గరుడ పంచమి :

P Madhav Kumar

గరుత్మంతుడు పక్షులకు రాజు. సర్పజాతికి శత్రువు. ఆయన గొప్పదనమంతా విష్ణుమూర్తిని వాహనరూపుడై సేవించడంలోనే ఉంది. నిరంతర స్వామి పాదసేవా పరాయణుడు గరుడుడు. అపార శక్తికి, అద్భుత గమనానికి సంకేతంగా ఆ పక్షిరాజును దేవతలు భావిస్తారు. విష్ణువు పతాకం మీద గరుత్మంతుడు అధిష్ఠించి ఉంటాడు. విష్ణునామాల్లో గరుడధ్వజుడనేది ప్రసిద్ధనామం. గరుత్మంతుని పేరుతోనే గరుడ పురాణం ఉంది. మరణించిన వ్యక్తికి కర్మకాండ పూర్తయ్యేంత వరకూ అశౌచ దినాల్లో గరుడ పురాణాన్ని పఠించడం ఒక ఆచారంగా వస్తోంది. ఇలా చేస్తే మరణించిన వ్యక్తికి పుణ్యలోకాలు లభిస్తాయని నమ్మకం. వివిధ ప్రాంతాల్లో గరుడ పంచమి గరుడుడు తల్లి దాస్యాన్ని విముక్తి చేసిన శ్రావణ శుద్ధ పంచమినాడు గరుడ పంచమి పర్వదినంగా జరుపుకోవడం ఆచారం. పంచమి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుచిగా కొయ్యతో చేసిన చతురస్రాకారంలో ఉన్న పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అయిదు రంగులతో ముగ్గు పెట్టాలి. పీటపై ముగ్గుమధ్యలో బియ్యం పొయ్యాలి. ఆ బియ్యం మధ్యలో తమలపాకు ఉంచి దానిపై బంగారు, వెండి లేదా మట్టితో చేసిన గరుత్మంతుని ప్రతిమ ఉంచాలి. ఇవేవీ వీలు కాని పక్షంలో  గరుతంత్ముని చిత్రపటాన్ని ఉంచి పూజించవచ్చు. పూజకు ముందుగా అయిదు రంగుల దారాలకు అయిదు ముడులు వేసి అయిదు పూలతో కట్టిన తోరాన్ని ఉంచాలి.అనంతరం షోడశోపచారాలతో గరుడుణ్ణి పూజించాలి. చక్రపొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజించిన తోరాన్ని స్త్రీలు కుడి చేతికి ధరించాలి. ఇలాచేస్తే సర్ప భయం ఉండదని విశ్వసిస్తారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat