#నవగ్రహ #పురాణం - 42 వ అధ్యాయం - బుధగ్రహ జననం - 5

P Madhav Kumar


🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷

*బుధగ్రహ జననం - 5*

తన ముఖం మీద చెమట బిందువులు పొటమరిస్తున్నట్టు గమనించాడు చంద్రుడు.

*"అరెరే ! చెమటలు కమ్ముతున్నాయి. పరుగెత్తావు కదా , పాపం..."* అంది తార అతని ముఖాన్ని చూస్తూ.

తటాలున పైటకొంగుతో అతని ముఖం మీది చెమటల్ని అద్దసాగింది. ఆ కొంగుని అంటిపెట్టుకున్న పుప్పొడి సువాసనా , తామర పువ్వులాంటి ఆమె అరచేతి స్పర్శా చంద్రుడికి మత్తెక్కిస్తున్నాయి.

*"చెమట మళ్లీ పొంగుతోంది ! అంతగా అలసిపోయావా ?"* తార అతని ముఖం మీద మళ్ళీ ప్రత్యక్షమవుతున్న చెమట పూసల్ని చూస్తూ అంది.

చంద్రుడు మాట్లాడకుండా చూశాడు. తన ముఖం మీదా , శరీరం మీదా చెమట ముత్యాలు పొంగడానికి కారణం అలసట కాదని అతనికి తెలుసు.

*"ఎలాగా తోటలోకి వచ్చాం ! పువ్వులు కోద్దాం ! ఏం ?"* అంది తార. *"అలాగే..."* చంద్రుడు నోరు పెగుల్చుకుని , అన్నాడు.

*"సరే... నువ్వు అటు ! నేను ఇటు ! ఎవరు ఎక్కువగా కోస్తారో చూద్దాం !"* తార నవ్వుతూ అంది. *"అన్ని రంగుల పువ్వులూ కోయాలి సుమా !"*

చంద్రుడు తోటలో పూల మొక్కల మధ్య కలియదిరుగుతూ పువ్వులు కోసి , తన అంగవస్త్రంలో వేసుకుంటున్నాడు. అతనిలో ఆలోచనలు సంకుల సమరం సాగిస్తున్నాయి. ప్రతీ పువ్వు స్పర్శా చంద్రుడికి తార శరీరాన్ని గుర్తుకు తెస్తోంది...

*"చంద్రా ! ఎక్కడున్నావ్ ? ఇలా రా !”* కాస్సేపట్లో తార పిలుపు కోకిలగానంలా అతని వైపు దూసుకువచ్చింది. చంద్రుడు వెనుదిరిగి , పిలుపు వినవచ్చిన వైపు అడుగులు వేశాడు.

*"ఇక్కడ !"* గుబురుగా ఉన్న పూల మొక్కల వైపు నుండి తార హెచ్చరిక. చంద్రుడు ఆగి , చుట్టూ చూశాడు. తార కనిపించలేదు. దాగుడుమూతలా !

*"చంద్రా ! ఇక్కడ ! పొదరింట్లో !"* తార కంఠస్వరంలో నవ్వు చంద్రుడికి వీనుల విందు చేసింది.

చంద్రుడు పొదరింటి వైపు నడిచాడు. ఆ ప్రదేశంలో గాలిలో కదలాడుతున్న సౌరభసమ్మేళనం గిలిగింతలు పెడుతోంది. కొద్దిగా తలవాల్చి అందమైన , దట్టమైన పందిరిగా ఉన్న పొదరింట్లోకి దూరాడు చంద్రుడు.

అతనికి స్వాగతం పలుకుతున్నట్లు తార చేతుల్లోని గాజులు చప్పుడుచేశాయి. మరుక్షణం అతని మీద పువ్వులు వర్షిస్తున్నాయి. అతని ఎదురుగా నిలబడిన తార పైట చెరుగులోంచి తీసి , పువ్వుల్ని పోసింది. ఆమె నవ్వు ఆ పూలవాన చేస్తున్న శ్రావ్యమైన శబ్దంలా ధ్వనిస్తోంది ! చంద్రుడు ఆశ్చర్యంగా చూశాడు.

*"ఏమిటలా చూస్తున్నావు ? దేవుడి కోసం కాదు... నేను పువ్వులు కోసింది ! నీ కోసం !"* తార నవ్వుతూ అంది. *"నువ్వెవరి కోసం కోశావో చెప్పు !"*

తార ప్రశ్న చంద్రునికి సున్నితమైన చెంప దెబ్బలా తాకింది.

*"చెప్పు చంద్రా ఎవరి కోసం ?"*

తారను 'మీరు' అనాలో , 'నువ్వు' అనాలో ఇంకా తేల్చుకోలేని చంద్రుడు 'ఆమె కోసమే' అన్నట్టు తల ఎగరేశాడు.

*"నా కోసమా ! అయితే చేయవేం , పుష్పాభిషేకం ?"* తార కిలకిలానవ్వుతూ అంది.

*"ఒక్కక్షణం ఆగు. ఇలా నిలుచుని కాదు.... నిలుచున్న ఈ భంగిమలో కాదు... ఇదిగో ఇలా ఈ శయన భంగిమలో !"* అంటూ తార పొదరింటి నేల మీద వొత్తుగా మెత్తగా రాలి ఉన్న పువ్వుల పడక మీద వెల్లకిలా పడుకుంది.

చంద్రుడు మంత్ర ముగ్గుళ్ళా చూస్తున్నాడు. తలగడలా , తలకింద మడత పెట్టుకున్న ఎడమచెయ్యి , నడుము మీదికి అల్లుకున్న కుడిచెయ్యి , మోకాలి వద్ద మడతపెట్టుకున్న ఎడమ కాలు , తార అందం ఆ పూల పాన్పు మీద కుప్పపోసినట్టుంది.

*"కానీ చంద్రా , నీ కుసుమాభిషేకం !"* తార అతన్ని హెచ్చరించింది. *“ఒక్కసారే కాదు... నెమ్మది నెమ్మదిగా శరీరమంతా వర్షించాలి సుమా పువ్వులు !"*

చంద్రుడు రెపరెపలాడుతున్న గుండెను కూడదీసుకుని తార మీద కొద్ది కొద్దిగా పువ్వులు రాల్చడం ప్రారంభించాడు. మొదట్లో కొద్దిగా వణికిన చంద్రుడి చెయ్యి కాసేపట్లో వణకడం మానేసింది.

అందమైన శిలాప్రతిమను అలంకరిస్తున్న భక్తుడి చేతుల్లా చంద్రుడి చేతులు జాగ్రత్తగా తార శరీరాన్ని పూలతో కప్పుతున్నాయి.

*"ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా , చంద్రా ?"* తార అతన్నే చూస్తూ అంది. *"ప్రకృతి కన్యను అలంకరిస్తున్న రుతువసంతుడిలా ఉన్నావు !"*

పూలతో నింపిన అంగవస్త్రాన్ని దులిపి వేసి , తార వైపు చూశాడు చంద్రుడు. రంగురంగుల పువ్వులు పూచి , వాటి బరువుతో నేల మీద వంపులు తిరుగుతూ పడిన తీగలా కనిపిస్తోంది తార.

ఆమె ముఖం చంద్రుడి వైపు ప్రొద్దుతిరుగుడు పువ్వులా తిరిగి ఉంది. గుండ్రటి ప్రొద్దుతిరుగ పువ్వు మధ్య మల్లె మొగ్గలా మెరుస్తున్న పలువరుస.

*"నేను వేసిన రెండు ప్రశ్నలకు నువ్వు సమాధానాలు ఇంకా చెప్పలేదు !"* తార కంఠం అతన్ని హెచ్చరించింది.

చంద్రుడు మౌనంగా , ఆశ్చర్యంగా చూశాడు.

*"నీకు ముందుగా , మాటలు నేర్పాలి ! ఇలారా..."* అంటూ తార తలగడలా పెట్టుకున్న చేతిని చూపుతూ అంది. చంద్రుడు అసంకల్పితంగా ఆమె చేతికి తన చెయ్యి అందేలా జరిగాడు.

*“కూర్చో !”* చంద్రుడి చేతిని పట్టుకు లాగుతూ అంది తార. చంద్రుడు ఆమె దగ్గరగా కూర్చున్నాడు.

*"నా పేరేమిటి ?"* తార చంద్రుడి చేతిని చిన్నగా నొక్కుతూ అంది.

*"...తార."*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat