అందువల్ల భక్తి అనే ప్రసాదం భక్తులకే చెందుతుంది. బోయలకు చెందదు’’ అన్నాడు. అప్పుడు బోయలు ‘‘కాశి, గయ, కేదారం, సౌరాష్ట్రం, దక్షారామం, శ్రీశైలం, రామేశ్వరం మొదలైన ఆగమస్థానాలన్నింటిలోనూ ప్రసాదం మాకే చెందాలి. మా ప్రాణాలైనా విడుస్తాము కానీ ప్రసాదం మీరు తీసుకోవడానికి వీలులేదు’’ అని బసవన్నతో కోపంతో అన్నారు.
అప్పుడు బసవన్న కళ్లతో నవ్వి ‘‘తాటాకులు గాలికి కదులుతై కాని గుట్టలు కదలవు. నదిలో బెండ్లు తేలుతాయి కాని గుండ్లు తేలవు. శివుని ప్రసాదం బలవంతంగా స్వీకరించడం బ్రహ్మ విష్ణులకే సాధ్యం కాదు గాని మీకు సాద్యమా? వెళ్ళండి ఇక్కడినుంచి. నిజంగా సంగమేశ్వరుని ప్రసాదం మీద మీకంత భక్తీ అనురాగాలు ఉన్నాయా? అయితే రండి ఇవ్వాళ నీలకంఠుడైన మన స్వామివారికి నేను కాలకూట విషం నైవేద్యం పెడుతున్నాను. వచ్చి తీసుకొనిపోండి’’ అన్నాడు.
‘‘ఓహో! బసవన్న మమ్మల్ని అందరినీ ఒకసారి చంపాలని ఈ యుక్తి పన్నాడు. లేకుంటే విషం నైవేద్యం పెట్టి తిమని ఎవరైనా అంటారా? మహాప్రభూ! బతికివుంటే బలుసాకు తిని జీవించవచ్చు. అంతేకాని ఈ బసవన్నతోడి వాదం పెట్టుకొని బోనులో పడ్డ ఎలుకల్లాగా ప్రాణాలు కోల్పోయేందుకు సిద్ధంగా లేము.
ప్రభూ! విషం ప్రసాదంగా శివునికిచ్చినవాడు ఎవరైనా ఉన్నట్లు లోకంలో మనం విన్నదీ కన్నదీ లేదు. పోనీయండి. ఈ బసవయ్యగారూ వారి భక్తగణమూ చాలా గొప్పవారు కదా, ఆ విషమే వారినే నైవేద్యం పెట్టి ఆరగించమనండి ముందు. ఆ తర్వాత మేము తింటాము’’ అన్నారు బోయలు. బసవడది విని నవ్వి ‘మంచిది. అలాగే గుడికి పోదాము రండి’ అని రాజునూ బోయలనూ పిలిచాడు.
ముందు బసవేశ్వరుడు నడువసాగాడు. అసంఖ్యాక భక్తగణం ఆయనను చుట్టుముట్టి ముందుకు సాగింది. ఈలోగా బసవేశ్వరుడు సృష్టిలోనున్న విషాలనన్నింటినీ తెప్పించాడు. శృంగి, నాభి మొదలైన విషాలను నూరించాడు. ఆ గాలి తగిలి జంతువులు చచ్చిపోయాయి. ఆకాశంలో ఎగిరే పిట్టలు రాలి పడ్డాయి. అలాంటి భయంకర కాలకూట విషాలనన్నింటిని బంగారు గినె్నలలోకి ఎత్తించాడు. ఆ గినె్నలన్నిటినీ సంగమేశ్వరుని గర్భగుడిలోకి చేర్పించాడు.
అప్పుడు బసవన్న సంగమేశ్వరుణ్ణి ధూప దీపాదులతో అర్చించి పంచమహావాద్య పటలము మ్రోగించి, మడిమాల మాచయ్య మొదలైన భక్త గణానికంతా శరణు చేసి విషాన్ని శివునికి నైవేద్యం పెట్టాడు. శివునికి నివేదన చేయడంవల్ల అది ప్రసాదమైనట్టే లెక్క!
బసవడు చిరునవ్వు నవ్వి ఆ శివ ప్రసాదాన్ని గినె్న ఎత్తుకొని తాగాడు. అది చూచి సృష్టి గడగడ వణికిపోయింది. గినె్న తర్వాత గినె్న ఆరగించడం మొదలుపెట్టారు. భక్తులకు ఉత్సాహం పెరిగింది. ‘చూస్తారేమిటి? బారులు తీరి కూర్చోండి అన్నాడు బసవన్న.
భక్తులంతా వరుసగా కూర్చున్నారు. బసవన్న ఆ నైవేద్యం పెట్టబడ్డ విషం నింపిన గుండిగెలన్నీ భక్తుల మధ్యకు తెచ్చాడు. ఒక్కొక్క భక్తుడూ తింటున్నకొద్దీ వారికి ఉత్సాహం ఎక్కువైంది. షడ్రసోపేతమైన విందు భోజనం చేస్తున్నట్లు నవ్వులతో కేరింతలతో పరిహాసాలతో సరసాలతో భక్తులంతా విషాన్ని ఇంకా ఇంకా తినసాగారు.
వడ్డించేవాళ్ళు కొసరి కొసరి వడ్డిస్తున్నారు. ‘తినండి నాయనా! ఆకళ్లతో లేచిపోవద్దు’ అంటున్నారు వడ్డించేవాళ్ళు.
‘అబ్బో! కడుపు నిండింది’ అని బ్రేవుమని ఒక భక్తుడు త్రేన్చాడు.
‘నాకు త్రేనే్చ సందు కూడా లేదురా బాబూ. అంత పొట్ట నిండేటట్టు ప్రసాదం తిన్నాను’ అన్నాడు మరొక భక్తుడు. ఇలా భక్తులంతా విషం తిన్నారు. విషం ఇంకా మిగిలిపోయింది. ‘‘ప్రసాదం వృధా కారాదు. రాజుగారి ఏనుగులనూ గుర్రాలనూ తీసుకొని రండి’’ అన్నాడు బసవన్న.
మావటీవాళ్ళు సుప్రసన్నుడు, సుభగుడు, ధర్మకీర్తి, భవరాజు, కర్మ సంహరుడు, నిర్మలుడు, వాయువేగుడు, వరదుడు దాయరంపము తత్వజ్ఞుడు, సృషిటపాలకుడు, చిత్రాంగుడు, దుష్టమర్దనుడు, దుర్దాంతుడు, చంత్రాతపము, శాశ్వతుడు, ఇంద్రాయుధము, శృంగారి, వారణాశి మొదలైన ఎన్నో పేర్లుగల గుర్రాలను తెచ్చి గుర్రాలనూ, ఏనుగులకూ కూడా విషమంతా పోశారు. ఈ దృశ్యం చూచి ఆకాశం నుండి పూల వానలు కురిశాయి. ప్రమధగణంతో సహా అంతా జేజేలు పెట్టారు.
‘‘క్షీరసాగర మథనం నాడు పరమేశ్వరుడు విషాన్ని గొంతులో నిలుపుకున్నాడే కాని మింగలేదు. కాని బసవేశ్వరుడు మాత్రం భక్తులతో సహా విషాన్ని నేడు తిని తన మహాత్మ్యాన్ని ప్రకటించాడు’’ అని అంతా బసవన్నను స్తుతించారు. బోయలు దిగ్భ్రాంతులై బసవని పాదాలపై బడి క్షమింపని వేడుకున్నారు. బసవన్న వారిని దీవించి పైకి లెమ్మన్నాడు.
జగదేవుని కథ
కల్యాణ నగరంలో జగదేవుడనే పరమ భక్తుడొకడున్నాడు. ఒకనాడు ఆయన బసవన్నను తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. ‘్భక్తగణం లేకుండా నేనెలా వస్తాను?’ అన్నాడు బసవన్న. ‘అందరూ రండి’ అని ఆహ్వానించాడు.
🙏 హర హర మహాదేవ 🙏