🪷🪷🪷🪷🪷🪷
ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు,
భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమ వైపు నుంచి కుడి వైపుకి తిరుగుతాడు. ఇలా స్వామి ఒక వైపు నుంచి మరో వైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక, దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు. మిగతా ఏకాదశుల మాదిరిగానే, ఈ ఏకాదశిన ఉపవాస దీక్షను చేపట్టవలసి వుంటుంది. శ్రీమహావిష్ణువును వ్రత విధానం ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించ వలసి వుంటుంది.వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని స్పష్టం చేస్తున్నాయి.
పరివర్తన ఏకాదశికి మన ప్రకృతి లో వచ్చే మార్పులకు సంబదించినదిగా కూడా పరిగణిస్తారు. కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు. ఈ రోజునే శ్రీ మహా విష్ణువు వామనావతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళ లోకానికి పంపిస్తాడు. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతరాన్ని పూజించడం వలన బ్రహ్మ -విష్ణు -మహేశ్వరులని సేవేస్తే కలుగే ఫలం లభిస్తుంది అని పురాణాలూ చెబుతున్నాయి.
పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశే వామన జయంతి. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలు అన్ని నశిస్తాయని, కోరిన కోరికలు ఫలిస్తాయని అని నమ్మకము. శ్రీ మహా విష్ణువు అది శేషు ని పైన శయనించి విశ్రాంతి లోకి వెళ్ళిపోతాడు, తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకో వైపు శయనిస్తాడు అని అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది.
🍀వామన జయంతి🍀
🪷🪷🪷🪷🪷🪷🪷
పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి.. ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము చేసింది.ఆ వ్రత చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో ….”దేవీ – చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని” పలికి అదృశ్యమవుతాడు.
ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమును జన్మించెను.
భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు.
భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి, వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు.
ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామనభగవానుడు విని అచ్చటికి వెళ్లెను, ఒకవిధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి, శరీరముపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపము నందు ప్రవేశించాడు.
అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై… వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చొండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా…. “వామనుడు మూడు పాదముల భూమి”ని అడిగెను.
శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి, దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేగాకుండా దానమొసగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను.
శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను, కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని చేధించెను, దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను. సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్విని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను, మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను.