🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷
*బుధగ్రహ జననం - 7*
కూర్చోబోతున్న చంద్రుడి చూపులు ఆశ్రమం వైపు
ఒక్కసారిగా దూసుకు వెళ్ళాయి. వాతాయనం ముందు నిలుచుని తీక్షణంగా చూస్తున్న తార , గిరుక్కున వెనుదిరిగింది.
అర్ధరాత్రి దాటింది. చంద్రుడు పొదరింటి సమీపంలో అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. తార. ఎందుకు రాలేదు ? వస్తుందా ? రాదా ? వస్తానంటూ సంకేతం ద్వారా సందేశం అందించిందే ! బృహస్పతి మీద ఎందుకో కోపమొస్తోందతనికి.
ఇలా తిరుగుతూ ఉంటే - విద్యార్థులో , పరిచారికో - ఎవరైనా చూసే అవకాశం ఉంది ! చంద్రుడు... ఆ ఆలోచన తట్టిన వెంటనే పొదరింట్లోకి దూరాడు.
ఉన్నట్టుండి గాలి సరికొత్త సౌరభాన్ని మోసుకొచ్చింది. ఇంతసేపూ ఆ ప్రదేశంలో లేని ఆ కొత్త సువాసనను వెంబడిస్తూ సన్నగా , లీలగా... అందెల సవ్వడి ! చంద్రుడి హృదయం ఉత్సాహంతో స్పందించింది.
*"చంద్రా !"* తార తగ్గు స్వరంతో పిలిచింది.
చంద్రుడు పొదరింట్లోంచి అవతలకి వెళ్ళాడు. వేగంగా తార అతని దగ్గరగా నడిచింది. తార కంటే ముందుగా , ఆమె పైట కొంగు గాలికి ఎగురుతూ , చంద్రుడి వైపు దూసుకుంటూ వచ్చింది. చంద్రుడనే గండు చేపను పట్టడానికి తార విసరిన వలలా - ఆ పైట చంద్రుడి ముఖాన్ని కప్పింది. పైటను వెంటాడుతూ వచ్చిన తార తనువు చంద్రుడి శరీరాన్ని తాకింది.
తక్షణం యాంత్రికంగా ఆమె చేతులు అతడినీ , అతడి చేతులు ఆమెనూ చుట్టేశాయి. తార పెదవులు చంద్రుడి చెవి దగ్గరగా కదుల్తూ గుసగుసగా 'చంద్రా !' అన్నాయి. సమాధానం అందజేస్తూ చంద్రుడు తన చెవిని ఆమె పెదాలకేసి నొక్కాడు.
ఇద్దరి ఆలోచనలూ ఒక్కటిగానే ఉన్నట్టు , ఇద్దరి శరీరాలు ఒకే విధంగా ప్రతిస్పందిస్తునట్టూ - అసంకల్పితంగా ఒకర్నొకరు నడిపించుకుంటూ పొదరింట్లోకి వెళ్ళారు. ఇద్దరూ ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు.
*"తారా..."* చంద్రుడు బరువుగా అన్నాడు. *"ఈ రెండు రోజులూ అంతులేనివిగా అనిపించాయి...”*
*"మనం జాగ్రత్తగా నడుచుకోవాలి... లేకపోతే ప్రమాదం ! అందుకే... రాలేదు...”* తార అంది.
*"తారా !”* చంద్రుడు మత్తుగా, పారవశ్యంతో పిలిచాడు. *"నిన్ను అలా పిలుస్తూనే ఉండాలనిపిస్తోంది !".*
తార చెయ్యి ప్రేమలతలా కదిలి , చంద్రుడి మెడ చుట్టూ అల్లుకుని , అతన్ని కిందికి లాగింది. చంద్రుడు వాలాడు. క్షణంలో తార ఒడిలో.
*“నిన్ను నోరారా పిలవాలనిపిస్తోంది...కానీ..నా పిలుపు ఇక్కడ ఇతర్లు వింటారేమో అన్న భయం నన్ను పీడిస్తూనే ఉంటుంది !”* చంద్రుడు ఆవేశంగా అన్నాడు.
తార చెయ్యి చంద్రుడి జుత్తును ప్రేమగా నిమిరింది. *"మనది రహస్య ప్రణయం. ఇలాగే చాటుమాటుగా... "*
చంద్రుడు ఆవేశంగా లేచి కూర్చున్నాడు. *"అది నాకు నచ్చదు !"* అతని కంఠంలో ఆవేశం గంటలా ధ్వనించింది. *"వడ్డించిన విస్తరి ముందు చేతులు కట్టివేయబడి కూర్చోవడం నాకు నచ్చదు.”*
"చంద్రా !"
*"నువ్వూ... నేనూ... అంతే ! మరెవ్వరూ ఉండకూడదు. మనల్ని ఎవ్వరూ - చాటుగా అయినా సరే - చూడకూడదు. మన మాటల్ని వినకూడదు.”*
తార చేత్తో చంద్రుడి బుగ్గ నిమిరింది. *“నువ్వు వర్ణిస్తుంటే - అలా ఉండాలని , శాశ్వతంగా అలాగే ఉండిపోవాలనీ నాకు అనిపిస్తోంది , తెలుసా ?"*
*"తారా ! నిన్ను...నాతో తీసుకెళ్ళిపోతాను !"* చంద్రుడు ఉద్రేకంతో అన్నాడు.
*“ఎక్కడికి ?”*
*“నాకు నువ్వూ , నీకు నేనూ మాత్రమే కనిపించే చోటికి !"*
*“ఎక్కడికి ?”* తార ప్రశ్నతో నవ్వు జత కలిపింది.
*“మనిద్దర్నీ ఎవ్వరూ చూడలేని...”*
*“ఎక్కడికి ?”*
*“మనిద్దర్నీ ఒక్కటిగా ఉంచే ఏకాంత ప్రదేశానికి !”*
*“ఎక్కడికి ?”* తార తన రెండు చేతుల్తో చంద్రుడి ముఖాన్ని , తన వైపు తిప్పుకుని , నవ్వుతూ అడిగింది.
*"నా మందిరానికి !”*
*"నీ మందిరమా !"* తార కంఠంలో ఆశ్చర్యం ధ్వనించింది. *“నీ తల్లిదండ్రులు ఆశ్రమానికా ?”*
*“కాదు. నా మందిరానికి ! నా కోసం విశ్వకర్మ మందిరం నిర్మించాడు ! విద్యాభ్యాసం పూర్తయ్యాక , వివాహం చేసుకుని , నేను ఆ మందిరంలో నివాసం ప్రారంభించాలి... "*
*"ఓహ్...”*
*“నా విద్యాభ్యాసం ఇక్కడికి వచ్చిన రోజే - ఆశ్రమ వాతాయనంలో నీ కళ్ళను చూసిన క్షణంలోనే పూర్తయింది !"* చంద్రుడు నవ్వుతూ అన్నాడు.
ప్రతిస్పందనగా తార అరచేతులు చంద్రుడి బుగ్గల్ని సున్నితంగా నొక్కాయి. చంద్రుడి అరచేతులు ఆమె చేతుల మీదికి చేరి , నిమురుతున్నాయి.
*"వివాహం... అది కూడా అయిపోయింది ! నీతో ! నీ చెయ్యి పట్టుకున్నాను. పాణిగ్రహణం అయిపోయింది ! త్వరలో నిన్ను రహస్యంగా తీసుకెళ్ళిపోతాను. దాంతో'రాక్షసం' కూడా అయిపోతుంది !"*
*"చంద్రా...”* తార కంఠంలో పారవశ్యం జీరగా ధ్వనిచేసింది.
*"నువ్వు నా కోసమే పుట్టావు. నా కోసమే బృహస్పతిని పెళ్లి చేసుకున్నావు. నా కోసమే దాంపత్య శిల్పం నేర్చుకుని , సిద్ధంగా ఉన్నావు !"*
ఏదో ఆవేశం , ఏదో ఉద్రేకం తారని చంద్రుడి కౌగిలిలోకి తోసింది. అతని చెవి దగ్గరగా ఆమె పెదవులు కదుల్తున్నాయి. *"మొదట్లో నీకు మాటలు రావేమో అనుకున్నాను. భయపడి పారిపోతావేమో అనుకున్నాను. నిన్ను... నీ సౌందర్యాన్ని నా దారికి తెచ్చుకోగలనో , లేనో అని నాలో నేనే నలిగిపోయాను. కానీ... ఎంత త్వరగా - ఎంతగా ఎదిగిపోయావ్ !".*