శ్రీ దేవీ భాగవతము - 9

P Madhav Kumar


*ప్రథమ స్కంధము - 5*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః*

*లలితా సహస్రనామ శ్లోకం - 9*

*పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూః!*
*నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

👉 *నిన్నటి భాగములో....*

సూతుడి ప్రబోధానికి మునులంతా సంతోషించారు. ఆమోదం తెలియజేశారు. అటుపైని యథావిధిగా ప్రశ్నించారు.

*సూతమహర్షీ!* ఇంతకుముందు అన్నావు, వ్యాసుడు ఈ పురాణమంతా రచించి శుకుడితో చదివించాడని. గొప్ప తపస్సు చేసి శుకుణ్ణి పుత్రుడుగా పొందాడు అని. అందులోంచి ఇంకో కథలోకి వెళ్ళిపోయాం! ఇపుడు ఆ సంగతులు తెలియజెయ్యి.

*మునీశ్వరులారా!* తప్పకుండా! వ్యాసుడికి శుకుడు జన్మించిన వృత్తాంతం సవిస్తరంగా చెబుతాను.
*శుకుడు సాక్షాత్తూ యోగీశ్వరుడు.*
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡️

🙏 *శుకమహర్షి జన్మ వృత్తాంతం* 🙏

మేరుపర్వత శిఖరం మీద వ్యాసుడు తపస్సుకి కూర్చున్నాడని చెప్పాను కదూ ! పుత్రుడు కావాలని కోరుతూ ఘోర తపస్సు చేశాడు. నారదుడు ఉపదేశించిన ఏకాక్షర వాగ్చీజమంత్రాన్ని జపిస్తూ, మహాదేవినీ, మహాదేవుణ్ణీ ధ్యానిస్తూ తపస్సు సాగించాడు.

తేజస్సులో - అగ్ని, భూమి, వాయువు అంతరిక్షాలతో సాటి వచ్చే పుత్రుడు కావాలని అతడి ఆకాంక్ష.

మేరుశిఖరం మీద, అద్భుతమైన కర్ణికారవనంలో దేవతలూ మునులూ విహారించే చోట, బ్రహ్మవిదులు సంచరించే పవిత్ర ప్రదేశంలో, మనోహర సుకుమారసంగీత ధ్వనుల మధ్య - వ్యాసుడి తపస్సు నిరాటంకంగా మహోగ్రంగా సాగింది. ఆ తేజస్సు విశ్వమంతటా వ్యాపించింది. వ్యాసుడి జటలు రాగిరంగులోకి మారిపోయాయి.

ఇంద్రుడికి భయం పట్టుకుంది. అది గమనించిన రుద్రుడు మేలమాడాడు. ఇంద్రా ! తపస్వులపట్ల ఈర్ష్య పనికిరాదు. నన్ను శక్తి సంయుతుడిగా ఎరిగినవారు నా అనుగ్రహం కోసం ఇలా తపస్సు చేస్తారు. వీరు ఎవరికీ ఏ అహితాన్నీ కోరరు.

*అమరో నైన కర్తవ్యస్తాపసేషు కదాచన ।*
*తపశ్చరంతి మునయః: జ్ఞాత్వా మాం శక్తిసంయుతమ్‌ ॥*

రుద్రుడి మాటలతో దేవేంద్రుడు కుదుటపడ్డాడు. అయితే వ్యాసుడు ఎందుకు తపస్సు చేస్తున్నట్టో అన్నాడు. పుత్రార్థియై తపస్సు చేస్తున్నాడు. నూరేళ్ళు పూర్తి అయ్యింది. అతడికి శుభప్రదుడైన పుత్రుణ్శి ఇవ్వబోతున్నాను - అంటూనే శివుడు వ్యాసుడి ముందు ప్రత్యక్షమయ్యాడు.

*వ్యాసమహర్షీ !* ఉత్తిష్ట, ఉత్తిష్ట. నీకు పుత్రుడు కలుగుతాడు. అతడు తేజస్వి జ్ఞాని కీర్తికరుడు అఖిలజనప్రియుడు అవుతాడు. సాత్త్విక గుణ సంపన్నుడై అందరి మన్ననలూ పొందుతాడు.

మహాదేవుడిచ్చిన వరానికి వ్యాసుడు సంతృప్తి చెందాడు. తపస్సు ముగించి ఆశ్రమం చేరుకున్నాడు. ఒకవైపు శ్రమ, మరొకవైపు ఆశ్రమంలో యాగాగ్నిని సిద్ధం చేసుకోవాలనే కంగారు. మథించి అగ్నిని రగుల్కొల్పాలి. అందుకని ఎక్కడో దాచిపెట్టిన అరణిని బయటికి తీశాడు. కాష్ఠంతో మథిస్తున్నాడు. చిత్తంలో పుత్రవాంఛ మెదులుతోంది. మంథాన అరణి సంయోగంతో, మంథనంతో అగ్ని పుడుతోంది.
మరి ఇలా నాకు పుత్రుడు ఎలా జన్మిస్తాడు ? పుత్రారణి అనిపించుకునే స్త్రీ నాకు లేదు గదా ! పోనీ అంటే, రూపయౌవన సంపన్నను తరుణిని తెచ్చి పెట్టుకుని పాదాలకు సంకెళ్ళు వేసుకోనా ! వంశాన్ని నిలబెడుతుంది, సౌఖ్యాన్ని అందిస్తుంది, సేవలు చేస్తుంది - ఇవన్నీ నిజమే కానీ స్వేచ్చా స్వాతంత్ర్యాలకు మాత్రం తరుణీమణి ప్రతిబంధకమే. ?

*పతివ్రతాపి దక్షాపి రూపవత్యసి కామినీ ॥*
*సదా బంధనరూపా చ స్వేచ్చా సుఖవిఘాతినీ ॥*

శివుడంతటి వాడికే తప్పలేదు. నిరంతరం కామినీపాశ బద్ధుడు. నేననగా ఎంత ! అయినా, ఇప్పటికిప్పుడు గృహస్థాశ్రమమంటే ఎలా వస్తుంది నాకు ?

అరణిముందు కూర్చుని మంథానంతో మథిస్తూ వ్యాసుడు ఇలా దిగులు పడుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఘృతాచి అనే అప్సరస ఎవరో పంపినట్టు ఆశ్రమం వైపు వచ్చింది. కదలిక మరిచిపోయిన మెరుపుతీగలా ఆకాశంలో దగ్గరగా నిలిచింది. విలాసంగా క్రీగంటి చూపులతో గిలిగింతలు పెట్టింది. వ్యాసుడి మనస్సులో కదలికలు మొదలయ్యాయి.

పెద్ద సంకటం వచ్చిపడిందే. ఏం చెయ్యను. ఒకవైపు ఆశ్రమధర్మం. మరొకవైపు మన్మథభావ విజృంభణ. నన్ను పల్టీకొట్టించడానికే ఇది ఇటు వచ్చింది. అంగీకరించనా ? పూర్తిగా నూరేళ్ళూ కఠిన నియమాలతో ఘోర తపస్సు చేసి చివరికి ఇలా లొంగిపోయాడని మహాతాపసులు పరిహసించరూ!  అంతటి మహాతపస్వి ఒక అప్సరసను చూసి చటుక్కున ఎలా వివశుడైపోయాడని కళ్ళు చిట్లించరూ !

పోనీ, నింద వస్తే వచ్చింది. గృహస్థాశ్రమసుఖం ముందు అది ఏపాటిది కనక, వ్రతం చెడినా ఫలం దక్కాలి అన్నారు. నా పుత్ర వాంఛ తీరడం ముఖ్యం. అది స్వర్గాన్ని ఇస్తుందనీ మోక్షాన్ని ఇస్తుందనీ జ్ఞానులు చెప్పారుగదా! అయితే ఈ అప్స్పరస వల్ల అది నెరవేరుతుందా? ఏమో, నాకయితే సందేహమే. వెనకటికి నారదుడు చెప్పిన కథలోలాగా అవుతుందేమో. ఆ ఊర్వశి పురూరవుణ్ణీ దగాచేసినట్టు ఇది చెయ్యదని నమ్మకం ఏమిటి?

*(అధ్యాయం - 70, శ్లోకాలు - ౩6)*

ఇలా రకరకాల సందేహాలతో సంకల్పవికల్పాలతో వ్యాసుడిలో అంతర్మథనం సాగుతోంది -  అనిచెప్పి సూతుడు గుక్కతిప్పుకోవడం కోసం ఆగాడు.  అంతే, మరొక మహాముని అడ్డుతగిలాడు.

*సూతమహర్షీ !* ఈ పురూరవమహారాజు ఎవరు? ఊర్వశి అన్నావు, ఆవిడ ఎవరు? ఏమి చేసింది? రాజుకి వచ్చిన కష్టం ఏమిటి? ఇదేదో చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ కథానకాన్ని పూర్తిగా రసవత్తరంగా చెప్పు. నువ్వు అసలే రోమహర్షణుడి కొడుకువాయె. మా తనువులు పులకించేట్టు రక్తికట్టించు.

*మహానుభావా!* మాటల్లో అమృతాన్ని మించిన రుచి ఉంది. అసలైన అమృతాన్ని అమరులు సేవించి తృప్తి చెందారు గానీ నీ వాగమృతాన్ని ఎంతసేవించినా మాకు మాత్రం తనివితీరడం లేదు.

*అమృతాదపి మృుష్టా తే వాణీ సూత! రసాత్మికా |*
*న తృప్యామో నయం సర్వే సుధయా చ యథామరాః ॥*

ఈ మాటలతో ముందుగా సూతుడికి తనువు పులకించింది. ఉత్సాహం ఉరకలు వేసింది. రసవత్తరంగా చెబుతాను విని ఆనందించండి అంటూ ప్రారంభించాడు.

*(రేపు "తరాశశాంక వృత్తాంతం")*

               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*

♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾

*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*

*భావము:* 💐

ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏


🙏 శ్రీ మాత్రే నమః🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat