🌹 శ్రీ గరుత్మంతుడి కధ -8 వ భాగం

P Madhav Kumar

 

శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి ఈ అధ్యాయంలో వైతరణిని గురించి వివరించాడు. నరకమంటే ఏమిటి అది ఎవరికి ప్రాప్తిస్తుంది, దానిని ఎలా తప్పించుకోవాలి, వైతరణి అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది లాంటి వివరాలు ఇందులో వర్ణించబడ్డాయి.పాపాత్ములు మాత్రమే యమపురి దక్షిణ ద్వారం నుండి పోవలసి ఉంటుంది. దక్షిణ మార్గంలో వైతరణి నది ఉంటుంది.దక్షిణ మార్గంలో వెళ్ళవలసిన దుర్గతి మనిషిగా పుట్టి చేయకూడని పాపాలు చేయడమేనని పురాణంలో చెప్పబడింది. బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య, స్త్రీహత్య చేసేవారూ గర్భపాతం చేసేవారూ, రహస్యంగా పాపపు పని చేసేవారూ, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు హరించే వారు, తీసుకున్న అప్పు తీర్చని వారు, ఒకరు దాచిన ద్రవ్యాన్ని అపహరించే వారు, విశ్వాసఘాతుకులు, విషాన్నం పెట్టి ఇతరులను హత్యచేసే వాళ్ళు వైతరణిని దాటి వెళ్ళవలసినదే. దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించే వారు, ఋణగ్రస్థులను ఎగతాళి చేసే వారు, నీచులతో స్నేహం చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయని వారు, పుణ్య తీర్ధాలనూ, సజ్జనులనూ, సత్కర్ములనూ, గురువులనూ, దేవతలనూ నిందించేవారు యమలోకం దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుంది. పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయ శాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటి వారు దుఃఖిస్తుంటే ఆనందించే వారు, చెడు మాటలు పలికేవారు, పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి చేసే వారు, పరనింద చేసేవారు. అధర్మ మార్గంలో నడిచేవారు దక్షిణమార్గాన ఏడుస్తూ పడిపోవలసిందే. తల్లి తండ్రులకు, గురువుకు, ఆచార్యులకు, పూజింపతగిన వారికి అవమానం కలిగించేవాడు, పతివ్రత వినయ సంపన్నురాలైన భార్యను అకారణంగా ద్వేషించి విడిచి పెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పిన వారు, ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి తరువాత ఇచ్చినందుకు బాధ పడేవారు వైతరణిని దాటక తప్పదు.దానం చేసే వారిని ఇవ్వవద్దని ఆపేవారు, యజ్ఞ విధ్వంసకులు, హరికథకులకు విగ్నం కలిగించే వారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమి ఆక్రమించే వారు, పశువుల బీడును దున్ని వాటికి మేతలేకుండా చేసేవాడు, అనవసరంగా పశుహత్య చేసేవాడు. కపిల గోవుపాలను దైవకార్యాలకు కాక స్వంత కార్యాలకు వినియోగించే వారు ఇలాంటి పాపాలు చేసే ప్రతి మనిషి యమలోకం దక్షిణ మార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందే. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరుణిలో త్రోసి వేస్తారు. గోదానం చేయని వారు ఊర్ధ్వ దేహక్రియలు జరగని వారు ఆ నదిలో అనేక బాధలు అనుభవించినా నది ఒడ్డున ఉండే బూరుగ చెట్టుకు వ్రేలాడ వలసి వస్తుంది. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచనచేసి ధనం సంపాదించేవారు దొంగతనం చేసేవారు పచ్చని చెట్లను నరికేవారు, ఫలవృక్షాలను పూలతోటలను ధ్వంసం చేసేవారు తీర్ధయాత్రలను చేసే వారికి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మానహరణ చేసే వారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగ చెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారు. ఇలా పాపాత్ములు వైతరణిలో పడి బాధలు అనుభవించాలని గరుడ పురాణం చెప్తుంది. గరుడ పురాణం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు వ్రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడంవల్ల మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలోకి మలచు కోవడానికి ప్రయత్నిస్తాడు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat