శ్రీ వేంకటేశ్వర లీలలు* 🐚☀️ *పార్ట్ - 54*

P Madhav Kumar

 

#శ్రీ వేంకటేశ్వర లీలలు

🐚☀️ *

🌸 *తీర్థ మహిమలు:*

శ్రీ వేంకటాచల పర్వతము మూడు ఆమడల వెడల్పును, ముప్పది యామడల పొడవును గలిగి ఆదిశేషుని రూపము గల్గి నొప్పుచుండును.

ఈ పర్వతము నందు అనేక దివ్య తీర్థములు విరాజిల్లు చుండును. అవి....

♦️ *స్వామి పుష్కరణి తీర్థము*

♦️ *కుమార తీర్థము*

♦️ *ఫల్గుణి తీర్థము*

♦️ *సనకసనందన తీర్థము*

♦️ *జాబాలి తీర్థము*

♦️ *తుంబుర తీర్థము*

♦️ *ఆకాశ గంగ*

♦️ *పాపనాశ తీర్థము*

♦️ *చక్ర తీర్థము*

♦️ *రామకృష్ణ తీర్థము*

♦️ *కటాహ తీర్థము*

♦️ *పాండవ తీర్థము*

♦️ *కపిల తీర్థము*

♦️ *దేవ తీర్థము*

♦️ *కాయరసాయన తీర్థము*

♦️ *శేష తీర్థము*

♦️ *పసుపు ధార కుమార ధార తీర్థము*

♦️ *శంకు తీర్థము*

♦️ *పంచాయుధ తీర్థము*

♦️*బ్రహ్మ తీర్థము*

♦️ *అగ్నికుండ తీర్థము*

♦️ *సప్తర్షి తీర్థము*

♦️ *విష్వక్సేన సరస్సు*

♦️ *వైకుంఠ తీర్థము*

♦️ *గోగర్భం ఆనకట్ట*

🌊 *స్వామి పుష్కరణి తీర్థము:*

ఈ తీర్థములన్నింటిలో స్వామి పుష్కరణి తీర్థము చాలా ముఖ్యమైనది. అందున్న నీరు మధురముగా అమృతము వలె యుండును. ఆ నీరు తాకినంతనే సకల పాపములు నశించును. ఈ పుష్కరిణీ అన్ని తీర్థములకు మూలమైనది. ఈ పుష్కరిణీ మహిమ ఆదిశేషుడైన వర్ణించలేడు.

🟢 *స్వామి పుష్కరిణీ తీర్థమహిమకి సంబంధించిన కథ:*

ఒకప్పుడు చంద్రవంశపు రాజైన "నందుడు" అనువానికి "ధర్మగుప్తుడు" అను కుమారుడు కలిగెను. ధర్మగుప్తుడు పెద్దవాడు కాగానే నందుడు వానికి రాజ్యమిచ్చి తాను తపస్సుకు పోయెను.

ఒకనాడు ధర్మగుప్తుడు వేటాడబోయెను. వేటాడి అలసి సొలసి ప్రొద్దు కుంకినందున ఒక చెట్టుపైనెక్కి కూర్చుండెను. ఆ సమయమున ఒక సింహము ఎలుగుబంటిని తరుముకొని వచ్చుచుండెను. ఎలుగుగొడ్డు భయపడి ఆ రాజు ఉన్న చెట్టు ఎక్కెను. రాజు భయపడగా ఎలుగు ధైర్యము జెప్పి "రాజా! నీవు అర్థరాత్రి వరకూ నా తొడపై పవళించి నిద్రించుము. తరువాత నేను నీ తొడపై నిద్రింతు" నని చెప్పి రాజును తన తొడపై నిద్రింపజేసెను. సింహము వచ్చి ఏలుగుతో ఇట్లనెను. "రాజును క్రిందికి తోయుము. నేను వానిని తిని పోదును. నీకు భయము లేదు" అనెను. ఎలుగు ఒప్పుకొనలేదు. తర్వాత రాజు నిద్రలేచెను. ఎలుగు రాజు తొడపై నిద్రించేను. సింహము రాజుతో "ఎలుగును క్రిందికి తోయుము. దానిని తినిపోవుదును. నీకు భయము లేదు" అనెను. రాజు సింహము మాటలు నమ్మి ఎలుగును తన తొడపై నుండి క్రిందికి త్రోసెను. దైవానుగ్రహమున ఎలుగు చెట్టుకొమ్మలు పట్టుకొని క్రింద పడకుండా నిల్చి రాజుతో...

"ఓయీ! ఎంత విశ్వాసహీనుడవు. విశ్వాసహీనుని భూదేవి సహితము భరింపలేదు. నేను నిజముగా యెలుగును కాను. భృగు వంశములో పుట్టిన బ్రాహ్మణుడను. కామరూపము ధరించి తిరుగుచున్నాను. నీవు విశ్వాసహీనుడవు. గనుక పిచ్చివాడవై పోవుదువుగాక!" అని శపించెను.

ధర్మగుప్త మహారాజు పిచ్చివాడై దేశదేశములు తిరుగుచుండేను. మంత్రులు వాని జాడ తెలుసుకొని తపస్సు చేసుకొనుచున్న వాని తండ్రికి జెప్పిరి. అప్పుడు నందుడు వచ్చి కుమారుని పిచ్చితనమునకు దుఃఖించి జైమిని మహాముని వద్దకేగి తన కుమారుని విధము జెప్పెను.

జైమినిముని ఆ కారణము యోగదృష్టిన తెలుసుకొని "రాజా! నీ కుమారుడు వేంకటాచలమున నున్న స్వామి పుష్కరిణిలో స్నానమాడింపుము. వాని పిచ్చి తీరును" అని దెల్పెను.

నందుడు కుమారుని తీసుకొని వేంకటాద్రికి చేరి దర్మగుప్తుని స్వామి పుష్కరిణిలో స్నానమాడించేను. స్నానం చేయగానే ధర్మ గుప్తుని పిచ్చితనం వడలిపోయేను. ధర్మ గుప్తుడు ఆరోగ్యవంతుడై స్వామిని భక్తితో సేవించి అగ్రహారములు స్వామి కొసంగి ఎన్నియో కానుకలర్పించి ధన్యుడయ్యెను.

🔸స్వామి పుష్కరిణిలో స్నానమొనర్చిన వారికి సమస్త పాపములు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములు గల్గును. సకల పాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు.

🔸శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరిణీలో స్నానం చేసి, స్వామి దర్శనానికి వెళ్ళాలి అని నియమం ఉంది.

🔸 వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం తిరుపతి కొండ మీదకు వేంకటేశ్వరుడు దిగి వచ్చేవేళ, తన జలక్రీడల కోసం వైకుంఠం నుంచి భువికి స్వామి స్వయంగా తెప్పించుకొన్న తీర్థము ఇదేనని భావన.

🔸 తారకాసురుని వధించి బ్రహ్మహత్యా దోషానికి గురైన సుబ్రహ్మణ్య స్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్టు చెప్తారు.

🔸 ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరహాస్వామి, భూదేవికి వివరించినట్లు వరాహపురాణం చెబుతుంది.

🔸ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశినాడు, ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయి అని భక్తుల విశ్వాసం.

🔸స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నది గమనార్హం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat