*చంద్రగ్రహ జననం - 7*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
ఆశ్రమంలోకి వచ్చిన అనసూయను త్రిమూర్తులు ఆనందంగా చూశారు. అత్రి మొహంలో సంతోషం నాట్యం చేస్తోంది.
*"అనసూయా ! ఆడిన మాట నెరవేర్చి , మాకు ఆనందం కలిగించావు. మా మాటను మేమూ పాటిస్తాం. కోరిన వరాలు కొంగులో వేయాలన్నావుగా. కోరుకో !"* చిరునవ్వుతో అన్నారు.
*"అలాగే స్వామీ ! నాకు మూడు వరాలు కావాలి. మొదటి వరంగా - శీలవతి భర్త పునర్జీవితుడు కావాలి. ఆ ఉగ్రశ్రవుడు కుష్టురోగ విముక్తుడై యవ్వనవంతుడిగా , శీలవతికి అనుకూల పతిగా మారాలి. వెంటనే ఈ రెండు వరాలూ...” "ప్రసాదించాం ! మూడో వరం కోరుకో , సాధ్వీ !"* విష్ణువు అన్నాడు.
*"మాత అనసూయ పతివ్రతే కాదు. పరిణత మనస్కురాలు !"* ఇంద్రుడు మెచ్చుకున్నాడు.
అనసూయ కొంచెం ముందుకి జరిగింది. తన చీర కొంగును రెండు చేతుల్లోకి విడదీసి పట్టుకొంది. ఆమె విశాల నేత్రాలు తడిగా మెరుస్తున్నాయి. బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులను ఆమె తదేకంగా చూస్తోంది.
*"వరం కోరుకో అనసూయా !"* బ్రహ్మ ఆమెను హెచ్చరించాడు.
*"మీరు ముగ్గురూ నా కుమారులుగా , నా గర్భవాసాన విడిది చేసి , జన్మించాలి..." విష్ణువు అర్ధం కానట్టు చిరునవ్వు నవ్వాడు. "ఎవరు ముగ్గురూ , అనసూయా ! పేరు పేరునా వివరంగా చెప్పు !".*
*"మీరే స్వామీ... బ్రహ్మ విష్ణు మహేశ్వరులు !"*
త్రిమూర్తులు ఒకర్నొకరు క్షణకాలం చూసుకొన్నారు.
*“తథాస్తు !"* త్రిమూర్తులు ఒకేసారి , ఒకే కంఠంతో అన్నారు.
*"ధన్యురాలిని స్వామీ !"* అనసూయ చేతులు జోడిస్తూ అంది. నిలువెల్లా ఆవరించిన ఏదో ఉద్రేకంతో వణికిపోతున్న అత్రి మహర్షి అనసూయ సమీపానికి జరిగి , మంత్రముగ్ధుడిలా ఉండిపోయాడు.
*"అనసూయా ! నీ ప్రార్ధన ప్రకారం - ప్రథమ పుత్రుడుగా బ్రహ్మ , ద్వితీయుడుగా నేను , తృతీయుడుగా పరమేశ్వరుడూ నీ గర్భాన నీ పుత్రులుగా జన్మించి , నీ లోగిలిలో ఆడుకుంటాం !"* విష్ణువు నవ్వుతూ అన్నాడు.
అనసూయ మౌనంగా చూస్తోంది. ఆమె విశాల నేత్రాలు ఆనందబాష్పాల్ని వర్షిస్తున్నాయి.
*"అత్రీ ! మీ దంపతులు అదృష్టవంతులు. అంతరిక్షంలో సూక్ష్మరూపంలో ఉన్న చంద్రుడు , సశరీరంగా మీ పుత్రుడుగా జన్మిస్తాడు. ఆ చంద్రుడు మరెవరో కాదు. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడే !*
తదనంతరం నేను దత్త నామ ధేయంతో జన్మిస్తాను. అత్రి పుత్రుడైన కారణంగా 'దత్తాత్రేయుడు'గా ప్రసిద్ధుడవుతాను...
ఆ తరువాత మీ తృతీయ పుత్రుడుగా పరమశివుడు 'దుర్వాసుడు'గా అవతరిస్తాడు !"
*"మా జన్మలు ధన్యమైనాయి !"* అత్రి కంఠం వణికింది.
బ్రహ్మ తన మానస పుత్రుడైన అత్రిని చిరునవ్వుతో ప్రత్యేకించి చూశాడు.
*"కుమారా , అత్రీ ! శుభఘడియలలో నీ తేజస్సును యజ్ఞకుండలిలో హవిస్సులాగా అనసూయ గర్భంలో నిక్షేపించు !"*
*"ఆజ్ఞ !"* అత్రి నమస్కరిస్తూ అన్నాడు. అనసూయ నమస్కరించింది.
*"ఇష్టకామ్యార్ధసిద్ధిరస్తు !"* అన్నాడు దీవిస్తూ.
*"తథాస్తు !"* అన్నారు శివుడూ , విష్ణువూ , ఇంద్రుడూ , నారదుడూ. నమస్కరించిన అత్రి అనసూయలు రెప్పలెత్తి చూశారు. త్రిమూర్తులూ , ఇంద్రుడూ , నారదుడు లేరు!
అత్రి అనసూయ మొహంలోకి పారవశ్యంతో చూశాడు.
*"అనసూయా , నీ జన్మ ధన్యం ! నీ చరిత్ర శాశ్వతం ! త్రిమూర్తుల్ని ఆడిస్తాను అన్నప్పుడు నీ మాట నాకు అర్థం కాలేదు ! అలా ఎందుకన్నావో ఇప్పుడు అర్థమైంది ! నువ్వే కాదు , నీ పెనిమిటి అత్రి కూడా త్రిమూర్తుల్ని వొడిలో ఆడిస్తాడు సుమా !"* అనసూయ ఆనందాశ్రువుల్ని తుడుచుకుంటూ నవ్వింది.
*"అమ్మా !"* ఆశ్రమం వెలుపలి నుంచి వినిపించింది పిలుపు. అనసూయా , అత్రీ గుమ్మం వైపు చూశారు. శీలవతీ , ఆమెతో పాటు అందగాడైన యువకుడు వస్తున్నారు.
*"అమ్మా... అమ్మా... నా భర్తకు పునర్జన్మ సిద్ధించింది. నా భర్త వ్యాధీ , వృద్ధాప్యమూ మాయమైపోయాయి. అంతా మీ ఆశీర్వచన మహిమే అమ్మా !”* భర్త చెయ్యి పట్టుకున్న శీలవతి ఆనందంగా అంది అనసూయతో.
*"అది నా మహిమ కాదు , శీలవతీ ! త్రిమూర్తుల దయ , నీ అదృష్టం !"* అనసూయ అంది.
*"మాతా ! మీ దయతో , నా సతీమణి మహిమతో నాకు పునర్జన్మ దక్కింది. మమ్మల్ని దీవించండి !"* అందంతో , యవ్వనంతో కళకళలాడుతున్న ఉగ్రశ్రవుడు కృతజ్ఞతా పూర్వకంగా అంటూ , అత్రి , అనసూయల ముందు మోకరిల్లాడు. శీలవతి కూడా ఆ ఇద్దరికీ పాదాభివందనం చేసింది.
*“నాయనా ! శీలవతి నీకోసం ఇన్నాళ్ళూ అష్టకష్టాలు అనుభవించింది. ఇక మీదట ఆమెను ఇష్టసుఖాలలో వోలలాడించే బాధ్యత నీదే !"* అనసూయ ఉగ్రశ్రవుడితో అంది.
*“అవున్నాయనా !” అత్రి ఉగ్రశ్రవుడితో అన్నాడు. సతి పతిని ఆరాధనతో సేవిస్తుంది. పతి సతిని అనురాగంతో దీవించాలి !"*
*"మా దంపతులిద్దరికీ , మీ దంపతులిద్దరే ఆదర్శం !"* అన్నాడు ఉగ్రశ్రవుడు. శీలవతి చిరునవ్వుతో చూసింది.
🙏 సకల నవగ్రహ దేవతాయ నమః🙏