#శ్రీ వేంకటేశ్వర లీలలు
🌸 *సవతుల కయ్యము:*
పద్మావతీ శ్రీనివాసులు ఆనంద నిలయంలో సుఖముగా ఉంటున్నారు. వేంకటేశ్వరునకు అప్పుడప్పుడు మనస్సులో లక్ష్మిని గూర్చిన విచారము బాధించుచున్నది. కానీ రామావతారమున వేదవతికి ఇచ్చిన వరము ప్రకారము యీ సంసారము తప్పలేదు. లక్ష్మిని చూడవలెనని మనస్సు తపిస్తుంది గాని చూచిన ఆమె ఎంత కోపించి యింకా ఏమిగా మారునోయని శంకించుచున్నాడు. పద్మావతీదేవి పతిని ఒక్క క్షణమైనా విడువక సేవించుచున్నది.
అంతలో లక్ష్మీ నారదులు కొండపైకి వచ్చారు. నారదుడు లక్ష్మీతో "అమ్మా! అదుగో, ఆ కనబడు మందిరమే నీ భర్త వుండు చోటు. నీవక్కడికి పోయితివేని అంతయూ తెలియగలదు. వెళ్లుము" అని చెప్పి లక్ష్మీదేవిని పంపించి తాను చాటున వుండి సవతుల సంభాషణ వినవలెనని అనుకొన్నాడు.
లక్ష్మీదేవి ఆనందనిలయము చేరింది. హంస తూలికా తల్పము పై శ్రీహరిని అతని ప్రక్కను మెరిసిపోతున్న సుందరాంగిని చూచింది. కన్నులను భ్రమగల్గినట్లైంది. మనస్సు భగ్గుమన్నది. తానుండవలసిన స్థానంలో మరొకతే ఉన్నదని అసూయ, ఆవేశము చుట్టుకొన్నవి.
వేంకటేశ్వరుడు అకస్మాత్తుగా లక్ష్మిని చూచాడు. కలయా? నిజమా? అనుకొన్నాడు. ఏనాడో చూచిన ప్రియురాలు కనబడేసరికి భగవానుని మనస్సు బ్రహ్మానందమైనది. కానీ వెంటనే ఆమె మనస్సు గ్రహించాడు. ఇక ఏమీ జరుగునోయని ఆందోళన పడుచున్నాడు.
లక్ష్మీదేవి శ్రీనివాసుని సమీపించింది. భగవానుని నిలువునా చూచింది. ప్రక్కనున్న పద్మావతిని చురచుర చూచింది.
పద్మావతికి ఆమె ఎవరో తెలియలేదు. ఆమె అంత కోపంతో ఎందుకు చూస్తున్నాదో అర్థంకాక బిక్కమొగముతో నిలుచున్నది.
లక్ష్మీదేవి స్వామితో ఇలా అన్నది. "నాధా! ఇదియేనా మీ ధర్మము. యిదియేనా మీ ప్రేమ. ఆనాడు మీకు జరిగిన అవమానమును నాదిగా భావించి ఇంత కష్టపడినానే? కట్టుకున్న ఇల్లాలు అరణ్యాల పాలయి అల్లాడుతుంటే, క్రొత్త పెండ్లాన్ని కట్టుకుని కులుకుచున్నావా? ధర్మావతారుడవు. ధర్మరక్షకుడవి. నీవే ఇట్టి అధర్మానికి పాలుపడిన ఇక లోకంలో ధర్మానికి తావేది? నిన్ను నమ్మియున్నానే. నీ పాదములే గతియని అరణ్యములో కూడా నిన్ను గూర్చియే తపస్సు చేస్తున్నానే! కనికరము లేదా? ప్రాణప్రదమైన ఇల్లాలు ఏమైనదోయని ఒక్కనాడైనా తలంచినారా? మీ తప్పెమున్నది? ఇది అంతా నా కర్మ" అని కన్నీరు ధారగా ఏడ్చినది.
శ్రీనివాసుడు ఏమీ చెప్పుటకు తోచక మారు మాటాడకున్నాడు. లక్ష్మిదేవి పద్మావతీతో "ఏమమ్మా! నీవెవరు? నా నాధుని ప్రక్కన జేరి తగుదునని కులుకుచున్నావు" అన్నది.
పద్మావతికి ఆ మాట వినేసరికి కోపము వచ్చింది. "నీవెవతెవు? నా భర్తను ఏమో నిందిస్తున్నావు. పెండ్లియాడిన ఇల్లాలిని నన్నే నీ వేవరని అడుగుచున్నావా? చాలు సిగ్గు కలిగి వచ్చిన దారిన పో" అన్నది.
ఆ మాట విని లక్ష్మి హృదయము భగ్గుమన్నది. "ఏమే గయ్యాళి! ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడియైనవన్నట్లు నిన్నగాక మొన్న వచ్చి నాకే శ్రీరంగనీతులు చెప్పుచున్నవా?" అన్నది.
ఆడపులులు రెండూ చెలరేగినట్లు అసూయావేశాలతో లక్ష్మి, పద్మావతి వాదనకు తారసిల్లారు. ఒకరినొకరు తిట్టుకొనుచూ, శపించుకొనుచూ, చేతులు త్రిప్పుచూ, మూతులు ముడుచుకోనుచూ *"నా మగడు" "నా మగడు"* అని శ్రీనివాసమూర్తిని చేరియొక రెక్కపట్టి లాగుచున్నారు. భార్యలిద్దరి మధ్య అప్పడమువలె నలిగి పోతున్నాడు నారాయణమూర్తి.
"నాధా! నీవు నా భర్తవు కాదా? నిజము చెప్పు" అన్నది లక్ష్మి. "ప్రానేశ్వర ! మీరు నన్ను పెండ్లాడ లేదా? సత్యము బల్కు" అన్నది పద్మావతి.
శ్రీనివాసమూర్తి చిక్కములో పడిన పిట్ట వలె గిల గిల లాడుచున్నాడు.