🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷
*బుధగ్రహ జననం -3*
చంద్రుడు మంత్ర ముగ్ధుడిలా తార మొహంలోకి చూశాడు. అక్కణ్నుంచి చూపుల్ని కిందికి మళ్ళించకుండా ఉండడానికి విశ్వప్రయత్నం చేసి , ఓడిపోయాడు...
*"చంద్రా !"* తార హెచ్చరించింది.
చంద్రుడు అసంకల్పితంగా లేచి , విస్తర్లో పడి ఉన్న తార పైటను అందుకున్నాడు. తార నెమ్మదిగా లేస్తూ , నిటారుగా నిలుచుంది. పైట కొంగును చేత్తో పట్టుకున్న చంద్రుడూ లేచాడు. వణుకుతున్న చేత్తో పైటను తార భుజం మీద వేశాడు. పర్వత శిఖరాల్ని కప్పిన మంచు దుప్పటిలా ఉంది ఆమె పైట ఇప్పుడు..
తన విస్తర్లో వడ్డించడం ముగించి , కూర్చుంది తార. చంద్రుడు ఆమె ఎదురుగా తన విస్తరి ముందు కూర్చున్నాడు. ఇందాక కరకరలాడిన ఆకలి ఎందుకో మాయమైనట్టు అనిపిస్తోందతనికి. మాటి మాటికీ చంద్రుడి కళ్ళు తారనే చూస్తున్నాయి. కడుపులోని ఇందాకటి ఆకలి కళ్ళలోకి చేరిందనిపిస్తోందతనికి.
*"ఎలా ఉంది , వంట రుచిగా ఉందా?”* తార ఉన్నట్టుండి అడిగింది.
తార ప్రశ్నతో ఉలిక్కిపడిన చంద్రుడు భోజనం చేయడం ప్రారంభించాడు. తనను చూస్తూ , విస్తరి వైపు చూడకుండా భోజనం చేస్తున్న చంద్రుణ్ణి చిరునవ్వుతో గమనిస్తూ భోజనం చేస్తోంది తార.
*"మీ అమ్మగారు మహామహిళ అని చెప్తూ ఉంటారు మీ గురువుగారు !"* తార చంద్రుడి మొహంలోకి చూస్తు అంది.
*"ఔను..."* చంద్రుడు మెల్లగా అన్నాడు.
*"మీ అమ్మగారు అందగత్తె అని కూడా విన్నాను..."* తార మళ్లీ అంది. *"ఊ..."* చంద్రుడు పొడిగా అన్నాడు..
*"నిజమేనా ? మీ అమ్మగారు అందంగా ఉంటారా ?”* తార తినడం ఆపి అడిగింది.
*"అమ్మ... చాలా అందంగా ఉంటుంది..."* చంద్రుడు గొంతు పెగుల్చుకుని అన్నాడు. తార మాటలు అతనిలో తాత్కాలికంగా పుట్టిన బెరుకుని చెరిపివేస్తున్నాయి.
*“నా కంటేనా ?"* తార నవ్వుతూ అంది.
చంద్రుడు తలెత్తి చూశాడు. తార కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి. ఎర్రటి పెదవులు కొద్దిగా విచ్చుకొని , మల్లెమొగ్గలాంటి పళ్ళని చూపిస్తున్నాయి.
*“చెప్పు చంద్రా... మీ అమ్మగారు అందంగా ఉంటారా ? నేను అందంగా ఉంటానా ?"* తార కంఠంలో చిలిపితనం రాగాలు తీసింది.
చంద్రుడు పెదవి కదపకుండా తార మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు.
తార చిన్నగా నవ్వింది. *"చెప్పవూ?"*
*"ఇద్దరూ... ఇద్దరూ అందంగా ఉంటారు..."* చంద్రుడు తడబడుతూ అన్నాడు. తార పగలబడి నవ్వింది. *"పిచ్చి చంద్రా !"* అంది నవ్వు ఆపి.
*"ఊ...తిను !"* అంది చుంద్రుడి విస్తర్ని చూస్తూ తార.
*"కడుపు నిండింది..."* చంద్రుడు మెల్లగా అన్నాడు.
తార ఎంగిలి విస్తర్లను తీసుకుని , పైకి లేస్తోంది. ప్రాణం వచ్చినట్టు ఆమె పైట మళ్లీ జారింది.
*"ఉస్ ! ఇవాళ ఈ పైట నా ప్రాణాలు తీస్తోంది. చంద్రా..."* అంది సాభిప్రాయంగా తార. అప్పటికే ఆమె అటువైపు తిరిగి ఉంది.
చంద్రుడు ఆమె వెనక వైపు నుండే , నేల మీద పడిన పైటను అందుకుని , ఎడమ చేత్తోనే ఆమె భుజం మీదకి సర్దాడు.
భుజం మీద చంద్రుడు సర్దిన పైటను గెడ్డంతో అదుముకుంటూ , చంద్రుడి వైపు వాలుగా చూసింది తార. *"ఈ నార చీరలింతే... జారిపోతూ ఉంటాయి !"*
తార నడుస్తూ వెళ్తుంది. కొలని గట్టున నడుస్తున్న హంస గుర్తుకు వచ్చింది. చంద్రుడికి. వెనుక నుంచి తార సౌందర్యం ఇనుమడించి కనిపిస్తోంది. తను సిగ్గుపడుతూ , మర్యాద కోసం *"ఇద్దరూ అందంగా ఉంటారు !"* అన్నాడు కానీ... అమ్మ అందం వేరు.... తార అందం వేరు !
ఏదో పిలుపు వినిపించి చంద్రుడు తటాలున వెనుదిరిగి చూశాడు. అతని చూపులు తోటలో ఆత్రంగా వెతికాయి. చెట్ల కింద , పొదల కింద , పొదరిండ్ల కిందా చీకటి దోబూచులాడుతోంది. చీకట్లో పొంచివుందా... ఆమె ?
తనలాగే నిద్రకు దూరమై , మనసును కెలికే మధురమైన ఊహలకు దగ్గరై , తనలాగే ఆమె కూడా తోటలోకి వచ్చిందా ?
మధ్యాహ్నం భోజనం చేసినప్పటి నుంచి అతనికి ఆ 'జారిపోయే నారచీరే' గుర్తుకొస్తోంది ! ఆమె కంఠంలో వలికిన వీణలే అతని చెవుల్లో , అతని హృదయంలో మారు మోగుతున్నాయి.
చంద్రుడు అక్కడా , ఇక్కడా నక్కిదాక్కున్న చీకట్లలో ఆమె కోసం ఆశగా , ఆత్రుతగా వెతుకుతూ , చప్పుడు చేయకుండా తిరుగుతున్నాడు.
ఏదో పిలుపు - ఇందాకటిలాగా - అతన్ని పిలిచింది. చంద్రుడు తల తిప్పి చూశాడు. గుబురుకొమ్మల్లో ఆకులు చప్పుడు చేశాయి. ఏదో రెక్కల చప్పుడు ! ఇందాకట్నుంచీ తనను 'పిలిచిన' పక్షి ఎగిరిపోయింది !
చంద్రుడు బరువుగా నిట్టూర్చాడు. ఆమె... ఆమె... గురుపత్ని... అలా నారచీర జారిపోవడం నిత్యమూ జరిగేదేనేమో ! సమీపంలో ఉన్న గురువుగారో , శిష్యులో ఆ పైటను సర్దడం సాధారణంగా జరిగేదేనేమో !
అందగత్తె అయిన స్త్రీని అతి సమీపంలోంచి మొదటిసారి చూసినందుకు తాను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడా ? ఆమె కళ్ళు అందర్నీ ఒక్కలాగా , తనను మాత్రం మరొకలాగా అర్ధవంతంగా - సందేశాత్మకంగా చూస్తున్నాయా ?
ఎటూ తేల్చుకోలేని చంద్రుడు విద్యార్థుల విడిది వైపు బరువుగా అడుగులు వేశాడు.
అంతసేపూ ఒక పొదచాటు నుంచే చంద్రుణ్ణి గమనిస్తూ ఉండిపోయిన పరిచారిక పుంజికస్థల పెదవి విరుచుకుని , తన పర్ణశాల వైపు వెళ్ళింది.
అప్సరస అయిన తనను ఆ మహేంద్రుడు గురువుగారి ఆశ్రమ పరిచారికగా నియమించి , స్వర్గలోకం నుంచి ఇక్కడికి పంపించి వేశాడు. ఆశ్రమ జీవితం తనకు విసుగు పుట్టించి వేసింది. గురుపత్ని చెప్పే ఆ పనీ , ఈ పనీ చేయడం , రోజూ ఉదయం గురువుగారి దేవతార్చనకు పువ్వులు కోసి , తెచ్చి సమర్పించుకోవడం , విద్యార్థుల విడిదిని శుభ్రం చేయడం... నిత్యం ఇవే పనులు.
పుంజికస్థల నిట్టూర్చింది. ఒక ఆట లేదు , ఒక పాట లేదు ! ఒక వినోదం లేదు , ఒక వేడుక లేదు ! తాను అటూ ఇటూ వయ్యారంగా అడుగులేస్తూ ఉంటే సరసోక్తులూ , ఛలోక్తులూ రువ్వే దేవయువకులూ లేరు ! హూ ! ఆ ఊర్వశిలాగో , మేనకలాగో ఆటాపాటా వచ్చి ఉంటే దేవరాజు తనని ఇక్కడికెందుకు పంపిస్తాడు ? ఈ ఏకాంతవాస శిక్ష ఎందుకు విధిస్తాడు ? అప్సరసగా జన్మించిన తనకు అప్సరసగా జీవించే అదృష్టం లేదు !
పుంజికస్థల బరువుగా నిట్టూర్చింది.