*శ్రీ వేంకటేశ్వర లీలలు* 🐚☀️ *పార్ట్ - 49*

P Madhav Kumar

 

#శ్రీ వేంకటేశ్వర లీలలు

🌸 *వేంకటేశ్వరుడు లక్ష్మీదేవికి పద్మావతి పూర్వచరిత్ర చెప్పుట:*

శ్రీ వేంకటేశ్వరుడు కొంతసేపటికి లక్ష్మీ పద్మావతులను శాంతింపచేసి, లక్ష్మిదేవితో ఇలా అన్నాడు. "ప్రానేశ్వరి! లక్ష్మీ! నీవు కోపము, ఆవేశము విడువుము. నీకు సత్యమైన వార్త దెల్పెదను. అది విన్న తరువాత నీ ఇష్టము వచ్చినట్లు మాటలాడి మంచి చెడ్డలు నీవే నిర్ణయింపగలవు. నే చెప్పు విషయములు పూర్వజ్ఞానము కల్గిన గాని నీకు నిజముగా తెలియవు. కనుక నీకు దివ్యజ్ఞానము ప్రసాదించుచున్నాను. సావధానంగా వినుము.

పూర్వం నేను రామావతారముననున్నపుడు నీవు సీతవైతివిగదా! ఆనాడు తండ్రి యాజ్ఞ ప్రకారము నిన్నూ లక్ష్మణుని వెంటబెట్టకొని అరణ్యవాసము చేసితిమి. అచ్చట పర్ణశాలలో మనము కాపురము చేయుచుండగా మాయలేడి నిన్ను మోహింపజేయ, దానిని తెచ్చి ఇమ్మని నీవు నన్ను కొరితివి. నేను దానికై పోగా నాకేదో ఆపద గల్గినదని నీవు లక్ష్మణుని నా కొరకు బంపితివి. ఆ సమయమున దుర్మారుడైన రావణాసురుడు నిన్ను ఎత్తుకొని పోవుటకు దొంగముని వేషమున రాగా మహానుభావుడైన అగ్నిహోత్రుడు నిన్ను తనలోన దాచి తనలో అంతకు ముందు నన్ను పెండ్లాడగోరి దగ్ధమైన వేదవతిని రావణాసురునకు నిజమైన సీతయని నమ్మించి ఇచ్చేను గదా! ఆ వేదవతిని రావణుడు సీతయని చెరెబట్టెను గదా!

నేను కపిబలమును కూర్చుకొని సముద్రము దాటి లంక చేరి రావణుని వధించి లోకాపవాదము వచ్చునని ఆ సీతరూపమును అగ్నిలో దూకమని పంపితిని గదా! అప్పుడు అగ్నిలోనేవున్న వేదవతియూ ఇద్దరు వుండగా నేను ఆశ్చర్యపడి నంతనే అగ్నిహోత్రుడు నిజవృత్తాంతము చెప్పెనుగదా! అప్పుడు నీవు నాతో ఏమంటివో జ్ఞప్తికి దెచ్చుకొనుము.

"నాధా! ఈ వేదవతి నాకొరకు రావణాసురుని చెర అనుభవించి నాకు సహాయము చేసింది కనుక, ఈమెను కూడా వివాహమాడుము" అని నన్ను నీవు నిర్బంధించితివిగదా! అప్పుడు నీతో నేను "సీతా! నేను ఏకపత్నీవ్రతస్థుడను. కలియుగములో ఈమెను పెండ్లాడదను" అని నీకు చెప్పి నిన్ను తృప్తి పరచితినిగదా! ఆనాటి వేదవతియే ఇప్పుడు పద్మావతిగా అవతరించింది. ఇప్పుడు నీకు ఆ వృత్తాంతము అంతయూ చక్కగా తెలిసినదిగదా! ఆడిన మాట తప్పకుండా నా ధర్మము నేను చేసితిని. ఇందు తప్పు ఎవరిదో యోచింపుము" అనెను.

లక్ష్మీదేవికి దివ్యజ్ఞానము వలన అంతయూ తెలిసినది. తన అజ్ఞానము క్షమించుము అని స్వామిని వేడుకొని పద్మావతిని కౌగిలించుకొని "చెల్లెలా! పూర్వ జ్ఞానము మరచి అసూయతో నిన్ను ఏమేమో తిట్టితిని. వానిని మరచి పొమ్ము" అని బుజ్జగించినది. పద్మావతి నవ్వి ఊరకుండెను.

(తరువాయి భాగం రేపు)...

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat