బసవ పురాణం - 19 వ భాగము🙏

P Madhav Kumar


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


నది సాగరంలో కలిశాక తన నదీ స్వరూపం పోగొట్టుకుంటుంది. సిద్ధరస స్పర్శతో రాగి బంగారంగా మారిపోతుంది. అలాగే గురు కరస్పర్శచే కులాన్ని పోగొట్టుకున్న తర్వాత బ్రాహ్మణుడూ అంత్యజుడూ సమానమే అవుతారు. ధరపై ‘ఉమా మాతా పిత రుద్రః’ అని అన్నపుడు వేరే తల్లి ఎక్కడిది భక్తుడికి? మాణిక్యం మసికోకలా కట్టినా కాంతి చెడదు. అలాగే హరి భక్తుడు అంత్యజాతివాడైనా అతడి ఉన్నతికి లోపం రాదు. పద్మం బురదనుంచే పుడుతుంది. అయినా అది పూజకు పనికిరాకుండా పోయిందా? నిప్పు కొయ్యల మధనంవల్లనే పుడుతుంది. అయినా దాని పవిత్రత తగ్గిందా?

అంతేకాదు, వ్యాసుడు బోయవనితకు పుట్టాడు. వసిష్ఠుడు ఊర్వశి అనే లంజకు పుట్టాడు. మాతంగ మహర్షి మాతంగికి పుట్టాడు. వీరే కదా మహర్షులు! జన్మవల్ల వారి ఋషిత్వానికి భంగం వచ్చిందా? చెప్పు రాజా!’’

అని ఈ విధంగా బసవేశ్వరుడు అనేసరికి బిజ్జలుడు మండిపడ్డాడు. ‘‘నీవు రాజ్యమంతా ఛండాలురతో కలిపివేశావు. అదేమిటని అడిగితే ఏవేవో కట్టుకథలు పురాణాలు చెపుతున్నావు. నీవు ఏమి చెప్పినా శివభక్తుల శరీరం కోస్తే పాలూ, ఇతరులను కోస్తే నీరూ రాదు. అందరిలోనూ రక్తం సమానమే!’’ అని బిజ్జలుడు ఇంకేదో అనబోతుండగా ‘‘ఎన్నటికీ సమానం కాదు. రాజా! భక్తుణ్ణి చిదిమితే పాలే కారుతాయి. మామూలు మనుషులవలె రక్తం కారదు’’ అన్నాడు బసవడు.

‘‘రాజా! కావాలంటే శివనాగుమయ్యగారు పవిత్రమైన హస్తాన్ని చిదిమి చూపిస్తాను. పాలు గారుతాయో నెత్తురు కారుతుందో చూడు’’ అని శివనాగుమయ్యకు శరణు చేసి బసవన్న ఆ మాటా ఈమాటా మాట్లాడుతూ సరసమాడున్నట్లుగా నటించి గభాలున శివనాగుమయ్య చేతి చివర కత్తితో సన్నగా కోశాడు.

వెంటనే చేతిలోనుండి పాలు ఆకాశమెత్తున పైకి చిమ్మాయి. ఆ కారింది పాలు కాదు బసవడనే దూడకోసం భక్తి అనే కామధేనువే పాలిచ్చినట్లయింది. అది చూచి బిజ్జలుడు నివ్వెరపోయాడు. పరుగు పరుగున శివనాగుమయ్య పాదాలబడి శరణు వేడాడు. చూస్తున్న సమస్త జనమూ శివనాగుమయ్యకు జేజేలు పెట్టారు. ఆ తర్వాత శివనాగుమయ్యను పెద్దగా ఏనుగు ఎక్కించి తానూ పక్కనే కూర్చొని బసవన్న ఊరేగించాడు.

బోయల తగవు

ఇలా ఉండగా ఒకనాడు కొందరు బోయలు బిజ్జలుని వద్దకు పోయి ఇలా విన్నవించుకున్నారు. ‘‘ప్రభూ! ఈ బసవన్నను చూచి నేడు ప్రతివాడూ తాను భగవంతుడినని చెప్పుకొంటూ బయలుదేరారు. శ్రీకంఠశివులు, గౌరీనాథశివులు, లోకేశ శివులు, త్రిలోచన శివులు, మహేశ్వర శివులు, పాశమోచన శివులు, పరమాత్మ శివులు, శాశ్వత శివులు గణేశ్వర శివులు, విశే్వశ్వ శివులు, విమలాత్మ శివులు, త్రిపురాంతక శివులు, త్రినయన శివులు, ద్విపదైత్య హరిశివులు, దేవేశ శివులు, ఉరులింగ శివులు- ఉగ్రాక్ష శివులు, హరిశివులు పరమానంద శివులు, ధర్మశివులు, విద్యాధర శివులు, నిర్మల శివులు, నిష్కల శివులు మొదలైన శివముఖ్యులంతా తయారైనారు. ఇవేమి మతాలో మాకు అర్థంకావడంలేదు.

ప్రభూ! దేవాలయంలో ప్రసాదం మాకే చెందవలసి వుంది. ఇది వంశపారంపర్యంగా వస్తున్న ఆచారం. పూర్వం మా వంశస్థుడైన బోయబాలుడు పసులు కాయడం కోసం వెళ్లి ఇసుక లింగాన్ని చేసి మందలోని పసువుల పాలతో అభిషేకం చేశాడు. అది చూచి ఆ బాలుడి తండ్రి ‘పాలన్నీ నేలపాలు చేశావా’ అని క్రోధంతో ఆ ఇసుక లింగాన్ని కాలితో తన్నాడు. వెంటనే బాలుడు తండ్రి అని కూడా గౌరవించకుండా శివద్రోహంచేసిన ఆ రెండు కాళ్లనూ నరికివేసి శివుని మెప్పించాడు. ఇలా శివుని చేత ప్రసాదం పొందాడు. నాటి నుండి పారంపర్యంగా శివప్రసాదం మాకే వస్తున్నది.

అట్లాంటిది ఇప్పుడీ భక్తులంతా బసవన్న బలం చూచుకొని ప్రసాదాన్ని ఆరగించడం కోసం వచ్చారు. పైగా మాకు కొంచెం కూడా మిగల్చడం లేదు. నిర్మాల్యం స్వీకరించడమే వృత్తిగా గల మాకు ఇలా జరగడం అన్యాయం అని మొరబెట్టుకున్నారు.

ఆ రాజు మాటలు విని కోపగించి బసవన్నను పిలిపించాడు. ‘‘బసవన్నా, అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని కాదని బోయలకెందుకు అన్యాయం చేశావు?’’ అని ప్రశ్నించాడు. అది విన్న బసవన్న ఇలా అన్నాడు.

‘‘ప్రభూ! ప్రసాదం ఎక్కడ వుంది? బాణ లింగాలలో స్ఫటిక లింగాలలో ప్రాణ లింగాలలో పుష్యరాగాది మణిమయ లింగాలలో లేదు ప్రసాదం. ఆగమాలలో చెప్పబడ్డ ప్రకారం మహేశ్వర ప్రసాదం, తలదాల్చినా, తీసుకున్నా, చివరకు చూచినా సరే నరకానికి పోతారు. ఇది వేదములో కూడా ఉంది. గురువు దయతో చూపే అనురాగమే మహాప్రసాదము. సుప్రసన్నమైన ఆనంద ప్రసాదం, శుద్ధ ప్రసాదం, లింగ ప్రసాదం, పరమ పవిత్ర సంపత్ప్రసాదం, భవరోగములకు ఔషధ ప్రసాదం. సత్య ప్రసాదం, నిత్య ప్రసాదం, మహారాజా! అరుదగు సంగమేశ్వరుని దయా ప్రసాదమే అది. అంతేకాని వేరుకాదు🙏


🙏 హర హర మహాదేవ🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat