🌹అనూరుని_శాపం
కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువ లకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ కోరిక ప్రకారం వెయ్యి పొడుగాటి శరీరం కలిగిన సంతానం, వినత కోరిక ప్రకారం ఇద్దరు ప్రకాశవంతమైన సంతానాన్ని కశ్యప ప్రజాపతి కోరుకొంటాడు. కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కద్రువకు అండాలనుండి వాసుకి, ఆదిశేషుడు ఆదిగా గల వెయ్యి పాములు జన్మిస్తాయి. వినత అది చూసి తొందరపడి తన ఆండాన్ని చిదుపుతుంది. అందునుండి కాళ్లు లేకుండా, మొండెము మాత్రమే దేహముగా కలిగిన అనూరుడు జన్మిస్తాడు. అనూరుడు అంటే ఊరువులు (తొడలు) లేనివాడు అని అర్థం. అనూరుడు తల్లితో నువ్వు సవతి మత్సరముతో నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసీగా ఉండు. రెండవ అండాన్ని భద్రంగా ఉంచు. అందునుండి జన్మించినవాడు నీ దాస్యాన్ని విడుదల చేస్తాడు అని చెబుతాడు. సప్తాశ్వాలను పూన్చిన సూర్యుని రథానికి రథసారథిగా అనూరుడు వెళ్లిపోతాడు.
#వినత_కద్రువల_పందెం
వినత, కద్రువలు ఒక రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు క్షీర సాగరమథనములో వచ్చిన ఉచ్చైశ్రవము అనే ఇంద్రుడి గుర్రము దూరముగా కనిపించింది. అప్పుడు దూరముగా కనిపిస్తున్న గుర్రమును చూసి, కద్రువ తన సవతితో "చూడు ఆ ఉచ్చైశ్రవము శరీరం అంత తెల్లగా ఉన్నా తోక నల్లగా ఉన్నది" అని అంటుంది. ఉచ్చైశ్రవము తోక తెల్లగా ఉండడం చూసిన వినత, లేదు దాని తోక తెల్లగ ఉన్నదని అంటుంది. దీనితో కద్రువకు మనస్సులో పట్టుదల పెరిగి పందెం వేదాము, తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అంటుంది. వినత పందానికి అంగీకరిస్తుంది. ఆ రోజు పొద్దు పోయిందని తరువాతి రోజు వచ్చి ఆ గుఱ్ఱాన్ని చూడవచ్చని ఇద్దరు అంగీకరించుకొని వారి ఇండ్లకి వెళ్ళిపోతారు.
#సంతానానికి_కద్రువ_శాపం
కద్రువ ఇంటికి వెళ్ళి తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకొని తోక నల్లగా ఉండేటట్లు చేయమని కొడుకులను అడుగుతుంది. కొడుకులు దానికి అంగీకరించక పోయేసరికి కోపముతో మాతృ వాక్యపరిపాలన చెయ్యని మీరందరు పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు చేసే సర్పయాగంలో మరణిస్తారు అని శపిస్తుంది. అది విన్న కర్కోటకుడు అమ్మా నేను వెళ్లి ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అంటాడు.
తరువాతి రోజు వినత, కద్రువలు వెళ్ళి చూడగానే గుఱ్ఱం తోక కర్కోటకుడు చుట్టుకోవడం వల్ల నల్లగా కనిపిస్తుంది. అది చూసి వినత బాధ పడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది.