోర స్వరూపంతో
వున్నందున ఆ దేవి "భద్రకాళి" అని దానవులకే భయాందోళనలు కలిగించేవిధంగా
వున్నందున "కాళరాత్రి" అని పిలువబడినది. శుంభ నిశుంభులతో
యుధ్ధానికి తరలివెళ్ళే ముందు దేవతలశక్తి అంతా వివిధ శక్తిరూపిణులుగా మారి భద్రకాళి వాహనాన్ని వెన్నంటి యుధ్ధరంగానికి చేరేరు.
సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుని బ్రహ్మశక్తి హంసవాహినియై జపమాల, కమండలం ధరించి " బ్రాహ్మణి " అనే పేరుతో వచ్చింది. స్థితికారుడైన మహావిష్ణువు యొక్క శక్తి గరుడ వాహినియై శంఖు ,చక్ర, గదాపాణియై " వైష్ణవి" అనే పేరుతో వచ్చింది.
లయకారుడైన రుద్రుని శక్తి శ్వేతవర్ణంతో
నంది వాహనం పై త్రిశూలధారిణయై
తదియ చంద్రుని ధరించి , "మహేశ్వరీ "అనే పేరుతో వచ్చినది. కుమారస్వామి శక్తి మయూర వాహనంపై శక్తి ఆయుధంతో "కౌమారి అనే పేరుతో వచ్చినది.
దేవతలకధిపతి అయిన ఇంద్రుని వద్ద వున్న
శక్తి ఐరావతమనే ఏనుగుపై ఆశీనురాలై వజ్రాయుధాన్ని చేత ధరించి సర్వాభరణభూషితయై "ఐంద్రి" అనే నామంతో వచ్చింది.
వరాహమూర్తి యొక్క వరాహ శక్తి
" వారాహి " అనే పేరుతో వచ్చింది. ధర్మ ప్రభువైన యమధర్మరాజు
శక్తి నల్లదున్నపోతుపై ఆశీనురాలై
చేతిలో దండాయుధంతో , ఘోర రూపిణియై
"యమి" అనే పేరుతో వచ్చింది.
నైఋతి శక్తి సింహ రూపంతో"నరసింహం" అనే పేరుతో వచ్చింది. వరుణ శక్తి
" వారుణి '' అనే పేరుతో వచ్చినది.
కుబేర శక్తి " కౌబేరి" అనే పేరుతో చివరగా వచ్చినది. ఈవిధంగా వరుసగా వచ్చిన పది దేవతాశక్తులు భద్రకాళికి
రెండు ప్రక్కలా అండగా నిలబడి దానవులతో జరిగిన యుధ్ధంలో తగు సహాయం చేసి
భద్రకాళి విజయానికి తోడ్పడ్డారు.
స్త్రీలవలన తప్ప తమకి మరణం రాకూడదనే వరాలు పొందిన ఆ దుష్ట దురహంకార
దానవులు యుధ్ధంలో దారుణంగా మరణించారు. ఆ దానవుల సంహారానంతరం ముల్లోకాలలో ప్రశాంతత ఏర్పడి ఆనందం వెల్లివిరిసింది.
దేవతలందరూ భద్రకాళిదేవిని ఘనంగా కీర్తించారు.
భద్రకాళి మాతకు యీ పదిమంది దేవతలందించిన సహాయాన్ని గురించిన
చరిత్ర దేవీ భాగవతంలో వివరించబడింది.