విభూత్యాభిషేకం * భస్మ హారతి -’భస్మ హారతి’ దర్శనం మానవ జీవితంలో పునర్జన్మ హరణం

P Madhav Kumar


విభూత్యాభిషేకం ఎన్నో వేల ఏండ్ల నుండి ఉజ్జయినిలోని మహంకాళేశ్వరునికి జరుగుతున్నది. అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైన మందిరం ఉంది. భస్మమందిరం అని పిలుస్తారా మందిరాన్ని. విభూతిని ఆవు పేడతో తయారుచేస్తారక్కడే.


భస్మమందిరంలోకి ఆవుల్ని తెచ్చి వాటి పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామి వారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూత్యాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది. తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు. అలా కొట్టినప్పడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతు న్నప్పుడు శంఖాలు, భేరీలు, పెద్ద పెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అపుడు అక్కడ మీరొక అలౌకికమయిన స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు.


రెండవ రకం అభిషేకంలో పురుషుల్ని సంప్రదాయక దుస్తులతో బ్రాహ్మీ ముహూర్తం లో తెల్లవారు జామున దేవాలయం లోపలికి పంపిస్తారు. అప్పుడే శ్మశానంలో దహనం చేయబడిన శవం యొక్క భస్మాన్ని అర్చకులు తెచ్చిస్తారు. ఆ భస్మపాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చుని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు.


ఇక్కడ జరిగే భస్మహారతి కైలాసనాధుని దర్శనభాగ్యం కలిగినంతటి ఆనందాన్ని ఇస్తుందంటారు. బ్రహ్మసైతం ఈ “భస్మపూజ” చేశారనీ, కనుకనే ఈ క్షేత్రాన్ని 'మహాస్మశానం' అని పిలవడం జరుగుతోందని కొన్ని పురాణ కథలు చెబుతున్నాయి.


ఈ స్వామి దర్శనం అకాల మృత్యువు నుంచి రక్షిస్తుంది. 12 సంవత్సరాలకోసారిక్కడ ఎంతో ఘనంగా జరిగే కుంభమేళాలో లక్షలాదిగా భక్తులు పాల్గొంటారు. ఈ క్షేత్రాన మరణించినవారికి పునర్జన్మ ఉండదనే విశ్వాసం ప్రబలంగా ఉన్నది.


శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి వారికి “భస్మ హారతి”(అస్థికల సమర్పణ) ప్రతీరోజూ ఉదయం 4 గంటలకు తప్పనిసరిగా జరుగుతుంది. ఆర్తి సమయంలో మంత్రాలు జపించడం, గంభీరమైన ధ్వనులు చేయటం వల్ల గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనాలతో మార్మోగిపోతుంది.


’ఈ భస్మహారతి’ 10 మంది నాగ సాధువుల ద్వారా జరుగుతుంది. కేవలం పురుషులకు మాత్రమే ఈ భస్మ హారతిలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. స్త్రీలకు ఈ హారతిలో పాల్గొనడానికి కానీ, చూడటానికి కానీ అనుమతి లేదు. భక్తులను గర్భగుడి బయట ఉన్న నంది మంటపంలో, బారికేడ్ల వెనుకకు అనుమతించబడతారు. కేవలం 100 మందికి మాత్రమే వసతి వున్న నంది మంటపంలో సుమారు 500 భక్తులు బారికేడ్ల వెనుక, సమీపంలో కూర్చుని దర్శనం చేసుకొంటారు.


’భస్మ హారతి’ దర్శనం మానవ జీవితంలో పునర్జన్మ హరణం.


🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat