🔰 *శ్రీ గణేశ పురాణం*🔰 21 వ భాగం

P Madhav Kumar


 *21.భాగం* 


*ఉపాసనా ఖండము*

*మంత్రోపదేశ వర్ణనం* 


శ్రద్ధాళువై ఎంతో ఆసక్తితో కధను ఆలకిస్తున్న భీమునితో విశ్వా మిత్ర మహర్షి యిలా కొనసాగించాడు. 

“ఓ రాజా! ఎప్పుడైతే వరదుడైన వినాయకుని మూర్తి హఠాత్తుగా అంతర్ధానమై పోయిందో, బాలకుడైన దక్షునికి ఇక దిక్కుతోచలేదు. ఎంతో బెంగతోనూ, బాధతోనూ విహ్వలుడై దారినపోయే వారందరినీ కూడా, చెట్లు చేమలతోసహా 'వినాయకుడు మీకెక్కడైనా కనిపించాడా? మీకేమైనా ఎదురైనాడా?' చెప్పమంటూ విలపించసాగాడు. ఆ అఘాతానికి తట్టుకొనలేక మూర్ఛిల్లినాడు. 



ఇంతలో అతనికి దైవవశాన ఒక అద్భుతమైన స్వప్నం కలిగింది. అందులో ప్రకాశ మానమైన సుందరవదనంతో బ్రహ్మవర్చస్సుతో దేదీప్య మానంగా వెలుగొందే ఒక బ్రాహ్మణుడు ఎదుట నిలబడి 'అభీష్టవరమును నీకు ప్రసాదించాను! నీవు నీకు ప్రత్యక్షమైన గజాననుని ఏయేవరములు అర్ధించ దలచినావో అవన్నీ నీకు యిచ్చాను!' అనిచెప్పి వెళ్ళిపోతూండగా ఒక్క ఉదుటున మేల్కాంచి, తన ఎదుటగా ఉన్న ఒక బ్రాహ్మణుడిని దర్శించి పరమానందభరితుడైనాడు. అతడిని ముద్గలుడు అనే బ్రాహ్మ ణోత్తముని ఆశ్రమానికి దారిని చూపగోరాడు.



ముద్దలాశ్రమ వర్ణనం ఆ బ్రాహ్మణుని అనుసరించి దక్షుడనే ఆ రాకుమారుడు వెళ్ళగా, ముద్గలుని ఆశ్రమం కనుచూపుమేర దూరంలో కనిపించింది. గజాననుని భక్తులలో శ్రేష్టుడైనవాడూ, అనేక శిష్యులచే ఆశ్రయించ బడినవాడూ అన్ని జీవులపట్లా కరుణ ఉట్టిపడుతూ అభయాన్ని ప్రసాదించినవాడూ, వేదవేదాంగములలో దిట్టయై, సర్వశాస్త్రములలో పారీణుడైనవాడూ, యోగంలో అనేక సిద్ధులను తనకు ఆభరణాలుగాధరించినవాడూ, ఐన ఆ ముద్గలమహర్షి ఆశ్రమం ఎలాఉన్నదంటే ఎంతో రమణీయమైన ప్రకృతితో శోభిల్లుతూ, అనేకరకాలైన ఫలపుష్ప వృక్షాలతోనూ, అనేక ఆశ్చర్యకర వస్తువులతోనూ నిండి అది యక్షుల ప్రభువైన కుబేరుని రాజధాని అలకాపురిని మరిపించేదిగానూ, దేవతలరాజైన ఇంద్రుని నందనోద్యానవనాన్ని తలదన్నేదిగానూ, అత్యంత శోభాయమానంగా వెలుగుతున్నది.



ఆ ఆశ్రమంలో రత్నాలతో పొదగబడిన స్వర్ణ వినాయకుడిని అర్చిస్తున్న ముద్గలుణ్ణి దర్శించాడు. ఆ వినాయకమూర్తి నాలుగు హస్తాలనూ మూడు నేత్రాలతో అనేకములైన అలంకారములతో ప్రకాశిస్తున్నది. అటువంటి దివ్యమంగళమైన వినాయకుని మూర్తిని అత్యంత శ్రద్ధాభక్తులతో షోడశ ఉపచారములతోనూ ఆ ముద్గలమహర్షి అర్చించసాగాడు.



అలా దేవతార్చనలో మగ్నుడైన ముద్గలుడి సన్నిధికి వెళ్ళి భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారంచేసి, అందువల్ల కలిగిన భావోద్వేగానికి ఆనందబాష్పాలను వర్షిస్తూ వినమ్రుడై నిలుచున్నాడు! అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని విశ్వామిత్రుడిలా కొనసాగించాడు. అప్పుడు గణేశుని పరమ భక్తాగ్రగణ్యుడైన ముద్గలుడు ఆ దక్షుడిని ఆప్యాయంగా లేవనెత్తి,“నాయనా! నీవెవరు? ఏకారణంచేత ఇక్కడికి వచ్చావు? నీ దుఃఖా నికిగల కారణం ఏమిటి? నీ దుఃఖాన్నీ, భయాన్నీ నివారిస్తాను ఆందోళ నను వీడి నీయొక్క యావద్వృత్తాంతాన్నీ నాకు వివరించు!" అన్నాడు.



అప్పుడు ఆ ముద్గలమహర్షి మాటలచేత ధైర్యం పొందినవాడై, ప్రశాంతచిత్తంతో కమలాసుతుడైన దక్షుడిలా బదులిచ్చాడు.



"ఓ మహాత్మా! కర్ణాటక దేశంలోని భానునగరానికి రాజైన వల్లభుడు నాకు తండ్రి! కమల అన్న పేరుగల ఈ మహారాణి నను కన్నతల్లి. దైవవశాన నాకు పుట్టుకతోనే అనేక వైకల్యాలూ, దుర్గంధ భూయిష్టమై చీమూ నెత్తురూ స్రవించే శరీరమూ సంప్రాప్తించాయి. ఐనా నాకు తగిన స్వస్థత చేకూర్చాలన్న సంకల్పంతో నా తండ్రి ఒక పుష్కరకాలం (పన్నెండు సంవత్సరాలు) కఠిన నియమాలతో ఘోరమైన తపస్సు ఆచరించినా ప్రయోజనం లేకపోయింది. దానితో నా తండ్రి ఆగ్రహోదగ్రుడై నన్ను, నా తల్లిని రాజాంతఃపురంనుండి వెడలగొట్టాడు!



తీరని దుఃఖముతో నాతల్లి నన్ను వెంటబెట్టుకొని గ్రామగ్రామా లలో భిక్షచేసి అలా సంపాదించుకున్న ఆహారం నా పోషణకై వినియోగిస్తూ, ఎంతో దైన్యస్థితిలో కాలం వెళ్ళబుచ్చుతూ కౌండిన్యపురం చేరుకున్నది. ఆ ఊరిలో మేమిరువురమూ భిక్షాటనం చేస్తూండగా పూర్వ పుణ్యవశాన గ్రుడ్డివాడికి దృష్టి లభించినట్లు మాకు నీ దర్శనభాగ్యం కలిగింది! నీ శరీరం మీదనుంచి వీచిన గాలి నన్ను సోకగానే నాకుగల వైకల్యాలూ, శరీరబాధ మటుమాయమైపోయాయి!



శిలారూపిణియైన అహల్యామాతకు రఘురాముని చరణధూళి శాపవిముక్తిని ప్రసాదించినట్లు, మీ అనుగ్రహ విశేషంచేతనే విధంగా దివ్యసుందరమైన దేహం నాకు సంప్రాప్తించింది! ఈ వృత్తాంతా న్నంతా నాకు నాతల్లి చెప్పటం వలననే తెలుసుకున్నాను. -



ఏ మహనీయుని శరీరముపైనుండి వీచిన వాయుస్పర్శ మాత్రం చేత నా అనారోగ్యములన్నీ మటుమాయమైనాయో, అట్టి సత్పురుషుని దర్శించుకుని జీవితం సార్ధకం చేసుకోవాలన్న సంకల్పం కలిగి, తిరిగి మీకై అన్వేషిస్తూండగా హఠాత్తుగా గజాననుని సాక్షాత్కారం లభించింది. ఆ దివ్యమంగళ మూర్తిని దర్శించుకున్న నాతల్లి కమల తన మనోభీష్టాల నన్నింటినీ పొందింది! ఆ గజాననుడు తానివ్వగల్గినా ఆ వరాలను తన అనుగ్రహ స్వరూపులై, నిజానుగ్రహాన్ని సంప్రాప్తించుకున్న మీనుంచి పొందమని ఆజ్ఞయిచ్చి అంతర్ధానం చెందాడు.


దాంతో మిమ్మల్ని వెతు క్కుంటూ ఇలా మీ ఆశ్రమం చేరుకున్నాను!" అంటూ తన కధను ముద్గలునితో వివరంగా తెలియచేశాడు.



ఇలా వివరించిన పై గజానన సాక్షాత్కారంతో పాటూ ద్విజరూపం లో ప్రత్యక్షమైనదీ, ఆ తరువాత మరలా గజవదనుడై సాక్షాత్కరించి తానే ఆ రెండు రూపాలలో దర్శనమిచ్చినట్లు నిరూపించినదీ వివరించి ముద్గలునివల్లనే తన సకలాభీష్టములూ నెరవేరగలవని చేసిన గణేశుని దివ్య ఆదేశాన్నీ తెలిపాడు.



గజాననుని అంతర్ధానంతో ఎంతో వ్యధకులోనైనాననీ, ఆ వివశతలో స్పృహను కోల్పోయాననీ వరం కోరుకోమన్న ఆ దివ్యాదేశాన్నే మననం చేసుకుంటూ ముద్గలుని ఆశ్రమానికి చేరుకున్నాననీ తెలియజేశాడు. ఇంకా ఆ దక్షుడు యిలా అన్నాడు:



“ఓ మహాత్మా! ముద్గలమహర్షీ! పరిపూర్ణ గణేశానుగ్రహానికి పాత్రుడ వైన నీవే సాక్షాత్తు గజాననుడవు. ఆ భగవానుని అనుగ్రహవిశేషంచేత నాకు సర్వమూ గణేశమయమై కనపిస్తున్నది."



ఈ వృత్తాంతాన్నంతటినీ సోమకాంత మహారాజుకు వినిపిస్తున్న భృగుమహర్షి ఇలా అన్నాడు. “భక్తిపూరితాలైన దక్షునియొక్క వచనాలను విని ముద్గల మహర్షి యిలా అన్నాడు:


"నాయనా! నీవు ఎంతో అదృష్టశాలివి! నీకుగల అనన్యభక్తి వల్లనే నీకు పైరీతిలో గజాననానుగ్రహం సంప్రాప్తించింది. ఆ దేవదేవుడు కేవలం నిర్మలమైన భక్తిచేతనే ప్రసన్నుడౌతాడు. అంతేగాని, డాంబికంగా, ప్రదర్శనాత్మకంగా ఎంతకాలం తపస్సుచేసినా నిష్ఫల మౌతుంది. భగవద్దర్శనానికై తీరని ఆర్తీ, తపనా కలిగినప్పుడూ, వీటికి భగవదనుగ్రహమూ తోడైనప్పుడే భగవద్దర్శనం సంప్రాప్తిస్తుంది. ఆ కరుణాలవాలుడు మూడులోకాలకూ భర్త! త్రిగుణాలకు అధిష్టాత! త్రిమూర్తులకు వారివారి ఉపాధులను తానే కల్పిస్తున్నాడు! 



పంచభూతములకు, పంచతన్మాత్రలకూ, ఇంద్రియ మనోబుద్ధులకన్నా, ఆతడు అతీతుడైనవాడు. ఆయనను దేవతా గణములుకాని, గంధర్వాదులుకాని చిర కాలం తపస్సుచేసిన ఋషులుగాని వేదములుగాని కనుగొనలేవు! అటు వంటి దేవతలకే దేవుడైన గజాననుడిని సాక్షాత్కారం పొందిన నీవు చాలా ధన్యుడివి! నీవంటి భక్తుడు నాకు పరిచయమవటం నాకు ఎంతో సంతోషాన్నిస్తున్నది!” 

అంటూ ముద్గలుడు ఆ దక్షునికి నమస్కరించి ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆతరువాత ముద్గలమహర్షి గజాననుని ఏకాక్షర మహామంత్రాన్ని సాంగోపాంగంగా దక్షునికి ఉపదేశించి ఇలాఅన్నాడు.



'ఓ రామా! ఈ మంత్రాన్ని ప్రతీదినమూ క్రమం తప్పక నియమంగా జపించు! నీ సకలాభీష్టాలూ ఆ గణేశాను గ్రహంచేత సిద్ధిస్తాయి! ఈ గణేశుని భక్తిచేత ఇంద్రాది దిక్పాలకులు సైతం వశ్యులై ఉంటారు! అనన్య మనస్సుతో ఆ పరాత్పరుని ధ్యానిస్తే సకల సంపదలూ చిరకాలం అనుభవించి, అంతములో మోక్షపదాన్ని పొందుతావు!" అంటూ దీవించాడు.



ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని 'మంత్రోపదేశ వర్ణనం' అనే 

 అధ్యాయం.సంపూర్ణం.


 *సశేషం.......*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat