శ్రీ దేవీ భాగవతము - 3

P Madhav Kumar


*లలితా సహస్రనామ శ్లోకం - 3*

*మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా!*
*నిజారుణప్రభా పూర మజ్జద్బ్రహ్మాండ మండలా!!*
🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏

దేవీ భాగవత మాహాత్మ్యాన్ని తెలియజెప్పే మరొక ఇతిహాసం ఉంది. అదికూడా వినిపిస్తాను శద్ధగా వినండి అంటూ సూతమహర్షి కొనసాగించాడు.

పూర్వకాలంలో ఒకప్పుడు అగస్త్యుడు లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్ళి కుమారస్వామిని అభ్యర్థించి కథలూ గాథలూ అనేకం తెలుసుకున్నాడు. తీర్ధ - దాన - వ్రతమాహాత్మ్యాలు ఎన్నో షణ్ముఖుడు చెప్పగా విని ఆ వృద్ధదంపతులు ఎంతగానో ఆనందించారు. అయినా తృప్తి కలగలేదు. లోకహితం కోరి దేవీభాగవతం గురించీ దాని మహిమ గురించీ చెప్పమని అడిగారు. త్రిలోకజనని ఆ పురాణంలో కీర్తింపబడిందిటగదా, మాకు తెలియజెప్పవా! అని అభ్యర్థించారు. స్కందుడు ఆరంభించాడు.

*కుంభసంభవా !*
భాగవతమాహాత్మ్యాన్ని విస్తరించి చెప్పాలంటే ఎవరివల్లా అయ్యేపనికాదు. నువ్వు అడిగావు కనక క్లుప్తంగా చెబుతాను.

సచ్చిదానందరూపిణి జగదంబిక భుక్తిముక్తి ప్రదాయినిగా సాక్షాత్కరించేది దేవీభాగవతంలోనే. అంచేత దేవీభాగవతం అంటే దేవీవాఙ్మయరూపం. దీని పఠన-శ్రవణాలకు దుర్లభమైనది ఏదీ ఈ సృష్టిలో లేదు.

వెనకటికి వివస్వంతుని కొడుకు శ్రాద్ధదేవుడని ఒక మహారాజు ఉన్నాడు. అతడికి ఎంతకాలానికీ పిల్లలు కలగలేదు, మగబిడ్డ కలగాలని ఆకాంక్షించి వసిష్టులవారి అనుమతితో ఒక ఇష్టిని (పుత్రకామేష్టి) నిర్వహించాడు. అతడి భార్య శ్రద్ధాదేవి, తనకు ఆడపిల్ల కావాలనీ ఆ విధంగా హోమం నిర్వహించమనీ అభ్యర్థించింది. హోత అలాగే హోమం చేశాడు. ఇష్టి పూర్తి అయ్యింది - కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం ధరించింది. ఆడపిల్లను ప్రసవించింది. ఇలాదేవి అని పేరు పెట్టారు. కానీ మహారాజు మనస్సు కలుక్కుమంది. మగపిల్లవాడు కావాలని సంకల్పించి ఇష్టిని నిర్వహిస్తే ఆడపిల్ల పుట్టిందేమిటి ?  గురూత్తమా ! ఈ సంకల్ప వైషమ్యం ఎలా జరిగింది ? అని వసిష్ణులవారిని అడిగాడు. వ్యతిక్రమం ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో చెప్పి, ఇలాదేవి మగవాడుగా మారాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించమని సలహాచెప్పాడు వసిష్థుడు. శ్రాద్ధదేవుడు శివుణ్ణి ప్రార్ధించాడు. శివానుగ్రహమూ గురువు అనుగ్రహమూ కలిసి ఇలాదేవి పురుషుడుగా మారిపోయింది. సుద్యుమ్నుడు అని అప్పుడు మళ్ళీ నామకరణం చేశారు.

ఆ రాకుమారుడు సకలవిద్యలకూ సముద్రుడయ్యాడు. యౌవనంలోకి అడుగుపెట్టాడు. ఒకనాడు వేటకోసం ఒక మహావనంలోకి అడుగుపెట్టాడు. పరివారంతో కలిసి రథారూఢుడై అడవి నుంచి అడవికి పయనిస్తున్నాడు. మేరుపర్వతానికి చేరువలో ఉన్న ఒక వనం చేరుకున్నాడు. ఆ వనానికి ఒక చరిత్ర ఉంది.

ఒకప్పుడు శివపార్వతులు అక్కడ క్రీడిస్తూండగా శివదర్శనలాలసులైన మునులు తెలియక హఠాత్తుగా ప్రవేశించారు. పార్వతి సిగ్గుపడింది. అది గ్రహించిన మునులు వెంటనే వెళ్ళిపోయి శ్రీహరిని శరణు వేడుకున్నారు. కానీ పార్వతిని సముదాయించడంకోసం శివుడు ఆ వనానికి ఒక శాపం ఇచ్చాడు. ఈ రోజునుంచీ ఈ వనంలోకి ప్రవేశించిన పురుషులెవరైనాసరే స్త్రీలుగా మారిపోతారు అని కట్టడి చేశాడు. ఈ వృత్తాంతం తెలిసిన పురుషులెవరూ ఆ వనం దరిదాపులకైనా వెళ్ళరు.  మన సుద్యుమ్బుడికి ఈ విషయం తెలియక ప్రవేశించాడు. ప్రవేశంచడంతోటే తానూ తన తోటివారూ అందరూ స్త్రీలుగా మారిపోయారు. మగ గుర్రాలు కూడా ఆడ గుర్రాలైపోయాయి. కారణం తెలియక నివ్వెరపోయారు. చేసేదిలేక అలాగే ఆ అరణ్యాల్లో సంచరించారు. సందర్శిస్తూ, సందర్శిస్తూ బుధుడి ఆశ్రమం చేరుకున్నారు. ఈ సుందరాంగిని (సుద్యుమ్నుడిని) చూసి బుధుడు మరులుకొన్నాడు. ఎవరీ అందగత్తె? ఉన్నతపయోధరాలు. దొండపండుల్లాంటి పెదవులు. మల్లెమొగ్గల్లాంటి పలువరుస. చంద్రబింబంలాంటి వదనం. పద్మాల్లాంటి కన్నులు. బుధుడికి మనసయ్యింది. ఆ సుందరాంగి కూడా బుధుణ్ణి చూసి అలాగే మన్మథ భావాలకు లోనయ్యింది. చంద్రుడిలా ఉన్నాడు ఎవరబ్బా ఈ అందగాడు అనుకొంది. చూపులు కలిశాయి. మనసులు కలిశాయి. తనువులూ కలిశాయి. ఆ సోమనందనుడి ఆశ్రమంలో కామసుఖాలు అనుభవిస్తూ చాలాకాలం ఉండిపోయింది. గర్భవతి అయ్యింది. పురూరవసుడికి జన్మనిచ్చింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు తన పూర్వరూపం, తన రాజ్యం తల్లిదండ్రులు అన్నీ జ్ఞాపకం వచ్చి దుఃఖించి, దుఃఖించి, ఇంక ఆ ఆశ్రమంలో ఉండలేక వెళ్ళిపోయింది. వెతుక్కుంటూ వళ్ళి వసిష్టుని ఆశ్రమం చేరుకుంది. తమ కులగురువును చూడటంతోనే దుఃఖం పొంగి వచ్చింది. కాళ్ళమీద పడి వలవలా విలపించింది. మళ్ళీ పురుషత్వం వచ్చేట్టు అనుగ్రహించమని ప్రార్థించింది.

వసిష్టుడు మంత్రశక్తితో జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్నాడు. కైలాసానికి పెళ్ళాడు. శివుని అర్చించి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఉబ్బులింగడుగదా అని భక్తిభావంతో స్తుతించాడు.

*నమో నమః శివాయాస్తు శంకరాయ కపర్దినే !*
*గిరిజార్ధాంగదేహాయ నమస్తే చంద్రమౌళయే !!*
                        (దే.భా.మా. 3-33)

*మృడా ! కైలాసవాసీ ! నీలకంఠా ! భుక్తిముక్తిప్రదాయకా ! శివరూపా ! శవా |! ప్రపన్నభయహారీ | వృషభవాహనా ! శరణ్యా ! పరమాత్మా! త్రిమూర్తిస్వరూపా ! దేవాధిదేవా ! వరదా ! పురారీ! యజ్ఞరూపా! యజ్ఞఫలదా ! గంగాధరా | సూర్యేందువహ్నిలోచనా ! నమో నమః. నమో నమః.*

బోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వృషభ వాహనం మీద పార్వతీసమేతుడై దర్శనం అనుగ్రహించాడు. వరం కోరుకోమన్నాడు. ఆడపిల్లగా జన్మించి మగపిల్లవాడుగా మారి, ఇప్పుడు మళ్ళీ స్త్రీత్వం పొందిన ఇలాదేవికి (సుద్యుమ్నుడు) తిరిగి పురుషత్వం ప్రసాదించమని వసిష్టుడు అభ్యర్థించాడు. శివుడు ఆమోదించాడు. ఒకనెల పురుషుడుగా ఒక నెల స్త్రీగా ఉంటుందని అభ్యనుజ్ఞ ఇచ్చి శివుడు అంతర్జానం చెందాడు. వసిష్టుడు అంతటితో సంతృప్తి చెందక జగదీశ్వరిని స్తుతించాడు.

*జయ దేవి మవాదేవి భక్తానుగ్రహకారిణి!*
*జయ సర్వసురారాధ్యే జయానంతగుణాలయే!!*
                        (దే.భా.మా. 3-44)

*శరణాగతవత్సలా ! దుర్గా! దేవేశీ | దుఃఖహంత్రీ |! దుష్టదైత్యనిషూదినీ ! భక్తిగమ్యా ! మహామాయా! జగదంబికా ! సంసారసాగరోత్తారపోతీభూతపదాంబుజా ! త్రిమూర్తి సంసేవితా ! చతుర్వర్గప్రదాయినీ !*
నిన్ను స్తుతించాలంటే సమర్ధుడెవడు ? కేవలం భక్తితో నమస్కరించడం తప్ప.

వసిష్టుడి స్తోత్రానికి జగదీశ్వరి ప్రసన్నురాలయ్యింది. సుద్యుమ్నుడి మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను అర్చించు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవీభాగవతాన్ని నవాహోనియమంతో అతడికి వినిపించు. అది ముగిసేసరికి తిరిగి పుంస్త్వం పొందుతాడు - అని ఆజ్ఞాపించింది.

వసిష్టుడు సంబరపడ్డాడు, ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. దేవి ఆజ్ఞను వివరించాడు. ఆశ్వయుజ శుక్ల పక్షంలో దేవిని ఆరాధింపజేసి భాగవతం తానే పురాణశ్రవణం చేయించాడు. సుద్యుమ్నుడు భక్తిగా విన్నాడు. వినిపించిన వసిష్థుడిని అర్చించాడు. వెంటనే పురుషత్వం పొందాడు. రాజ్యానికి పట్టాభిషక్తుడయ్యాడు. ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. భూరిదక్షిణలతో దేవీయజ్ఞాలు అనేకం నిర్వహించాడు. పుత్రుల్ని పొందాడు. వారికి రాజ్యం అప్పగించి తాను తపస్సులు చేసుకుని దేవీసాలోక్యం చెందాడు. |

అగస్త్యా ! దేవీభాగవతమహిమ అంతటిది. చదివినవారికీ విన్నవారికీ సకలవాంఛాప్రదం. ఇహపరాలకు సాధకం - అని చెప్పి కుమారస్వామి ఇతిహాసాన్ని ముగించాడు.

*(శ్రీస్కాందపురాణం- మానసఖండం - అధ్యాయం -3, శ్లోకాలు - 58)*

అగస్త్యుడు సంతృప్తి చెందలేదు. ఇంకా ఇలాంటి విచిత్రమైన కథలు - దేవీభాగవత మహిమను చెప్పే ఇతిహాసాలు ఏమైనా ఉంటే వినిపించమని ప్రార్థించాడు. స్కందుడు కొనసాగించాడు.

అగస్త్యా ! *భగవత్యాః ఇదం భాగవతమ్‌* అని దీని వ్యుత్పత్తి. గాయత్రీ మహిమ విస్తారంగా వర్ణింపబడింది. అందుకని కూడా దీనికి భాగవతమని పేరు. *బ్రహ్మవిష్ణుశివారాధ్య ఆ భగవతి.* ఈ తల్లి మహిమను తెలియజెప్పే మరొక విచిత్రగాథ ఉంది. చెబుతున్నాను. వినండి.

బుతవాక్కు అని ఒక మహర్షి ఉండేవాడు. అతడికి ధర్మపత్ని వల్ల ఒక కుమారుడు జన్మించాడు. రేవతీ నక్షత్రయుక్తమైన గండాంతకాలంలో జన్మించాడు. బుషిదంపతులు సంతోషించి జాతకర్మాదులన్నీ యథావిధిగా జరిపించారు. కానీ కొడుకు పుట్టినప్పటినుంచీ ఆ తల్లిదండ్రులు ఆధివ్యాధి పీడీతులయ్యారు. మంచం పట్టారు. కారణం తెలియలేదు. ఒకవేళ ఈ పుత్రుడు పూర్వజన్మలో మహాపాపాలు చేశాడేమో? బుషి పత్నులను శీలభంగాదులు చేశాడేమో? ఆ మహాపాతకాలు మనల్ని
రోగాలుగా పట్టిపీడిస్తున్నాయేమో - అని ఎంతగానో దిగులు పడ్డారు. అనుకున్నట్టుగానే కొడుకు ఎదిగి
అలాగే తయారయ్యాడు. బుషిదంపతుల దుఃఖానికి అంతులేకపోయింది. కుపుత్రుడు కలిగే కంటే అపుత్రులుగా ఉండిపోవడమే మంచిది. స్వర్గానికి వెళ్ళే తల్లిదండ్రుల్ని నరకానికి పడదోస్తారు కుపుత్రులు. దుఃఖదాయకులు. వీరివల్ల అయినవారికి ఉపకారమూ లేదు, కానివారికి అపకారమూ లేదు. ఇలాంటి కుపుత్రులు పుట్టకండా ఉండటమే మంచిది. ఇల్లు సుపుత్రుడితో కళకళలాడటం ఎంతటి అదృష్టవంతులకోకదా ! కుపుత్రుడివల్ల వంశం, కుభార్యవల్ల జీవితం, కుభోజనంవల్ల దివసం, కుమిత్రుడి వల్ల సుఖం - నశిస్తాయన్నారు పెద్దలు.

*కుపుత్రేణాన్వయో నష్టో జన్మ నష్టం కుభార్యయా !*
*కుభోజనేన దివసః కుమిత్రేణ సుఖం కుతః !!*  (దే.భా.మా. 4-17)

ఇలా దుఃఖిస్తూనే ఉన్నారు ఆ దంపతులు. ఒకనాడు గర్గమహర్షి అక్కడికి వస్తే తమ గోడు వెళ్ళబోసుకున్నారు. మేము ధర్మబద్ధంగానే జీవితాలు గడిపాం. గురుశుశ్రూషలు చేశాం. వేదాధ్యయనం నియమనిష్టలతో చేశాను. బ్రహ్మచర్యం గడిపి గృహస్థాశ్రమంలో ప్రవేశించాను. ధర్మబద్ధంగా సంసారసుఖాలు అనుభవించాం. రోజూ పంచయజ్ఞాలు చేస్తున్నాం. పున్నామనరకం నుంచి కాపాడతాడని ఆశించి పుత్రుణ్ణి పొందామే తప్ప కామవాంఛతో కానేకాదు. కానీ వీడు పుట్టినప్పటి నుంచీ మేమిద్దరం ఇలా అయిపోయాం. ఇది నా తప్పా? దీని తప్పా? వీడి తప్పా? నువ్వు జ్యోతిశ్శాస్త్రంలో పారంగతుడివి. కనక ఆలోచించి చెప్పు. ఈ కుపుత్రుడు మాకు ఎలా జన్మించాడు? దీనికి శాంతి ఏమిటి? - అని అడిగాడు బుతవాక్కు.

గర్గాచార్యుడు లెక్కలు వేసి తీవ్రంగా విచారణచేశాడు. బుతవాగ్మునీ ! ఇందులో మీ దంపతుల దోషం ఏమీ లేదు. కాకపోతే మీ పుత్రుడు దుర్ముహూర్తంలో జన్మించాడు. రేవతీగండాంత కాలంలో పుట్టాడు. అంచేత దుశ్శీలుడు అయ్యాడు. అదే మీ ఆధివ్యాధులకు కారణం, అంతకన్నా ఏమీ లేదు. ఈ దుఃఖం ఉపశమించాలంటే *దుర్గతినాశిని దుర్గాదేవి* ని ఉపాసించండి. అది అన్ని దోషాలకూ మహాశాంతి - అని చెప్పి గర్గుడు సెలవు తీసుకున్నాడు.

బుతవాగ్మహర్షికి రేవతీనక్షత్రం మీద పట్టరానంత కోపం వచ్చింది. నేలకు రాలిపొమ్మని శపించాడు. వెంటనే అ నక్షత్రం భగభగలాడుతూ *కుముదాద్రి* మీదకు రాలిపడింది. అప్పటినుంచీ ఆ పర్వతం *రైవతకాద్రి* అయ్యింది. దాని సౌందర్యం రెండింతలు పెరిగింది. అటుపైని గర్గుడు చెప్పినట్టు ఆ బుషిదంపతులు జగదంబికను ఆరాధించి సుఖశాంతులు పొందారు. కుపుత్రుడు సుపుత్రుడుగా మారి అందరి ప్రశంసలూ అందుకున్నాడు.

ఆ రేవతీనక్షత్ర తేజస్సునుంచి ఒక కన్యకామణి ఆవిర్భవించింది. రూపంలో కాంతిలో మరొక లక్ష్మీదేవిలా భాసించింది. ఆమెను చూసిన ప్రముచమహర్షి ఆశ్చర్యచకితుడై తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి రేవతి అని నామకరణం చేసి కన్నకూతురిలా పెంచుకున్నాడు. రేవతి ఎదిగి ఈడేరిన తరవాత వరాన్వేషణ ప్రారంభించాడు. అనురూపవరుడు ఎక్కడా దొరకలేదు. దిగులు చెందాడు. తన హోమశాలలో ప్రవేశించి అగ్ని దేవుణ్ణి స్తుతించాడు. పావకుడు సుప్రీతుడయ్యాడు. మీ అమ్మాయికి దుర్దముడనే మహారాజు తగిన వరుడు, అతడు ధర్మిష్టుడు. బలపరాక్రమశాలి. మహావీరుడు. మేధావి. అందగాడు - అని అగ్నిదేవుడు తెలియపరిచాడు. ప్రముచుడు సంబరపడ్డాడు.

దైవవశాత్తు అదే సమయానికి దుర్దముడు వేటకోసమని అడవికి వచ్చినవాడు ప్రముచుడి ఆశ్రమాన్ని సందర్శించాడు. ఈ దుర్దముడు ప్రియవ్రత కులోద్భవుడు. కాళిందీవిక్రమశీలుల తనయుడు. ఇతడు వచ్చిన ఆ సమయానికి ప్రముచుడు ఆశ్రమంలో లేడు. హోమశాలలో ఉన్నాడు. పర్ణశాలలో రేవతి మాత్రమే ఉంది. దుర్గముడు చూశాడు.

ప్రియా ! ప్రముచులవారు ఆశ్రమంలో లేరా ? వారిని దర్శించి పాదాభివందనం చేసి ఆశీస్సులు పాంది వెడదామని వచ్చాను.

హోమశాలలో ఉన్నారు - అంది రేవతి.

దుర్దముడు హోమశాలకు వెళ్ళాడు. ద్వారంలో నిలబడ్డాడు. ప్రముచుడు తలెత్తి చూశాడు. రాజ లక్షణాలతో వినయవిధేయతలతో విరాజిల్లుతున్న దుర్దముణ్ణి చూసి ప్రముచుడు ఆప్యాయంగా ఆహ్వానించాడు. రాజు వచ్చి పాదాభివందనం చేసి నిలబడ్డాడు. ప్రముచుడు గౌతముణ్లి (శిష్యుడు) పిలిచి అర్భ్యపాద్యాలు తెమ్మన్నాడు. చాలాకాలానికి వచ్చాడు - మన మహారాజు, పైగా కాబోయే అల్లుడు అంటూ అతిథిసత్కారాలు జరిపాడు. సముచితాసనం చూపించి కూర్చోమన్నాడు. కుశలప్రశ్నలు వేశాడు.

మహారాజా ! నీ సైన్యమూ కోశమూ మిత్రబృందమూ కుశలమేనా ? భృత్యులూ అమాత్యులూ క్షేమమా ? దేశమూ రాజధానీ సుభిక్షంగా సమృద్ధంగా ఉన్నాయా ? నీకు అనామయమే కదా ! నీ భార్య క్షేమం గురించి అడగను. ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది కనక. తక్కినవారి క్షేమసమాచారాలు ఏమిటో చెప్పు.

ప్రముచమహర్షీ ! అన్నీ కుశలమే. అందరం క్షేమమే. నా భార్య ఇక్కడే ఉంది అంటున్నావు. ఎవరావిడ ? ఇది చాలా కుతూహలం కలిగిస్తోంది. చెప్పవూ ?

చిరంజీవీ | దుర్దమా ! రేవతి అని ఆ అమ్మాయి పేరు. నీ భార్య. రూపంలో గుణంలో సాటిలేని మహిళ. నీ భార్యనే నువ్వెరగవా ?

మహర్షీ! నా అంతఃపురంలో సుభద్రాప్రభృతులు చాలామంది ఉన్నారు భార్యలు. కానీ వారిలో రేవతి ఎవరూ లేరే |?

రాజా ! ఇక్కడికి రాబోయే ముందు పర్ణశాలలో ఒక అమ్మాయిని చూసి ప్రియా అని సంబోధించావు కదా ! అప్పుడే మరిచిపోయావా ?

మహర్షీ! నువ్వన్నది నిజమే. అక్కడ ఒక అమ్మాయిని చూశాను. ప్రియా అని సంబోధించాను. కానీ నాకు ఏ దుష్టభావమూ లేదు, కోపించకు. ఏదో మాటవరసకు అలా పిలిచానంతే.

రాజా ! నాకు తెలుసు. నీ మనస్సులో ఏ దుష్టభావమూ లేదు. అయినా అగ్నిదేవుడి ప్రేరణతో నీ నోటినుంచి అలా ఆ సంబోధన వెలువడింది. ఇప్పుడే నేను వహ్నిదేవుణ్ణి అడిగాను రేవతికి తగిన వరుడు ఎవరు అని. దుర్దముడు భర్త అవుతాడు అని చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి నువ్వు పర్ణశాలకు వచ్చి రేవతిని ప్రియా అని పిలిచావు. ఇక్కడికి వచ్చావు. ఇది దైవ నిర్ణయం. కనక మా అమ్మాయిని స్వీకరించు. ప్రియా అని ఎలాగూ పిలిచావు కనక ఇక విచారించవలసింది లేదు.

దుర్దముడు ఆలోచనలో పడ్డాడు. ప్రముచుడు వివాహయత్నాలు ప్రారంభించాడు. రేవతికి విషయం తెలిసింది. రేవతీ నక్షత్రంలోనే వివాహం జరిపించమని కోరింది. ఇంకా మంచి నక్షత్రాలు చాలా ఉన్నాయి కదా నీకు ఈ పట్టుదల ఎందుకు ? పైగా బుతవాగ్ముని శపించాడాయె. ఇప్పుడు ఆ నక్షతం ఆకాశంలో లేనే లేదు. నేలకు రాలిపోయింది. ఎలా జరిపించమంటావు? - అన్నాడు ప్రముచుడు. ఒక్క బుతవాక్కేనా సమర్ధుడు ? నువ్వూ అంతటి తపస్వివే. నేనెరుగుదును. తలుచుకుంటే ముల్లోకాలను సృష్టించగలవు. కనక నా విన్నపం మన్నించు. రేవతీనక్షత్రంలోనే వివాహం జరిపించు - అని పట్టుబట్టింది రేవతీదేవి. ప్రముచుడు సరే అన్నాడు. తన తపశ్శక్తితో నక్షత్రవీథిలో మరో రేవతిని సృష్టించాడు. అదే ముహూర్తంలో రేవతీదుర్దముల వివాహం సలక్షణంగా జరిపించాడు. సంబరపడ్డాడు. ఏమీ కావాలో కోరుకొమ్మని అల్లుణ్జి అడిగాడు.

ప్రముచమహర్షీ! నేను స్వాయంభువమనువంశంలో పుట్టినవాణ్ణి. కనక నాకు మన్వంతరానికి అధిపతి అయ్యే తనయుడు కలిగేట్టు వరం ఇయ్యి - అని అభ్యర్థించాడు దుర్దముడు. అయితే, దుర్దమా! మహాదేవిని ఉపాసించు. నీ కోరిక నెరవేరుతుంది. *దేవీభాగవతము* అని ఒక మహాపురాణం ఉంది. అది అయిదవ పురాణం, దాన్ని శ్రద్ధాసక్తులతో అయిదుమార్లు చదివించుకుని విను. ఈ రేవతికీ నీకూ జన్మించబోయే కుమారుడు అయిదవ మన్వంతరానికి అధిపతి అవుతాడు - అని ప్రముచుడు ఆశీర్వదించాడు. దుర్దముడు సంతోషించాడు. రేవతిని తీసుకుని రాజధాని చేరుకున్నాడు. ధర్మబద్ధంగా ప్రజలను సొంత కొడుకుల్లాగా చూసుకుంటూ పరిపాలన సాగించాడు.

ఒకనాడు లోమశమహర్షి దుర్దముడి రాజధానికి వచ్చాడు. మహారాజు ఎదురువెళ్ళి సాష్టాంగనమస్కారం చేసి అంతఃపురంలోకి తోడ్కొనివచ్చి అతిథిమర్యాదలు జరిపాడు.

మహర్షీ ! దేవీభాగవతం వినాలని ఉంది. తమరు వినిపించండి అని అభ్యర్థించాడు. లోమశుడు సంబరపడ్డాడు. మహారాజా ! నీకూ జగదంబిక పట్ల భక్తి అంకురించింది. ఇది చాలా శుభంకరం. భక్తి కలిగితే చాలు ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులైనట్టే. కార్యసిద్ధి కలుగుతుంది. తప్పకుండా దేవీభాగవతం వినిపిస్తాను అని చెప్పి, ఒక శుభముహూర్తాన ప్రారంభించి అయిదు అవృత్తులుగా పురాణశ్రవణం చేయించాడు లోమశుడు.  రేవతీసహితుడై దుర్దముడు భక్తిశ్రద్ధలతో ఆలకించాడు. ముగింపురోజున మహర్షినీ వేదపండితులనూ ఆ పండితుల ధర్మపత్నులనూ సువర్ణాంబరాలతో సత్కరించాడు. నవాక్షరమంత్రంతో హోమాలు చేసి కుమారీపూజలు నిర్వహించి పెద్ద ఎత్తున సంతర్పణ జరిపాడు. రేవతీదేవి గర్భం ధరించింది. శుభముహూర్తాన లోకకల్యాణకారకుడైన పుత్రుణ్ణి ప్రసవించింది. జాతకర్మాదిక్రియలన్నీ ఉత్సవాలుగా జరిపించాడు మహారాజు. భూరి దక్షిణలతో విఫ్రల్ని సంతోషపరిచాడు. *రైవతుడు* దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. ఉపనయనం అయ్యింది. గురుకులంలో వేదశాస్తాలు అన్నీ సమగ్రంగా అధ్యయనం చేశాడు. ధనుర్విద్యాపారంగతుడు అయ్యాడు. ధర్మశాస్త్రానికి వక్తా కర్తా అయ్యాడు. బ్రహ్మదేవుడు రైవతుడి యోగ్యతలు గుర్తించి మన్వంతరాధిపతిని చేశాడు.

కుంభసంభవా ! అగస్త్యా ! ఇంతటిది సుమా దేవీభాగవత శ్రవణమాహాత్మ్యం. క్లుప్తంగా చెప్పాను. పరిపూర్ణంగా చెప్పడం ఎవరితరమూ కాదు - అని కుమారస్వామి ముగించాడు.

లోపాముద్రాగస్త్యులు అప్పటికి సంతృప్తిపడి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కనుక శౌనకాది మహామునులారా ! ఈ పురాణాన్ని వినడంవల్ల కలిగే పుణ్యఫలం అనంతమన్నాడు సూతుడు.

*(శ్రీస్కాందం - మానసఖండం- దేవీభాగవత మాహాత్మ్యం. అధ్యాయం - 4, శ్లోకాలు - 91).*

*సూతమహర్షీ!*

*దేవీభాగవతమాహాత్మ్యం అద్భుతంగా వివరించావు. చాలా ఆనందం కలిగించావు. అయితే ఆ పురాణం వినడానికి ఏవైనా నియమాలు ఉన్నాయా ? ఎప్పుడు మొదలు పెట్టాలి ? ఎక్కడ మొదలు పెట్టాలి ? ఎలా వినాలి? ఈ సందేహాలు తీర్చి అటుపైని పురాణం వినిపించు – అని అభ్యర్థించారు శౌనకాదులు.*

    *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*

*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*

🙏 శ్రీ మాత్రే నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat