🌹లక్ష్మీదేవికై నారాయణుని అన్వేషణ*
మతి స్తిమితము లేనివానివలె శ్రీమన్నారాయణుడు తన ప్రియసతి లక్ష్మీదేవిని వెదకుచూ ఎక్కడనూ గానక బాధపడుచుండెను.
రెండు కన్నులను వేయి కన్నులుగా భావించుకొని చూడ ప్రదేశము లేకుండగ చూచుచుండెను. తిరుగనిచోటు లేకుండగ తిరుగుచుండెను. ఎన్నియో కొండలకు ఆయన పాదస్పర్శ లభించినది.
ఎన్నియోప్రదేశములు ఆయన ఆగమనముతో పవిత్రములయినవి. తలక్రిందుల జపము చేసినను స్వర్గమునకేగి నారాయణుని దర్శించుట కష్టమే, అట్టిది ఎందరికో ఆటవికులకు నారాయణుని అమోఘ దర్శన మగుచుండెను,
కాని ఆయన నారాయణునిగ వారికి తెలియ స్థితిలో లేకుండెను. లక్ష్మిని గూర్చి నారాయణుడు గూడ బాధపడవలసి వచ్చెను గదా. నడచి నడచి ఆయాసమును పొందుటయే శరీరము తూలిపోవుచుండగా నారాయణుడు శేషాద్రి దగ్గరకు వచ్చి కొండొక కొండ పై ఒక చింతచెట్టును చేరినాడు.
లక్ష్మిని గూర్చిన చింత తప్ప మరొక్క చింత అతనికి లేకుండెను. చింతచెట్టు చెంత జేరిన నారాయణుడు ఆ చెట్టు నీడలో గల ఒక పుట్టను చూచినాడు. యెటులైనను యెవ్వరికినీ కనిపించకుండా కొన్నినాళ్ళుండవలెనని యోచించిన వాడయి శ్రీమన్నారాయణుడు ఆ పుట్టలో ప్రవేశించి అక్కడ నుండ జొచ్చెను.
బ్రహ్మ, శివుడు గోవత్స రూపములు ధరించుట
నారదుడు హుటాహుటీగా సత్యలోకమునకు వెడలినాడు. తండ్రి అయిన బ్రహ్మదేవునకూ, తనకూ చదువులకూ తల్లి అయిన సరస్వతీదేవికీ ప్రణామాలు చేసినాడు. ‘ఏమిటి విశేషాలు!’ అన్నాడు బ్రహ్మ.
‘తండ్రీ! లోగడ మీరు లోకోపయుక్తమయిన ఒక ఆలోచన నాకు చెప్పియున్నారు. ఆ ఆలోచన శ్రీమహావిష్ణువును భూలోకమునకు రప్పించుటను గూర్చి, అందుకై నేను చేసిన ప్రధమ ప్రయత్నము యొక్క ఫలితమును మీకు చెప్పుటకై వచ్చియున్నాను.
నా ప్రయత్నము వలన శ్రీ మహావిష్ణువునకూ, లక్ష్మీదేవికి ఎడబాటు కలిగినది. రమాదేవి కొల్లాపురములో తపస్సు చేస్తూయున్నది. శ్రీ మహావిష్ణువు శేషాద్రిపై ఒక పుట్టలో నివసిస్తూ పాపము తిండీ తిప్పలు లేక, నిద్రలేక ఆరోజుకారోజు మిక్కిలి శుష్కించి పోవుచున్నాడు.
తండ్రీ! మీరేదియో ఒక విధముగ శ్రీమహావిష్ణువునకు ఆహారము లభించునట్లు చూడవలసినదని నారాయణుని యెడల గల తన సహజాభిమానముతో అభ్యర్థించాడు. నారదుడు ఆ విధముగా అభ్యర్థించగా బ్రహ్మదేవుడు తన జనకుడయిన శ్రీమహావిష్ణువును గూర్చి యాలోచించసాగినాడు.
తండ్రి కష్టదశలోనున్నప్పుడు తనయుడతని కుపకరించి తీరవలెను గదా!
‘సరియే ఆ సంగతి నేను ఆలోచించి కార్యమున పెట్టెదను’ అనెను బ్రహ్మదేవుడు. అది నారదునకు కొంత సంతోషమునకు కారణమయినది. శలవుగైకొని నారదమహాముని తన దారిన వెడలినాడు.
సీతానాయక గోవిందా, శ్రితపరిపాలక గోవిందా, ఆద్ర పోషక గోవిందా, ఆది పురుష గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||9||
శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏
🌸 *జై శ్రీమన్నారాయణ* 🌸
💥సర్వేజనాః సుఖినోభవంతు💥