శ్రీ దేవీ భాగవతము - 4

P Madhav Kumar


*లలితా సహస్రనామ శ్లోకం - 4*

*చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా!*
*కురువిందమణిశ్రేణీ కనత్కోటీర మండితా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*సూతమహర్షీ!*

*దేవీభాగవతమాహాత్మ్యం అద్భుతంగా వివరించావు. చాలా ఆనందం కలిగించావు. అయితే ఆ పురాణం వినడానికి ఏవైనా నియమాలు ఉన్నాయా ? ఎప్పుడు మొదలు పెట్టాలి ? ఎక్కడ మొదలు పెట్టాలి ? ఎలా వినాలి? ఈ సందేహాలు తీర్చి అటుపైని పురాణం వినిపించు – అని అభ్యర్థించారు శౌనకాదులు.*

*మహర్షులారా !*
ఈ పురాణ శ్రవణానికి సాధారణ నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిని పాటించి వింటే శ్రవణఫలం సమగ్రంగా దక్కుతుంది. సకలవాంఛలూ నెరవేరతాయి. ముందుగా దైవజ్ఞులను సంప్రదించి పురాణశ్రవణారంభానికి ముహూర్తం పెట్టించుకోవాలి. *శుచిమాసంతో ఆరంభించి (జ్యేష్టంగానీ ఆషాఢంగానీ) ఆరునెలలు శుభావహాలు. హస్త -  అశ్విని - మూల - పుష్యమి నక్షత్రాలు మంచివి.* తిథివారాలు మంచివి చూసుకుని ఆరంభించాలి. ఏ కోరికతో ఈ పురాణశ్రవణం చేస్తున్నామో దానికి తగినట్టు ముహూర్తం నిశ్చయించుకోవడం మంచిది. ధర్మప్రాప్తి, లక్ష్మీప్రాప్తి, సుఖప్రాప్తి, పీడానివారణ, రాజభయనివారణ, జ్ఞానప్రాప్తి - ఇలా ఏవేవో వాంఛితాలు ఉంటాయి గదా ! వాటినిబట్టి అనుకూలమైన ముహూర్తం నిశ్చయించుకోవాలి. పుష్యమి మొదలుకొని (గురుభం) ఇరవైయేడు నక్షత్రాలనూ ఏడు రాశులు చేసి పారాయణ ఫలాలను చెప్పారు. వాటిని చూసుకోవాలి. అలాకాక,  *కేవలం దేవీప్రీతి కోసమే దేవీభాగవతం వింటున్నాను లేదా పఠిస్తున్నాను అనేట్టయితే దీనికి దేవీనవరాత్రచతుష్టయం ఉత్తమోత్తమం. (దేవీనవరాత్రాల్లో నాలుగురోజులు).* మిగతా నెలల్లో కూడా చెయ్యవచ్చు. తిథివారనక్షత్రాలు మంచివిగా చూసుకుంటే చాలు. ఇది నిష్కామం కనుక అన్ని నెలలూ యోగ్యాలే.

ఒక వివాహానికి ఎలా సంబారాలు సమకూర్చుకుంటామో అలాగే ఈ పురాణ శ్రవణ యజ్ఞానికీ సమకూర్చుకోవాలి. *ఇది తొమ్మిదిరోజులపాటు సాగే యజ్ఞం. నవాహయజ్ఞం. దేవీభాగవత పురాణ శ్రవణ యజ్ఞం.* దేనికీ లోభించకూడదు. పదిమంది సహాయమూ తీసుకోవాలి. వీరంతా దేవీభక్తిపరులై ఉండాలి. వదాన్యులై ఉండాలి. పనులు చెయ్యడంలో చతురులై ఉండాలి. చుట్టుపక్కల గ్రామాలకూ నగరాలకూ ఈ పురాణశ్రవణ వార్తను తెలియపరచాలి. "తప్పకుండా రండి" అని అందరినీ పిలవాలి. సౌరగాణపత్య శైవ శాక్త వైష్ణవాది మతానుయాయులు అందరూ దీన్ని వినవచ్చు. పఠించవచ్చు. దేవీభాగవత పీయూషం పంచుతున్నాం, రండి, వచ్చి భక్తిశ్రద్ధలతో ఆస్వాదించండి అని అందరినీ ఆహ్వానించాలి. చతుర్వర్ణాలవారూ స్రీలూ పురుషులూ అన్ని ఆశ్రమాలవారూ సకాములూ నిష్కాములూ అందరూ ప్రేమతో ఈ అమృతాన్ని చెవులారా గ్రోలవచ్చు. తొమ్మిదిరోజులూ ఉండి విని వెళ్ళండి అని ఆప్యాయంగా సవినయంగా పిలవాలి. కుదరనివారు వీలైనన్ని రోజులూ ఉండి విని వెళ్ళవచ్చు. మధ్యలో వచ్చి వినవచ్చు. వచ్చినవారందరికీ బస - వసతులు ఏర్పాటు చెయ్యాలి.

విశాలమైన పందిరివేసి చాందినీలు కట్టి అరటి బోదెలతో కొబ్బరిఆకులతో మామిడితోరణాలతో అలంకరణ చెయ్యాలి. మనోహరంగా వేదిక నిర్మించాలి. దాన్ని గోమయంలో అలికి ముగ్గులు పెట్టాలి. పందిరి అంతటా ఈ అలంకరణ చెయ్యాలి. జెండాలు కట్టాలి. ఆ వేదిక మీద పౌరాణికుడు కూర్చునేందుకు వీలుగా సుఖాసనం ఏర్పాటు చెయ్యాలి. ఆయన తూర్పుముఖంగా గానీ, ఉత్తరముఖంగా గానీ కూర్చునేందుకు వీలుగా ఉండాలి. శ్రోతలకుకూడా యథోచితంగా యథావకాశంగా ఆసనాలు వెయ్యాలి. ఆడవారికి వేరుగా మగవారికి వేరుగా కూర్చునే ఏర్పాటు ఉండాలి.

పౌరాణికుడు మంచి మాటకారి అయ్యుండాలి - నిగ్రహం కలవాడై ఉండాలి. దేవీ ఆరాధన తత్పరుడూ వివిధ పురాణ శాస్త్రాలు తెలిసినవాడూ, మంచి కంఠం కలవాడూ, దయాళుడూ, నిస్పృహుడూ, దక్షుడూ, ధీరుడూ అయ్యుండాలి. ఇన్ని లక్షణాలూ ఉంటే అతడు ఉత్తమోత్తమ పౌరాణికుడు. శ్రోతలుకూడా బ్రహ్మణ్యులూ దేవతాభక్తులూ కథారసపరాయణులూ ఉదారులూ అలోలుపులూ నమ్రులూ హింసాది దుర్గుణ వివర్ణితులూ అయ్యుండాలి. పాషండులూ, లుబ్దులూ, నాస్తికులూ, దుశ్శీలురూ, దుర్గుణులూ, నిష్టురులూ, క్రోధనులూ, శివకేశవులకు భేదం పాటించేవారూ ఈ పురాణం చెప్పడానికి గానీ వినడానికిగానీ పనికిరారు. ఇది దేవీయజ్ఞం. ఈ మాట మరిచిపోకూడదు.

పురాణశ్రవణం జరుగుతున్నప్పుడు లేదా పఠిస్తున్నప్పుడు అనేక సందేహాలూ సంశయాలూ వస్తూ ఉంటాయి. వాటిని తీర్చడానికి వీలుగా సమర్భుడైన పండితుణ్ణి (ఒకరిద్దరినిగానీ) ఆహ్వానించి పౌరాణికుని సన్నిధిలో కూర్చుండబెట్టాలి. ఈయన సహాయకుడుగా వ్యవహరిస్తూ సందేహాలు తీర్చాలి. ప్రారంభముహూర్తానికి ముందురోజునే వక్తృ శ్రోతలు క్షురకర్మాదులు చేయించుకోవాలి. అందరూ పురాణశ్రవణ దీక్షను స్వీకరించాలి. తెల్లవారుజామునే లేచి కాల్యాలు తీర్చుకుని స్నాన సంధ్యాదులు ముగించి వినడానికి కూర్చోవాలి. ఈ తొమ్మిది రోజులూ వీటిని క్లుప్తంగా ముగించుకోవచ్చు. కథా శ్రవణ యోగ్యత్వ సిద్ధికోసం యథాశక్తిగా గోదానాదులు చెయ్యడం మంచిది.

యథాశక్తిగా భూ సువర్ణ వస్త్ర భూషణ ధనాదులతో పొరాణికుణ్ణి సంతృప్తి పరచాలి. ఆయన ప్రసన్నుడైతే దేవతలందరూ ప్రసన్నులైనట్టే. అలాగే సహాయకులుగా ఉండే పండితులనూ నామజపాలూ హోమాలూ చేసే విపృలనూ సంతృప్తిపరచాలి కుమారీ సువాసినీ పూజలు అందుకున్న వారినీ దక్షిణలతో సంతృప్తిపరచాలి. సంతర్పణ జరపాలి. వీరందరూ సంతృప్తి చెందితే దేవి సంతృప్తి చెందినట్టే. కోరికలన్నీ తీరతాయి. దేవీనవరాత్రాలలో అష్టమినాడుగానీ నవమినాడుగానీ దేవీభాగవత గ్రంథాన్ని పట్టువస్త్రంతో కప్పి అర్చించి పౌరాణికులకూ విప్రులకూ దానం చెయ్యాలి. ఇలా చేసిన పుస్తకదానం సకలపాపాలనూ హరిస్తుంది. ఇహ లోకంలో సకలభోగాలనూ కలిగించి పరలోకంలో ముక్తిని ప్రసాదిస్తుంది. పౌరాణికుడు దుర్చలుడా బలుడా యువకుడా వృద్ధుడా-అనే విచారణతో పనిలేదు. అందరికీ పూజ్యుడు. అందరికీ వంద్యుడు. వ్యాసుడితో సమానుడు. లోకంలో చాలామందికి చాలారకాల గురువులు ఉంటారు. కానీ అందరిలోకీ ఉత్తమోత్తమ గురువు పొరాణికుడే.

*సంతి లోకస్య బహవః గురవో గుణజన్మతః!*
*సర్వేషామపి తేషాంచ పురాణజ్ఞః పరో గురుః!!*

వ్యాసపీఠం ముందు కూర్చుని పురాణం చెబుతున్నంత సేపూ అతడు వ్యాసుడే. ఆ సమయంలో అతడికి ఎవరూ నమస్కరించకూడదు. ప్రసంగం ముగిశాకనే నమస్కరించాలి.

*పౌరాణికో బ్రాహ్మణస్తు వ్యాసాసన సమాశ్రితః |*
*అసమాప్పే ప్రసంగే తు నమస్కుర్యాన్న కస్యచిత్‌!!*

*మహర్షులారా !*
ఈ నియమావళి పాటిస్తూ వినాలి. అప్పుడే ఫలితం దక్కుతుంది. పౌరాణికుడికన్నా ఉన్నతమైన ఆసనం మీద కూర్చుని డాంబికంగా వినకూడదు. అలా చేస్తే మరుసటి జన్మలో కాకిగా పుడతాడు. సాధ్యమైనంతవరకూ తొమ్మిదిరోజులూ ఉండి వినివెళ్ళడం మంచిది. మధ్యలో వితండవాదాలు చేసేవారు గాడిదలై పుడతారు. నిందించే వారు శునక జన్మలెత్తుతారు. పౌరాణికుడితో సమానమైన ఆసనంలోనూ కూర్చోకూడదు. నమస్కరించకుండా వచ్చి కూర్చున్నా పడుకుని విన్నా విఘ్నాలు కల్పించినా, శ్రద్ధగా వినకపోయినా మహాపాపం చుట్టుకుంటుంది. నరకయాతనలూ నీచజన్మలూ తప్పవు. అందుకని పురాణాన్నీ పౌరాణికుణ్ణీ గౌరవిస్తూ భక్తిశ్రద్ధలతో వినాలి. పురాణప్రవక్తకు యథాశక్తిగా పండో ఫలమో ధనమో వస్త్రమో ఇవ్వాలి. అలా ఇచ్చినవారికి వైకుంఠం దక్కుతుంది.

సకల పురాణాలనూ వింటే దక్కే ఫలంకన్నా ఈ దేవీభాగవతం వింటే లభించే పుణ్యఫలం నూరురెట్లు అధికం. ఈ పుస్తకానికి అట్టవేసినా, నూతనవస్త్రం చుట్టినా దారం సమకూర్చినా అది అత్యంత పుణ్యప్రదం. నదులలో గంగ, దేవుళ్ళలో శివుడు, కావ్యాలలో రామాయణం, గ్రహాలలో సూర్యుడు, తారకలలో చంద్రుడు, థనాలలో కీర్తిధనం, క్షమాగుణ సంపన్నులలో భూమి, గాంభీర్యంలో సముద్రుడు, మంత్రాలలో గాయత్రి, పాపనాశకులలో శ్రీహరి - ఎలా ఉత్తమోత్తమమో అలా పురాణాలలో దేవీభాగవతమే ఉత్తమోత్తమం,. ఎలాగోలాగా శ్రమపడి తొమ్మిది రోజులూ వింటే (తొమ్మిది పర్యాయాలు వింటే) ఆ ఫలితం పర్షనాతీతం,అతడు జీవన్ముక్తుడే. రాజభయం, శత్రుభయం, మహామారీభయం, దుర్భిక్ష భయం, రాష్ట్ర భంగభయం - ఇలాంటివి వచ్చిపడ్డప్పుడు ఈ భాగవతాన్ని చదవడం వినడం చాలా మంచిది. అన్ని భయాలూ తొలగిపోతాయి. భూతప్రేతవినాశం కోసం, రాజ్యలాభం కోసం, సంతాన ప్రాప్తికోసం దీన్ని తప్పక వినాలి లేదా పారాయణ చెయ్యాలి. దీనిలో కనీసం ఒక్క శ్లోకాన్నో శ్లోకభాగాన్నో విన్నా చదివినా దాని సత్ఫలితం తప్పక కనిపిస్తుంది. ఉత్తమగతి లభిస్తుంది.

*శ్రీ మద్భాగవతం యస్తు పఠేద్వా శృణుయాదపి!*
*శ్లోకార్థం శ్లోకపాదం వా స యాతి పరమాం గతిమ్!!*

ఆదిలో మహాదేవి ఈ పురాణాన్ని అర్ధశ్లోకంతో చెప్పింది. అదే శిష్యప్రశిష్యుల ద్వారా ఇంత గ్రంథంగా విపులీకరించబడింది. గాయత్రికి సాటివచ్చే మంత్రంగానీ దేవతగానీ తపస్సుగానీ లేవంటారు. అలాంటి ఆ గాయత్రి ఈ గ్రంథంలో సరహస్యంగా ప్రతిపాదింపబడింది. ప్రతిష్టింపబడింది. అందుకనే మరింక ఏ మహాపురాణాలు దేవీభాగవతంలో పదహారవకళకైనా సాటిరావనడం. ఇందులోఉన్న ధర్మప్రబోధం, మణిద్వీపవర్ణన, దేవీగిత మరింకెక్కడా అభించవు. అందుచేత దేవీభాగవతాన్ని పఠించడం వినడం అత్యంత పుణ్యప్రదాలు.‌ భుక్తిముక్తిదాయకాలు. దీని ప్రభావాన్ని త్రిమూర్తులు కూడా పూర్తిగా వివరించి చెప్పలేరంటే అతిశయోక్తి కాదు. ఆ తల్లి పాదపద్మాల నుంచి రాలిపడిన ఒక రేణువును శిరసావహించి ఆ త్రిమూర్తులూ తమ తమ విధులను నిర్వర్తించగలుగుతున్నారు. జగదారాధ్యులు అవుతున్నారు. ఇంతకన్నా మహాదేవి మహిమకు నిదర్శనం ఏం కావాలి !

ఆ జగదంబికకు నమస్కరిస్తున్నాను. ఆ తల్లి - సుధా సముద్రంలో మణిద్వీపంలో చింతామణి గృహంలో విరాజిల్లుతూ ఉంటుంది. చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. సన్నిధిలో నిలిచి బ్రహ్మేశాచ్యుత శక్రాది దేవతలూ సకల బుషులూ ఉపాసిస్తూ ఉంటారు. ఆ ళల్లి ఈ జగత్తుకి సమస్త శ్రేయస్సులూ కలిగించుగాక !

*(స్కాందం - మానసఖండం - అధ్యాయం - 6, శ్లోకాలు - 102)*

*బ్రహ్మేశాచ్యుత శక్రాద్యైర్మహర్షిభిరుపాసితా!*
*జగతాం శ్రేయసే సాస్తు మణిద్వీపాధిదేవతా!!*

*శౌనకాది మహామునులారా !*
ఇంతటి మహిమాన్వితమైన శ్రీమద్దేవీభాగవతాన్ని వినాలి అనే కోరిక మీకు కలగడం, వినిపించే అవకాశం నాకు కలగడం - నిజంగా ఇదంతా దేవి అనుగ్రహమే, కనక ముందుగా ఆ జగన్మాతకు నమస్కరించి ఆరంభిస్తున్నాను - శ్రద్ధాభక్తులతో ఆలకించండి.

(రేపటి భాగంలో *ప్రథమ స్కంధము* ప్రారంభం)
      
               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*

♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾

*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*

*భావము:* 💐

ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏

🙏 శ్రీ మాత్రే నమః 🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat