🌹శ్రీహరి_దశావతారములు
పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు.
*1_మత్స్యావతారము* :
వైవస్వతమను అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడ గలదు. ఆ సత్యవ్రతుడు కృతమాలిక అనే నదిలో అర్ఘ్యం ఇస్తున్నాడు.
ఆయన దోసిలిలోకి ఒకచిన్న చేపపిల్ల వచ్చింది. దాన్ని ఆయన నదీజలంలో పడవేయబోతే, ‘ఓ రాజర్షీ! నీవు దయాత్ముడివి… నన్ను మింగేసే పెద్దచేపలు నదిలో ఉన్నాయని తప్పించుకోవడానికి నేను నీ చేతిలోకి వచ్చాను’ అంది. దానితో ఆ రుషి తన కమండలంలోని నీటిలో చేపపిల్లను ఉంచి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. తరవాత ఆ చేపకు కమండలం సరిపడక నూతిలో వేయగా అదీ సరిపోలేదు. పరిణామం క్రమక్రమంగా పెరిగిన ఆ చేపకు సరోవరంగానీ నదిగానీ సరిపోక సముద్రంలో వేయగా, సముద్రంలోనూ లక్షల యోజనాలను ఆక్రమించింది. అప్పుడు రాజు “నీవెవరవు?” అని ఆ చేపను ప్రార్ధించగా ఆ చేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది. “శ్రీ లలనాకుచవీధీ కేళీ పరతంత్రబుద్ధిన్ క్రీడించు శ్రీహరీ! తామసాకృతిన్ ఏలా మత్స్యంబవైతివి?” అని రాజు ప్రశ్నించాడు.
అప్పుడా మత్స్యం ఇలా జవాబిచ్చింది. “రాజా! నేటికి 7వ దినమునకు బ్రహ్మదేవునకు ఒక పగలు పూర్తియై రాత్రి కావస్తున్నది. అప్పుడు సకల ప్రపంచమూ జలమయమౌతుంది. నా మహిమ వల్ల ఆ ప్రళయసాగరంలో ఒక నావ వస్తుంది. ఆ నావలో నిన్నూ, తపోమూర్తులైన మునులనూ, ఓషధులను, తిరిగి సృష్టికోసం అవుసరమైన మూలబీజాలనూ పదిలం చేసి నా శృంగము (ఒంటి కొమ్ము) తో ఆ నావను లాగి ప్రళయాంబోధిని దాటింతును” అని చెప్పెను.
ప్రళయం సంభవించి, ధరిత్రి మొత్తం సముద్రంలో మునిగిపోయినప్పుడు, లీలామానుష వేషధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడు ధగధగమని కాంతులీనే సువర్ణ వర్ణంగల పెద్దచేపగా అవతరించి, మనువుకు ఒక దేవనౌకను అనుగ్రహించాడు. స్వామి ఆదేశానుసారం మనువు ఆ నౌకలో సమస్త ఔషధులను, బీజాలను నింపడమే కాక- సప్త రుషులను అందులోనికి పంపి, వాసుకిని తాడుగా ఉపయోగించి, దివ్యకాంతులతో వెలిగిపోతున్న మత్స్యానికి ఉన్న కొమ్ముకు నౌకను కట్టాడు. ఆ రకంగా ప్రళయాన్ని దాటుతున్న సమయంలో నౌకలోని వారందరూ ఆయన నామామృతంతో తరించారని పురాణాలు విశదీకరిస్తున్నాయి.
సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ ఆ కల్పాంత సాయంసంధ్యలో రవ్వంత కునుకు తీసెను. ఇదే అదనుగా చూసుకొని హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను చేజిక్కించుకొని మహాసముద్రంలోకి ఉరుకెత్తాడు. శ్రీమన్నారాయణుడు మత్స్యరూపంలో ఆ రాక్షసుని వెదకి, చంపి, వేదములను తిరిగితెచ్చి బ్రహ్మకిచ్చాడు.
*2_కూర్మావతారము:*
దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం.
ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి “దేవతలు శక్తిహీనులగుదురు” అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా “సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి” అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు.
దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది.
అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి పర్వతము క్రింద ఆధారముగా నిలువబడి ఆ కొండను భరించెను. దానితో సముద్ర మధనము జరిగి సర్వ వస్తువులును, అమృతమును పుట్టెను.
అలా దేవదేవుని అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనము చేయగల హాలాహలము ఉద్భవించినది. దేవతల మొర విని, కరుణించి, పరమశివుడు హాలాహలాన్ని భక్షించి, తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చాయి. ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించుకొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు.
జయ_విజయులు: