🌹దానములు_ధర్మములు:
దానములు వేరు ,ధర్మములు వేరు దాన మనగా ఇచ్చెడి వస్తువు నందు మమత్వమును విడిచి ఇతరుల కిచ్చునది .ధర్మమనగా ప్రజోపయోగార్ధ మై చేయు ఇష్టా పూర్త రూపమైనది. దిగుడు బావులు ,మంచినీటి నూతులు చెరువులు త్రవ్వించుట ,దేవాలయ నిర్మాణము ,ఉద్యానవనములు ,పండ్ల తోటలు నాటించుట మొదలగు కార్యములు ధర్మములోనికి వచ్చును. అగ్నిహొత్రము ,తపస్సు, సత్య వ్రతము,వేదాధ్యయనము ,అతిధి మర్యాద, వైశ్వదేవము ఇట్టి వానిని ఇష్టము లందురు.
సూర్య ,చంద్ర గ్రహణ సమయములలో ఇచ్చు దానము వలన దాత స్వర్గాది పుణ్య లోకములను బొందును. దేశమును, కాలమును, పాత్రతను (యోగ్యతను ) గమనించి ఇచ్చిన దానము కోటి గుణిత మగును. కర్కాటక ,మకర సంక్రమణము లందును అమావశ్య,పూర్ణిమాది పర్వములందును చేసెడి దానము విశేష ఫలము నిచ్చును. దాత తూర్పు ముఖముగా కూర్చుండి సంకల్పము ,గోత్రనామములతో జెప్పి దాన మీయవలెను. పుచ్చుకొనువాడు ఉత్తరాభి ముఖుడై స్వీకరింపవలెను. అట్లు చేసినచో దాతకు ఆయుర్దాయము పెరుగును. గ్రహీతకు పుచ్చుకున్నది అక్షయ మగును. మహాదానములు పది :
శ్లో కనకా శ్వతి లానాగా దాసీరధ మహీ గృహాః
కన్యాచ కపిలా దేను: మహా దానాని వైదశ ||
తా || బంగారము ,గుఱ్ఱము ,తిలలు ,ఏనుగులు,దాసీ జనము ,రధములు ,భూమి, గృహములు ,కన్యక నల్లని ధేనువు వీనిని మహా దానము లనిరి . ఇవి పది.
దేవతలకు గాని ,బ్రాహ్మణులకు గాని , గురువులకు గాని ,తల్లి దండ్రులకు గాని ఇచ్చెదనని వాగ్దానము చేసిన దానిని ఇయ్యక ఎగ గొట్టినచో వంశ నాశనము జరుగును. ప్రతి గ్రహీత నుండి ఏదో లాభము నాశించి దాన మిచ్చినచో అది నిష్ప్రయోజన మగును . ప్రతి గ్రహీత నుద్దేశించి దానము చేయుచు ,ఆ దాన ధారను భూమిపై విడిచినచో ఆ దాన ఫలము మహా సాగరము కన్నా అనంతమైనది యగును. గౌతమీ ,గంగా ,గయా ,ప్రయాగాది తీర్ధము లందిట్టి దానములు విశేష ఫలముల ని ఇస్తుంది ....