తిరుక్కోట్టియూర్ Part II
🍂ఇచ్చట సన్నిధి మూడు అంతస్తులుగా ఉండును. ఈ సన్నిధి విమానము విశ్వకర్మచే నిర్మింపబడినది. మొదటి అంతస్తు భూలోకం, రెండవ అంతస్తు క్షీరసాగరం, మూడవ అంతస్తు వైకుంఠం. స్వామి మొదటి అంతస్తులో కృష్ణుడు నాట్యభంగిమలో ఉన్నట్లు, రెండవ అంతస్తులో శయన భంగిమలో, మూడవ అంతస్తులో నిలుచున్న భంగిమలో దర్శనం ఇస్తాడు.
🍂ఇక్కడ స్వామి దేవతలకి నృసింహ అవతారంలో దర్శనమిచ్చాడు. దేవతలు హిరణ్యకశిపుని బారినుంచి రక్షించమని శ్రీ మహా విష్ణువును వేడుకుంటారు. నారాయణుడు నరసింహ అవతారం ఎత్తడానికి సంసిద్ధుడవుతాడు. దేవతలు స్వామివారి అవతారమును ముందుగానే చూడాలని వేడుకుంటారు.
🍂స్వామి అనుగ్రహిస్తాడు. ఈ సన్నిధిలో హిరణ్యకశిపుని వధించే భంగిమలో నిలువెత్తులో ఉన్న నరసింహ స్వామి మూర్తి ఉన్నది. దీనినిబట్టి ఈ ఆలయం నరసింహావతారా కాలానికే ఉన్నట్లు తెలుస్తూంది. ఈ ఆలయంలో శివలింగం, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మూర్తులు కూడా ఉన్నవి.
🍂ఇది ఒక విశిష్టమైన క్షేత్రం. ఎందుకనగా -- భగవద్ రామానుజులు 1017 వ సంవత్సరములో అవతరించారు. వారు సాక్షాత్ ఆదిశేషుడి అవతారం. వారి కాలంలో ఎవరికీ తిరుమంత్రం (అష్టాక్షరీ మంత్రం) తెలియదు. తిరుక్కొట్టియూర్ నంబికి ఆ మంత్రం తెలుసునని తెలిసి, వారి దగ్గరకు రామానుజులు వెళతారు. వారి కటాక్షం కలుగదు.
🍂మళ్ళీ వెళతారు ఫలితం దక్కదు ఇలా 18 సార్లు వెళతారు. 18 వ సారి రామానుజులు వారికి తిరుక్కొట్టియూర్ నంబి తిరుమంత్రం ఉపదేశిస్తారు. అయితే వారు ఒక షరతు పెడతారు. ఈ మంత్రం ఇంకెవ్వరికి ఉపదేశించ రాదనీ, ఆలా చేసినట్లయితే రామానుజులు నరకానికి వెళతారని షరతు పెడతారు. రామానుజులు సరే అంటారు. గురువుగారు మంత్రం ఉపదేశిస్తారు.
🍂అనంతరం రామానుజులు సన్నిధి పైకి వెళ్లి ప్రజలను పిలిచి తిరుమంత్రం చెపుతారు. ఆలాగున తిరుమంత్రం జనబాహుళ్యంలోకి వస్తుంది. గురువుగారు రామానుజులును పిలిచి ఎందుకు వాగ్దాన భంగం చేసావు అని అడుగుతారు. రామానుజులు గురువుకు క్షమాపణ చెప్పి, నేను మాట తప్పాను.
🍂నరకానికి పోతాను కానీ ఈ తిరుమంత్రం తెలుసుకున్న వాళ్ళందరూ మోక్షం పొందుతారు అని విన్నవించుకుంటారు. విషయం తెలుసుకున్న గురువుగారు రామానుజులును క్షమించి వారికి ఎమ్బెరుమానార్ అనే బిరుదు ప్రదానం చేస్తారు.