#శ్రీ వేంకటేశ్వర లీలలు
🐚☀️
🌸 *లక్ష్మీదేవి పద్మ సరోవరమున వెలయుట:*
అంతట శ్రీనివాసమూర్తి చెప్పిన పూర్వచరిత్ర విని లక్ష్మీదేవి సత్యము తెలిసికొని శాంతించినందులకు వేంకటేశ్వరుడు సంతోషించి లక్ష్మీతో ఇట్లనెను.
"ప్రియురాలా! నా వివాహమునకు కుబేరుని వద్ద అప్పు పడితిని. ఆ ఋణము తీర్చుటకు మార్గము తోచకున్నది. కుబేరునికి ప్రతీ సంవత్సరము వడ్డీ చెల్లించినటుల పత్రము వ్రాసి ఇచ్చితిని. అది చెల్లించుటయేట్లో సాధ్యము కాలేదు. అందుకు నీవు నాకు కొంత ఉపకారము చేయవలసినది.
ఏమందువా? నీవు కలియుగమున నా భక్తులకు భాగ్య మిచ్చుచుండ వలసినది. వారు ఆ భాగ్యగర్వము వలన పాపకర్మలు చేసి వ్యాధి మొదలైన ఆపదలలో పడుదురు. అప్పుడు నన్ను రక్షింపుము అని ధ్యానము చేయుదురు. నేను వారికి స్వప్నములో కనబడి నాకు మ్రొక్కులు మ్రొక్కి, ముడుపులు గట్టి, వడ్డికాసులు, నిలువు దోపిడి ఇవ్వమని వారికి చెప్పి, వారిని ఆపదల నుండి కాపాడుచూ వారి వద్ద వసూలు చేసిన వడ్డీ కాసులు ప్రతి సంవత్సరము కుబేరునికి కలియుగాంతం దాకా చెల్లించి అనంతరము అతని అసలు దీర్చి మనము వైకుంఠము జేరి సుఖముగా నుండవచ్చును. అంత పర్యంతము నీవు పద్మ సరోవరమున వెలసి భక్తులను రక్షించుచుండుము. నీవు నన్నెడ బాయకుండా నీ నిజస్వరూపం నా వక్షముననే యుంచి నీయంశము మాత్రము అచ్చట వెలయింపవలసినది" అనెను.
లక్ష్మీదేవి స్వామి మాటలకు సంతోషించేను. వేంకటేశ్వరుడు లక్ష్మీదేవిని మనసారా కౌగిలించుకొని తన వక్ష స్థలమున జెర్చుకొనేను.
శ్రీనివాసమూర్తి బ్రహ్మాది దేవతలను రావించి విశ్వకర్మతో ఇట్లనెను. "శుకాశ్రమమున పద్మ సరోవర సమీపమున దివ్య మందిరం నిర్మింపుము" అనెను. విశ్వకర్మ అట్లే గావించెను. సుమూహుర్తమున లక్ష్మీదేవిని ఆ మందిరమున ప్రవేశింపజేసీ శుకునితో "నీవు యీ క్షేత్రమున ఒక అగ్రహారము నిర్మింపుము" మని బలికెను. శుకు డట్లే యేనర్చేను.
(తరువాయి భాగం రేపు)...