శ్రీ దేవీ భాగవతము - 5

P Madhav Kumar


*ప్రథమ స్కంధము - 1*

*లలితా సహస్రనామ శ్లోకం - 5*

*అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థలశోభితా!*
*ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషకా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శౌనకాది మహామునులారా !*

ఇంతటి మహిమాన్వితమైన శ్రీమద్దేవీభాగవతాన్ని వినాలి అనే కోరిక మీకు కలగడం, వినిపించే అవకాశం నాకు కలగడం - నిజంగా ఇదంతా దేవి అనుగ్రహమే, కనక ముందుగా ఆ జగన్మాతకు నమస్కరించి ఆరంభిస్తున్నాను - శ్రద్ధాభక్తులతో ఆలకించండి.

శౌనకాదిమహామునులు కలికాలదోషాలకు భయపడి బ్రహ్మదేవుని ఆజ్ఞమేరకు నైమిశారణ్యంలో తలదాచుకున్నారు. నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు విధివిధానంగా నిర్వహిస్తున్నారు. మధ్యమధ్య విరామసమయాల్లో కాలక్షేపంకోసం పురాణ శ్రవణం చేస్తున్నారు. అపష్టాదశపురాణాలూ రచించిన వ్యాస భగవానుడికి సాక్షాత్తూ శిష్యుడైన సూతుడు ఒక్కటొక్కటిగా పురాణాలు వినిపిస్తున్నాడు. అందరూ శ్రధ్ధాసక్తులతో వింటున్నారు.

ఒకరోజున శౌనకుడు -

*మహానుభావా! సూతమహర్షీ!*

అష్టాదశపురాణాలనూ సమగ్రంగా అధ్యయనం చేశావు. నువ్వు ధన్యుడివి. గురువుగారి అనుగ్రహం వల్ల నీకు పురాణ (పంచ) లక్షణాలూ, పురాణ రహస్యాలూ అన్నీ పూర్ణంగా అవగతమయ్యాయి. దీనికితోడు, శ్రోతలకు తనువు పులకించేట్టు - రోమహర్షణంగా కథ చెప్పే నేర్పు నీకు పుట్టుకతోనె లభించింది. మా అదృష్టం బాగుండి నువ్వు ఈ పుణ్యక్షేత్రానికి ఇలా దయచేశావు. మేమంతా ధన్యులం.

చెవులుండీ, పురాణాలు విననివాళ్ళు నిజంగా విధివంచితులు. షడ్రసోపేతమైన విందుతో నాలుక సంతృప్తి చెందినట్టు, నీవంటి పండితుల వాక్కుతో చెవులకు పండుగ అవుతుంది. చెవులు లేని పాములు సైతం శబ్దానికి సంబరపడతాయి. అటువంటిది చెవులుండీ పురాణాలు వినకపోతే అవి చెవులే కాదు. అందుచేత మేమంతా వినాలనే కోరికతో నీ చుట్టూ చేరాము. ఎవరైనా, ఎలాగోలాగా కాలం గడపాలిగదా! వ్యసనాలతో మూర్ఖులు కాలక్షేపం చేస్తే, శాస్త్ర చింతనలతో పండితులు కాలం గడుపుతారు.

*యేన కేనాప్యుపాయేన కాలాతివాహనం స్మృతం!*
*వ్యసనైరిహ మూర్ఖాణాం బుధానాం శాస్త్రచింతనైః ॥* (1-12)

శాస్త్రాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిలో జల్ప వితండవాదాలు అనేకం. అవి కొన్ని, కొందరికి గర్వాన్ని కలిగిస్తాయి. వేదాంతశాస్త్రమైతే సాత్త్వికమే కానీ, మీమాంసాశాస్త్రం మాత్రం రాజసం, హేతువాదాలతో నిండిన న్యాయశాస్త్రం పూర్తిగా తామసం. అలాగే పురాణాలు కూడా త్రిగుణాత్మకాలని విన్నాను. వాటిలో సర్వలక్షణ సమన్వితమైన దేవీభాగవతం పంచమవేదమనీ, పుణ్యప్రదమని భుక్తిముక్తిదాయకమనీ నీ మాటల వల్లనే తెలిసింది. ఆ పురాణాన్ని దయచేసి సవిస్తరంగా చెప్పు. నీ నోట వినాలని మాకందరికీ ఎంతో కుతూహలంగా ఉంది.

ఇప్పటికి చాలా పురాణాలు చెప్పావు. విన్నాం. అయినా మాకెవ్వరికి తృప్తి తీరలేదు. అమరులు అమృతం సేవించారు. తృప్తి పొందారా! ఇంతకీ ఏమిటట ఆ అమృతం గొప్ప ! ఎంత సేవిస్తే మాత్రం ముక్తినిస్తుందా ! అదే భాగవతామృతమైతే వెంటనే సంకటాలు అొలగిపోయి, ముక్తి లభిస్తుంది. సుధాపానం కోసమని మేమంతా ఎన్నెన్నో యజ్ఞాలు చేశాం. అయినా శాంతి లేదు. యజ్ఞఫలం స్వర్గప్రాప్తి. కొంతకాలానికి ఆ స్వర్గం నుంచి పతనం కావడం, సంసార చక్రంలో పడటం. ఇలా నిరంతరం పరిభ్రమించడమే కదా !

త్రిగుణాత్మకమైన ఈ కాలచక్రంలో పడి తిరుగుతున్న మానవులకు మోక్షం లేదు. జ్ఞాన మొక్కటే ముక్తి మార్గం. అందుచేత పరమపావనమూ, అతిగుహ్యమూ, ముక్తిదాయకమూ, ముముక్లువులకు అత్యంత ప్రియమూ అయిన దేవీభాగవతాన్ని సవిస్తరంగా మాకు వినిపించు.
         *(అధ్యాయం-1-శ్లోకాలు-25)*

ఈ అభ్యర్థనకు సూతుడు ఎంతగానో సంతోషించాడు.

*శౌనకాదిమహామునులారా !*

నేను ధన్యుణ్ణి. నా భాగ్యమే భాగ్యం. వేదసమ్మితమైన భాగవతం చెప్పమని మీరు అడిగారంటే నేను పవిత్రుణ్ణి అయ్యాను. తప్పకుండా చెబుతాను. సర్వవేదాలకూ సర్వశాస్త్రాలకూ సర్వ ఆగమాలగూ సారభూతమైన దేవీభాగవతం అతిరహస్యం, అతిగుహ్యం. అయినా మీవంటి యోగ్యులు అడిగారు కనక వివరంగా చెబుతాను. యోగులకు ముక్తి ప్రదమై, బ్రహ్మాదిదేవతలకు సేవ్యమై, మునీంద్రులకు ధ్యేయమైన ఆ తల్లి పాదపద్మాల జంటకు నమస్కరించి ఇప్పుడే మొదలుపెడుతున్నాను. శ్రద్దగా ఆలకించండి.

*ఇది పురాణోత్తమం. సర్వరసాలయం. భగవతి అనే పేరుతో ప్రసిద్ధం. శక్తిః - విద్యా - పరా - సర్వజ్ఞా -: భవబంధా - విచ్చేదనిపుణా మొదలైన నామధేయాలతో స్తుతింపబడుతూ మహామునీంద్రులకు ధ్యానంలో మాత్రమే దర్శనమిచ్చే భగవతి ఈ పురాణంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. సకల సిద్ధులూ కలిగిస్తుంది. సదసత్స్వరూపమైన ఈ అఖిల జగత్తునూ త్రిగుణాత్మకమైన స్వీయశక్తితో తానే సృష్టించి, రక్షించి కల్పాంతంలో ఉపసంహరించి ఒంటరిగా వినోదించే ఆ విశ్వజననిని, ఆ లోకమాతను మరొక్కసారి మనసులో స్మరిస్తున్నాను.*

వేదవేత్తలైన పౌరాణికులు - బ్రహ్మదేవుడు సృష్టికర్త అనికదా చెబుతారు. ఆ బ్రహ్మదేవుడు, శేషశయ్య పై విశ్రమించే విష్ణుమూర్తికి నాభికమలం నుంచి జన్మించాడనీ, అతడి సృష్టి స్వతంత్రం కాదనీ జీవుల కర్మానుసారం జరుగుతుందనీ వారే అన్నారు. ఇంతకీ ఆ విష్ణుమూర్తికి ఆధారం ఆదిశేషుడు. ఆదిశేషుడికి ఆధారం మహాసముద్రం. అది సలిలం. రస స్వరూపం, పాత్రలేకుండా జలం నిలబడుతుందా ఎక్కడైనా? ఆ పాత్రయే, ఆ ఆధారమే *జగజ్జనని.* ఆ సర్వశక్తి స్వరూపిణి పాదపద్మాలను శరణువేడుతున్నాను.

*యోగనిద్రా మీలితాక్షం విష్ణుం దృష్ట్వాంబుజే స్థితః!*
*అజస్తుష్టావ యాం దేవీం తా మహం శరణం వ్రజే ॥*

విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నప్పుడు, నాభికమలం లోని బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్తుతించాడు. సగుణరూపిణి, నిర్గుణ రూపిణి, మాయా స్వరూపిణి, ముక్తి ప్రదాయిని ఆ తల్లిని ధ్యానించి దేవీ భాగవతం సవిస్తరంగా చెబుతున్నాను, మునులారా ! వినండి.

🙏 *పురాణప్రపంచం*

ఇది మహాపురాణం. ఉత్తమోత్తమం. ఇందులో మొత్తం...
*పద్ధెనిమిదివేల శ్లోకాలు.*
*పన్నెండు స్కంధాలు,*
*మూడు వందల పద్ధెనిమిది అధ్యాయాలు.*

✅ ప్రథమ స్కంధంలో ఇరవై,
✅ ద్వితీయ స్కంధంలో పన్నెండు, 
✅ తృతీయ స్కంధంలో ముష్ఫయి,
✅ చతుర్ధ స్కంధంలో ఇరవై అయిదు,
✅ పంచమ స్కంధంలో ముష్ఫైఅయిదు,
✅ షష్ట స్కంధంలో ముప్ఫయి ఒకటి,
✅ సప్తమ స్కంధంలో నలభై,
✅ అష్టమ స్కంధంలో ఇరవైనాలుగు,
✅ నవమ స్కంధంలో యాభై,
✅ దశమ స్కంధంలో పదమూడు,
✅ ఏకాదశ స్కంధంలో ఇరవై నాలుగు,
✅ ద్వాదశ స్కంధంలో పధ్నాలుగు అధ్యాయాలు ఉంటాయి.

అని, ప్రణాళిక అంతా గ్రంథారంభంలోనే తెలియజేశాడు వ్యాసభగవానుడు.

*సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ ॥*
*వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణమ్‌ ॥*

పురాణానికి అయిదు ప్రధాన లక్షణాలు ఉన్నాయి. *సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరాలు, వంశానుచరితం* అనేవి పురాణంలో ఉండాలి.

నిర్గుణ స్వరూపిణియైన లోకమాత జగత్సృష్టికోసం మూడు రూపాలు ధరించింది.  *సాత్తికశక్తి మహాలక్ష్మీ రూపంగానూ, రాజసశక్తి మహాసరస్వతీ రూపంగానూ, తామస శక్తి మహాకాళీరూపంగానూ* ఆవిర్భవించింది. కాబట్టి దీనిని సర్గము అంటారు శాస్త్రవేత్తలు. అటుపైని త్రిమూర్తుల ఉత్పత్తి జరిగింది. *పాలనకోసం హరి, ఉత్పత్తికోసం బ్రహ్మ, నాశంకోసం రుద్రుడు.* దీనిని ప్రతి సర్గము అంటారు. రాజులకు సంబంధించి సూర్య - చంద్ర వంశాలనూ, రాక్షసులకు సంబంధించి హిరణ్యకశిపు ప్రభృతుల వంశాలనూ వివరించడమే వంశం. స్వాయంభువుడు మొదలుకొని ఆయా మనువులనూ వారి కాలాలనూ వర్ణించి చెప్పడమే మన్వంతరాలంటే. వారి వంశాల అనుక్రమాన్ని తెలియజెప్పడమే వంశానుచరితం. ఇలా పురాణాలన్నీ పంచలక్షణ యుక్తాలు. ఇవికాక వ్యాసభగవానుడు; *లక్షాపాతికవేల శ్లోకాలతో (సవాలక్ష) భారతం రచించాడు. దాన్ని ఇతిహాసం అంటారు. అది పంచమ వేదం.*

ఇంతవరకూ చెప్పి ఎందుకనో సూతడు ఒక్క నిమిషం ఆగాడు. అప్పుడు శౌనకుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు -

*సూతమహర్షీ !*

నువ్వు సర్వజ్ఞుడివి. అందుచేత ఆ పురాణాలు ఎన్ని? ఏమేమిటి? తెలియజెయ్యి. మేమేమో కలికాలానికి భయపడి ఈ నైమిశారణ్యంలో నివసిస్తున్నాం. కలికానికైనా కనిపించని ప్రదేశం మాకు చూపించు మహానుభావా అని మేమంతా ప్రార్ధిస్తే అలనాడు బ్రహ్మదేవుడు ఒక మనోమయ చక్రాన్ని సృష్టించి మాకిచ్చాడు. దొర్గించుకుంటూ దీని వెంట వెళ్ళండి. దీని నేమి ఎక్కడ శిథిలం అవుతుందో ఆ ప్రదేశం పరమపావనమని గ్రహించండి. అక్కడికి కలి ప్రవేశించడు, ప్రవేశించలేడు. అక్కడ మీరంతా మళ్ళీ సత్యయుగం వచ్చేంత వరకూ హాయిగా నివసంచండి అని ఆజ్ఞాపించాడు.

ఆయన మాటమీద చక్రాన్ని దొర్లించుకుంటూ బయలుదేరాం. ఇక్కడికి వచ్చేసరికీ దీని నేమి శీర్ణమయ్యింది. అందుకే ఇది *నైమిశక్షేత్రం* అయ్యింది. ఈ ప్రదేశం పరమపొవనం. కలి! ప్రవేశం లేదు. అందుకని దీన్ని నివాసంగా చేసుకున్నాం. కలిభీతులైన ఈ సిద్ధులూ ఈ మునులూ అందరం కలసి ఇక్కడే ఉంటూ, పశుహింస లేని యజ్ఞాలను కేవలం పురోడాశాదులతో చేస్తూ కాలం గడుపుతున్నాం. మళ్ళీ సత్యయుగం వచ్చేంతవరకూ కాలక్షేపం చెయ్యాలిగదా ! ఇంతలోకీ మా భాగ్యంగా నువ్వు ఇక్కడికి వచ్చావు. బ్రహ్మసమ్మితమైన ఆ పురాణాన్ని సవిస్తరంగా చెప్పు. మాకు వేరే మరొక పని ఏమీ లేదు. ఏకాగ్రచిత్తంతో వింటాం. కథామాత్రంగా చెప్పేస్తే మాకు తృప్తి కలగదు. ధర్మార్ధకామమోక్షాలను చాలా  అందంగా వర్ణించాడుకదా వ్యాసుడు. దేవీభాగవతమంటే అది సకల గుణగణాలకూ నిలయం. జగన్మాత నాట్యంలాగా అది చిత్రవిచిత్ర. సమస్త దోష వినాశకం. అఖిలవాంఛా ప్రదాయకం. దయచేసి వివరంగా చెప్పు.

*(అధ్యాయం - 2, శ్లోకాలు - 40)*

శౌనకుడు మళ్ళీ ఇలా అభ్యర్థించేసరికి సూతుడు ఇంకా సంబరపడ్డాడు. ప్రవచనం  కొనసాగించాడు.

*మద్వయం భద్వయం చైవ - బ్రత్రయం వచతుష్టయమ్‌ ।*
*అ-నా-ప -లిం - గ - కూ - స్కాని పురాణాని పృథక్‌ పృథక్‌ ॥*

వీటిలో.... 
*మత్స్యపురాణం* మొదటిది - పధ్నాలుగువేల శ్లోకాలు.
✅ రెండవది *మార్కండేయం* - తొమ్మిదివేల శ్లోకాలు.
ఇవి *'మ' ద్వయం.*

*భవిష్యపురాణం* - పధ్నాలుగువేల అయిదు వందల శ్లోకాలు.
*భాగవతం* - పద్ధెనిమిదివేల శ్లోకాలు.
ఇవి *'భ' ద్వయం.*

*బ్రహ్మపురాణం* - పదివేల శ్లోకాలు.
*బ్రహ్మాండపురాణం* - పన్నెండువేల ఒక్కవంద శ్లోకాలు.
*బ్రహ్మ వైవర్తపురాణం* - పద్ధెనిమిదివేలు.
ఇవి *'బ్ర' త్రయం.*

*వామన పురాణం* - పదివేల శ్లోకాల గ్రంథం.
*వాయుపురాణం* - ఇరవైనాలుగువేల ఆరువందల శ్లోకాలు.
*విష్ణుపురాణం* - ఇరవైమూడువేల శ్లోకాలుంటాయి.
*వరాహపురాణం*  ఇరవైనాలుగువేల శ్లోకాల గ్రంథం.
ఇవి *'వ' చతుష్టయం.*

*అగ్నిపురాణం* -  పదహారువేలు,
*నారదపురాణం* - ఇరవైఅయిదువేలు,
*పద్మ పురాణం* - యాభై అయిదువేలు,
*లింగపురాణం* - పదకొండువేలు,
*గరుడపురాణం* - పందొమ్మిదివేలు,
*కూర్మపురాణం* - పదిహేడువేలు,
*స్కాందపురాణం*  ఎనభైయొక్కవేలు శ్లోకాలు ఉంటాయి.

ఇవే *అ-నా-ప-లిం-గ-కూ-స్కాలు.*

🙏 *ఇవి పద్దెనిమిదీ మహాపురాణాలు.*

వీటి పేర్లే కాకుండా వీటిలో ఉండే శ్లోకాల సంఖ్య కూడా తెలియజేశాను. విన్నారు కదా ! మరో పద్దెనిమిది ఉపపురాణాలు ఉన్నాయి. అవీ చెబుతాను, వినండి.

*సనత్కుమార-నారసింహ- నారదీయ - శివ - దౌర్వాస - కాపిల - మానవ - బెశనస – వారుణ - కాళికా - సాంబ - నంది (కృత) - సౌర - పారాశర - ఆదిత్య - మాహేశ్వర - భాగవత - వాసిష్ట* పురాణాలను ఉపపురాణాలు అంటారు. ఇన్నీ వ్రాసి ఇంకా *మహాభారతం* రచించాడు వ్యాసుడు.

(రేపటి భాగంలో *వ్యాస చరిత్ర - వ్యాసుని పుత్రకాంక్ష*)

      
               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*

♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾

*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*

*భావము:* 💐

ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏

🙏 శ్రీ మాత్రే నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat